Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 43


    "దారుణం కాదు...దగా...అదీకాదు...కుట్ర...మోసం...." ఛీఫ్ మినిస్టర్ గారు తన ఇంట రహస్య సాలోచనా మందిరంలో విపరీతంగా కదిలిపోతున్నారు. ఉదయం పదిన్నర కావస్తున్న ఆ సమయంలో సెక్రటేరియట్ కి వెళ్ళకుండా తన ఇంటనే అంతలా చికాకు పడిపోవడానికి కారణం సర్పం సాగిస్తున్న మారణకాండ గురించి కాదు...

    అతడి చేతిలో కొన్ని రిపోర్ట్సున్నాయి. అతడి కభిముఖంగా ఇంటెలిజెన్స్ ఛీఫ్ నిలబడి ఉన్నాడు. అతడందించిన రిపోర్ట్స్ లో చచ్చినా నాగరాజు సియమ్ పరపతిని చంపడానికి చేసిన రహస్య ప్రయత్నాల భోగట్టాలున్నాయి.

    ఒకవేళ నాగరాజు బ్రతికివుంటే రేపటికల్లా అసెంబ్లీలో సియమ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేవాడు... అలా ప్రకటించిన మరుసటిరోజు రాజ్ భవన్ లో తను డబ్బుతో కోనేసిన అనుయాయూల్తో పెరేడ్ ఏర్పాటుచేసి తన మెజారిటీని నిరూపించుకుని పార్టీకి, ఆ తరువాత రాష్ట్రానికి అధిపతయ్యేవాడు...ఇది ఫెయిలైతే బ్లాక్ మాంబా ముఠా సహకారంతో పాముల్ని రంగంలోకి దింపి శాంతిభద్రతలు విచ్చిన్నం చేసేవాడు అలా కేంద్రం జోక్యం చేసుకునేట్టు చేసి అర్జెంటుగా తనను గద్దె దింపేవాడు.

    "ఎంతటి నమ్మకద్రోహం! బ్రతికివుంటే వాడి అంతు చూసేవాడ్ని" ఒక విధంగా అతడ్ని కాటేసిన పాము తనను రక్షించిందేమో అన్న ఆలోచనతో ప్రస్తుతం ఎక్కడుందో తెలీని పాముకి మనసులోనే అంజలి ఘటించాడు కూడా. "ఇక సమస్య తేలినట్టేగా" ఫకలున వికటాట్టహాసం చేయబోతుంటే ఇంటెలిజెన్స్ ఛీఫ్ వారించాడు.

    "సర్..." వికటాట్టహాసానికి వాయిదా వేసుకోమన్నట్లుగా చూసేడు ఇంటెలిజెన్స్ యస్పీ. "సమస్య అయిపోలేదు నాగరాజు. పోయినా ప్రస్తుతం వున్న అటవీశాఖామంత్రి అదే రూట్ లో ప్రయాణం చేసి మీకు వ్యతిరేకంగా..."

    "అడవిలో పాముల్ని అసెంబ్లీలో వదలిపెడతానంటున్నాడు." 

    "నో సర్...నాగరాజుకి ప్రియమిత్రుడిగా అసెంబ్లీ మెంబర్లని యిప్పుడు మీకు వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడే రహస్యంగా గవర్నరుని కలిసి మంతనాలు సాగించినట్టుగా వినికిడి..."

    "అవును...గవర్నరు మా ప్రత్యర్ధి అయిన కేంద్రప్రభుత్వపు గూఢచారి" ఆవేశంగా అరిచాడు. "కాబట్టే రాష్ట్రపతిలాగే మా అసెంబ్లీలో మెంబర్లనుంచే గవర్నరు కూడా ఎన్నిక కావాలని మేం గగ్గోలు పెడుతున్నది..."

    "మావయ్యా" అప్పుడు జోక్యం చేసుకున్నాడు ముఖ్యమంత్రి మేనల్లుడు గోవర్ధనం "అదంతా తరువాత చెయ్యాల్సిన పని, ఇప్పుడేం చేయాలీ అన్నది మన తక్షణ కర్తవ్యం."

