Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 5


    నగరంలో ఏ  మూలకైనా తన పరపతిని  విస్తరింపచేయగల అమ్మాయి ఆమె.

 

    తనను ఎవరైనా ఏమిటి, ఎవరైనా ప్రేమించాలిగానీ తను మరొకర్ని కోరుకోవడమేమిటి?

 

     ప్రేమను కోరడమూ అంటే  యాచించడమేగా.

 

    డబ్బుతో నాలుగు ఫ్యాక్టరీల యజమాని అయిన తండ్రి ప్రేమతో ఏదన్న సాధించగలదూ అనుకుంటున్న విజూష పొరపాటు పడిందక్కడే.

 

    తండ్రి మరో పెళ్లి చేసుకోలేదు.

 

    ఆమెకు అన్నీ చేయడం తన విధి అనుకుంటూ డబ్బుతో సుఖాల్ని. కొన్నాడు.

 

    ఈ ప్రపంచంలో సంతోషాన్నిచ్చేది 'డబ్బు' మాత్రమే అన్న ఫిలాసఫీని ఉగ్గుపాలతో రంగరించి నూరిపోశాడు.


 
     ఆ భావం విజూషలో బలమైన రూపాన్ని దిద్దుకుంది.

 

    అందుకే డబ్బుతో ఏదన్నా సాధించగలనని  నమ్మకాన్ని అలవాటుగా మార్చుకుంది.

 

    ఒక భవంతిలో తన బెడ్ రూంవలో విజూష ఇలా ఆలోచిస్తున్న సమయంలో...

 

    యూనివర్శిటీలో బోయ్స్  హాస్టల్లో  ఓ జీపు దూసుకొచ్చింది.

 

    అందులోనుంచి దిగిన గూండాలు కొందరు సరాసరి  ఓ హాస్టల్ రూంలో అడుగుపెట్టి ఓ యువకుడి కాళ్లూ చేతులూ విరగ్గొట్టి వచ్చిన పని అయినట్లుగా అయిదు నిముషాల్లో నిష్క్రమించారు.


 
    అప్పుడు సమయం  రాత్రి రెండున్నర గంటలు.


                               *    *    *    *    


    "చాలా సంతృప్తిగా వుందా?" కృష్ణా ఓబెరాయ్ సెల్లార్ రెస్టారెంట్లో విజూషకి అభిముఖంగా కూర్చున్న స్పూర్తి అడిగింది.

 

    విజూష సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తనే అంది - "స్టూడెంట్ అన్నాక  అల్లరి చేయడం, అబ్బాయిలు అమ్మాయిల్ని ఆటపట్టించడం మామూలే విజూషా!

 

    అలా నిన్ను టీజ్ చేసాడన్న ఒక చిన్న కారణం మూలంగా నాగరాజుకి అంత పెద్ద శిక్ష విధించడం అన్యాయం."

 

    నిన్న రాత్రి యూనివర్శిటీ హాస్టల్లో కాళ్లూ, చేతులూ ఫ్రేక్చరైన నాగరాజుని ఆ తర్వాత హాస్పిటల్లో చేర్పించడమూ అతడు ఓ మూడు నెలలుదాకా ఇక బెడ్ నుంచి లేచే అవకాశం లేదని డాక్టర్లు చెప్పడమూ విజూషకి తెలిసిన విషయమే.

 

    అయినా నాగరాజు గురించి సానుభూతిగా ఆలోచించలేకపోయింది.

 

    "డాడీకి చెప్పాను.

 

    అంతే తప్ప అలాంటి పనిష్ మెంట్ ఇమ్మని నేనూ అడగలేదు."

 

    "అసలు మీ డాడీదాకా ఆ విషయం ఎందుకు వెళ్లనిచ్చావూ అని.."

 

    డిగ్రీనుండి మొదలైన విజూష, స్పూర్తిల పరిచయం పీజీకి వచ్చే సరికి విడదీయలేని అనుబంధమైంది.

 

    పత్రికల్లో కథలు రాసే స్పూర్తి విజూషకి చాలా యిష్టం పైగా చాలా తెలీని  విషయాలు చర్చించే స్పూర్తి అంటే గౌరవం కాబట్టే ఆ మాత్రమైనా తన దగ్గర మాట్లాడే అవకాశం యిస్తుంది.

