నిజానికి వరదరాజు అప్పటికి ఒక నిర్ణయానికి రాకపోయినా, తనకి ఉద్యోగం మీద అపేక్ష వుందని తెలిపితే వాళ్ళ ఆఫీసులో ఏదైనా పని ఇస్తాడేమో అన్న ఆశతో "ఉద్యోగంలో ప్రవేశిద్దామనుకొంటున్నానండీ" అన్నాడు.
"ఇంకా చిన్నవాడివి. ఇప్పుడే ఉద్యోగానికి వచ్చిన తొందర ఏమిటి? ఎమ్. ఎస్ సి. చదవరాదూ?" అంది రాజమ్మ.
"చదువుకొనేందుకు వయసున్నా పరిస్థితులు అనుకూలంగా లేవండీ! అసలే మూడేళ్ళయి పంటలు తిన్నగా పండటంలేదు. ఆపై ని ఈ కరువు ఒకటి. యెంత జాగ్రత్తగా ఖర్చు చేసుకొన్నా వచ్చిన సొమ్ము కుటుంబం గడిచిందికే చాలటం లేదు. పైగా, నా చదువు ఒకటి. మీ దయవల్ల ఈపాటి సహాయం చేసేరు కాబట్టి ఇదైనా పూర్తి చేయగలిగేను. ఇప్పటికే అన్నయ్య చాలా అప్పుల్లో ఉన్నాడు. ఇంకా చదవాలంటే...."
"పోనీ, నేను డబ్బు పెడితే చదువుకొంటావా?" రాఘవయ్య ప్రశ్నించేడు.
"ఒద్దండీ! పుచ్చుకొన్న సొమ్ము ఏదోనాటికి తీర్చవలసిందే కదండి. ఇంకా అప్పుల్లో మునిగిపోతే మాకున్న భూమి, ఇల్లూ అమ్ముకోందే తీర్చుకొనే అవకాశంలేదు. ఏదో ఉద్యోగం చూసుకొని పదిరాళ్ళు తెచ్చుకొంటే, ఆ పంటకి ఈ జీతం తోడుకాగా ఎలాగోలాగ గడుపుకుపోవచ్చును" అన్నాడు రాజు.
రాఘవయ్య సాభిప్రాయంగా భార్యవైపు చూసేడు. రాజమ్మ సంభాషణ అందుకొంది.
"రాజూ, నీకు చదువుకు తగిన లోకజ్ఞానం ఉంటే మా అభిప్రాయం ఏనాడో గ్రహించివుండేవాడివి. నీ బుద్ధినంతా చదువుకే వినియోగించి పరీక్షలయితే పాసయేవుకాని....మేము నీకు డబ్బు పెట్టాలనుకొంటున్నామంటే అప్పుకుగాదు _ మా కాబోయే అల్లుడికి చదువు చెప్పిస్తున్నామన్న మాట! ఇప్పటికైనా నా మాట నీకు అర్ధమయిందా? అనూరాధని నీ కియ్యాలని వుంది మాకు. మంచిరోజు చూసుకొని మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్యకి, వదినకి చెబుతాం. ఈలోగా మీరూ ఆలోచించుకోండి.
"ఇంక ఉద్యోగం చెయ్యడం అన్న ఆలోచన వదిలిపెట్టి ఎమ్.ఎస్ సి. లో సీటుకి అప్లికేషన్ పెట్టు. ఈ మాట చెప్పేందుకు నిన్ను ఇంత తొందరగా పిలిచేము" అంది రాజమ్మ.
నా అభిప్రాయం కూడా అదే అన్నట్లు చిన్నగా నవ్వేడు రాఘవయ్య.
కథానాయకి అనూరాధకోసం రాజు కళ్ళు ఆత్రంగా ఇల్లంతా వెతికేయి.
"రాధ ఇంకా ఊరినించి రాలేదు." అంది కంటి చూపుల భావం గ్రహించినట్లు అంది రాజమ్మ.
రాజు వారిదగ్గిర సెలవు పుచ్చుకొని ఇల్లు చేరేడు.
"యెందుకు పిలిపించేరు ?" అంటూ ప్రశ్నించింది మీనాక్షి.
