బుల్లెట్ మీద వ్యక్తి టాక్సీ దిగి హోటల్ లోకి వెళుతున్న సాగర్ ను చూస్తూ అనుమానంగా నిలబడ్డాడు కాస్సేపు. అయిదు నిముషాల తర్వాత ఆ వ్యక్తి హోటల్ రిసెప్షన్ లోకి నడిచాడు.
"మిస్టర్ మెహతా అనే వ్యక్తి రూం నెంబరు 203లో ఉన్నారా?" అడిగాడు.
"ఉన్నారు" చెప్పాడు రిసెప్షనిస్ట్.
అతను గబగబా బయటకు నడిచాడు.
అతడు వెళ్ళిపోయిన పదిహేను నిముషాల తర్వాత సాగర్ కాపీ రెస్టారెంట్ లోంచి బయటకు వచ్చాడు.
* * *
రాత్రి పదకొండవుతుంది.
వీనస్ ఇంపోర్టు ఎక్స్ పోర్ట్సు ఆఫీస్ ఎదురుగా వున్న రెస్టారెంట్ లో కూర్చున్నాడు సాగర్ మామూలు వేషంలో, ఎదురుగా బిల్డింగులో అక్కడక్కడా వరండాల్లో మాత్రం లైట్లు వెలుగుతాయి. వాచ్ మెన్ కాబిన్ బయట కూర్చున్నాడు. అప్పుడప్పుడు లేచి అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతన్ని గమనిస్తున్న సాగర్ పదకొండవగానే లేచి వచ్చి ఫోన్ కోసం అడిగాడు. హిమజకు ఫోన్ చేసి చెయ్యవలసింది చెప్పి పెట్టేశాడు. బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు.
ఈ లోపునే గదిలో ఫోన్ మోగటం విని లోపలకెళ్ళాడు వాచ్ మెన్.
"హలో!"
"నేను నీతా కంపెనీ మేనేజరు ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. మావారు ఆఫీసులోనే ఉంటామన్నారు. ఫోన్ చేస్తే జవాబివ్వడంలేదు. బయటకుగాని వెళ్ళారా?" అడిగిందొక తియ్యని కంఠం.
"లేదు మాడమ్! బిల్డింగ్ లో ఎవరూ లేరు. అంతా వెళ్ళిపోయారు" చెప్పాడతను.
"అరే. అరగంట క్రితం ఫోన్ చేసి అక్కడే ఉంటామన్నారే. ఒకసారి చూసి వస్తారా వాచ్ మెన్?" అభ్యర్ధనగా అడిగింది.
"అలాగే. మీరు లైన్లో ఉండండి, చూసి వస్తాను" రిసీవర్ పక్కన పెట్టి లిఫ్ట్ వైపు నడిచాడతను. నీతా అండ్ కంపెనీ అయిదో అంతస్థులో వుంది. వాచ్ మెన్ లోపలికి వెళ్ళగానే, కొంచెం టైమిచ్చి సాగర్ లోపలకు నడిచాడు. తనకు కావలసిన ఆఫీసు క్రింద అంతస్థులోనే వుంది. అదొక అదృష్టం. మెట్ల ప్రక్కనే వున్న ఖాళీలో నక్కి కూర్చున్నాడు. అరగంట వరకూ అక్కడి నుంచి కదలలేదు. తరువాత తలుపు దగ్గిర కెళ్ళాడు.
రెండంగుళాల వెడల్పు మైకా ముక్కకు చిన్న కత్తి కలిపి తియ్యడంతో స్ప్రింగ్ లాక్ తెరుచుకుంది. గది చీకటిగా వుంది. ఆఫీసులో ఎవరూ లేరని నిర్ణయించుకున్నాక పెన్ టార్చ్ వెలిగించాడు. తర్వాత టైం వేస్ట్ చేయలేదు. ఆఫీసు అలమార్లలో ఉన్న ఫైల్స్ లో ఏమీ దొరకవని తెలుసు. అందుకని వెతకలేదు.
ఎమ్.డి. టాయిలెట్ లోకి వెళ్ళినప్పుడు నీళ్ళ చప్పుడు కూడా బయటకు వినిపించలేదు. సాగర్ టాయిలెట్ తలుపు తీశాడు. రాలేదు. తాళం వేసి వుంది. రెండు నిమిషాలలో తలుపు తెరిచాడు. బాత్రూంకి అంత బలమైన తాళం ఎందుకు వెయ్యవలసి వచ్చింది.
