Previous Page Next Page 
ఆత్మబలి పేజి 51


    "శోభత్తయ్యా! నువ్వెళ్ళగానే నీకోసం రావుగారొచ్చారు."
    శోభ ముఖం కఠినంగా మారిపోయింది.
    "ఎందుకట?" నిర్లక్ష్యంగా అడిగింది.
    "వాళ్ళ ఆశ నిన్నే కలవరిస్తూందిట! తనను క్షమించి ఒక్కసారి నిన్ను ఆశను చూడటానికి రమ్మన్నారు."
    ఒక్కసారి ఉలిక్కిపడింది శోభ. అంతలోనే అదేదో సామాన్యమైన విషయమన్నట్లు అక్కడినుండి లేచిపోయింది. మామూలుగా తనపనిలో తాను లీనమవ్వాలని శతధా ప్రయత్నించింది. అయినా పెనుతుఫాను నాటి పారావారంలా అల్లకల్లోలమయిపోతున్న తన మనసును అదుపులోకి తెచ్చుకోలేకపోతూంది. రకరకాల భావనలు గజిబిజిగా అల్లుకుంటూ ఆమె మనసు నల్లరిపెడుతున్నాయి. మాట వినని మనసు రకరకాల దృశ్యాలను కళ్ళముందుకు తేస్తూంది.
    ఆశ అతి నీరసంగా మంచంమీద పడుకొని ఉంది. స్వార్థంతోనేమి, మమకారంతోనేమి, తను పెంచిన అనుబంధం ఆ పసి హృదయంలో గాఢమై నిలిచింది. శరీరంలో బాధతో, మనసులో బెంగతో నిస్సహాయంగా "టీచర్" అని కలవరిస్తూంది. తన నాడించిన టీచర్ తనను ప్రాణానికి ప్రాణంగా చేసుకున్న టీచర్ వస్తుందన్న ఆశ నింపుకుని తహతహతో గుమ్మంవంక చూసింది. మంచీ, మమకారం తప్ప లోకంలో కల్మషం తెలియని ఆ పసిగుండె టీచర్ రానందుకు కృంగిపోయింది. తనమీద టీచర్ కెందుకీ కోపమని ఆక్రోశించింది. జ్వరంతో నీరసించిన ఆ అందమైన కళ్ళలో ఆవేదన కరిగి కన్నీరై జారింది.
    "ఎందుకేడుస్తున్నావత్తయ్యా?"
    రాణి మాటలకు ఉలికిపడి తనకు తెలియకుండానే జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుని లేచి చెప్పులు తొడుక్కుంది.
    "సీన్స్ సృష్టించకు" అన్న రావు కఠినమైన మాటలు గుర్తుకు వచ్చాయి. చెప్పులు విప్పేసింది. పిచ్చిగా ఇల్లంతా తిరిగింది. మనసు బాధతో మెలికలు తిరిగిపోతుంది. ఆశ, తన చిన్నారి ఆశ తనకోసం నిరీక్షిస్తూ జబ్బుతో మంచంమీద ఉంది. రావు తన నవమానిస్తాడు. అవమానించనీ. ఈ మానావమానాలతో తనకేం నిమిత్తం? అభం శుభం తెలియని పసికందు స్వచ్చమైన అభిమానంతో ఆర్తితో తన రాకను కోరుతూంటే ఈ పంతాలూ పట్టుదలలూ తననాపగలవా? ఇంక ఆలోచించకుండా వెంటనే రిక్షాలో రావుగారింటికి బయలుదేరింది.
    గుబగుబలాడే గుండెలను అదిమిపట్టుకుంటూ ఆతృతతో రిక్షా దిగిన శోభను వీధి గుమ్మానికున్న పెద్ద తాళం కప్ప వెక్కిరిస్తూ వికటాట్టహాసం చేసింది.
