"అయితే ఏమిటటా?"
"అతడి కన్ను నీ మీదుంది. ఏదో పధకం వేస్తాడు. అది తెలుసుకోవాలని నా ప్రయత్నం."
బృహస్పతి మొహం చిట్లించి ".... అతడా విషయం నీకెందుకు చెప్తాడు" అన్నాడు.
"నేను నీ మరదలినని తెలిసీ అతను నాతో ప్రపోజల్ పెట్టాడుగా! అంటే నాకు డబ్బాశ ఉంది అనుకుంటున్నాడు. నిజానికి నాకు అటువంటి ఆశ ఏమీలేదు. నువ్వు మంగళ్ సింగ్ వి అయినా, కాకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే వుంటాను. అయితే నువ్వు నీ స్నేహితురాలి నెంత ప్రేమించావో నాకు తెలుసు. నేన్నీనుంచి ఏమీ ఆశించడం లేదు...." ఆమె కంఠం అదోలా మారింది. నేను అమాయకురాలిని అయితే అయుండవచ్చు కానీ, స్వార్ధపరురాలిని మాత్రం కాదు. నీ నిధి ఆశించి రాలేదు. నీ వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది బృహస్పతీ! ఈ ఒక్క సహాయం నీకు చెయ్యనీ, ప్రియురాలి స్థానం ఎలాగూ పొందలేను. స్నేహితురాలిగా ఇక్కడే వుండమంటావో, పంపించేస్తావో నీ ఇష్టం. నేను చెప్పేది మాత్రం ఒకటే. రావుని తక్కువగా అంచనా వెయ్యకు."
ఆ మాటలకి బృహస్పతి కదిలిపోయాడు. ఆమె దగ్గరగా వెళ్ళి "థాంక్స్ యూ!" అన్నాడు- ప్రేమపూరిత స్వరంతో. "కానీ జాగ్రత్త! నువ్వు చెప్పినమాటే, అతణ్ణి తక్కువగా అంచనా వెయ్యకు."
ఆమె ఆ సాయంత్రం రావుని కలుసుకోవడానికి వెళ్ళబోయే ముందు హరిస్వామికి ఫోన్ చేసింది. "అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇంకో అరగంటలో రావుని కలుసుకోబోతున్నాను. నిధి ప్లాన్ బయట పెట్టించడానికి రావు వేసిన పథకమేమిటో తెలుసుకోవాలన్నదే నా ప్రయత్నం."
"ఈ విషయంలో బృహస్పతికేమీ అనుమానం రాకుండా చూసుకున్నావా?"
"నేను తన మనిషినే అని బృహస్పతిని నమ్మించాను. అలాగే రావు దగ్గర కూడా నటించబోతున్నాను!"
"గుడ్! ఇలాగే తెలివితేటలతో పనిచెయ్. ఏదో ఒక పార్టీకి రికమెండ్ చేసి నీకు రాజ్యసభ మెంబర్ షిప్ ఇప్పిస్తాను" అని ఫోన్ పెట్టేశాడు హరిస్వామి.
ఆ తర్వాత ఆమె పార్క్ లో రావుని కలుసుకుంది. "ఆ నిధి విషయం ఏం చేశావ్? వదిలేస్తావా?" అనడిగింది.
"అంత సులభంగా ఎలా వదులుతాను? కేవలం అతడివల్లే నా రెండు కాళ్ళూ పోగొట్టుకున్నాను. ఆ స్నేహభావమూ, కృతజ్ఞతా లేకుండా నన్ను గెంటేసాడు. అతడి అంతు తేల్చిగానీ నిద్ర పోను."
"నేను నీకేదయినా సహాయం చేద్దామనుకున్నా అదీ కష్టమే! మనిద్దరి సంభాషణ బృహస్పతి విన్నాడు. ఇప్పుడు నేనతనికి దగ్గరై, ఆ నిధి గురించి ప్రస్తావిస్తే నేను చేసేదంతా నాటకమని తెలిసిపోతుంది."
"అవును. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను వేసిన పథకం నుంచే నిన్ను తప్పించాను."
ఆమె ఆసక్తిగా "ఈ పథకం అన్నమాట చాలాసార్లు వాడావు. ఏమిటది?" అనడిగింది.
ఆమెవైపు అతడు కన్నార్పకుండా ఒక క్షణం చూసి "....నిజానికీ విషయం ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాను. అయినా నిన్ను నమ్ముతున్నాను కాబట్టి చెపుతున్నాను. ఒక స్త్రీ ద్వారా ఈ రహస్యం బయట పెట్టించాలనుకున్నాను."
"ఏ విధంగా?"
"అది మాత్రం అడక్కు. రెండు రోజుల్లో నువ్వే ఎలాగూ స్వయముగా తెలుసుకుంటావు కదా!"
