చేతివ్రాత - ఉద్యోగం
ఒక వ్యక్తియొక్క బలహీనతలు, స్ట్రాంగ్ పాయింట్లు, అతని యొక్క మానసిక స్థాయి, విపత్కర పరిస్థితుల్లో అతను ఎలా ప్రవర్తిస్తాడు అనేవి గ్రాఫాలజీద్వారా తెలుసుకోవచ్చని ఇంతకు ముందు చాప్టర్లలో వ్రాయటం జరిగింది. తెలివితేటలు, సాంఘిక నియమాలపట్ల ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, కొత్తదారులు వెతికే ఉత్సాహం, డబ్బుపట్ల ఆవ్యక్తికున్న జాగ్రత్త, ఆమనిషి యొక్క అహంభావ స్తాయి, అతడు నమ్మకస్థుడా లేదా అన్నది కూడా గ్రాఫాలజీ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పటం జరిగింది.
ఒక మనిషికి మనం మనదగ్గర ఉద్యోగం ఇస్తున్నా, లేక ఒక కంపెనీ మనల్ని ఉద్యోగంలోకి తీసుకోవాలన్నా ఇటువంటి చిన్న చిన్న విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారన్న విషయం మనందరికీ తెలుసు. భారతీయ సంస్థల్లో ఉద్యోగాల కోసం, గ్రాఫాలజీని అంతగా
ఉపయోగించకపోయినా, అభ్యర్ది స్వంతదస్తూరితో పెట్టుకున్న అప్లికేషన్ చూడగానే ఇంటర్వూచేసే వ్యక్తికి ఆ అభ్యర్ది గురించి కొంత తెలుస్తుందనేది సత్యం.
గ్రాఫాలజీ ప్రకారం కరెక్టుగా మనిషిని అంచనా వేస్తే, అనవసరమైన అభ్యర్దుల్ని వాళ్ల చేతివ్రాతను విశ్లేషించటం ద్వారానే తొలగించవచ్చని నమ్ముతారు కొందరు గ్రాఫాలజిస్టులు. క్రిమినల్ మనస్తత్వాన్ని మానసిక అనారోగ్యాల్ని కూడా చేతివ్రాత ద్వారా పట్టుకోవచ్చంటారు.
కొన్ని ఉద్యోగాలలో మానసికమైన వత్తిడి చాలా ఎక్కువగా వుంటుంది. కొన్ని ఉద్యోగాలకి ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు మెదడు అవసరం లేకుండా పని చేయాల్సిన అవసరం వుంటుంది.
ఏయే ఉద్యోగాలకి ఎలాటి మనిషి అవసరం అనేది చాలా సులభంగా చెప్పవచ్చు.
ప్రతి మనిషి ఏదో ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అవుతాడు. చేతివ్రాతనిబట్టి ఏ మనిషి ఎక్కువస్థాయి మానసికఒత్తిడిని తట్టుకుంటాడు, లేక ఏ మనిషి తక్కువ స్థాయిలో బ్రేక్ అవుతాడు అనేది కూడా చెప్పవచ్చు. అలాగే తన మనసులో అభిప్రాయాన్ని బయటవాళ్లకు ఎంతవరకు తెలపగలడు అన్నప్రశ్నకి కూడా ఇందులో సమాధానం దొరుకుతుంది.
ఏదైనా ఒక కంపెనీలోగానీ, సంస్థలోగానీ ఉద్యోగం కావాలనుకుంటే, యాజమాన్యం కోరుకునే అభ్యర్ది లక్షణాలు ఈ క్రింది విధంగా వుంటాయి.
- నమ్మకస్తుడేనా?
- అభివృద్ది కోసం కష్టపడే గుణం, మేధస్సు కలవా?
-ఆర్గనైజ్ చేయగలిగే శక్తి వుందా?
- స్నేహపాత్రుడా?కాదా?
- ఒక పెద్దపనిని భుజాలమీద వేసుకునే శక్తి వున్నదా? లేదా?
- నాయకత్వ లక్షణాలు వున్నాయా?
- పైకి రావాలనే తపన ఎంతవరకూ వుంది?
ప్రతీ ఉద్యోగానికి పైన చెప్పినవన్నీ అక్కరలేదు. ఒక్కో ఉద్యోగ లక్షణాన్ని బట్టి ఎలాంటి లక్షణాలు కావాలి అనేది ఆధారపడి వుంటుంది.
ఎన్నుకునే వృత్తి:
మనం ఏ వృత్తిలో రాణిస్తామనేది భగవంతుడు మనకిచ్చిన శక్తిని బట్టి, దాని ఆధారంగా మనం మన కృషితో పెంపొందించిన ఇతర గుణగణాల్ని బట్టి ఆధారపడి వుంటుంది. ఒక ఉద్యోగంలో ఎందుకూ పనికిరానివాడిగా భావింపబడినవాడు మరో ఉద్యోగంలో పైకి రావచ్చు. సినిమా ఫీల్డులో చాలామంది అసిస్టెంట్ డైరక్టర్లుగా చేరి నటులవటం, అలాగే నటులవుదామనుకొని వచ్చినవారు దర్శకత్వం వైపు వెళ్లటం చూస్తూనే వుంటాం. ఏ వ్యక్తి ఏ రంగంలో పైకొస్తాడు అనేది ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్ద్యాలమీద, అతడు పెరిగిన వాతావరణంమీద, అతడి యొక్క అభిలాషమీద, అతడు ఇష్టపడే కళలమీద ఆధారపడి వుంటుంది. కొన్ని ఉద్యోగాలకి పొద్దున నుంచి సాయంత్రం వరకు - మెదడే మాత్రం ఉపయోగించకుండా - కేవలం వ్రాతపని మాత్రమే వుండి వుండవచ్చు. ఎంతో క్రియాత్మక శక్తి వున్న మనిషికి ఆ ఉద్యోగమిస్తే అతడు దారుణంగా ఫెయిలవటం సహజం. అలాగే లెక్కల్లో బాగా పరిపూర్ణత్వం వున్న వ్యక్తి ఒక డెంటిస్ట్ గానీ, ఒక పెయింటర్ గానీ కావాలనుకుంటే అది దురాశే అవుతుంది.
చేతివ్రాతని బట్టి ఒక మనిషి యొక్క గుణగణాల్ని, అతడు ఏయే రంగాల్లో రాణిస్తాడు అనేది తెలుసుకోవచ్చని మనం ఇంతకుముందే చదివాం. అందువల్ల ఒక మంచి గ్రాఫాలజిస్ట్ మనం ఏయే రంగాల్లో రాణిస్తామనేది సులభంగా చెప్పగలడు. మనయొక్క బలహీనతలు, మనయొక్క స్ట్రాంగ్ పాయింట్స్,ఎక్కడ మనం రాణించగలం అనేది మనం ఈ గ్రాఫాలజిస్ట్ ల ద్వారా తెలుసుకోవచ్చు.