Previous Page Next Page 
ధ్యేయం పేజి 6


    ప్రీతమ్  నుదుట చెమట ఎగ్లయిట్ మెంట్ తో ఎక్కువైంది. తడారిన పెదవుల్ని నాలుకతో తడి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె మాత్రం మామూలుగానే వుంది. ఆమె మెడ దగ్గిర వున్న పుట్టుమచ్చని చూడటం లేదతడు. కంఠం క్రింద గీతని చూస్తున్నాడు. అంతలో ఆమె పైట సరిగ్గా సర్దుకుంది.

    ఆ తరువాత షర్టుతీసి ఆరిందోలేదో చూసింది. ఫాన్ గాలికి అది తొందరగానే ఆరింది. దాన్ని అతడికి అందించింది. అందుకుంటూంటే అతడి చేతివేళ్ళు కంపించాయి. అతడు చాలా హుషారు, చొరవ వున్న కుర్రవాడే. స్నేహబృందంలో ఏదైనా కొత్త పని చేయవలసి వచ్చినప్పుడు అందరికన్నా ముందుంటాడు. సిగరెట్స్ తాగటం లాటివైతే అతను తొందరగానే నేర్చుకున్నాడు. కానీ అతని వయస్సుతో పోల్చుకుంటే ఇది చాలా కొత్త అనుభవం. తమకు తెలియనిది ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదనుకున్న స్నేహబృందం- వాళ్ళకు తెలియని దానికన్నా మరోమెట్టు ఎక్కానన్న కించిత్ గర్వం.

    ఆమె వచ్చి అతడి పక్కన కూర్చుంది. సోఫాలో ఇంకా జాగా వున్నా, ఆమె అతడికి తగుల్తూనే కూర్చుంది. ఆమె చేస్తున్న ప్రతీ పని సహజంగా వుండటంతో అతడికి ఏమీ అర్థంకావడంలేదు. ఏదో వుందని తెలుసు-కానీ ఏం జరుగుతూందో తెలియటంలేదు.

    అంతలో బయట ఏదో వెహికల్ ఆగిన చప్పుడు. ఆమె లేచివెళ్ళి తలుపు తీసింది. ఆమె భర్త క్యాంప్ నుంచి వచ్చాడు. ప్రీతమ్ ని కళ్ళతోనే పలుకరించి లోపలి వెళ్ళాడు.

    "నేను వెళ్ళొస్తాను" అన్నాడు.

    "మంచిది" అన్నదామె చిరునవ్వుతో........... "అప్పుడప్పుడు వస్తూవుండు".

    అతడు నీరసంగా బయటకు నడిచాడు.


                                                                 5


    చంటిపాప సన్నగా ఏడుస్తున్నట్లు ఎక్కడినుంచో ధ్వని. సీరియస్ గా చదువుకుంటున్న అవినాష్ ఉలిక్కిపడ్డాడు. ఆ శబ్దం ఏమిటో, అతనికి వెంటనే అర్థంకాలేదు.

    మళ్ళీ అదే శబ్దం సన్నటి రోదనలాగ. గదంతా కలియజూశాడు. ఏమీ కనపడలేదు. అంతా తన భ్రమేమో అనుకునేంతలో మళ్ళీ అదే ఏడుపు వినిపించింది, ఈ సారి కిటికీ అవతలనుంచి. అంతలోనే దబ్బున ఏదో పడిన శబ్దం కూడా.

    అవినాష్ లేచి నిలబడి కిటికీలోంచి బయటకు చూశాడు, బయట బాగా చీకటి వుంది. ఏమీ కనపడలేదు. తటపటాయిస్తూ గదిలోంచి బయటికొచ్చాడు. అతడికి భయం వేసింది. అంతలోనే ఏదో మొండిధైర్యం కూడా వచ్చింది. నెమ్మదిగా బయటికెళ్ళాడు.

    కిటికీ పక్కన గోడకానుకొని కూర్చుని వుందది.

