పక్కనుంచి అంతా వింటున్న సరళరేఖ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోదల్చుకుంది. "అయ్యా, మినిష్టర్ గారూ! ఆడెవడో అవసరం లేదు. వీణ్ణి చూడండి. ఈ పొట్టి పోలీసు పేరు బ్రహ్మనాయుడు. నా కుడిభుజం లాంటివాడు. జనంలో వీణ్ణి నిలబెడితే మీకు కావలసిన విధంగా, అద్భుతంగాచెప్పగలడు" అంది.
"నమ్మకస్తుడేనా?" అనుమానంగా అడిగాడు మంత్రి.
"మీ - మా పర్సంటేజీల మీద ఒట్టు!" అంది.
"గుడ్!" అన్నాడు మంత్రి. బ్రహ్మనాయుడ్ని దగ్గరకు పిల్చి, రిహార్సల్ ప్రారంభిస్తున్నట్టు. "బాబూ, నువ్వు ఈ నియోజకవర్గం ఓటరువేనా?" అని నాటకీయంగా అడిగాడు.
"అవునండీ" అన్నాడు పొట్టి పోలీసు.
"ఇన్నాళ్ళూ ఒక మంత్రిగా, మీ ప్రతినిధిగా వున్న నాపై నీ అభిప్రాయం మొహమాటం లేకుండా చెప్పు".
"మీలాంటివాళ్ళు లక్షకో, కోటికో ఒకళ్ళు పుడతారు. మీరు మా నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం మా అదృష్టం. మీకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నవాడు అన్నివిధాలా అసమర్ధుడు...."
"నోర్ముయ్! నువ్వు ఇట్టా గడగడా ఒప్పచెప్పినావంటే ఇదంతా ముందే ప్లానింగేసుకుని చెప్పామనుకుంటారు. నేను అడగ్గానే మొహమాట పడాల! చెప్పనండీ, చెప్పనండీ' అణాల!! అతికష్టంమీద చెప్పినట్టు, అన్నీ సత్యాలే చెప్తున్నట్టు మొహంలో ఫీలింగుండాల!!! నువ్వెవరివి? అక్కడున్న అశేష పెజల మనసులకి అద్దానివన్నమాట. ఓటర్లకి పెతినిధివన్నమాట. నా గురించి ఇక్కడి జనమంతా ఏమనుకుంటున్నారో నీ ద్వారా టీ.వీ. లద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలియాల...."
"మిగతాదంతా నాకొదిలెయ్యండి సార్" అంది సరళరేఖ హుషారుగా. ".... మీరు చూడగానే గుర్తుపట్టేట్టు వీడికి ఎర్రఫ్యాంటు, పచ్చ షర్టు వేయించి జనంలో నిలబెడతాను. సాయంత్రం వరకూ నేనే ట్రైనింగ్ ఇస్తాను. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. లక్షలూ, కోట్లూ ఖర్చుపెట్టినా దొరకనంత ప్రచారం మీకు ఈ ఒక్క సంఘటనతో లభిస్తుంది. అసలు మీ తెలివే తెలివి. ఎలక్షన్ ఖర్చుమీద వున్నా నిబంధనని ఇంత తెలివిగా అధిగమించగలిగారు కాబట్టే మీరు మంత్రి అవగలిగారు. అమోఘమైన...."
"సూడూ, ఈ కాకీ బట్టలు తీసేసి ఖద్దరు బట్టలేసుకోకూడదూ? నీ పొగడ్తలు చూస్తుంటే నువ్వు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కాదు, పాలిటిక్స్ లో పైకి వస్తావనిపిస్తోంది."
"నా జీవితాశయం అదేనండీ" నమ్రతగా అంది సరళరేఖ.
"అవునా? మరి చెప్పావు కాదేం? తెలివితేటలున్నాయో లేదో తెలీదుగానీ ఎర్రగా బుర్రగా వున్నావ్ కదా! నా పార్టీకి నిన్నే వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేస్తాను. సాయంత్రం మీటింగ్ మాత్రం రక్తి కట్టించు."
"అంతా నేను చూసుకుంటాను సార్!" అంది సరళరేఖ గాలిలో తేలిపోతూ. ఆమె ఊహల్లోకి అప్పుడే ఒక దృశ్యం వచ్చేసింది- గాంధీ, నెహ్రూలు కూచున్నట్లుమోకాళ్ళు మడిచి తనూ, పార్టీ ప్రెసిడెంటూ బాలీసులకి ఆనుకుని కూర్చుని, దేశ భవిష్యత్తు చర్చిస్తున్నట్టు!