 

    ఆ వయసులో మనసులోని ఆలోచనల్ని పెంచుకోటానికి ఒక మంచి స్నేహితురాలు అవసరం అన్న నిజం విజూషకి తెలీదు.

 

    ఉన్నట్టుండి విజూష అంది "నాగరాజు ట్రీట్ మెంటుకయ్యే ఖర్చు అంతా డాడీనే  భరించమంటాను."

 

    విస్మయంగా చూడలేదు స్పూర్తి.

 

    ఆమెకి తెలుసు.

 

    అహంకారాన్ని కుబుసంలా అతికించుకున్న విజూష పాములా బుసకొడుతుంది తప్ప స్వతహాగా దూర్మార్గురాలు కాదు.

 

    ప్రపంచాన్ని కానీ, పుస్తకాల్ని కానీ ఎక్కువ చదువుతున్న కొద్దీ మనకి తెలిసింది ఎంత స్వల్పమో మరింత స్పష్టంగా అర్దమౌతుందని అర్దం చేసుకోలేని మొండిపిల్ల విజూష.

 

    నీటిలోని చేపపిల్లని నోట కరుచుకుని పైకెగిరిన పక్షి చేపని తినడానికి తీసకువెళుతుందీ అంటే... కాదు వున్నతమైన స్థానానికి చేర్చుతుందని అడ్డంగా వాదించే అమాయకురాలు.

 

    రాత్రి ఏడున్నర గంటలు కావస్తోంది.

 

    సబ్ డ్యూడ్ లైటింగ్ తో గోడలు కాంతులీనుతుంటే ఏదో ఓ షాక్ తో తప్ప విజూష ఆలోచనా సరళిలో మార్పు రాదనుకుంటూ అంది స్పూర్తి.

 

    "ది జోయ్ ఆఫ్ లివింగ్ ఈజిన్ జోయ్ ఆఫ్ గివింగ్ అన్న సూక్తి నువ్వు తెలుసుకోవాలి విజూషా.

 

    ఆ ఇవ్వడమన్నది మనసే అని నువ్వు గ్రహించిన రోజు నువ్వు పూర్తిగా మారిపోతావు"

 

    "అలాంటి మార్ప నేను కోరుకోకపోతే?"

 

    "జీవితమంటే మనం కోరినవన్నీ జరగడం కాదు విజూషా."

 

    "కానీ నేను పుట్టి పెరిగాక... " మొండిగా అంది విజూష.

 

    "నాకు జరిగిందంతా నేను కోరిందే."

 

    అదిగో.. సరిగ్గా అప్పుడు అసంకల్పితంగా రెస్టారెంట్ గోడకి వున్న 'టీవీ' లోకి చూసింది విజూష.

 

    అంతే...

 

    పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది.

 

    టీవీలో ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు.

 

    అతడు నిన్న రాత్రి కలలోని మిలింద్ లా వున్నాడు.

 

    కాదు మిలింద్.

 

    ఏంటలా ఏకాగ్రతగా చూస్తున్నావ్?" స్పూర్తి గొంతు  వినిపించగానే తొట్రుపడింది విజూష.


 
    "అబ్బే... ఏం లేదు."

 

    తల తిప్పేసింది ఇంకా అతడ్ని చూడాలని మనసు ఉవ్విళ్లూరుతున్నా.

 

    "పుట్టి బుద్దెరిగిన దగ్గర్నుంచీ నువ్వు పొందిన ప్రతిదీ నువు కోరిందే కావడం నీ అదృష్టం అని నేను అనలేదు విజూషా" స్పూర్తి ఇందాకటి  ప్రసక్తిని కొనసాగిస్తూ అంది " అతి తెలివితనం కూడా కావచ్చు."

 

    విజూషకి చురుక్కుమంది.

 

    "అలా కోపంగా చూడకు విజూషా.

 

    నేను మాట్లాడుతున్నది మనలో వయసుతోబాటు పెరిగే మానసిక పరిణతి గురించి "విశ్లేషణలా చెప్పుకుపోతోంది స్పూర్తి.

 Previous Page Next Page