    తెల్లటి పిల్లిపిల్ల. బొద్దుగా, అందంగా వుంది. అవినాష్ ని చూడగానే దీనంగా 'మ్యావ్' అంది. ఆ పిలుపులో అది తనను రక్షణ కోరుతున్నట్లుగా అనిపించింది నెమ్మదిగా దగ్గరకెళ్ళి మోకాళ్ళమీద కూర్చొని దాన్ని ముట్టుకున్నాడు.

    పట్టుకుచ్చులా తగిలింది.

    అతని దగ్గర రకరకాల బొమ్మలున్నాయి. అతని తండ్రి చాలా కొని తీసుకు వస్తూంటాడు కూడా. కాని ప్రాణం వున్న జంతువుని ముట్టుకోవడం జ్ఞానం వచ్చాక అదే మొదటిసారి. ఏదో అపూర్వమైన అనుభూతి. అనుకోకుండా దొరికిన వరంలాగా అపురూపంగా దాన్ని ఎత్తుకొని గుండెలకి హత్తుకున్నాడు. అదికూడా ఆప్యాయంగా అతడి చేతిని నాకుతోంది. ఈ లోపల వెనుక అలికిడయింది. తిరిగి చూస్తే మంగ.

    "అబ్బ ఎంత బావుందో, దీన్ని మనింట్లో వుంచుకుందామా బాబూ" అంది.

    ఆ పిల్ల రావడం అతను గమనించలేదు. అప్పుడు రాత్రి ఎనిమిది అయి వుంటుంది. శీతాకాలం కావటంతో బాగా చలికూడా వుంది.

    "ఇదెవరిదో మనకి తెలీదుగా" అమాయకంగా అన్నాడు.

    "మన పక్క కాలనీ నుంచి అప్పుడప్పుడు వస్తూ వుంటాయి" అంది మంగా.

    "అయితే మనం వుంచేసుకోవచ్చన్నమాట" అన్నాడు సంతోషంగా.

    "తనకి చాలా ఆకలిగా వున్నట్లుంది. ఏమైనా పెట్టాలి" అంది మంగ పెద్ద ఆరిందలాగ. నిజానికి  అవినాష్ కన్నా మంగ వయసులో చిన్నదే.

    "ఏం పెడదాం. నా గదిలో స్వీట్లూ, బిస్కట్లు వున్నాయి పెట్టనా" అని అడిగాడు.

    "అవి తింటానికి ఇది చాలా చిన్నదికదా! అన్నంకూడా తినదు. పాలుపోస్తే తాగుతుంది" అంది మంగ.

    "పాలా? ఎలా పట్టించాలో మనకు తెలీదుగా!" అన్నాడు.

    మంగ పడీ పడీ నవ్వింది. పిల్లి పాలు ఎలా తాగుతుందో తెలియని పిల్ల లుంటారని దానికి మొట్టమొదటి సారి తెలిసింది. "సాసర్ లో పోస్తే అదే తాగుతుంది బాబూ. మనం చెప్పకపోయినా దానికి తెలుస్తుంది" అంది. ఈ లోపులో "అవినాష్" అని ఓ పెద్ద గర్జన వినిపించింది. అవినాష్ ఉలిక్కిపడ్డాడు. ఎప్పుడొచ్చిందో తెలియదు కాని తల్లి గోడ దగ్గిర నిలబడి వుంది. "దాన్ని కిందపెట్టు" అని గట్టిగా అరిచింది. ఆ భయానికి ఒక్కసారిగా దాన్ని వదిలేశాడు. పిల్లి పిల్ల దబ్బున కిందపడింది.

    "గదిలో నువ్వు కనిపించకపోతే ఏమైపోయావోనని హడలిచచ్చాను. ఎక్కడిదది? ఏమిటీ పనులు?" అంటూ గద్దించింది.

    "తెలీదు మమ్మీ. ఏడుస్తూంటే ఏమిటో చూద్దామని వచ్చాను" అన్నాడు భయంగా.

    "గొప్ప పని చేశావులే పద. డాడీ వచ్చే టైమయ్యింది" అంది.

    ఇంకా అక్కడే నిలబడివున్న  మంగవైపు వురిమినట్లు చూసి "ఏమిటే, ఏదో  సినిమా చూస్తూన్నట్లు అలా నిలబడ్డావు. దాన్ని తీసి బయట పడేయి" అంది.