* * *
పెద్ద రథం వచ్చి ఆగింది. రథం అంటే రథం కాదు. కారుకే రథంలాగ ఆర్చీలు కట్టారు. ఒక కాలు సీటుమీదా, ఒక కాలు స్టీరింగ్ మీదా పెట్టి అర్జునుడు పాంచజన్యం ఊదినట్టు, శంఖం పూరిస్తూ నిలబడ్డాడు రామ్ భరత్. ఆరడుగుల పొడవూ, అమితమైన లావూ, నెత్తిమీద ఖద్దరు టోపీ, రిమ్ లెస్ కళ్ళ జోడు.... ఆ గెటప్ లో అతనలా శంఖం పూరిస్తుంటే జనమంతా దసరా పండుగ రోజును గుర్తు తెచ్చుకున్నట్లు చూసారు.
"కడుపు నిండిపోతందయ్యా చక్కట్రీ! నేలీనినట్టు ఎంత జనం చూడు" అన్నాడు రామ్ భరత్.
"అయ్యా! ఆళ్ళొచ్చింది మనగురించి కాదులెండి. మనతో పాటొచ్చిన సినిమా యాక్టర్ల గురించి"
"మరందుకే కదయ్యా! మనతో పాటుంటారనే కదా, ఈ యాక్టర్లకే అర్హతా లేకపోయినా, రాజ్యసభ మెంబర్లని చేసి ఢిల్లీ పంపించింది! గ్లామరాళ్ళదీ, లాభం మనదీ. పద పద టైమైతాంది" అంటూ హడావుడిగా రథం దిగివెళ్ళి స్టేజ్ ఎక్కాడు.
ఉపన్యాసం ప్రారంభమైంది. స్టేజికి ఒక పక్క మహిళా విభాగం వైపు నిలబడ్డ సరళరేఖ ఉత్సుకతతో చూస్తోంది. దూరంగా జనంలో మంత్రి దృష్టికి అనేలా నిలబడి వున్నాడు పొట్టి పోలీసు. అయితే అతడు పోలీసు డ్రస్సులో లేడు. ఎర్ర ఫ్యాంటు, పచ్చషర్టులో వున్నాడు. దాదాపు ఆరుగంటలనుంచి అతగాడికి ఎలా మాట్లాడాలో సరళరేఖ నూరిపోసింది. అవకాశం ఒకేసారి తలుపు తడుతుందని ఆమెకి తెలుసు. ఇప్పుడలాంటి అవకాశం వచ్చింది.
దురదృష్టవశాత్తూ బృహస్పతి రూపంలో!
* * *
"ఇదేంటి? ఈ గెటప్పేమిటి?" ఆశ్చర్యపోతూ అడిగాడు రావు. ఎర్రఫ్యాంటు, పచ్చషర్టు వేసుకుని వున్నాడు బృహస్పతి. షర్టు రెండువైపులా కిందికొదిలేసి, మధ్యలో మాత్రం ఫ్యాంట్ లోకి దోపుకున్నాడు. చూడగానే అందరి దృష్టీ అతడిమీద పడేటట్టు వుంది. ఆ వేషధారణ. షర్టుకి బటన్స్ పెట్టుకోలేదు.
బృహస్పతి చెప్పాడు- "నా ఎర్రఫ్యాంటు కమ్యూనిజానికి గుర్తు. నా పచ్చషర్టు తెలుగుదేశానికి ప్రతీక. అది రెండుగా విడిపోయింది గాబట్టే నేనూ చొక్కా బొత్తాలు పెట్టుకోకుండా రెండుగా వదిలేసాను. ఇక కమ్యూనిస్టులు తమకంటూ ఒక అస్థిత్వం లేకుండా నిజమైన కమ్యూనిజాన్ని గాలికి వదిలినందుకు నిరసనగా ఒకవైపు పచ్చషర్టుని ఎర్రప్యాంటు మీద కప్పేను. ఎలా వుంది ఈ ప్రదర్శన?"
"అక్కడితో ఆపావు బాస్. సంతోషం. కమ్యూనిస్టులు రెండుగా చీలిపోయారు కాబట్టి, దానికి ప్రతీకగా ఫాంటు బటన్స్ కూడా రెండుగా విప్పేసి వుంటే చూడలేక చచ్చి వుండేవాళ్ళం."
మైక్ లోంచి మినిష్టర్ గారి స్పీచ్ వినవస్తోంది.
