"మూవ్" గట్టిగా అరిచాడు బృహస్పతి. ".... అందరూ ఓ మూల నిలబడండి."
అతడు చెప్పేది వారికో క్షణం అర్ధంకాలేదు.
"ఒక నిముషం టైమిస్తున్నాను. నేను చెప్పినట్టు చేయకపోతే కాల్చేస్తాను" హెచ్చరించాడు.
క్రమశిక్షణకల సైనికుల్లా ఓ మూలకి నిలబడ్డారు. తన పక్కనే అచేతనంగా వున్న సి.బి.ఐ. చీఫ్ కి రివాల్వర్ అందిస్తూ "షూట్ మీ" అన్నాడు. చీఫ్ దాన్ని అందుకోకుండా అయోమయంగా చూశాడు. "అందరూ మీ మీ స్థానాల్లో వచ్చి కూర్చోండి" అంటూ ఆదేశించాడు బృహస్పతి. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. "....డూ యాజ్ ఐ సే" కరుగ్గా నిర్దేశించాడు.
ఆఫీసర్లందరూ తమ తమ స్థానాల్లోకి వచ్చి కూర్చున్నారు. అందరివైపు పరిశీలనగా చూసాడు బృహస్పతి. అక్కడ భయం కరమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. దాన్ని చీలుస్తూ అన్నాడు. "....మీరు చంపలేరు. మీరు చావలేరు. ఇప్పుడర్ధమైందా దేశం ఎందుకిలా తగలడిందో! మీకు ప్రాణభయం. శత్రువుని ఎదుర్కోవడం మీకు చేతకాదు. శత్రువే 'రుజువుల్లాటి' తన ఆయుధం మీకిచ్చి లొంగిపోయినా చట్టం గురించి ఆలోచిస్తారు. మీ చేతుల్లో దేశం ఇంకెలా బాగుపడుతుంది? మీరు దేశంకోసం పనిచెయ్యరు. అందర్లాగే జీతం కోసం చేస్తారు. సైన్యంలో మీరూ ఒక భాగమని మర్చిపోతారు. డిపార్ట్ మెంట్ లో చేరిన నాలుగయిదు సంవత్సరాల తర్వాత - రివాల్వర్ షూటింగ్ సంగతి దేవుడెరుగు- రోజువారీ వ్యాయామం కూడా చెయ్యరు. తాగి తాగి కడుపులు బానల్లా పెంచుకుంటారు. శరీరం దారుఢ్యం లేని పోలీసు అధికారుల్ని మరో డిపార్ట్ మెంట్ కి మారుస్తానని ఏ ముఖ్యమంత్రో అంటే బెంబేలెత్తి పోతారు. నక్సలైట్లు వచ్చి మీరున్న పోలీస్ స్టేషన్లు తగలబెట్టబోతుంటే తింటున్న అన్నం సగంలో వదిలేసి గోడ దూకి పరుగెడతారు. మీరా.... మాకు రక్షణ కల్పించే అధికారులు? మీరా- లంచగొండితనాన్ని రూపుమాపగల ధీశాలురు? రెడ్ టేపిజంతో పుచ్చిపోయారు! బ్యూరోక్రసీతో కుళ్ళిపోయారు!!" అంటూ విసురుగా చీఫ్ దగ్గరకెళ్ళాడు. ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు.
