"బాల్యానికి యవ్వనానికి మధ్య దశ చాలా చిత్రమైంది. ఏదో కావాలనుకుంటాం తప్ప ఖచ్చితంగా ఫలానాదే అనుకోం.
కారణం దేనిమీదా నిర్ధిష్టమైన అభిప్రాయం వుండదు కాబట్టి. స్వీటు కావాలని షాపుకెళతాం.
వెళ్లేటప్పుడు రసమలై తీసుకుంటే బాగుంటుందనుకుంటాం. వెళ్లాక జిలేబీ బాగుంటుందని సడెన్ గా అభిప్రాయం మార్చుకుని దాన్నికొంటాం.
అక్కడ మనం ప్రాధాన్యతనిచ్చింది స్వీట్ కి మాత్రమే. ఏ స్వీటూ అన్న విషయానికి కాదు. "
స్పూర్తి చెప్పింది చాలా సమంజసంగా అనిపించినా అవును అని బాహాటంగా అంగీకరించలేకపోయింది.
ఎందుకో టీవీవేపు దృష్టి మరల్చి చూడాలని వుంది.
నిన్న రాత్రి కలలో కనిపించిన వ్యక్తి ఇలా వున్నట్టుండి టీవీ స్త్రీన్ మీద ప్రత్యక్షం కావడం విజూషని చాలా దిగ్ర్బాంతికి గురిచేసింది.
"నువ్వు ఇప్పుడు వయసులో అడుగుపెట్టావు"
ఉలిక్కిపడింది విజూష.
ఇప్పుడు తన మానసిక స్థితిని చదివేసినట్టు మాట్లాడుతోంది స్పూర్తి.
"అలా షాక్ తినకు విజూషా! నేనన్నది నిజం. స్పష్టమైన నిర్ణయాలగురించి ఆలోచించే వయసులో అడుగుపెట్టిన నువ్వు చిన్నతంలోలా తోచిందేదో చేయలేవు. చేతికందని ప్రతిదాన్నీ నువ్వు కోరినదానిగా అనుకోనూ లేవు."
చిరాగ్గా చూసింది విజూష.
"నీకు తెలియదు స్పూర్తీ... నేను కావాలీ అనుకుంటే..."
"డబ్బు సంపాదించగలవూ లేదా డబ్బుతో దొరికే వస్తువులనైనా కొనగలవు తప్ప నువ్వు కోరిన మనిషిని అతడి అనుమతి లేకుండా నువ్వు దక్కించుకోలేవు."
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
స్పూర్తి మాటల్ని మననం చేసుకుంది విజూష అయిష్టంగానే.
డబ్బుతో దొరికే వస్తువుల్ని మాత్రమే తను కొనగలదా?
తను కోరిన మనిషిని అతడి అనుమతి లేనిదే తను దక్కించుకోలేదా?
అందమయిన పదానికి విశ్వకర్మ సృష్టించిన ఆకృతిలాంటి తను నిర్వచనాలకి అతీతమయిన సౌందర్య సౌరభంలా కనిపించే తను ఎలాంటి మగాడి అభిలాషకయినా అంతిమ జవాబులా కనిపించే తను కోరితే....
ఇంకా అవతలి వ్యక్తి అనుమతితోనూ అవసరం వుంటుందా?
"ఏంటి ఆలోచిస్తున్నావు?" అడిగింది స్పూర్తి.
రేకులు విచ్చుకుంటున్న అహంకారంతో విజూష జవాబు ఘాటుగా చెబుతుందని తెలుసు.
అయినా రెచ్చగొట్టిందింకా.
"ఎలాంటి మగాడినయినా పాదాలకి రప్పించుకోగల నీకు నా సెంటిమెంట్ చిత్రంగా అనిపించొచ్చేమో కదూ?"
"చిత్రంగానే కాదు నీ అమాయకత్వానికి జాలిగానూ వుంది."
"అంటే..." ఇలాంటి జవాబునే ఆశించిన స్పూర్తి మరితంగా విజూష అహాన్ని గాయపరచాలని నిర్ణయించుకుంది.
"నువ్వు కోరితే చాలు మగాళ్లు క్యూలు కడతారంటావ్?"
