Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 41


    మానవ శరీరం కేవలం ఒక యంత్రం. అందుకే మనసులో ఎంత అశాంతిగా ఉన్నా, వారం రోజుల నిద్రలేమి తరువాత ఆ రోజు తులసికి నిద్రపట్టింది.
    కృష్ణారావు పిల్లిలా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. నిద్రపోతున్న తులసి మీద బకాసురుడిలా పడ్డాడు. తులసి అరవాలనుకుంది. కానీ, క్రుద్నారావు తులసి నోరు గట్టిగా నొక్కేశాడు. తులసికి ఊరిరాడటం లేదు. మనసులో ఎన్నో గొంతులు ఘోషపెడుతున్నా, ఒక్కటికూడా గొంతు దాటి బయటికి రావటంలేదు. దాహంతో గొంతు ఎండుకు పోతోంది. గాలి ఆడని ఏ ప్రాంతంలోనో బంధించినట్లుగా, శరీరం ఉక్కిరిబిక్కిరిగా కొట్టుకుపోతోంది. చుట్టూ ఏవేవో ఆకారాలు తిరుగుతున్నాయి. గోల గోలగా నవ్వుతున్నాయి. కృష్ణారావు వంటిమీద చీర లాగి పారేస్తున్నాడు.
    ఆ చీర వంటిమీద నుంచి తొలగిపోకుండా గట్టిగా పట్టుకోవాలని ఉంది. కానీ, పట్టుకోలేక పోతోంది. కుడి చెయ్యి స్వాధీనంలో లేదు. అయ్యో! తన చెయ్యి, కుడి చెయ్యి, మనసు విల విల లాడుతోంది. చీర తొలగిపోతోంది. తను నగ్నంగా నిలబడింది. అయ్యో! పడుకుంది కదూ! ఎలా నిలబడింది? నిలబడింది సరే! కృష్ణారావు దగ్గర నుంచి ఎందుకు పారిపోదు? కృష్ణారావు తనను ఏం చెయ్యటం లేదు. తనను చూసి నవ్వుతున్నాడు. ఇదే సమయం! పారిపోవాలి! ఎలా పారిపోవాలి! నగ్నంగా వీధుల్లోకి ఎలా పరిగెట్టాలి? దేవుడా! ఈ నగ్నతను ఎలా కప్పుకోవాలి? కృష్ణారావు దూరంగా నిలబడి నవ్వుతూ "రమ్మంటావా?" అని అడుగుతున్నాడు. "వద్దు వద్దు!" అంది. గొంతు దాటి పైనించి అరుపులతో తన అరుపులు, తన ఘోష గొంతు దాటి బయటికి రాలేదుగా! అంచేత కృష్ణారావుకి వినిపించలేదు. ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ వస్తున్నాడు. కెవ్వున అరిచింది హమ్మయ్య! శబ్దం బయటికి వచ్చింది. ఇంకా ఇంకా గట్టిగా అరిచింది.
    "తులసీ! తులసీ!" కొన్ని గొంతులు కలగాపులగంగా అరుస్తున్నాయి. తులసి కళ్ళు తెరిచింది, చుట్టూ మనుష్యులు, ముందు తనను తను భయంగా చూసుకుంది. నగ్నంగా లేదు. వంటిమీద చీర ఉంది.
    కృష్ణారావు కొంచెం ముందుకు వంగి, తన ముఖం లోకి చూస్తున్నాడు. ఆ ముఖం చూడగానే భయం వేసింది......
    రెండు చేతులూ జోడించి ఏడ్చేస్తూ "కృష్ణారావ్! నీకు నా మీద మోజువుంటే పెళ్ళిచేసుకో! నువ్వు చంద్రని ఉంచుకున్నా, ఇంకా ఎంత మందిని ఉంచుకున్నా విశ్వాసంగా పడి ఉంటాను. అంతే కాని నా బ్రతుకు నాశనం చెయ్యకు" అంది.
    ఈ మాటలు విన్న పెద్ద బొజ్జ ఉన్న ఇంటి యజమాని నిటారుగా నిలబడ్డాడు. లోకంలో యెన్నో విధాలుగా ఎన్నెన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు. కాని, ఇలాంటి విషయాల్లో మాత్రం ప్రతి ఒక్కరూ సంఘంలో ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత తమదే అనుకుంటారు. ఎవరిని కదిలించినా ఇలాంటి విషయాల్లో నీతి వాక్యాలు ధారా ప్రవాహంగా పొంగివస్తాయి.