    క్షణాలు యుగాలుగా నిరీక్షిస్తూ ఆ గుమ్మంలోనే ఒక గంట కూలబడింది. కృష్ణపక్షపు చీకట్లు దట్టంగా వ్యాపించిన తరువాత శోభకు తన నిరీక్షణ వ్యర్ధమేమోనని అనుమానం తోచింది. అయినా తిరిగి వెళ్ళలేకపోయింది. ఇరుగుపొరుగువారికి సంగతేమైనా తెలుస్తుందేమోననే ఆశతో ప్రక్కింటివారిని "రావుగారు ఎక్కడికైనా వెళ్ళారండీ?" అని అడిగింది. ఆ ఇల్లాలు శోభను పై నుండి క్రిందికొకసారి పరిశీలనగా చూసి "ఏమోనమ్మా! నాకు నా ఇల్లేదో నా సంసారమేదో అంతే! రావుగారెవరో, సూరిగారెవరో నేను పట్టించుకోనమ్మా!" అంది, కొంత వెటకారంగా.
    ఇట్లాంటి వెటకారాలను పట్టించుకొని బాధపడేస్థితిలో లేదు శోభ. వెంటనే ఇవతలికొచ్చి అటు ప్రక్కఇంట్లో కెళ్ళింది. ఎవరో యువకుడు బయటికొచ్చి "ఓహ్! శోభాదేవిగారా?" అన్నాడు.
    శోభ తెల్లబోయి "నేను తెలుసా?" అంది.
    "రావుగారి ఇంటికి వస్తుంటారు కదూ?" అంటూ నవ్వాడతను. ఆ నవ్వు వెక్కిరించినట్లుంది.
    జబ్బులో ఉన్న ఆశ తప్ప శోభకింకేదీ మనసులోకి రావటం లేదు.
    "రావుగారెక్కడి కెళ్ళారండీ?"
    "మూడురోజుల క్రిందటే వాళ్ళమ్మాయిని తీసుకుని హైదరాబాదు వెళ్ళారు."
    మ్రాన్పడిపోయింది శోభ.
    ఆమెలో భావ పరివర్తనను గమనించి లోలోపల నవ్వుకున్నాడతడు.
    "ఆశకు తగ్గిందా?"
    "లేదు. జ్వరం తీవ్రం కావటంవల్లనే ఎవరో స్పెషలిస్టుతో కన్సల్టు చెయ్యటానికి వెళ్ళారు."
    "హైదరాబాద్ లో ఎక్కడికివెళ్ళారు? ఆ డాక్టర్ ఎవరు?"
    "క్షమించండి. ఆ వివరాలు నాకు తెలియవు."
    "మళ్ళీ వస్తారా?"
    "అదీ తెలియదు. ఆశకు నయంకాగానే వస్తారేమో."
    తన శరీరమే తనకు భారంకాగా నడవలేక నడవలేక నడుస్తూ ఇంటికి చేరుకుంది శోభ.
    ఆనాటి నుండి ప్రతిరోజూ పనికట్టుకుని ఇంటిముందు నుంచి వెళ్తూ ఆ తాళం కప్పను చూసి నిట్టూర్చటం శోభకొక అలవాటై పోయింది. రెండునెలల తరువాత ఏదో ఒక కొత్తముఖం ఆ ఇంట్లోంచి తనను పరిశీలనగా చూసేసరికి మతిపోయినట్లయింది శోభకు. అయినా ఆశ చావక సాహసించి లోపలికి వెళ్ళి "మీరు రావుగారికి బంధువులా?" అని అడిగింది.
    అతడు విచిత్రంగా చూసి 'కాదండీ! ఆయన ఈ ఇల్లు అమ్మేశారు. మేం కొనుక్కున్నాం" అన్నాడు.
    శోభ ఆశాజ్యోతి పూర్తిగా ఆరిపోయింది. అటు తర్వాత ఆమె రోడ్డువైపుకు ఎన్నడూ రాలేదు.


                                       32


    భారంగా కళ్ళు తెరిచిన ఉమకు ఆతృతగా తనమీదికి వంగిన చలపతి ముఖం కనిపించింది.
    "ఎలా ఉంది ఉమా?" గాభరాగా అన్నాడు చలపతి.
    "ఏం లేదు. కళ్ళు తిరిగాయంతే!" అంటూ ఉమ లేవబోయింది.
    "వద్దు, వద్దు. లేవవద్దు. పడుకో!"
    "ఇంట్లో పనులూ..."
    "మిగిలినవాళ్ళు చూసుకుంటారు..."

 Previous Page Next Page