గదిలో మామూలుగా ఉండవలసిన వస్తువులు తప్ప మరేం లేవు. అతని చూపులు గదిలో గోడలను నిశితంగా పరిశీలించినయ్. అక్కడేమీ లేదు. స్క్రూడ్రైవర్ తో గోడని కొట్టి చూడడం మొదలు పెట్టాడు. వెంటిలేటర్ క్రింద టైల్స్ మధ్య ఖాళీ కనిపించింది. అతనికి అర్ధం అయింది. అది మామూలు తాళంకాదు. విదేశాల్లో కొన్ని హోటళ్ళలో గదులకు వేసే కంప్యూటర్ తాళం అది. దాని తాళం చెవి చిన్న ప్లేట్ లా వుంటుంది. దానిమీద కోడ్ లో రంధ్రాలు పంచ్ చేసి వుంటాయి. దాన్ని ఆ ఖాళీలోంచి లోపలకు తోస్తే తలుపు తెరుచుకుంటుంది.
సుందర్ లాల్ జేబులో ఏదో వేసుకుని వెళ్ళడం గుర్తు వచ్చింది. టేబుల్ కి కుడివైపు సొరుగులో ఫైల్ మధ్యదొరికిందతనికా తాళం.
తాళం తెరిచి చూసిన సాగర్ నిశ్చేష్టుడై నిలబడ్డాడు కాస్సేపు.
అత్యంత ఆధునాతనమైన ఎలక్ట్రానిక్ స్విచ్ బోర్డ్ ఉందందులో. చిన్న నోట్ బుక్ లో చాలా నెంబర్లు వ్రాసి వున్నాయి. కాని అర్ధం కావడంలేదు. కోడ్ లో వ్రాసినట్లుంది. జేబులో నుంచి డైరీ తీసి గబగబా అన్నీ నోట్ చేసుకున్నాడు. మామూలుగా తాళం వేసి ఎక్కడివక్కడ సర్దేశాడు. వెనకవైపు గోడౌన్స్ వున్నాయి. అటు నుంచి బయటకు వెళ్ళడానికి షట్టర్స్ వేసిన తలుపులున్నాయి. గోడౌన్ లో పెద్ద పెద్ద చెక్క పెట్టెలు ప్యాక్ చేసి వున్నాయి. అన్నింటిమీదా శ్రీ గంగానగర్ అడ్రస్ వ్రాసి వుంది. కొన్ని మెషిన్ లు ఇంకా పక్కనే పెట్టి వున్నాయి. వాటిని పరిశీలించాడు.
తను చూసిన విషయం వెంటనే రిపోర్ట్ చేస్తే వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ ని అఫీషియల్ గా సెర్చి చేస్తారు కానీ దానివల్ల వాళ్ళు చేస్తున్న ఇల్లీగల్ పనులు బయటపడతాయా? గిరిధర్ విషయం కూడా బయట పెడతారా? ఇంకా కొన్ని అసలయిన ఆధారాలు సంపాదించాలి. అప్పుడే వీళ్ళ కుట్రనంతా బయటపెట్టాలి. ఆలోచిస్తూ తల పై కెత్తాడు సాగర్. బీరువామీద పెట్టిన రెండు సూట్ కేసులమీదా అతని దృష్టి పడింది.
ఏదో అనుమానం వచ్చి సూట్ కేస్ లను కిందకు దించాడు. రెండూ ఖాళీగానే వున్నాయి. కాని ఒకటి కాస్త బరువుగా అనిపించింది. మరుక్షణం సూట్ కేస్ వెనక్కు తిప్పి అడుగు నుంచి క్లాంప్ లు గట్టిగా లాగాడు. అడుగునవున్న సీక్రెట్ అర బయటపడింది. నిండా కాగితాలు. ఒక్కక్షణం ఆలోచించాడు. వెంటనే ఆ కాయితాలన్నీ తీసేసి బీరువాలో కనిపించిన కాగితాలు అందులో పెట్టేసి క్లాంపులు బిగించాడు. సూట్ కేసులు ఎప్పటిలా పైన పెట్టేసి గదికి తాళం వేసేశాడు. ఇంటికొచ్చి గదిలో కూర్చుని ఒక్కో కాగితం చూడడం మొదలు పెట్టాడు సాగర్. టెలిఫోన్ నెంబర్లు వ్రాసి వున్న చిన్న నోటు పుస్తకం కనిపించింది. ఒక నావకు సంబంధించిన వివరాలతోవున్న బ్లూ ప్రింట్ వుంది.
ఒక మ్యాప్ లో నావ ప్రయాణం చేసే రూట్ మార్క్ చేసి వుంది. అవి కాకుండా కొన్ని ఉత్తరాలు సాగర్ ను ఆకర్షించాయి. అందులో ఒకటి తీశాడు. అది బాంబేలో పోస్ట్ చేయబడింది. పారిస్ లో శివరాం అనే వ్యక్తిని ఉద్దేశించి వ్రాశారు.


