అక్కడ నానీని సమీపించిన త్రాచు పడగవిప్పి ఏ క్షణంలో అయినా కాటేసేట్టు చూస్తూంది... ఇప్పుడు నానీ స్పృహలో లేడు... ఏ శక్తీ తనను కాపాడలేదనుకున్నాడో...తన చావుకి తను సాక్షిగా ఉండలేననుకున్నాడో భయంతో తెలివి తప్పేడు...
"మా షరతులని అంగీకరించినట్టేనా" స్థిమితంగా అడుగుతున్నాడు ప్రదీప్ సక్సేనా..
"యస్...అంగీకరిస్తున్నాను" తల పంకించాడు సంఘమిత్ర తలవంచుకునే...
"గూడ్..." ఇప్పుడు ఎక్కడినుంచో 'బ్లాక్ మాంబా' కంఠం వినిపించింది. "నానీని బయటికి తీసుకురండి."
మరుక్షణం కేజ్ డోర్ తెరుచుకుంది. ఆ చప్పుడికి ఉలిక్కిపడ్డ త్రాచు వేగంగా డోర్ ని సమీపించబోతుంటే "వి" ఆకారంగల పొడువాటి కర్ర దాని పడగని చేరుకుంది. అది తప్పించుకుపోయేటంతలో పడగని నేలపై ఒత్తి పట్టుకున్నాడు ఓ వ్యక్తి. మరోవ్యక్తి నానీని బయటికి తీసుకొచ్చాడు..."
సంఘమిత్ర గదిలోకి రప్పించబడిన నానీ ఇంకా స్పృహలోకి రాలేదు.
ఒళ్ళంతా చెమటతో తడిసిపోయిన సంఘమిత్ర తూలుకుంటూ నానీని చెరి ఆ పసికందు చెంపల్ని ఆప్యాయంగా నిమురుతుంటే నెమ్మదిగా అన్నాడు సక్సేనా. "గూడ్...సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయినట్టుంది."
అది ఉన్మాదమో లేక ఇంత రాక్షసత్వాన్ని ప్రదర్శించగల మనుషులు కూడా వుంటారని తెలుసుకున్న స్థితిలో కలిగిన నిస్తేజమో అదీ కానివాడు దశాబ్దాల తన కృషి చాలా నిస్సహాయంగా చేజారిపోతున్నందుకు బాధో మృదువుగా అన్నాడు సంఘమిత్ర.
"నా ప్రయోగం ఫలించిందని చెప్పింది మీరే కదూ..."
"అవును" సక్సేనా చెప్పాడు. "ఆ రాత్రి అంటే నిన్ను కిడ్నాప్ చేసుకొచ్చిన ఆ రాత్రి నీ ప్రయోగం విజయవంతమైందని మా మనిషి చెప్పాడు... ఫెయిలైందని నువ్వనుకున్నావు...ఆ బాధలో నీ లేబ్ ని దాటి నువ్వు బయటికి వచ్చిన కొన్ని నిముషాలలో నువ్వు చచ్చిందనుకున్న కుందేలు బ్రతికిన సూచనగా టేబుల్ కదిలి క్రిందికి దుమికింది... దానికి సాక్ష్యం నీకు అసిస్టుచేసే శృతి..."
ఈ విషయం ముందే చెప్పారు వాళ్ళు...
ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయిన సంఘమిత్ర అన్నాడు. "కాని...మరో ముఖ్యమైన చివరి ప్రయోగం మిగిలిపోయింది" నిజాయితీగా చెప్పుకుపోయాడు. "అసలు మాంబా సర్పాన్ని ఇంపోర్ట్ చేసుకున్నది ఆ ప్రయోగంకోసమే... అది పూర్తయి వుంటే ఈ సరికే మార్కెట్ లో నేను తయారు చేయాలనుకున్న ఆయింట్ మెంట్ విడుదలయ్యుండేది."
"ఆ ప్రయోగం అంత అవసరమా" సక్సేనా అడిగాడు.
"న్యూరోటాక్సిన్ ప్రభావంనుంచి కాటేయబడిన మనిషి రక్షించబడాలీ అంటే 'మాంబా' కాటుతో గాయపడ్డ ప్రాణిపై చివరి పరీక్ష జరపాలి..."
