"చెప్పు..... ఆగిపోయావేం?" నిలదీసింది ధీర.
" ఇంకా ఏం చెప్పాలే?"
"చెప్పటానికి ఏదన్నా వుంటే చాలా చెప్పేదానవే. కానీ నీకేమీ లేదు. ఉన్నట్టు నటిస్తున్నావు. అందుకే పొడిగా మాట్లాడి మధ్యలో ఆపేశావు."
ధీర ఇలా నిలధీయడం బాధగా వుంది.
"నా సంగతికేంగానీ నీ గురించి చెప్పు. నీ పెళ్ళి సెటిలైందా? మీ బావనే చేసుకోబోతున్నవా? ఉద్యోగం ఎలా వుంది? అసలు ఇప్పుడు వున్నట్టుంది మా ఊరెందుకొచ్చావు?" ఉత్సాహంగా అడిగిన ఆర్తి అప్పటికీ ధీర మాట్లాడకపోయే సరికి "ఏ మైందే సి బి ఐ.? జవాబు చెప్పవేం?" అంది అల్లరిగా.
ధీర వాగుడు వింటూ 'చాటర్ బాక్స్ ఫ్ ఇండియా' అంటూ ముద్దుగా పిలిచే ఆర్తి షార్ట్ ఫాంలో ' సి బి ఐ' అని సంబోధించడాన్ని అలవాటు చేసుకుంది యూనివర్శిటీలోనే .
" ఆరీ .... నువ్వు ఆనందంగా లేవు కదూ?" అంది ధీర సూటిగా చూసూ.
ఉక్రోషం ముంచుకొస్తుంటే " ఎవరన్నరలా?" అంది ఆవేశంగా.
"నీ రూపం" టక్కున జవాబు చెప్పింది ధీర. "నీ కళ్ళక్రింద అస్పష్టంగా పేరుకుంటున్న నల్లటి చారలు."
ఆర్తి ఇబ్బందిగాకదిలింది.
" నువ్వు దాయలేవు ఆర్తీ! అది నీకు చేతకాదే! చేతనయినదానివే అయితే ఇందాక మీ అత్తయ్య సమక్షంలో నాకన్నా ముందు నువ్వు రియాక్టయేదానివి. కనీసం నీ స్థితిని నాకు తెలియచెప్పే కన్నీళ్ళు కనిపించకుండా జాగ్రత్తపడేదానివి ఏదీ ఆర్తీ! నువ్వు సుఖంగా వుండటమే నిజమయితే గుబురు చీకటిలోనైనా దీపకళికలా వెలిగే నీ కళ్ళల్లో ఆ కాంతి ఏది? నీ చూపుల సోపానంపై అడుగుపెట్టాలని ఎగిసిపడే తరగంలనురగల్లా అబ్బాయిలు నీ చుట్టూ చేరి ఆర్తితో కలవరపడేవారే! మరి నీ కనుపాపల్లో అప్పటి వర్ణచిత్రాల మెరుపుల మరకలెక్కడ... చీకటి మింగేసి వెలుగు లాగో... రెక్కలు తెగిన కలహంసలాగో కనిపిస్తున్న నువ్వు యిప్పుడు అప్పటిలాగే వున్నానని అంటే మాత్రం నేనెలా నమ్మేదే?"
"అదికాదే ధీరా!"
"నువ్వు సుఖంగా లేవు. ముందా నిజం ఒప్పుకో."
ఆవేశంగా అంది ఆర్తి" బ్రతకంటే భావుకత్వం కాదే."
"కానీ ఒక అబద్ధాన్ని నిజంగా భ్రమపెట్టే కవిత్వం కూడా కాదు"
"అబ్బ బ్బా!" ఆర్తి తల పట్టుకుంది.
యూనివర్శిటీ హాస్టల్లో ధీరతో వాదించలేనప్పుడు ఆర్తి ఇలానే అనేది. ఇదే పద్ధతిలో తల కొట్టకునేది.
అది గుర్తుకొచ్చిందేమో! ధీర కూడా నవ్వేసింది.
"బహూశా మీ అత్తయ్య ధాటికి తట్టుకోలేక యిలా అయిపోయివుంటావు."