".... మీరు మా ఇంటికొచ్చినప్పుడు ఏమన్నారో గుర్తుందా? 'సి.బి.ఐ. అంటే దేశానికీ, దేశ రక్షణకీ ప్రాణాలైనా సరే అర్పించడం కోసం సిద్ధపడ్డవాళ్ళు పనిచేసే డిపార్ట్ మెంట్' అన్నారు. నాలాంటి లుచ్చాలూ, క్రిమినల్సూ, మోసగాళ్ళూ పనిచేయడం కోసం కాదని హేళన చేశారు!! మీకన్నా నేనే నయం సార్! సంపాదించే మార్గాలు తెలుసుండీ నిజాయితీగా బతకాలనుకున్నాడు. బతుకుతున్నాను కూడా! మీది ఏదో అద్భుతమైన డిపార్ట్ మెంట్ అనుకుని నా ప్రియురాలు అందులో చేరింది. చివరివరకూ ఆ విషయాన్ని నా నుంచి కూడా దాచింది. అంత సిన్సియర్ గా తన పని నిర్వర్తించింది. ఫలితంగా ఆమెకు ఏం లభించింది? చెప్పండి సార్! ఏం లభించింది....? మరణం!.... అవున్సార్.... మరణం....! మీరెవరూ రిస్క్ తీసుకోరు. రిస్క్ లోకి లోతుగా చొచ్చుకుపోరు. అందుకే ఆమెని రక్షించలేక పోయారు.... ఆమెలాంటి వాళ్ళు దేశంకోసం అక్కడ ఛస్తుంటే ఇక్కడ మీరు మాజీ ప్రధానుల ఆశీర్వాదం కోసం వెళ్తారు.... మరణించి తనూ, బతికున్న నేనూ మా జీవిత విధానాల్ని ఈ విధంగా నిర్దేశించుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను సార్! తెలివైన వాళ్ళందరూ స్వార్ధమే మంచిదనుకుంటే- నిజాయితీ పరులందరూ మనకెందుకులే అని ఊరుకుంటే - దేశం ఒక శ్మశానమైపోతే- దానికి బాధ్యత వహించవలసింది మీ డిపార్ట్ మెంట్! అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను" అంటూ అక్కడి నుంచి కదిలాడు. సెక్యూరిటీ గార్డు వెనకనుంచి అతన్ని బంధించబోతుంటే చీఫ్ కనుసైగతో ఆపాడు.
* * *
ఆ సాయంత్రం అతడి ధాబాముందు ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి సి.బి.ఐ. చీఫ్ దిగాడు. బృహస్పతి విస్మయంగా చూస్తుండగా "రా.... కారెక్కు" అంటూ తీసుకెళ్ళాడు. దాదాపు పదినిముషాలు ప్రయాణం చేసి ఒక ద్రాక్షతోట దగ్గర కారాగింది.
"నడుస్తూ మాట్లాడుకుందాం"
ఆయన తనను అక్కడికి ఎందుకు తీసుకొచ్చారో, ఏం మాట్లాడదలచుకున్నాడో బృహస్పతికి అర్ధంకాలేదు. ఏకాంతంగా ఏదో చెప్పడానికి తీసుకు వచ్చాడని మాత్రం తెలుస్తోంది.
ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. అయితే అది బృహస్పతిని ఉద్దేశించినట్లుగా కాకుండా తనలో తనే మాట్లాడుకుంటున్నట్టుగా వుంది.
".... నువ్వు చెప్పింది నిజమే! ప్రజలంతా రక్షణ వ్యవస్థ మీద చాలా నమ్మకం పెట్టుకుని వున్నారు. పోలీసులు, సైన్యం, సి.బి.ఐ. ఇవన్నీ ఆ రక్షణ వ్యవస్థకి ప్రతినిధులు. అయితే-యుద్ధభూమిలో సైనికుడు ఓ రకమైన ట్రాన్స్ లో ఉంటాడు. దేశం గురించి తప్ప మరే ప్రలోభమూ ఉండదు. పైగా అతడి శత్రువు ఎవరో అతడికి నిర్దుష్టంగా తెలుసు. మా డిపార్ట్ మెంట్ విలాసవంతమైన ప్రజా జీవితానికి దగ్గరగా ఉంటుంది. సుఖం తాలూకు ఆనందం తెలుస్తూంటుంది. అయినా నువ్వనుకున్నంత చెడిపోలేదు మా డిపార్ట్ మెంట్! దేశంపట్ల నీకెంత ప్రేముందో నాకూ అంతే వుంది. ఒక్క విషయం నువ్వు గమనించావా? నీకు తెలియకుండా నీ ప్రేయసి మా డిపార్ట్ మెంట్ లో చేరింది. అందులో రిస్క్ గురించి 'తెలిసే' నేను నా కూతుర్ని దానికి అనుమతించాను. దీన్నిబట్టే నేనేమిటో నీకు అర్ధంకావడంలేదూ?"
బృహస్పతి విస్మయంగా ఆయనవైపు చూశాడు. ఆయన పట్టించుకోలేదు. నడుస్తూ తలవంచుకుని చెప్పుకుపోతున్నాడు.
