మూర్తి వెలతెలబోతూ తడబడుతూ "రా! శోభా! కూర్చో! అలా నిలబడతావేం! నేను పరాయివాడినా? నాదగ్గిర మర్యాదలెందుకు?" అన్నాడు వెకిలి నవ్వుతో.
"ఎందుకొచ్చారని అడుగుతున్నాను." గంభీరంగా మరింత కఠినంగా రెట్టించింది శోభ.
"అదేం ప్రశ్న శోభా? స్నేహితుడుగా వచ్చాను. కారణమేముంటుందీ?"
"స్నేహితుడు! ఆ మాటనటానికి నీకు సిగ్గులేదూ? ఒకసారి మోసపోయాక కూడా నీ మాటలు నమ్మటం నాది బుద్ధితక్కువ. ఆ తెలివితక్కువతనానికి ఫలితమనుభవిస్తున్నాను. నువ్వవతలికిపో! ఇంకెప్పుడూ నా గుమ్మం తొక్కకు."
ఇంత దారుణమైన తిరస్కారం ఎదురయ్యేసరికి మూర్తి కూడా తెగించాడు. తన పై మెరుగులన్నీ తీసేసి పచ్చిగా మాట్లాడటానికి సిద్ధపడ్డాడు.
"ఆ రావుతో వ్యవహారం బెడిసికొట్టిందని విన్నానులే! అందుకే వచ్చాను. ఏం? రావున్నంత అందంగాలేనా?"
"నువ్వు అవతలికి పోతావా? పోవా?" గర్జించింది శోభ.
మూర్తి చటుక్కున లేచొచ్చి శోభ రెండు చేతులూ పట్టుకున్నాడు. ఒళ్ళు తెలియని కోపంతో ఆ చేతులను విదిలించి కొట్టబోయిన శోభ సరిగా ఆ సమయాని కక్కడికివచ్చిన రావును చూసి మతిపోయి నిలబడింది.
"సారీ! రాకూడని సమయంలో వచ్చాను. మరొకసారి వస్తాను." అంటూ వెనక్కి తిరిగాడు రావు.
మూర్తి చేతులు విదిలించి పిచ్చిదానిలా రావు వెనుక పరుగెత్తి కారు కడ్డంగా నిలబడింది శోభ.
"వెళ్ళకండి రావుగారూ! వెళ్ళకండి. రండి. ఒక్క అయిదు నిముషాలు కూర్చుని వెళ్ళండి. కొంచెం కాఫీ తీసుకుని వెళ్ళండి."
"కాఫీకేంలే శోభా! ఇది అతిథి మర్యాదలకు సమయం కాదు. ఆశకు టైఫాయిడ్. అదేపనిగా నిన్ను కలవరిస్తూంది. వీలయితే ఒకసారి రా!"
అదిరిపడింది శోభ. ఆశకు టైఫాయిడా! అంటూనే కారులో అడుగుపెట్టబోయింది.
ఆమెను పక్కకు లాగేశాడు రావు.
"అవతల నీకు గెస్ట్ ఉన్నాడు శోభా! అతనిని సాగనంపిరా." అంటూనే కారులో కూర్చుని కారు స్టార్టుచేశారు.
భరింపరాని ఆవేదనతో శోభ తల గోడకేసి కొట్టుకుంటూ "దుర్మార్గుడా! నా బ్రతుకు సర్వనాశనం చేశావు" అని కుమిలికుమిలి ఏడవసాగింది.
మూర్తిమీది కోపంతో ఒళ్లెరగకుండా ఉన్న శోభ గమనించలేదు కాని దూరంనుంచే రావు కారును మూర్తి గమనించాడు. కావాలనే సరిగ్గా సమయానికి శోభ చేతులు పట్టుకున్నాడు. అతడు ఆశించిన ఫలితం దక్కింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న శోభను కసిగా చూసి సంతృప్తిగా వెళ్ళిపోయాడు. భరింపరాని శోకావేశంతో తనను తాను మరిచిన శోభ ఎంతసేపటికో తెప్పరిల్లింది. ఉద్రేకం కొంత చల్లారగానే కర్తవ్యం గుర్తుకొచ్చింది. ముఖం కడుక్కుని చీరయినా మార్చుకోకుండా రావు ఇంటికెళ్ళింది.
హాలులో రెండు చేతులలో తల పట్టుకుని కూర్చున్న రావు అడుగుల చప్పుడుకు తలెత్తి శోభవంక నిర్జీవంగా చూశాడు. ఆ చూపులకు వణికిపోయిన శోభ కంగారుగా 'ఆశకెలా ఉందీ?' అనడిగింది.