"ఎవరామ్మాయి" కుతూహలంగా అడిగింది.
"డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడేవాళ్ళు తక్కువేం లేరుగా!"
పఠాణీ దెబ్బతిన్నట్టు చూసి, వెంటనే సర్దుకుని "నిజమే! నేనూ అలాంటి దాన్నేగా" అంది.
రావు ఆశ్చర్యంగా "అదేమిటీ!" అన్నాడు.
"అవును మరి. బృహస్పతి పెళ్ళి చేసుకుంటాడన్న ఆశతో వచ్చాను. అతడు నిరాకరించేసరికి భంగపడ్డాను. ఆ కసితోనే నీతో చేతులు కలుపుకున్నాను."
రావు మొహంలో సంశయం తొలగిపోయింది. "అదన్న మాట కారణం! ఇంతసేపూ నువ్వా నిధి కోసమే నా దగ్గరకొచ్చావని అనుకుంటున్నాను."
"నాకా నిధి అవసరంలేదు" అందామె నెమ్మదిగా. ".... మరణించిన మంగళ్ సింగే బృహస్పతి అనుకుని వచ్చాను. కాదని తెలిసిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మా మావయ్య తాలూకు నిధి ఆ బృహస్పతికి దక్కడానికి వీల్లేదు. అదికూడా ఓ కారణం."
"శత్రువుకి శత్రువు మిత్రుడవడమంటే ఇదేనేమో!"
"అయుండవచ్చు" అంటూ ఆమె వెళ్ళబోయింది.
"ఒక విషయం" అన్నాడు. ఆమె ఆగింది.
"ఆ నిధి మనిద్దరం సగం సగం చేసుకుందాం."
ఆమె ఆశ్చర్యంగా అతడివైపు చూసింది.
"అవును. ఆ నిధి మీ వారసత్వపు హక్కన్న విషయం మర్చిపోయాను. నిజానికి అది మొత్తం మీకే చెందాలి."
ఆమె అడుగు ముందుకువేసి, దగ్గరగా వచ్చి అతడి చేతులు తన చేతుల్లోకి తీసుకుని "థాంక్యూ" అంది, నీళ్ళు నిండిన కళ్ళతో.
* * *
ఇది జరిగిన రెండు రోజుల తర్వాత రావు ఒక హోటల్ ఫ్యామిలీ సెక్షన్ లో సరళరేఖని కలుసుకున్నాడు. హోటల్లో జనం చాలా పల్చగా వున్నారు.
"ఎందుకు నాకు కబురు చేశావు?" అడిగింది రేఖ.
"మీతో చిన్న పనుండి!"
"నీ అంతస్థేమిటో, నేనేమిటో గుర్తుంచుకునే కబురు చేశావా? నువ్వు పిలవగానే వస్తానని ఎలా అనుకున్నావ్?"
వీళ్ళ పక్క టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తున్న ఒక స్త్రీ, రేఖ గట్టిగా మాట్లాడటంతో తలెత్తి చూసి, తిరిగి తన పనిలో నిమగ్నమయింది.
"డబ్బు విషయం మాట్లాడటానికి అని చెప్పగానే నువ్వొస్తావని నాకు తెలుసు" ఈసారి ఏకవచనంతో అన్నాడు.
"నేనంత చీప్ గా కనబడుతున్నానా? నా టైమ్ చాలా విలువైనది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? చాలా గొప్ప మేధావిని ననుకుంటున్నావా?"
"నేను చెప్పబోయేది కోటిరూపాయల డబ్బు గురించి?"
పొంగుతున్న పాలమీద నీళ్ళు చిలకరించినట్లు- అతడు నెమ్మదిగా చెప్పిన ఆ మాటలకి- ఆమె ఒక్కసారిగా చల్లారిపోయి "....ఏమిటీ?" అంది.
"నేనూ, బృహస్పతీ విడిపోయాం" అంటూ అతడు క్లుప్తంగా జరిగినదంతా చెప్పాడు. అంతా చెప్పాక ".... ఆ నిధి ప్లాన్ అతని దగ్గరనుంచి సంపాదించడానికి నువ్వు నాకు సహకరిస్తే కోటి రూపాయలిస్తాను."
"సహకరించడమంటే ఏ విధంగా?"
"అతనితో అర్ధరాత్రి ఒక గంట గడపడం ద్వారా!"
ఆమె ఛివాలున లేచి "ఏమనుకుంటున్నావ్ నువ్వు నా గురించి? రివాల్వర్ వుంటే ఇప్పుడే షూట్ చేసేదాన్ని" అంది కోపంగా.
"ఆవేశపడకు కూర్చో. నువ్వు నా మాటల్ని తప్పుగా అర్ధం చేసుకున్నావ్! అతడు ప్రస్తుతం ధాబాలో ఉంటున్నాడు. అర్ధరాత్రి ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. ఏ పన్నెండింటికో నువ్వు జీప్ లో వెళతావు. కబుర్లు చెపుతున్నట్టు ఓ గంటసేపు కాలం గడుపుతావు. అంతే నువ్వు చెయ్యవలసింది!"