".... నువ్వు నాతో జరిపిన సంభాషణలో చాలాసార్లు ఎగతాళిగా సుప్రీంకోర్టు మమ్మల్ని చివాట్లు పెట్టడం గురించి ప్రస్తావించావు. నాణానికి మరోవైపు చూడటానికి ప్రయత్నించు. మా కున్న బలగం ఎంత? మాకు కేటాయించిన నిధులెన్ని? ఇంత చిన్న సైన్యంతో మేమెలా విజయం సాధించగలం? రోజురోజుకి పెరిగిపోతున్న ఈ జలగల్ని పట్టుకోవడానికి మా బలగం సరిపోతుందా? అదలా వుంచు. చట్టం గురించి ఆలోచించు. చైనా గురించి నీకు తెలుసా? లంచగొండితనానికి అక్కడ శిక్ష 'మరణం'! ఇలాంటి కేసుల్ని త్వరగా పూర్తిచేయడానికి ప్రత్యేక కోర్టులు వున్నాయి. ఏ సాక్షి అయినా నాలుగురోజుల్లో అక్కడికి రావలసిందే! మొత్తంకేసు మూడు నెలల్లో పూర్తవుతుంది. మరో వారం రోజుల్లో ఉరిశిక్ష అమలు జరుపబడుతుంది. ప్రజలందరూ చూడడానికి వీలుగా ఈ వ్యవహారాన్నంతా టీ.వీ.లో చూపిస్తారు. భయాన్నీ, బెదురునీ, మానసిక పరివర్తననీ మనుషుల్లో, రాజకీయ నాయకుల్లో ప్రభుత్వోద్యోగుల్లో ప్రవేశపెట్టే కార్యక్రమం ఇది. కానీ ఇక్కడేం జరుగుతోంది? నేరస్థుడు విదేశాన్నుంచి రాగానే ఏర్ పోర్ట్ లో అంబులెన్స్ రెడీగా ఉంటుంది. తొంభయ్ రోజులకన్నా ఎక్కువకాలం కస్టడీలో పెట్టడానికి వీల్లేదు. తొమ్మిదికోట్లు మింగిన వాడయినా సరే కేవలం తొంభయ్ రోజుల కస్టడీలో ఉండి, స్వేచ్చా విహంగంలా బయటికి వస్తాడు. ఆ డబ్బు వాడి స్వంతం అవుతుంది. ఆ తరువాత లిటిగేషన్ల పేరుతో వాయిదాలు వేయించుకుంటూ తొంభయ్ సంవత్సరాలు హాయిగా బతికేస్తాడు. జనం ఆ కేసు గురించి మర్చిపోతారు. సాక్ష్యాధారాలు ఉండవు. త్వరితగతిన పూర్తిచేయడానికి బలగం లేదు. కోర్టుల్లో వందలకొద్దీ పెండింగ్ కేసులు. అన్నిటికన్నా ముఖ్యంగా .... అత్యద్భుతమైన తెలివితేటల్ని తమ స్వంతం చేసుకున్న న్యాయవాదులు వారివైపు ఉన్నారు. ఇప్పుడు చెప్పు.... జల్లెడలోంచి నీళ్ళు జారిపోయినట్టు మా వలలోంచి నేరస్తులు జారి పోకుండా ఎవరు ఆపుచెయ్యగలరు? అయితే ఇదంతా నిరాశవైపు! నాణానికి ఆశ వైపుచూడు. ఒకప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారలేదూ? తమ తప్పులు బయటపడకుండా ఉండటానికి రాజకీయాన్ని కవచంగా వేసుకున్న ఎంతమంది నాయకుల గుండెల్లో మేము రైళ్ళు పరిగెత్తిస్తున్నామో నువ్వు ఇటీవల కాలంలో చూడడంలేదూ? ఇదొక ప్రారంభం మాత్రమే! నీలాంటి నిరాశక్తులైన తెలివైనవాళ్ళు, మనకెందుకొచ్చిందిలే అనుకునే మేధావులూ, మన ఖర్మ ఇంతేలే అనుకునే అమాయకులూ, మనదేశం 'మరో హిరోషిమా' కాకూడదనుకునే మధ్య తరగతి ప్రజలూ- మా వెనక నిలబడండి. మేము చేసి చూపిస్తాం. ఇది చెప్పడం కోసమే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. పద వెడదాం!"