"అదేం పెద్ద శ్రమకాదు. ప్రస్తుతం సిటీలో చాలామందిని 'మాంబా' కాటేసి చంపుతూంది. నువ్వు ఆ చివరి ప్రయోగాన్ని పూర్తిచేస్తే సిటీలో గాయపడ్డ ఏ వ్యక్తిపై అయినా మేం స్వయంగా పరీక్ష జరుపుతాం..."
"కాని నాకు శృతి అసిస్టెన్స్ అవసరం" టక్కున అన్నాడు సంఘమిత్ర.
ఆ గదిలో హఠాత్ నిశ్శబ్దం ఆవరించింది.
"మిస్టర్ సంఘమిత్రా...మరోసారి తెలివిని ప్రదర్శిస్తున్నావనుకుంటాను" ఈసారి లోపలినుంచి 'బ్లాక్ మాంబా' కంఠం వినిపించింది.
"లేదు మిస్టర్...ఇది అతి తెలివికాదు. ప్రయోగంచేసే తెలివి నాకున్నా శృతి అసిస్టెన్స్ తోబాటు దాన్ని ప్రయోగశాలలోనే చేయడం తప్పనిసరి."
ఫకాలున నవ్వాడు సక్సేనా. మొత్తానికి పరోక్షంగా నిన్ను వదిలిపెట్టమని చెబుతూ ఇప్పుడు నీ ప్రయోగశాల కూడా అవసరమంటున్నావన్నమాట..."
"ఇది మీనుంచి నేను తప్పించుకోటానికి చేస్తున్న ప్రయత్నం కాదు. అక్కడ నా లేబరేటరీలో దశాబ్దాల నాకృషిలో సాధించిన కొన్ని రసాయనిక ద్రావకాలున్నాయి. ప్రయోగానికి అవసరమైన ఎక్విప్ మెంటూ అక్కడే వుంది."
"అలాంటి ఎక్విప్ మెంట్ మేమూ ఏర్పాటు చేయగలం..."
"మరి నేను ఇప్పటికే తయారుచేసిన మూలకాలు..."
"అవికూడా ఇక్కడికి వచ్చే ఏర్పాటు...." ఓ క్షణం ఆగి చెప్పాడు నక్సేనా. "నువ్వు చేయాలి...అంటే ఏమేం కావాల్సిందీ శృతికి నువ్వు చెప్పి ఇక్కడికి తెప్పించుకోవాలి... ...అలాగే శృతిని కూడా..."
"అసంభవం..."
"అయితే నానీ చస్తాడు" సక్సేనా రెండడుగులు ముందుకేసాడు నానీని అందుకోవాలన్నట్టుగా...
అసంకల్పితంగా ఆ వయోవృద్ధుడి చేతులు నానీని చుట్టుకున్నాయి. భయోద్విగ్నంగా బాధగా చూసాడు. "నేను మాట తప్పను సక్సేనా. అక్కడకు నేను వెళ్ళినా పూర్తయ్యాక ఫార్ములా మీకు అందచేస్తాను...నన్ను నమ్మండి..."
"మిస్టర్ సంఘమిత్రా...మా సహనాన్ని పరీక్షించి నీ ప్రాణాల మీదికే కాదు నీ వాళ్ళనుకుంటున్న అందరి ప్రాణాలకీ ముప్పు తెచ్చుకుంటానన్నావు...నిన్ను రప్పించిందీ విడిచిపెట్టడానికి కాదు... ఇది నా సామ్రాజ్యం...ఏ ప్రయోగమైనా ఇక్కడే జరగాలి...జరిగితీరాలి. దీనిగురించి ఆర్గ్యుమెంటు అనవసరం" కనిపించని బ్లాక్ మాంబా కంఠం బొంగురుగా హెచ్చరిస్తూంది. "నువ్విప్పుడు శృతితో ఫోన్ లో మాటాడబోతున్నావు...మా ఓర్పు నశించకముందే నీకు కావాల్సిన ఆ రసాయనిక మూలకాలతో శృతిని ఇక్కడికి రప్పించుకుంటున్నావు... యస్...క్విక్... ...లేదా రెండు నిముషాలలో నీ ముందున్న నానీ శవంగా మారిపోతాడు..."