"అప్పుడు నువ్వేం చేస్తావ్?"
"అది నీకనవసరం!"
"అయితే నేను చెయ్యను".
"నువ్వు నన్ను సరిగ్గా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నా గురించి తక్కువగా అంచనా వెయ్యకు. నువ్వు ఇన్ స్పెక్టర్ వి. విషయం కాస్త అటూ ఇటూ అయితే నిన్ను నువ్వా మాత్రం రక్షించుకోలేవూ? నేను నిన్నడుగుతున్నది కేవలం రేపురాత్రి పన్నెండు నుంచి ఒంటిగంట వరకూ అతన్ని ఎంగేజ్ చెయ్యమని మాత్రమే! మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఇష్టమైతే చెప్పు. లేకపోతే గుడ్ బై!"
"కోటి రూపాయలు నిశ్చయంగా ఇస్తావా?"
"నేను బృహస్పతి లాంటి వాడిని కాను."
"సరే! రేపతన్ని కలుస్తాను. ఇందులో నా కొచ్చే నష్టమేంలేదు. కానీ నువ్వు నాతో ఆటలాడుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం తగిన ఫలితం అనుభవిస్తావు" అంటూ లేచింది.
"థాంక్యూ" అంటూ అతను కూడా ఆమెను అనుసరించాడు.
అప్పటివరకూ ప్రక్క టేబుల్ మీద టిఫిన్ చేస్తున్న బురఖా స్త్రీ వారిద్దరూ అక్కడినుంచి వెళ్ళిపోయిన కొంచెం సేపటి వరకూ అలాగే కూర్చుని, ఆ తరువాత బిల్లు పట్టుకుని తను కూడా లేచింది.
* * *
సరిగ్గా రాత్రి పన్నెండింటికి ధాబా ముందు సరళరేఖ జీప్ ఆగింది. కస్టమర్ కి టీ అందిస్తున్న బృహస్పతి ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మనోహరంగా నవ్వింది. "లేడీస్ కి ప్రత్యేకంగా సీట్లు లేవా?"
"ఇది చాలా చిన్న ధాబా మేడమ్! ప్రత్యేకమైన సీట్లున్న ధాబా కావాలంటే మీరింకో యిరవై కిలోమీటర్లు ముందుకి వెళ్ళవలసి వుంటుంది."
"నువ్వు మాట్లాడే తరహా చూస్తుంటే నన్నిక్కడినుంచి పంపించెయ్యాలని అనుకుంటున్నట్టున్నావ్! నేనేమో ఈ రోజు నాతో చాలాసేపు స్పెండ్ చెయ్యాలని అనుకుంటున్నాను. ఇక్కడ బయట కూర్చోవడం నాకు ఇబ్బందిగా వుంది. లోపల నీకో గదంటూ లేదా?" అంటూ చనువుగా లోపలికి నడిచింది.
ఆమె ప్రవర్తన అర్ధంకానట్టు అతడు ఆమెను అనుసరించాడు. లోపలి గదిలో మంచం పక్కనే వున్న కుర్చీలో కూర్చుంటూ అతడివైపు ఓరగా చూసి ".... ఇంక సస్పెన్స్ ఉంచనులే! అసలు విషయం చెప్తాను" అంది.
అతడు సీరియస్ గా "ఏమిటి?" అన్నాడు.
"ఈ దరిదాపుల్లో ఏదో నక్సలైట్ మూవ్ మెంట్ ఉందని వార్త వచ్చింది. అందరం తలో చోటా సర్దుకుంటున్నాం. తిరిగి మాకు వైర్ లెస్ లో సూచనలు వచ్చేవరకూ గంటో, రెండు గంటలో నేనిక్కడ ఉండాల్సి వస్తుంది. నీకేమయినా అభ్యంతరమా?"
మనసులో సంశయం తీరిపోయినట్టు బృహస్పతి తేలిగ్గా ఊరికి పీల్చుకుని "అభ్యంతరమేముంది? ఇక్కడే వుండు. టిఫిన్ ఏమయినా పంపించనా?" అన్నాడు.
ఆమె దృష్టి మంచం వెనక వున్న విస్కీబాటిల్ మీద పడింది. సగం ఖాళీగా ఉన్న బాటిల్ ని ఆమె అందుకుంది. బృహస్పతి మొహం వివర్ణమయింది. అతడేదో చెప్పబోతుంటే, ఆమె నవ్వేసి, "ఫర్లేదులే, తీసుకో! నేను కబుర్లు చెపుతూ కంపెనీ ఇస్తాను" అంది.
అతడు విస్మయంగా చూశాడు.