"ఒక్కక్షణం...." అన్నాడు బృహస్పతి.
ఏమిటన్నట్టుగా చూసాడాయన.
"హేమంత మరణిస్తూ ఆగస్టు పదిహేను గురించి సంకల్పనాథ్ గురించీ నాకో మాట చెప్పింది."
ఆయన కనుబొమలు ప్రశ్నార్ధకంగా పైకి లేచాయి.
"అదేమిటో నేను చెప్పను. ఇది నాకూ- సంకల్పనాథ్ రేకి మధ్య డీల్! దీన్ని నేనే సెటిల్ చేసుకుంటాను. మీరన్నట్టు చైనా న్యాయవ్యవస్థ కూడా దీని కవసరం లేదు."
ఆయన ఆందోళనగా "ఆగస్టు పదిహేను గురించి హేమంత నీకేం చెప్పింది?" అనడిగాడు.
బృహస్పతి ఆయనవైపు సాలోచనగా చూశాడు. "మీకు చెప్తే దాని కోసం ఒక ఫైల్ తెరుస్తారు. మీకున్న అతి తక్కువ బలగంలో ఒక ఆఫీసర్ ని దానికోసం నియమిస్తారు. ఎంక్వయిరీ చేయిస్తారు. సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెడతారు. అక్కడ వాయిదాలు పడుతుంటాయి. కోపగించుకోకండి .... ఇదంతా మీరు చెప్పినదే!" అని ఆగి చివరిగా అన్నాడు. ".... అందుకే ఈ విషయాన్ని నేను సెటిల్ చేసుకుంటాను."
26
"నేను నీతో కొంచెం మాట్లాడాలి."
షాపులో కూచుని కిళ్ళీలు కడుతున్న రావు తలెత్తి చూశాడు. ఎదురుగా పఠాణీ.
"ఓ! నువ్వా?" అన్నాడు.
"నీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి."
"ఏ విషయం?"
"పది నిమిషాలు టైమిస్తే చెప్తాను."
"ఇక్కడయితే జనం చాలామంది వస్తూ పోతుంటారు. సాయంత్రం పార్క్ దగ్గర కలుసుకో. తీరిగ్గా మాట్లాడుకోవచ్చు" అన్నాడు రావు. ఆమె తలూపి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఆమె తిరిగి ధాబా చేరుకునేసరికి మధ్యాహ్నమయింది. "ప్రొద్దున్నించీ ఎక్కడికి వెళ్ళావు?" అనడిగాడు బృహస్పతి.
"నువ్వు తిట్టనంటే చెప్తాను."
"తిట్టడమేమిటి?"
"నీకు చాలా కోపం వస్తుంది."
"సరే తిట్టను. చెప్పు."
"ప్రామిస్?"
బృహస్పతి చిరాగ్గా "అసలు విషయమేంటో చెప్పు" అన్నాడు.
"హనుమంతరావు దగ్గరికి వెళ్ళాను!"
బృహస్పతి ఛివాలున తలెత్తి "ఏమిటీ?" అని అరిచాడు. అతడి గొంతు కీచుగా ధ్వనించింది. ఆమె తలదించుకొని "అదిగో, నీకు కోపం వచ్చింది...." అంది. బృహస్పతి నిభాయించుకుంటూ "ఎందుకెళ్ళావ్?" అనడిగాడు. ఆమె ఒక క్షణం మౌనంగా ఊరుకొని చెప్పడం ప్రారంభించింది. "నాకెందుకో రావుని చూస్తే అతడు దీన్ని అంత సులభంగా వదిలిపెట్టేవాడిలా కనిపించలేదు. నేను నీకింత దగ్గర వరసయినదాన్నని తెలిసి కూడా నాతో ఈ ప్రపోజల్ పెట్టాడంటే, అతడెంతకి తెగించాడో అర్ధమౌతోంది. ఓంఫట్ బాబాగా అతడు జనాల్ని ఆకట్టుకున్న విధానం చూస్తే, తెలివితేటలు కూడా తక్కువేమీ లేవని అర్ధమౌతోంది. అటువంటివాడితో నువ్వు గొడవ పెట్టుకున్నావు."