    మంగ అక్కడనుంచి కదలలేదు. పార్వతి విసురుగా వచ్చి ఆ పిల్లిని గాలిలోకి లేపి గోడపై రోడ్డుమీదకి విసిరేసింది. అది దీనంగా అరుస్తున్న అరుపులు ఇంకా వినపడుతూనే వున్నాయి. అవినాష్ అసహనంగా ఇంట్లోకి నడిచాడు, వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు. గదిలో షెల్ఫ్ లో వరుసగా వున్న జంతువుల పుస్తకాలు 'బేర్', 'డోనాల్డ్ డక్' 'మిక్కిమౌస్' 'జిమ్ లో' అన్నీ తనని జాలిగా చూస్తున్నట్లు అనిపించాయి.

    పుస్తకం తీసి చదువుతూ కూర్చున్నాడన్న మాటేగాని అతని మనసు మనసులో లేదు. ఈసారి పిల్లి అరుపులు అంత దగ్గరగా వినిపించడంలేదు. దూరంగా ఎక్కడినుంచో సన్నటి ఆర్తనాదం, గుండెల్ని దేవేసేరోదన, అతడికి బాగా దుఃఖం కలిగింది.

    పావుగంట గడిచాక అతని తండ్రి వచ్చాడు. తండ్రి చేతిలో పెద్ద ప్యాకెట్ వుంది. "చూడు నీకోసం ఏం తెచ్చానో" అన్నాడు. పెద్ద అట్టపెట్టె టేబుల్ మీద పెడుతూ. "కంప్లీట్ వరల్డ్ ఎన్ సైక్లో పీడియా. మొత్తం ఇరవై అయిదు వాల్యూమ్స్. ఇక నీకు బోరనేదే వుండదు" అన్నాడు.

    "ఎంతిది?" భర్తకి పంచె అందిస్తూ అడిగింది పార్వతి.

    పదిహేను వందలు".

    వెంటనే పార్వతి కొడుకువైపు తిరిగి "చూశావా అవినాష్, డాడీకి నువ్వంటే ఎంత ప్రేమో! మన కాలనీలో ఎవరైనా పిల్లలకి ఇంత ఖరీదైన బహుమతి ఇస్తారా? మహా అయితే ఏ క్రికెట్ బ్యాటో, సైకిలో కొంటారు. ఇవి నీకు భవిష్యత్తులో కూడా పనికొస్తాయి" అంది.

    అవినాష్ మాట్లాడలేదు. ఆ పుస్తకాలని చూస్తూ కూర్చున్నాడు.

    రాత్రి పదవుతోంది. అతను పడుకునే టైమైంది. తల్లీ, తండ్రీ ఇంట్లోలేరు. తొందరలో డిసెంబరు ముప్పయ్ ఒకటి రాబోతుంది. ఆ ఫంక్షన్ ఆ కాలనీలో ఎలా చేయాలా? అన్న మీటింగ్ కి వెళ్ళారు.

    "బాబూ! పాలు త్రాగి పడుకోమంది మమ్మీ" అంటూ మంగ గ్లాసు తీసికొచ్చింది. ఆ పిల్ల కళ్ళల్లో కూడా ఏదో తెలీని విషాదం.

    అవినాష్ ఆ పాలగ్లాసు అందుకున్నాడు.

    "పాపం ఆ పిల్లిపిల్లకి దెబ్బ తగిలింది. రోడ్డుమీద పడినపుడు కాలుకూడా విరిగిందేమో. కుంటుకుంటూ గ్రౌండ్ లోకి వెళ్ళింది" అంది.

    అవినాష్ తాగుతున్న గ్లాసు కింద పెట్టేశాడు.

    "తాగండి బాబూ. మళ్ళీ అమ్మగారు కోప్పడతారు".

    "వద్దు. తీసికెళ్ళిపో" అన్నాడు. మంగ వెళ్ళిపోయింది.