"మీలోంచి ఎవరైనాసరే ఒకళ్ళు స్టేజిమీదకు రండి. నిజాయితీగా చెప్పండి. నా గురించీ, నా ప్రత్యర్ధి గురించీ మీరంతా ఏం చెప్తే అదే నిజం. మీలోంచి ఒకరు వచ్చి మీ మనసులో మాట చెప్పండి.... ఇదిగో బాబూ! నువ్విటురా" అంటూ దూరంగా వున్న గుంపువైపు చెయ్యి వూపి పిల్చాడు.
రావు ఉలిక్కిపడి బృహస్పతివైపు చూసాడు.
"నన్నేనా?" అన్నట్లు సైగ చేసాడు బృహస్పతి.
'అవునన్నట్టు' మళ్ళీ చెయ్యి వూపాడు మినిష్టరు.
బృహస్పతి స్టేజివైపు నడుస్తుండగా మినిష్టర్ మైకులో చెప్పసాగాడు - "మీరే చూసారు, మీలోంచే ఒకణ్ణి పిలిచాను కదా! సగటు ఓటరు అభిప్రాయం ఎలా వుందో అతడి నోటివెంటే విందాం!!"
జెమిని, ఈటీవి, సిటీకేబుల్- అన్ని కెమెరాలూ బృహస్పతివైపు తిరిగాయి. అతడు స్టేజీ ఎక్కాడు. నిజానికి అతడికి ఇదేమీ అర్ధంకావడంలేదు.
దూరంగా స్టేజి కింద ఉన్న సరళరేఖ నుదురు బాదుకుంటోంది. జనంలో ఎర్రఫాంటు, పచ్చషర్టు వేసుకుని నిలబడివున్న పొట్టి పోలీసు ఎక్కాలు మర్చిపోయిన కుర్రాడిలా బిత్తరచూపులు చూస్తూ చేతులూ గట్రా ఎత్తి మంత్రిగారి దృష్టిని ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈలోగా మంత్రి సాదరంగా మైక్ ని బృహస్పతి ముందుకు తోసి- "నా పట్ల మీ అభిప్రాయం ఏమిటో జనానికి చెప్పండి" అన్నాడు.
"అబ్బే వద్దండీ, బాగోదు" అన్నాడు బృహస్పతి.
"ఫర్లేదు చెప్పండి."
"నాకు ఇబ్బందిగా వుంటుంది."
"ప్రజాస్వామ్యంలో ఓటరుకి ఇబ్బందన్న ప్రశ్నే లేదు నిర్బయంగా, స్వేచ్చగా తన అభిప్రాయం చెప్పవచ్చు."
"ఇంత నిర్భయంగా మీ గురించి చెప్పమన్నందుకు మీకు జోహార్లు అర్పిస్తున్నాను" అన్నాడు బృహస్పతి.
మంత్రి అతడివైపు అభినందన పూర్వకంగా చూసాడు.
'అనుకున్న దానికంటే బాగా నటిస్తున్నాడు ఈ కుర్రాడు. నిజంగానే బాగా ట్రైనింగ్ ఇచ్చింది ఆ ఇన్ స్పెక్టరు' అనుకున్నాడు. ఈ సంభాషణంతా జనం మైక్ లో వింటున్నారు.
జనమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోవడంతో, అక్కడ సూదిపడితే వినపడేంత వాతావరణం ఏర్పడింది. ఇదంతా ఒక కొత్త ప్రక్రియ. మంత్రి ఊహించినట్టే ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. జనమంతా ఉత్సుకతతో చూస్తున్నారు.
మంత్రివైపు తిరిగి, చిన్న స్వరంతో-
"మీరు నన్ను చాలా మొహమాట పెట్టేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు చెపితే ఇరుకున పడతారు" చివరిసారిగా చెపుతున్నట్టు అన్నాడు బృహస్పతి.
కంఠంలో నిజాయతీ ధ్వనిస్తుండగా మంత్రిగారు మార్దవంగా అన్నారు- "బాబూ! ఏదో ఎదురుగా కనబడ్డావని పిల్చాను. నువ్వు నా పార్టీ మనిషివో, ప్రత్యర్ధి వాడివో తెలీదు. అయినాసరే నిన్ను పిలిచానంటే నామీద నాకంత నమ్మకం ఉందన్నమాట! నా ప్రత్యర్ధులు కూడా నన్ను మెచ్చుకునేటంత గొప్ప గొప్ప పనులు నా హయాంలో చేసానని నాకు నమ్మకముంది. అందుకే నువ్వనుకున్నదేదో నిర్భయంగా చెప్పమంటాన్నాను."
బృహస్పతి గొంతు సవరించుకున్నాడు.