"రాఘవయ్యగారు నేను ఎమ్.ఎస్ సి. చదవాలనుకొంటే తాము డబ్బు ఇస్తామన్నారు. ఆ మాట చెప్పిందికే పిలిపించేరు." తన పెళ్ళిమాట తన నోటిమీదుగా చెప్పేందుకు రాజు సిగ్గుపడ్డాడు.
"నువ్వేమన్నావు ?" శివయ్య ప్రశ్నించేడు.
"మా అన్నయ్య నడిగి చెబుతానన్నాను."
రాజు సమాధానం శివయ్యకి తృప్తి కలిగించింది. తమ్ముడు తన పెద్దరికం నిలిపినందుకు ఆనందించేడు.
"సరే....తాపీగా ఆలోచిద్దాం" అన్నాడు శివయ్య.
"కాని, చదివేమాటుంటే త్వరగా అప్లికేషను పెట్టుకోవాలి. ఆలస్యమయితే సీటు దొరక్కపోవచ్చు" అన్నాడు రాజు.
"నీకు సీటెందుకు రాదయ్యా, ఫస్టుక్లాసులో పాసైన పిల్లడివి" అంది మీనాక్షి గర్వంగా.
"నాలా ఫస్టుక్లాసులో పాసైనవాళ్లు దేశంలో చాలామంది వుంటారు, వదినా! మన ఊరిలో గొప్పగా చెప్పుకొనేందుకేగాని బయటికి పోతే దీనికేం గొప్పలేదు" అన్నాడు రాజు.
"సరి, అయితే సీటుకి అప్లికేషను పెట్టు. ఇళ్లు వుందికదా, ఆపాటి సొమ్ము పుట్టకపోదు. ఈ రెండేళ్లు చల్లగా గడిచిపోతే ఆపై దానికి భగవంతుడే ఉన్నాడు" అన్నాడు శివయ్య.
ఆ రోజునే వరదరాజు ఎమ్. ఎస్ సి. లో సీటుకి అప్లికేషన్ పెట్టేడు.
* * *
వరదరాజుకి ఎమ్. ఎస్ సి. లో సీటు వచ్చింది. మూడు రోజుల లోపున సొమ్ము చెల్లించి రసీదులు తీసుకోవాలి. అప్పటివరకు రాఘవయ్యగారు చేస్తానన్న సహాయం అందే సూచనలు లేవు.
"ఎవరుమాత్రం సొమ్ము ఊరికే యెందుకు పెడతారు? ఏదో పిల్లడు ఫస్టుక్లాసులో పాసయ్యేడు. ముందు చదువు చదివితే మంచిదన్న ఉద్దేశంతో మాటవరసకి అనివుంటారు పొరుగింటి బొబ్బట్ల కోసం నెయ్యి కాచుకు కూచున్నట్లు వారి మాటమీద ఊరుకొంటే ఎలా? సొమ్ము పుట్టే మార్గం చూడండి" అని భర్తని తొందర చేసింది మీనాక్షి.
శివయ్య డబ్బుకోసం సాధారణంగా గ్రామంలో యెవరికి అవసరం అయినా అప్పుపెట్టే సుబ్బిరెడ్డి దగ్గిరికి వెళ్లేడు. సుబ్బిసెట్టి మంచి వ్యవహారజ్ఞానం వున్నవాడు. పాము చావకుండా, కర్ర విరగకుండా డబ్బుకోసం వచ్చినవాళ్లకి గడువులు పెట్టి, వారికి ఆత్రం అధికంచేసి, అప్పుడు తనకి లాభసాటి అయిన షరతులతో డబ్బు ఇస్తాడు.
"ఈ పల్లెటూళ్ళో ఇంటికేం ధర పలుకుతుంది. శివయ్యా! పైగా మిద్దెయిల్లు, నేల గచ్చులయినా తిన్నగా ఉన్నట్లులేవు అయినా నీ ముఖం చూసి ఇస్తున్నాను. తమ్ముడు చదువుకొంటున్నాడు కదా, ఏదోవిధంగా అప్పు తీర్చేస్తారనే నమ్మకంమీద ఇస్తున్నాను" అంటూ కొసరి కొసరి ఎనిమిది వందల రూపాయలు ఇచ్చేడు.