వ్యవధిలేదు...తను జాప్యంచేస్తే ఓ పసిగుడ్డు ప్రాణాలు కడతేరిపోతాయి. తన గురించి తను ఆలోచించడం లేదిప్పుడు...ఓ పసికందుని రక్షించడానికైనా ఆత్మద్రోహానికి సిద్ధపడాలి తప్పదు.
"మిస్టర్ బ్లాక్ మాంబా" ఒక నిర్ణయానికి వచ్చినట్టు అన్నాడు సంఘమిత్ర దృడంగా. "శృతితో నేను మాటాడతాను...ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేస్తాను. కాని శృతి ఆడపిల్ల..."
"అయినా మా మగతనం పెట్టుబడిగా శృతికి అన్యాయంచేయం" వెంటనే జవాబు చెప్పాడు సక్సేనా. "మా లక్ష్యం వెలకట్టలేని సంఘమిత్రా! ఒక ఆడదాని ప్రాణం అవసరమనుకుంటే తీస్తాం తప్ప అత్యాచారం చేయడం మా పాలసీ కాదు. నిర్భయంగా నువ్వు రప్పించుకో..."
కార్డ్ లెస్ ఫోన్ అందుకున్న సక్సేనా బటన్స్ నొక్కుతూ శృతి ఇంటికి రింగ్ చేసాడు.
అర నిముషంలో శృతి లైన్ లోకి వచ్చింది.
"హల్లో."
"నే...ను..." ఫోన్ అందుకున్న సంఘమిత్ర గొంతు వణికిపోతూంది. "నేను శృతీ...మీ మామయ్య... సంఘమిత్రని..."
"ఆ...అంకుల్...మీరు... ...ఎక్కడినుంచి" తొట్రుపాటుగా వినిపిస్తూంది.
చెప్పాడు వివరాలన్నీ "తప్పదు శృతీ...ఆ చివరి ప్రయోగం నీ సహాయంతో నేను ఇక్కడే చేరాలి...లేకపోతే నానీ బలైపోతాడు..."
"అంటే..." శృతి గొంతులో మరింత కంగారు... "నానీ...నానీ అక్కడే వున్నాడా."
"అవునమ్మా...మృత్యువు సరిహద్దులో నిలబడి కేవలం నా నిర్ణయంతో మాత్రమే తను బ్రతికే స్థితిలో వున్నాడు."
జవాబు చెప్పలేదు శృతి.
"నా మూలంగా ఈ పసికందు ప్రాణాలు పోకూడదు శృతీ... నా కృషి బూడిదలో పోసినా నాకు ఆమోదమే కాని...ఏ తప్పుచేయని నానీ..." సంఘమిత్ర కళ్ళు చెమర్చాయి.
ఇక మాటాడే అవకాశం యివ్వనట్టు సక్సేనా ఫోన్ లాక్కున్నాడు...వెనుక చీకటిలో నిలబడ్డ బ్లాక్ మాంబాకి అందించాడు.
"బేబీ...నేనూ...బ్లాక్ మాంబా..."
రిచ్చెడ్ టెర్రరిస్టు..."
"విశేషణం బాగుంది. యూసీ మైడియర్ బేబీ...ఇరవై నాలుగు గంటలపాటు జయేంద్రని రక్షించాలని నువ్వు చేసిన ప్రయత్నం అభినందించతగ్గది..." ఓ క్షణం ఆగేడు. "అయినా అదృష్టవంతురాలివి... మా వాళ్ళు వాడ్ని లేపేయాలని వెంటాడారు...కాని కోబ్రాకాటుతో అవసరం మరోలా తీరిందీ అనుకుంటే అనుకోకుండా నీ మూలంగా బ్రతికి బయటపడ్డాడని ఈ ఉదయం తెలిసింది. ఎనిహౌ...యూ ఆర్ లక్కీ...నో...హీ యీజ్ లక్కీ బాస్టర్డ్...మీ అంకుల్ వివరంగా చెప్పాడుగా...సో... మరోగంటలో నా మనిషి నీ దగ్గరకు వస్తాడు...సంఘమిత్ర చెప్పిన కెమికల్స్ తో ఇక్కడకు వచ్చేయ్....తక్కిన ప్రిపరేషన్ మేం ఏర్పాటుచేస్తాం. ఇంకో విషయం. నానీ బ్రతకాలంటే పోలీసులకి చెప్పడంలాంటి తెలివి తక్కువ పనుల్ని చేయకు."