    కళ్ళుమూసుకొని పడుకున్నాడు అవినాష్. అతని కళ్ళల్లో ఆకలితో అలమటిస్తున్న పిల్లి పిల్ల కదులుతోంది. విరిగిన కాలుతో దేక్కుంటూ నడుస్తున్న ఆ పిల్లి తన  గుండెమీద నుంచి వెళుతున్నట్లనిపించింది. బయటికి వెళ్ళి చూడాలంటే, మమ్మీ వాళ్ళకి తెలిస్తే ఎంత గొడవ చేస్తారో ఊహించుకుంటే భయమేసింసి. అలాగే వరండాలోకొచ్చాడు.

    ఎదురుగా దృశ్యాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు.

    మానవత్వం, జీవకారుణ్యంలాంటి పదాలు అతడికి తెలియవు. కానీ ఆ దృశ్యాన్ని చూస్తుంటే మనసు నిండా ఏదో భరించలేని తృప్తిగా అనిపించింది.

    ఎనిమిదేళ్లు కూడా లేని మంగ పిల్లిపిల్లని ఒళ్ళో పెట్టుకొని చిన్నగిన్నెలో పాలు తాగిస్తుంది. అలికిడికి తలెత్తి అవినాష్ ని చూసింది. వెన్నెల ఆ పిల్లి కళ్ళల్లోపడి మెరుస్తోంది. "మీరు పాలు వదిలేయటం మంచిదయింది బాబూ. లేకపోతే ఇంత రాత్రివేళ పాలెక్కడ దొరుకుతాయి" అంది. అతడు మాట్లాడలేదు. ఆ దృశ్యాన్నే అపురూపంగా చూస్తున్నట్లు నిలబడ్డాడు. అంతలోనే మంగ సంతోషంగా "దీని కాలు విరగలేదు బాబూ" అంది. అతడికి సంతృప్తిగా అనిపించింది.

    ఇంతలో దూరంగా మరొక ఆకారం దగ్గరికి రావడం కనిపించింది. అది సావిత్రి. వచ్చి కూతురి దగ్గర కూర్చొని ఒక చిన్న డబ్బా మూతవిప్పింది.

    "ఏమిటిది?" అని అడిగాడు అవినాష్.

    "పసుపు బాబూ" అంది సావిత్రి. "పిల్లిపిల్ల మీదకి కుక్కలు ఎగబడుతూ వుంటే ఇదేమో చెప్పకుండా పరిగెత్తింది. చీకటి కదా. రాయితగిలి పడింది. మోచేతులు, మోకాళ్ళు కొట్టుకుపోయాయి" ఆ పిల్ల దెబ్బల మీద పసుపువేసి గుడ్డతో తడుస్తూ అంది.

    "దీన్ని నేను వుంచుకుంటున్నానుబాబూ. మా గుడిసెకి తీసికెళ్ళి పోతున్నాను" అంది మంగ సంతోషంగా.

    సావిత్రి చిరుకోపంతో "దీని కసలు బుద్ధిలేదు. ఈ పిల్లిని పెంచుతుందట. అమ్మగారు దీనికిచ్చే పదిరూపాయలు జీతంలో పాలు కొంటుందట" అంది.

    మంగ ధీమాగా తలెగరెసి "అన్నపూర్ణమ్మగారింట్లో పనిచేస్తే ఇంకో పాతిక రూపాయలు యిస్తామన్నారు. అక్కడకూడా చేస్తా" అంది.

    ........ అవినాష్ గదిలోకెళ్ళి పడుకున్నాడు. అతడి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి.

    తను వదిలేసినా పాలతో పిల్లిపిల్ల కడుపు నిందిందన్న సంతోషమో, మంగకి వున్నంత ధీమా జీవితంపట్ల తనకి లేనందుకు కలిగిన బాధో అతడికే తెలీదు.

    అతడు పడుకున్న పక్కకి కాస్త దూరంలో బల్లమీద తండ్రి ఆ రోజే కొనుక్కొచ్చిన జనరల్ నాలెడ్జ్, ప్రపంచ చరిత్ర పుస్తకాలు తనని చూసి నవ్వుతున్నట్లనిపించాయి.

    జ్ఞానం పుస్తకాల్లో వుండదు. అనుభవాల్లో వుంటుంది. అనుభవాలన్నీ కూర్చి గుచ్చిన జీవితపు దండలో వుంటుంది.

 Previous Page Next Page