"అవును"
"అసంభవం"
"నో" అరిచింది విజూష.
రెస్టారెంట్ లోని పక్క టేబుల్స్ దగ్గర కూర్చున్న కస్టమర్స్ ఒక్కసారిగా విజూషవైపు చూసేసరికి ఇబ్బంది పడిపోతూ" ఇక వెడదామా?"అంది.
"అప్పుడేనా?"
ఒక కోటీశ్వరుడయిన తండ్రికి ముద్దుల కూతురుగా డబ్బు అనే చట్రంలో నిలబడి అదే ధోరణిలో అలోచిస్తూ అపురూపమయిన జీలితాన్ని పోగొట్టుకుంటున్న విజూషని మరో మార్గంలోకి మళ్లించాలని స్పూర్తి చాలాసార్లు ప్రయత్నించింది కానీ ఈ రోజు కాస్త ఎక్కువ అవకాశం దక్కింది.
"ఉదాహరణకి ఆ టీవీ స్క్రీన్ వేపు చూడు" కేజువల్ గా అంది స్పూర్తి.
అదిగో మరోమారు కనిపించాడు ఇందాకటి మిలింద్ లా వున్న యువకుడు.
"అతడి పేరు రుత్వి" స్పూర్తి పరిచయం చేసింది ముందే తెలిసినట్టుగా.
"ఆంధ్రా యూనివర్శిటీలో పి. జి. అయ్యాక ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్నాడు. అసాధారణమైన ఐక్యూగల వ్యక్తిగా పేరున్నవాడు."
ఆసక్తిగా వింటూనే ఆలోచిస్తోంది విజూష.
రుత్వి గురించి పనిగట్టుకుని ఇప్పుడెందుకు చెబుతూంద? అసలు రుత్వి స్పూర్తికెలా పరిచయం?
"పేరు చూసి ఏ బెంగాలీవాడో మరో నార్తిండియనో అనుకోకు. అచ్చతెలుగు అబ్బాయి."
"రాత్రి కలలో మిలింద్ అనే పేరు కూడా నార్తిండియాదిగా గుర్తుకొచ్చిన విజూష టెన్షన్ గా చూస్తోంది నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ."
"ప్రస్తుతం హైదరాబాద్ లోనే వుంటున్న రుత్విని రెండుమూడు సార్లు సిటీ సెంట్రల్ లైబ్రరీలో కలిసాను. జీవితం గురించి నిర్దిష్టమయిన అభిప్రాయాలుండడమేగాక అతడికున్న అపారమైన మేధస్సు, విశ్లేషణా శక్తి నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. స్నేహం చేయడానికి అభ్యంతరమా అంటే సుతిమెత్తగా తిరస్కరించాడు. నా అహం దెబ్బతింది. అయినా నేను బాధపడడంలేదు విజూషా."
క్షణం ఆగి అంది స్పూర్తి.
"ఎందుకంటే ఆ తర్వాత తెలిసింది అతడికి కాలేజీ రోజులనుండి వందలమంది అమ్మాయిలు అభిమానులు వుండేవారని, ప్రేమా దోమా అంటూ వెంటపడ్డా సారీ అంటూ దూరం జరిగేవాడని."
స్క్రీన్ పై కనిపిస్తున్న రుత్వి మరింత అందంగా, ఆకర్షణగా కనిపిస్తున్నాడామెకి.
"ఇదంతా నేను చెప్పిందెందుకో తెలుసా?" స్పూర్తి సూటిగా అంది విజూషతో - "నువ్వెంత అందగత్తెవైనా, వున్న దానివైనా రుత్విలాంటి వ్యక్తుల్ని ఆకర్షించలేవని."
చిట్లిన అహంకారపు పొర విజూష ముఖాన్ని రాగరంజితం చేసింది.
ఏమనుకుంటోంది స్పూర్తి?
ఏ మగాడైనా కోరుకునే మనో దివ్యహర్మ్యంలాంటి తన అందాన్ని, చంద్రకాంత శిలల తాకిడిలా వినిపించే కిన్నెరనాద మందస్మిత వదనాన్ని చూడగానే పాదాక్రాంతం కావాలి తప్ప రుత్విలాంటి వాడయితే మాత్రం తనను తిరస్కరించగలడా?