ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది. తను ఏం చెయ్యాలి?
ఒక నిర్ణయానికి వచ్చాడు సాగర్.
* * *
మేకప్ ముగించుకుని అద్దంలో చూసుకున్నాడు. దాదాపు నలభై అయిదుదేళ్ళ వ్యక్తిలా వున్నాడు. త్రీపీస్ సూట్ లో కాస్త లావుగా కనిపిస్తున్నాడు. గుబురుమీసాలు, కళ్ళజోడు ముఖాన్ని కొద్దిగా కప్పేశాయి. సినిమాల్లో చూపించినట్లు చిన్న గెడ్డం, కళ్ళజోడు పెట్టుకోగానే రూపం మారిపోతే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. వేషం మార్చుకోవడం అంత సులభంకాదని అనుభవం వున్న వాళ్ళకి తప్పతెలియదు.
ఫోన్ తీసి నెంబరు డయిల్ చేశాడు.
"హోటల్ దిల్ కుషా" వినిపించిందొక స్వరం.
"రూం నెంబరు మూడువందల ఒకటి" అడిగాడు.
అవతలవాళ్ళు ఫోన్ తీయగానే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ చేశాడు. ఈసారి 202కి....ఈసారి అతని ప్రయత్నము ఫలించింది.
"జవాబు లేదు సర్!" చెప్పింది ఆపరేటరు. (రూమ్ లో వాళ్ళు బయటకు వెళ్ళిన ఏదైనా ఒక రూమ్ కోసం వెతుకుతున్నాడు అతడు)
"అరే మిస్టర్ షా గదిలోనే ఉంటానన్నారు. కాస్త కనుక్కుని చెప్తారా?" అభ్యర్ధనగా అడిగాడు.
"ఒక్క నిముషం....సారీ సర్, రూం నెంబరు రెండువందల రెండులో ఉన్నది మిస్టర్ షా కాదు_ మిస్టర్ మెహతా ఉన్నారు. ఆయనిప్పుడే బయటకెళ్ళారు."
"మిస్టర్ షా అక్కడే ఉంటానన్నారే. ఎనీవే థాంక్యూ!" డిస్కనెక్టు చేసి బయటపడ్డాడు చేతిలో బ్రీఫ్ కేసుతో_ సో....రూం నెంబరు మూడువందల రెండులో మెహతా అనే వ్యక్తి ఎవరో వుంటున్నారు.
__అరగంట తర్వాత అతను వీనస్ ఇంపోర్ట్సు అండ్ ఎక్స్ పోర్ట్సు కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు సుందర్ లాల్ గదిలో కూర్చుని ఉన్నాడు.
"అయితే మిస్టర్ గిరిధర్ ఇప్పుడు ఇండియాలో లేరన్నమాట" అన్నాడు నిరాశగా.
"అవును. ఆయన విదేశాలకు వెళ్ళిపోయి రెండు నెలలవుతోంది. ఆయన మీకెలా తెలుసు?" అడిగాడతను అనుమానంగా.
"నా పేరు మెహతా! మేము పారిస్ లో కలుసుకుని రెండేళ్ళవుతూంది. ఇదిగో ఈ విజిటింగ్ కార్డ్ యిచ్చి, వచ్చినప్పుడు తప్పక కలవమన్నారు. "గిరిధర్ బీరువాలో దొరికిన కార్డ్ ఒకటి అందిస్తూ సాగర్ అన్నాడు.
అది చూడగానే ఎదుటి మనిషి ముఖంలో కాస్త ప్రసన్నత కనిపించడం గమనించాడు.
సాగర్ అనుమానం నిజమయింది. గిరి బీరువాలో రెండు రకాల విజిటింగ్ కార్డ్స్ కనిపించాయి. చూడగానే దీనిలో ఏదో ప్రత్యేకత కనిపించిందప్పుడే.
"ఆ తర్వాత ఆయన్ను మీరు కలవలేదా?" అడిగాడు సుందర్ లాల్.
