'ఈ సొమ్ముతో రాజు చదువు పూర్తికావాలి. ఈ సంవత్సరమైనా పంటలు తిన్నగా పండి కాస్త ధాన్యం కళ్లపడితే వుంది. లేకపోతేమాత్రం ఇంటిఖర్చుకి కూడా నడివీథికి పడవలసివస్తుంది' అనుకుంటూ ఇంటిముఖం పట్టేడు శివయ్య.
సుబ్బిసెట్టి ఇల్లు ఓ చివరన ఉంది. శివయ్య ఇంటికి రెండు మూడు వీథులు వెనకగా ఉంది. ముందు రాబోయే కాలం గురించి ఆలోచిస్తూ శివయ్య నడక సాగిస్తూంటే దారికి అడ్డంగా పిల్లలు పరుగులు తీస్తున్నారు.
"ఎక్కడికలా పరుగులు తీస్తున్నారు? పడగలరు. కిందా మీదా చూచుకొని నడవండి." పల్లెటూరిలో ఎవరి పిల్లడు అనే విచక్షణ లేకుండా పెద్దలకందరికీ పిల్లల్ని ఆదరించే అలవాటు ఉంటుంది.
"కారు వచ్చిందండి....మోటారుకారు" అంటూ పరుగులు తీస్తూనే కేకలు పెట్టేరు పిల్లలు.
ఆ గ్రామానికి మోటారుకార్లు చాలా అరుదుగా వస్తూంటాయి. ఎలెక్షన్ రోజుల్లో మాత్రం అన్ని పార్టీల వాళ్ళూ కార్లమీద విధిగా వచ్చి, "మా పార్టీకే మీ ఓటు" అని బొట్టుపెట్టి వెళ్ళిపోతుంటారు. కొందరు పెద్దింటివారు, చిన్నతరహా రాజులు కూడా కారు దిగి ఆ మైలున్నర మేరా కాలినడకన గ్రామంలోకి వచ్చి ప్రతి ఇంటి ముంజూరులోకీ దూరి, "అమ్మా, అయ్యా" అంటూ అతి గౌరవంగా ఓట్లు అడుగుతారంటే అది వారి నిగర్వప్రియత్వానికీ, నిత్య సేవాభిలాషకీ చిహ్నం కాకమరేమిటీ?
వంతెన దాటిన కొద్ది మేరవరకే కంకర రోడ్డు ఉంది. అది కూడా ఎవరో నాయకుని ఆగమన సందర్భంలో వేసింది. అక్కడ ఒక పొలం చదునుచేసి పెద్ద పందిరివేసి సభ జరిపించేరు. తరువాత ఆ పొలానికి పందిరిపొలం అన్నమాట వాడుకలోకి వచ్చింది. ఈ రోజు వచ్చిన కారు కూడా ఆ పందిరి పొలందగ్గిరే ఆగిపోయింది. మామూలుగా శిస్తువసూళ్ళకి సర్కారు ఉద్యోగస్థులు వచ్చేటప్పుడు ఏవో పాతకర్లు, డొక్కుజీపులమీద రావడం అలవాటే.
కాని ఈ కారు రంగు యెండలో మిలమిల మెరిసిపోతున్నది, దాని కిటికీలకి పల్చని పట్టుతెరలు వున్నాయి, డ్రయివరు తెల్లకోటుకున్న రోల్డుగోల్డు బొత్తాములు బంగారంలా మెరుస్తున్నాయి. పిల్లలే కాక చుట్టుపక్కల పెద్దలుకూడా ఈ కొత్తకారు వింతగా చూస్తున్నారు.
శివయ్య ఇంటికి చేరేసరికి ఇంటిముందు నలుగురైదుగురు మనుష్యులు ఇటు అటు తచ్చాడుతున్నారు. పల్లెటూరిలో ప్రతి ఇంటికి వచ్చీపోయే బంధువుల్ని అందరూ ఎరిగేఉంటారు. వేరుగా ఏ కొత్తవారు వచ్చినా "ఏమిటీ సంగతి? ఎవరు?" అని చెవులు కొరుక్కొంటారు!
అందులో మడతలు నలగని బట్టలతో కారులోంచి దిగిన పెద్దమనిషిని, కాశ్మీరు సిల్కుచీరతో, ఒళ్లు నిండిన నగలతో అతన్ని అనుసరించిన ఆడమనిషిని చూసేక వీరు ఎవరింటికి వెళ్లుతున్నారు అని గ్రామస్థులందరి కళ్ళూ వారినే అనుసరించేయి. ఆ కారు దిగిన పెద్దమనిషి "శివరామయ్యగారిల్లు" అని అడగగానే అందరికీ అసలు విషయం అర్ధమయింది. "వీరు శివయ్యతో వియ్యమందడానికే వచ్చి వుంటారు. వరదరాజుకి తమ పిల్లనిస్తామని చెప్పిందికే వచ్చి వుంటారు. ఓహో, ఏమి వరదరాజు అదృష్టం! అటువంటి కారులో తిరిగే మామగారు, మెడ విరిగి పడేటన్ని నగలతో అత్తగారు__ఈ దంపతులను చూస్తూంటే పిల్ల అందంగానే వుంటుందని చెప్పడానికి ఏమీ ఆటంకం లేదని మురిసిపోసాగేరు.
