Previous Page Next Page 
మధుపం పేజి 5


    'అబ్బ వినండి. సినిమా కెళ్ళానా.... మీ గోలతో ఆలస్యంగా బయలుదేరాను . సినిమా మొదలెట్టేశారు. నాసీటు పక్కన యిటు అటు మగాళ్ళు.... ఆ ఉంటే నాకేం. అమ్మమ్మ అయన నేనేం చిన్నదాన్నా మగాళ్ళుంటే . నాకేం , నా కొడుకో తమ్ముడో అనుకుంటూ హాయిగా కూర్చున్నా ..." కుతూహలంగా వింటున్న అయన మొహంలో రంగులు మారాయి. యింకేం చెప్తుందోనన్నట్లుగా ఆరాటంగా ఎదురుచూశారాయన.
    "ఇటు పక్కనున్న అయన పాపం పెద్దమనిషే ..... కాస్త వదిగి కూర్చున్నాడు. ఎడమవైపున్నాడు చూడండి , కాస్త కుర్రకారు - అంటే ఏ ముప్పై ముప్పై ఐదో ఉండచ్చు.... నే కూర్చున్న దగ్గిర నుంచి నా వైపు దొంగచూపులు మొదలు పెట్టాడు. మొదట ఏమిటి కాలేజీ కుర్రపిల్లని చూసినట్లు చూస్తున్నాడని చిరాకనిపించినా తరువాత ..... ఏదో గమ్మత్తుగా బాగానే వుందనిపించింది. కించిత్తు గర్వమూ అనిపించింది సుమండీ..... నేను అమ్మమ్మలా కాక ఆంటీలా వున్నాను గాబోలు, పురుష పుంగవుడిని ఆకర్షించే అందం యింకా ఉందన్న మాట అనుకోగానే గర్వంగా అనిపించింది. 'పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్టు ' యింటి మొగుళ్ళు పెళ్ళాలని ముసలమ్మలా తీసి పారేస్తారు గదా..... అలాంటప్పుడు పరాయి మగాడు దొంగచూపులు చూడడం ఓ ఆడదానికి కించిత్తు ఆనందమే కలిగిస్తుందిగా...."
    నవ్వుతూ అంది ఆ యిల్లాలు. వింటున్న భర్త గారి మొహంలో హావభావాలు సెకను కోసారి మారుతున్నాయి. "సిగ్గులేకుండా, మనవల నెత్తిన దానివి, ఓ కుర్రవెధవ నిన్ను దొంగ చూపులు చూసాడని, చాలా సంబరంగా చెప్పడం కూడానా' నాకెందుకు సిగ్గు .... నేనేం తప్పుడు పనిచేశానా..... ఎవడో చూస్తె నా తప్పా...... అందంగా ఉన్నానని చూసుంటాడు. నేనో అమ్మమ్మనని అతనికేలా తెలుస్తుంది....." విలాసంగా అంది.
    "ఇంతే అనుకుంటున్నారా..... తరువాత ఏం జరిగిందో చెప్పనా ..... చెపితే ఉడుక్కుంటారు."
    భర్త గారి మొహంలో కొత్త రంగులు వచ్చి చేరాయి. అడగడానికి అహం అడ్డువచ్చి ఆవిడ చెప్పబోయే మాట కోసం అసహనంగా ఎదురు చూశాడాయన.
    "ఇంటర్వెల్లో లైట్లు వెలిగాక నా వైపు చూశాడు. ఫరవాలేదు అంటే బాగానే ఉండనుకున్నారు గాబోలు .... బైటికెళ్ళి రెండు కూల్ డ్రింకులు తెచ్చాడు. ఒకటి నాకిచ్చి "తీసుకోండి అంటీ" అన్నాడు. వద్దన్నాను. బలవంతపెడితే తీసుకున్నాను" లైటారాక వెనుక నుంచి చెయ్యి వేశాడు. ఆహా నా భుజం మీద కాదు కుర్చీ మీదే లెండి..... ఆ తరువాత కాలు తగిలింది. పాపం కావాలని తగిల్చి ఉండడులెండి. మనిషన్నాక కదలక మెదలక ఎలా కూర్చుంటాడు. సినిమా అయిపోయిందా.... అంటే మీరిక్కడికి వెళ్ళాలి రండి. ఈ రాత్రి వంటరిగా వెడతారా, నా బైక్ మీద దింపేస్తాను అన్నాడు నవ్వుతూ.
    'అమ్మో అలా అనగానే భయం వేసింది సుమా...."
    "ఏం పళ్ళికిలించు కుంటూ మురిసిపోయావుగా ... భయమెందుకు స్కూటరెక్కి చక్కగా రావాల్సింది .' పళ్ళ బిగువునన్నాడాయన.
    "నిజంగానే కాసేపు స్కూటరు ముచ్చట  తీర్చకుంటే బాగుండు అనిపించినా బాబోయ్ ఎవరన్నా చూస్తె అనిపించింది...."
    'అంటే ఎవరు చూడకపోతే ఎక్కేద్దువన్న మాట...."ఉక్రోషం ధ్వనించింది అ గొంతులో.
    "ఊరికే అన్నా.... ఎక్కుతానేమిటి పరాయి మగాడి స్కూటరు మీద - "కులుకులు పోతూ అంది.
    "ఏమో బాబూ యిదే చెప్పుతున్నా - మీరోచ్చినా రాకపోయినా నాకు ఏదన్నా సినిమా చూడాలనిపిస్తే వంటరిగా వెళ్ళే ధైర్యం వచ్చేసింది. ఇక మీదట మిమ్మల్ని అడగనే అడగను....' నిష్ట్టూరంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది.

                                                      *    *    *    *
    "ఏమిటోదినా , రెండు సినిమాల కెళ్ళేసరికి నాతోడు అవసరం లేకుండా పోయిందా అన్నయ్యగారు వచ్చేసరికి నన్ను పక్కకి తోసేసారు-" పక్కింటి సావిత్రి హాస్యం ఆడింది. రాజేశ్వరి కొత్త పెళ్ళి కూతురిలా సిగ్గుపడింది. తరువాత కొంటెగా చూస్తూ "మా ఇద్దరి మధ్యా నీవెందుకమ్మా తల్లీ పానకంలో పుడకలాగా....."
    "బాగానే ఉంది ముది వయసులో మీ ముచ్చట్లు ...." సావిత్రీ నవ్వింది.
    "ముదివయసేమిటి, అరవైలు, ఎభైయిలు ముదివయసెం గాదు'. మధ్య వయసు ఈ రోజుల్లో, అయినా మరీ చోద్యం గాకపోతే మొగుడితో సినిమా కెళ్ళాడానికి ఏ వయసయితే నేం."
    'అవును మరి, అందుకే కాబోలు అన్నయ్యగారు, ఈ అందాల పడచుపెళ్ళాన్ని ఎవడెం చేస్తాడోనని భయపడి వెంటపడ్డారు" ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు.
    
                                            *** 

 Previous Page Next Page