"ప్రజలారా! మన మంత్రిగారు ప్రస్తుతం ఎన్నకల్లో తిరిగి పోటీ చేస్తున్నారు. ప్రజల తరఫు ప్రతినిధిగా తన గురించి అభిప్రాయం చెప్పమన్నారు. ఏం చెప్పాలి? ఎలా ప్రారంభించాలి? ఈయన ఒకప్పుడు 'అవినీతి నిరోధక సంస్థ దగ్గరా, పోలీస్ స్టేషన్ ల దగ్గరా' బ్రోకరుగా చేసినవాడు..."
జనంలో చిన్న కలకలం రేగింది.
"నగరంలో ఏ యే వ్యక్తులమీద త్వరలో కేసులు బుక్ అవుతున్నవో తెలుసుకుని, క్షణాలమీద జ్యోతిష్కుడయిన హరిస్వామికి ఆ వివరాలు అందజేసేవాడు. ఆయన ఆ వ్యక్తుల్ని కలిసి వాళ్ళజాతకంలో శని ప్రవేశించిందనీ, హోమాలూ, పూజలూ చేయించాలనీ, భవిష్యత్ వాణిగా చెప్పేవాడు. దాదాపు ప్రతివాళ్ళూ అవినీతి నిరోధకశాఖ అన్నా, పోలీసుల కేసు అన్నా విపరీతంగా భయపడతారు. పోలీసు ఇంటికి రాగానే జైలుశిక్ష పడినంతగా కంపించిపోతారు. ఈ అవకాశాన్ని రామ్ భరత్, హరిస్వామిలు చక్కగా వినియోగించుకునేవారు. మానసికమైన ఒత్తిడిలో వున్న ఆ వ్యక్తులు తమకు వచ్చిన ఈ ప్రమాదాన్నీ అంత కరెక్ట్ గా "ముందే" పసిగట్టిన హరిస్వామిని దేవుడిగా భ్రమించేవారు. తెరవెనుక జరిగినదంతా తెలీదు కాబట్టి ఇదంతా హరిస్వామి గొప్పతనమే అనుకుని వేలకివేలు సమర్పించుకునేవారు. మాఫియా కన్నా చాలా గొప్ప రాకెట్ ఇది! సామాన్య ప్రజానీకం కల్లోకూడా ఊహించలేనంత గొప్ప ప్లాన్.... ఈ విధంగా తాయెత్తులూ, హోమాలతో లక్షలు సంపాదించాక ఇటు ఈయన రాజకీయాల్లోకి చేరాడు. అటు హరిస్వామి రాజకీయ నాయకులకి ముఖ్య సలహాదారుగా -మరోలా చెప్పాలంటే- తాంత్రికం ముసుగులో వ్యవహారాలు సెటిల్ చేసే బ్రోకరుగా తయారయ్యాడు."
స్టేజిమీద వున్న మంత్రి, ఆయన అనుచరులూ మొహాలు చూసుకున్నారు. జనం కూడా దిగ్భ్రాంతి చెందినట్టు అక్కడ వాతావరణంలోని నిశ్శబ్దమే సాక్షిగా నిలిచింది.
".... సరే! జరిగినదేదో జరిగిపోయింది. బలహీనమనస్కులతో హోమాలు చేయించడం చట్టవిరుద్దం కాదు కాబట్టి, ఆ విషయం అక్కడితో వదిలిపెడతాం. ఈయన పార్టీ రెండుగా విడిపోయినప్పుడు బలప్రదర్శన చూపించడం కోసం, కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఎనిమిది బహిరంగ సభలు నిర్వహించాడు. అప్పటికి ఎన్నికలు కూడా దగ్గరలో లేవు. ఒక్కొక్క ప్రదర్శనకీ కనీసం రెండు వందల లారీల జనాన్ని వీరి పార్టీ సమీకరించింది. ఒక్కొక్క లారీ డీసెల్ ఖర్చూ, దాంట్లో జనాల ఖర్చూ కనీసం పాతికవేలు వేసుకున్నా, ఎనిమిది సభలకీ కలిపి కనీసం నాలుగు కోట్ల ప్రజాధనం ఖర్చై వుంటుంది. ఒక నాయకుడు మరణించగానే- కేవలం ప్రజలు తమవైపు వున్నారని నిరూపించుకోవడం కోసం చీలిపోయిన రెండు పార్టీలూ రాష్ట్రంలో దాదాపు పదికోట్లు ఆ విధంగా వెచ్చించడానికి జవాబుదారీ ఎవరు? దీనివల్ల కనీసం ఒక్క ఓటరుకైనా లాభం వుందా?