    "అటవీశాఖా మంత్రిగాడి పక్కనచేరిన ఎమ్మెల్యేలు నూటడెబ్బైదాకా ఉన్నట్టు రిపోర్టు తెలుపుతూంది."

    "అవునా?"

    "ఇప్పుడు వాళ్ళందర్నీ మనం ట్రేస్ చేయాలి."

    "అవునవును."

    "ఎలాగు డబ్బు తినేసిన వాళ్ళని మనం నమ్మలేం కాబట్టి అర్జెంట్ గా గవర్నరు ముందు పెరేడ్ ని ఆపాలి."

    "అవునవునవునవున..."

    "వాళ్ళందర్నీ మనం ఓ చోట కొన్నిరోజులు బంధించి అలా బంధించిన తరువాత వాళ్ళ గురించి విడివిడిగా ఉన్న అభియోగాల్ని సంపాదించి, బ్లాక్ మెయిల్ చేసి మనపక్కకి మళ్ళించాలి."

    "అవు..."

    "సో...ఈ రాత్రికే ఓ సమావేశానికని పిలిచి బంధించేద్దాం."

    అవును. టు ది పవరాఫ్ ఇన్ ఫినిటీ' అనబోయి తనకు అత్యంత ప్రీతీతిపాత్రుడూ, రాజకీయ దురంధరుడూ అయిన మేనల్లుడికేసి చూసి "కాని...ఎక్కడ" అన్నాడు.

    "మనకి బాగా అచ్చి వచ్చింది ఒకటే కాన్ ఫరెన్స్ హాల్."

    ముఖ్యమంత్రి భృకుటి ముడిపడింది.

    "దివ్యతేజ అపార్ట్ మెంట్స్ ఆరో అంతస్తులోని విశాలమైన హాలు అందర్నీ దాచేయడానికి సరిపోతుంది."

    "అయితే ఈ రాత్రికే..." సిఎంగారి వాక్యం ఇంకా పూర్తికాకుండానే జోక్యం చేసుకున్నారు.

    "సరిగ్గా పన్నెండున్నరకి సిటీ నిద్రలోకి జారినవేళలో మనం అత్యవసర సమావేశంలా మభ్యపెట్టి, వాళ్ళ ఎత్తు చిత్తుచేద్దాం..."

    ఇక్కడ ఓ నిర్ణయం తీసుకోబడిన సమయంలో...

    సరిగ్గా దివ్యతేజ ఎపార్ట్ మెంటుకి అరకిలోమీటరు దూరంలో వున్న ప్రైవేటు నర్సింగ్ హోంలో హఠాత్తుగా ఆర్తనాదాలు మొదలయ్యాయి.

    బ్లాక్ మాంబా అప్పటికే లోనికి ప్రవేశించి ముందు కాంపౌండర్ ని కాటేసి, వెనువెంటనే పేషెంట్స్ వేపు దూసుకుపోయింది.

    రోగులు, డాక్టర్లు కకావికలై పోతున్నారు.

    అర్దరాత్రి చుట్టుముట్టిన ఉప్పెనకి ఉలికిపడిన ప్రజల్లా పట్టపగలు జనం అటూ ఇటూ కకావికలౌతుంటే...

    దూరంగా వృద్ధుడితో మాట్లాడుతున్న జయేంద్ర సాలోచనగా అటు చూశాడు.

    పరుగెత్తే జనం, అక్కడి ఆర్తనాదాలు ఏమిటో ముందు అర్ధం కాలేదు.

    ఎవరో చెప్పారు.

    అంతే...

    వాయువేగంతో హాస్పటల్లోకి దూసుకుపోయాడు. కొందరు వారించబోయారు. కాని వినలేదు.

    బెడ్స్ మధ్యకి వెళ్ళిన జయేంద్ర నేలపైపడి మాంబా కాటుతో ధనువుల్లా వంగిపోతున్న వ్యక్తుల్ని మాత్రమే కాదు. మెరుపులా ప్రాకుతున్న మాంబానీ చూశాడు.