"లేదు పారిస్ నించి నేనే ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. అక్కడ ఆలిస్ స్ప్రింగ్స్ లో ఉండిపోయానిన్నాళ్ళూ. ఈ మధ్యనే ఇక్కడకు వచ్చాను. రాగానే గిరిధర్ గుర్తువచ్చాడు. నేను వచ్చి ఇండియాలో స్థిరపడాలనుకుంటే తను నాతో కలసి వ్యాపారం చేస్తానన్నాడు. మా స్వస్థలం కాకినాడ. అక్కడ బ్రాంచి తెరిచే ఆలోచన ఉందని చెప్పారాయన" సాగర్ మాట పూర్తి కాకముందే టేబిల్ మీద ఇంటర్ కం మోగింది.
అది తీసి "అలాగే" అని పెట్టేశాడు.
"కాని గిరిధర్ ప్రస్తుతం తిరిగివచ్చే ప్రసక్తిలేదు. ఇక మీ భ్రాంచి కాకినాడలో తెరవడం యిప్పట్లో జరగదు" మర్యాదగా చెప్పాడు.
"అలాగా నా దురదృష్టం. నాకు గిరిధర్ అడ్రస్ యిస్తారా? ఎంతో ఆశతో వచ్చాను."
"ఒక్క నిముషం కూర్చోండి. ఇప్పుడే వస్తాను ఎక్స్యూజ్ మీ" లేచి టాయిలెట్ లోకి వెళ్ళాడతను.
టాయిలెట్ తలుపు మూసుకోగానే గదినంతా పరికించి చూశాడు సాగర్. చాలా సింపుల్ గా వుంది గది. ఒక పెద్ద కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గదిలాలేదు. సాగర్ జేబులోంచి కర్చీఫ్ తీస్తున్నట్లు తీశాడు. కర్చీఫ్ తోపాటు వచ్చిన చిన్న వస్తువుని ఎడం చేతిలో వుంచుకుని వంగి కుడిచేతితో టేబుల్ మీద న్యూస్ పేపరు అందుకున్నాడు. ఎడం చెయ్యి టేబుల్ పై భాగానికీ సొరుగుకీ మధ్య ఖాళీలో ఒక్కక్షణం కదిలింది. ఏం జరగనట్లుగా పేపరు తీసి చూస్తున్నాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. గదిలో ఏదో తెలియని అస్వాభావికత.
అయిదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు సుందర్ లాల్ కర్చీఫ్ తో చేతులు తుడుచుకుంటూ.
"సారీ మిస్టర్ మెహతా! ఆలస్యం అయింది. ఇప్పుడే గిరిధర్ అడ్రసు రాసి యిస్తాను" అతను అడ్రసు రాస్తున్నాడు.
సాగర్ తృప్తిగా నిట్టూర్చాడు. ఎందుకో అతనికి ఫోన్ తాగానే తనమీద అనుమానం వచ్చిందేమోననిపించింది. తన విషయం బయటపడితే ఏం చేయాలో ఆలోచిస్తూండిపోయాడు.
"థాంక్యూ మిస్టర్ సుందర్ లాల్!" సెలవు తీసుకుంటూ అన్నాడు. అతను తలుపు దగ్గరకు రాగానే__
"మీరే హోటల్లో దిగారు?" ఉన్నట్లుండి అడిగాడు సుందర్ లాల్.
"హోటల్ దిల్ కుష్. రూం నెంబరు 203" చెప్పి బయటకు నడిచాడు సాగర్.
అతను కూర్చోగానే టాక్సీ కదిలింది. సాగర్ ఊహించినట్లుగానే కాసేపటికి టాక్సీ వెనుక కాస్త దూరంలో ఫాలో చేస్తున్న బుల్లెట్ మోటార్ సైకిల్ కనిపించింది. చిన్నగా నవ్వుకున్నాడు.