"నిద్రపోతూంది" నిదానంగా సమాధానం చెప్పాడు రావు.
ఒక్కసారి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది శోభ.
"ఒంట్లో ఎలా ఉందీ?"
"ఫరవాలేదు."
శోభకు సరిగా అర్థంకాలేదు.
"ఒక్కసారి చూస్తాను." అంటూ లోపలికెళ్ళబోయిన శోభ "ఒద్దు" అన్న రావు కఠినమైన ఆజ్ఞా స్వరానికి ఆగిపోయి దీనంగా రావువంక చూసింది.
"అదిప్పుడే నిద్రపోతూంది. లేపటం మంచిదికాదు."
"నేను లేపను."
"అయినా వద్దు. చూడవలసిన అవసరంలేదు. అప్పుడే చావదు."
శోభ గుండెలు ఝల్లుమన్నాయి. ఈ క్షోభ ఆమె ఇంక భరించలేకపోయింది. తన అహాన్ని వ్యక్తిత్వాన్నీ పూర్తిగా మరిచి రావు పాదాలదగ్గిర కూలబడిపోయింది.
"నా మీద ఎందుకింత పగ మీకు? నన్ను మీరర్ధం చేసుకోలేరా? నాకు ఆశమీద మమకారాన్ని శంకించగలరా? ఏ ప్రతిఫలమూ కోరని నా అభిమానాన్ని ఎందుకింత దారుణంగా అవమానిస్తున్నారు!"
వెక్కి వెక్కి ఏడ్చేసింది శోభ.
రావు గబుక్కున సోఫాలోంచి లేచి నాలుగడుగులు వెనక్కువేశాడు. హృదయ విదారకంగా ఏడుస్తున్న శోభను నిర్లక్ష్యంగా చూస్తూ "అనవసరంగా 'సీన్స్' సృష్టించకు. జబ్బుగా ఉన్న ఆశ ఈ గొడవకు నిద్రలేవగలదు" అన్నాడు.
పదునైన బల్లెపు పోటుకన్న వాడిగా ఉన్న ఈ మాటలు శోభ సున్నిత హృదయాన్ని ముక్కముక్కలుగా చేశాయి. రివ్వున లేచింది. కన్నీళ్ళ మధ్యనే నవ్వి "ఇంతవరకూ నేను సృష్టించిన ఎన్నో సీన్స్ సహించారు. ఇది ఆఖరిశీను. ఇంకమీద నేను సృష్టించే సీన్స్ మీరు భరించవలసిన అవసరంరాదు." అని వీడ్కోలు సూచకంగా రావుకు నమస్కారం చేసి బయటికొచ్చి రిక్షాలో ఇంటికి చేరుకుంది.
తన చాపమీద వాలి దిండు కవరులేని దిండులో తలదూర్చి, కళ్ళు మండుతున్నా, మనసు మరుగుతున్నా, తల పగులుతున్నా అలా ఏడుస్తూనే ఉంది. ఆ రోజంతా ఆమెను కాఫీకి కాని అన్నానికికాని ఎవరూ కదపలేకపోయారు. ఇంటిల్లిపాదీ ఈ ధోరణికి హడలిపోయారు. కాని, మరునాడు మామూలుగా తయారయి ఆఫీస్ కెళ్తున్న శోభను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని ఈ శోభ వెనుకటి శోభ కాదు. ఏదో కాఠిన్యం, గాంభీర్యం తెరలా ఆమె నావరించుకున్నాయి. ఆమె ముఖంలోకి చూస్తూ ఏదైనా ప్రశ్నించగలిగే సాహసం ఎవ్వరికీ లేకపోయింది.
శోభకు తెలిసినవాళ్ళు కొందరు స్పెషల్ ట్రెయిన్ లో ఉత్తర దేశయాత్రకు వెళుతూంటే వాళ్ళతో శోభ కూడా బయలుదేరింది. మనశ్శాంతి మనసులో ఉంటుంది. బయట ఎంత ప్రయత్నించినా అది దొరుకుతుందా?
ఈ ప్రయాణం కారణంగా శోభ అశాంతి ఏమాత్రమూ తగ్గకపోగా అలసట కూడా తోడైంది.
యాత్రలనుండి తిరిగివచ్చిన శోభకు అన్నకూతురు రాణి కబురందించింది.