శివయ్య ఇంటిలో కాలు పెట్టేసరికి ముందు చావిట్లో మునసబుగారింటివి మూడు కొయ్యకుర్చీలు వున్నాయి. యెదురుగా వాల్చి వున్న మంచంమీద ఒక స్త్రీ, ఒక పురుషుడు కూర్చొనివున్నారు. పక్కనున్న తిన్నెమీద రాజు కూర్చుని వారితో మాట్లాడుతున్నాడు. మీనాక్షి మూడు గ్లాసులతో ఆవుపాలు, ముందురోజు చేసిన జంతికెలు తెచ్చి పెట్టింది. శివయ్య సావిట్లో కాలు పెట్టగానే "అదిగో మా అన్నయ్య" అన్నాడు రాజు.
రాఘవయ్య మంచం మీద నుంచి లేచే ప్రయత్నంలో వుండగానే "రాఘవయ్యగారు ఈయన, అన్నయ్యా! ఆవిడ అనూరాధ తల్లి, రాజమ్మగారు" అంటూ అన్నకి పరిచయం చేసేడు.
రాఘవయ్య,శివయ్య 'నమస్కారం' అంటూ ఒకేసారి చేతులు జోడించేరు.
"నమస్కారం అమ్మా! మీ గురించి, రాఘవయ్యగారిని గురించి మా రాజు చెబుతూనే వుంటాడు. ఇంతకాలానికి మిమ్మల్ని చూడడమయింది. మీవంటివారు ఇంటికి వస్తే కూర్చోపెట్టేందుకు సరియైన ప్రదేశమైనా మా ఇంట్లో లేదు. ఇలా వచ్చి ఈ కుర్చీలో కూర్చోండి" అన్నాడు శివయ్య వినయంగా.
"ఫరవాలేదండి మాకిక్కడ సరిగానే వుంది. ఈ కుర్చీలు, సోఫాలు ఈనాడు వచ్చేయికాని మన పెద్దలనాడు...." అంటూ మొదలుపెట్టేడు రాఘవయ్య.
'ఇంక ఉపన్యాసం కట్టిపెట్టి వచ్చిన పని తెముల్చుకోండి' అన్నట్లు భర్తని మోచేత్తో పొడిచింది రాజమ్మ. రాఘవయ్య భార్య హెచ్చరికతో సర్దుకొని "రాజు మీతో చెప్పే ఉంటాడు" అంటూ మొదలు పెట్టి ఒక్కనిమిషం ఆగేడు.
అంతవరకూ వారి రాకకి పేరు కారణం ఊహించుకొంటున్న మీనాక్షి ఆ మాటతో తెల్లబోయింది. 'మీ పిల్లడి చదువుకి డబ్బు అప్పుపెడతాం అని చెప్పేందుకు పనిపెట్టుకొని భార్యను వెనకేసుకు రావాలా?పోనీ, అనూరాధలా గ్రామం చూసేందుకు వచ్చేరేమో అనుకొనేందుకు ఆవిడ వచ్చిన దగ్గిరనుంచీ ప్రతిదానిని పురుగుల్ని చూసినట్లు చూస్తున్నది. పట్నంలో పాలగచ్చుమేడల్లో మసిలేవారికి ఈ పేడామన్ను అలికిన మట్టి ఇళ్లు, నుదురుకి తగిలే ముంజూర్లు చికాకుగానే ఉంటాయి. కాని అంత మాత్రంగా ఎదటివారు ఏమనుకొంటారో అన్న సంకోచం లేకుండా తేలిగ్గా మాటలు విసరడం ఆవిడకి అలవాటు లాగుంది. తల్లీ, కూతుళ్ళలో ఎంత భేదం! అనుకొంది మీనాక్షి.
శివయ్యకూడా రాఘవయ్య మాట సరిగా అర్ధం చేసుకోలేక పోయేడు. 'ఈ రోజుల్లో స్వయంగా ఇంటికి వచ్చి అప్పు పెడతామనేవారు ఎవరైనా ఉంటారా? ఆ మాట చెప్పేందుకు ఈ శ్రీమంతుడు ఇల్లు దాటి పల్లె పట్టుకి వచ్చేడా? అదేం కాదు. ఇందులో ఇంకేదో ఉంది' అనుకొన్నాడు.