ఒక్క అత్తయ్యేమిటి 'నాతి చరామి' అంటూ మాట ఇచ్చిన భర్త ప్రవర్తన కూడా ఆర్తిని ఆస్థితికి దిగజార్చింది. అయినా ధీరముందు ఆనిజాన్ని ఎలా ఒప్పుకోగలదని.
ధీర ఇక వినదు, ఊరుకోదు. అందుకే కొంత నిజాన్నయినా చెప్పాలనుకుంది.
"కొంత వరకూ నీవూహ కరక్టేనే. మా అత్తగారిది కాస్త డామినేటింగ్ నేచర్. పైగా నేనుపల్లెటూరి నుంచి వచ్చానని, మధ్యతరగతి రైతుకు పుట్టిన ఆడపిల్లనని కాస్త చిన్న చూపు."
" మీ ఆయన మాత్రం రాష్ట్ర్రపతి కొడుకా?"
" కనీసం డెప్యూటీ కలెక్టరుకి పుట్టిన బిడ్డగా."
"ఆ మాత్రం దానికి ఈవిడెందుకు రెచ్చిపోవాలి. నీ తెలివికి, చదువుకీ నువ్వు ఐ. ఏ.ఎస్ చేసి వుంటే ఆ బోడి డిప్యూటీ కలెక్టరుగా నువ్వూ జాబ్ చేసేదానివిగా."
"నీకు దణ్ణం పెడతా.... " ఆర్తి అలసటగా అంది "కాస్త నీసమక్షములో అయినా మనశ్శాంతిగా బ్రతకనియ్."
"ఒప్పుకున్నావన్నమాట."
"ఏమిటి?"
"నీకస్సలు మనశ్శాంతి లేదని."
దొరికిపోయినట్టుచూసింది ఆర్తి. " నీతో మాట్లాడలేనే."
"కనీసం నా ప్రశ్నలకి జవాబులైనా చెప్పగలువగా."
"చెబుతాను ముందు నన్ను ప్రశ్నలడగనియ్. ప్లీజ్!"
ధీర సాలోచనగా చూసింది.ఎలాగూ ఓ రెండు రోజులుడాలనుకుంటూంది. వెంటనే ఆర్తిని అదరగొట్టే పనిలేదు.బెదిరించి కాకపోయినా, బుజ్జగించైనా కొంత రాబటొచ్చు.
" మన స్నేహితురాళ్ళు ఉమా, సరళ...... వీళ్ళంతా ఎలా వున్నారు?"
"ఉమ లవ్ మ్యారేజ్ చేసుకుంది.ఉమ పెద్ద కూతురైనా తండ్రి పెళ్ళి చేయలేకపోవడంతో లేచిపోయింది. సరళ బ్రతకాలని క్యాహరే డ్యాన్సర్ గా బాంబేలో సెటిలైందట"
ఆర్తి అవాక్కయినట్టు చూస్తూంటే " ఏమిటే...... నేను చెప్పిందంతా నిజమే " అంది ధీర.
" నమ్మలేకపోతున్నాను" అంది ఆర్తి.
"నిజమా?" నవ్వేసింది. "మరి నిన్ను చూస్తుంటే నాకూ అలానే అనిపిస్తుందిగా. నువ్వేం చెబుతావు."
"నేనేం మారలేదు."
"అని నువ్వంటే చాలదే ఎదుట వున్న ప్రకృతి అందాన్ని తాగేస్తున్నట్టు మాట్లాడే అప్పటి నీ భావుకత్వం స్థానంలో నిర్లిప్తత ఎందుకు చోటు చేసుకుంది మరి? నిన్ను తాకిన ఓ గాలి అలకి సైతం పులకించి ఆరమూసిన కళ్ళతో అందంగా కవిత్వం చెప్పేదానివే! శూన్యాన్ని సైతం చిత్రించి చెప్పగల ఆ చైతన్యం యిప్పుడేమైంది?"
"బాగుందే!" ఇంత సులభంగా ధీర తనను గుర్తుపట్టేయడం నచ్చలేదు. ఆర్తికి. " వచ్చి అయిదు నిమిషాలు కూడా కాలేదు. నాలో అంత మార్పుని ఎలా చూడగలిగావు? నేను"