    జయేంద్రలో అనూహ్యమైన గగుర్పాటు...

    సర్పాలతో అసాధారణమైన పరిచయంగల జయేంద్ర ఇప్పుడు తొలిసారి ప్రపంచంలో అతి ప్రమాదకరమైన 'మాంబా'ని చూస్తున్నాడు.

    మెరుస్తున్న వజ్రాలను ఒంటికి అద్దుకున్నట్టు ఉరుముతున్న బాణంలా వేగంగా కదులుతూంది.

    పొలికేకల హోరుతో మృత్యుగహ్వరంలా అనిపిస్తున్న విశాలమైన ఆ హాల్లో నల్లని రాకాసిలా అటూ ఇటూ దుముకుతూంది. దాని తలపైవున్న త్రికోణాకృతిగల పొలుసులు నీలిరంగు వెలుగును చిమ్ముతున్నాయి.

    కత్తిపోట్ల సంతర్పణలా గుచ్చుకుంటున్న కోరలు నెత్తుటి మరకలతో పిడిబాకుల్లా కనిపిస్తున్నాయి.

    ఇది పెనుచీకటి తిరుగుబాటు.

    అది బీభత్సపు మెరుపుదాడి.

    ఏడుపులు పెడబొబ్బలు.

    తేరుకున్న జయేంద్ర కదిలే ఆ కాలసర్పాన్ని మాత్రమే కాదు కూలిపోతున్న మనుషుల్నీ విషంతో విరుగుతున్న వెన్నెముకల శబ్దాల్నీ గమనించాడు.

    ఉచితానుచితాల గురించి ఆలోచించే సహనం కోల్పోయినట్టు ఆవేశంగా మాంబాని సమీపించబోయాడు ఇక్కడ కదిలింది, మాయమై మరో మూలకి చేరుతూంది. అక్కడ రగిలింది అదృశ్యమై ఇంకో బెడ్ అంచున ప్రత్యక్షమౌతూంది. జయేంద్ర వేగం చాలడంలేదు.

    ఒడుపుగా అందుకోవాలనుకుంటున్నాడు.

    కాని అలసిపోతున్నాడు...కాదు అంతర్లీనంగా పేరుకుంటున్న ఏ అలజదో అతడ్ని బలహీనుడ్ని చేస్తూంది. అయినా ప్రయత్నం మానలేదు.

    అప్పటికే చాలామందిని కాటేసిన మాంబా ఇప్పుడు హాలు చివరనున్న ఓ గదిలోకి దూరింది. ఒక్క ఉదుటున తోక అందుకోబోయాడు జయేంద్ర. అతడి ప్రయత్నం విఫలంకాగా క్షణంపాటు ద్వారం దగ్గర ఆగిపోయాడు.

    ముందున్న గదిలో చాలినంత వెలుగులేదు.

    ఏ మూలన నక్కిందో అంతకన్నా తెలీదు.

    లోనికి వెళ్లాలి...కాని అది తనకు పరిచయమున్న విషసర్పం కాదు.

    రెండు క్షణాలు ఆలోచించాడు...

    తప్పదు...ఈ మారణహోమం ఇక్కడే ఆగాలీ అంటే కొంత రిస్కు తప్పనిసరి. ఇంతదాకా వచ్చేక తను వెనుకడుగు వేయలేడు.

    వారగా తెరిచి వున్న తలుపుని తోసాడు నెమ్మదిగా.

    కిర్రుమన్న చప్పుడు...అలికిడి లేదు.

    జయేంద్ర గుండెచప్పుడు అతడికే స్పష్టంగా వినిపిస్తూంది.

    ఒకటి రెండు మూడు...క్షణాలు గడుస్తున్నాయి.

    అంతే...ఒక్క అంగలో గదిలోకి ప్రవేశించాడు.


                      *    *    *    *


    "ఆపండి" సంఘమిత్ర అరుపుతో ఆ గది ప్రతిధ్వనించింది. "నానీని కాపాడండి" కంపించిపోతున్నాడా వృద్ధుడు. 

 Previous Page Next Page