    ఇంటి యజమాని కృష్ణారావుని ఒక హంతకుడికంటే, ఒక గజదొంగ కంటే, నీచంగా హీనంగా చూస్తూ అత్యంతాశ్చర్యంగా కనుబొమలు పైకి లేపి, "ఏమిటి? మీరిద్దరూ భార్యా భర్తలు కారూ? ఛ! ఛ! ఎలా తగలబడి పోతున్నాయి రోజులు? ఏదో మీరిద్దరూ మర్యాదస్థులనుకుని ఇల్లిచ్చాను. ఇలాంటి వాళ్ళని తెలిస్తే.....ఏవయ్యా? ఒక అమాయకురాలికి సహాయం చేస్తానని మోసగించి, ఇలా బలత్కరించటానికి పూనుకుంటావా? సమయానికి మేం వచ్చాం గనుక సరిపోయింది. లేకపోతే, ఎంత ఘోరం జరిగి ఉండేది? ఉండు? ఇప్పుడే పోలీసులకు రిపోర్టిస్తాను" అన్నాడు.
    కృష్ణారావు తులసిని దెబ్బతిన్న పిట్టలా చూశాడు. ఆ చూపులకు తులసి గుండె బెదిరింది. తలంతా దిమ్మెత్తి నట్లయి, ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఏదీ సరిగా అర్ధం కావటంలేదు.
    కృష్ణారావు ఇంటియజమాని వంక చూసి, "మీరు అనవసరంగా హడావుడి చెయ్యకండి, మేమిద్దరమూ ఒక్క పదిరోజులలో పెళ్ళి చేసుకోబోతున్నాం" అన్నాడు.
    ఇలాంటి సందర్భాలలో ఈ "పెళ్ళి" అనే మాట రక్షణ కవచంలా ఉపయోగిస్తుందని అనుభవం మీద తెలుసుకున్నాడు కృష్ణారావు.
    ఇంత త్వరగా ఈ విషయం తేలిపోవటం ఇంటి యజమానికి కొద్దిగా నిరుత్సాహం కలిగించింది. అయినా ఇంకా కొంచెం సాగ తియ్యాలనే ఆశతో, "ఏం అమ్మాయ్! నిజమేనా?" అన్నాడు తులసితో. తులసి మాట్లాడకుండా తలవంచుకుంది. తలఎత్తి కృష్ణారావును చూసే సాహసం కలగటంలేదు. ఇంటి యజమానికి బాగా నిరుత్సాహం కలిగింది.
    "కృష్ణారావ్! ఇప్పుడే చెపుతున్నాను. పెళ్ళయ్యే వరకూ కాస్త జాగ్రత్తగా ఉండు. మా ఇంట్లో ఇలాంటి గొడవలు జరగటానికి వీల్లేదు." అనేసి విధిలేక వెళ్ళిపోయారు భార్యను వెంట బెట్టుకుని.
    తులసీ, కృష్ణారావూ మిగిలారు, ఒకరికొకరు ఎదురుగా. తులసి లాగే తలవంచుకుని నిలబడింది. వంచిన తల ఎత్తలేక. ఎందుకింత గొడవ చేశావు తులసీ! నిద్రలో గట్టిగా పట్టుకుని మరింత అరిచావు. అరుపులకి వాళ్ళంతా వచ్చారు. నువ్వు ఏదేదో మాట్లాడావు. ఛ! ఛ! అలా ఎందుకు ఊహిస్తున్నావు?"
    అప్పటికి తులసికి అర్ధమయింది కల! అదంతా భయంకరమైన కల! తనవంటిమీద చీర కృష్ణారావు లాగెయ్యబోవటం. తను జారిపోకుండా పట్టుకోవాలనుకుంటే కుడిచెయ్యి స్వాధీనంలో లేకపోవటం....అబ్బ!! ఏం కల ఇది? అతి ప్రయత్నంమీద తాను అణచి ఉంచిన చీకటి కోణాలన్నీ కొద్దిపాటి విశ్రాంతి లభించగానే ఒక్కసారి విజ్రుంభించి విశ్వ రూపాలతో తనముందు ప్రత్యక్షమయ్యాయి. ఆ తాకిడికి తట్టుకోలేక తనను చూసి బెదిరి, నిష్కారణంగా కృష్ణారావును అల్లరి పెట్టింది.
    "ఛ! ఛ! అలా ఎందుకు ఊహిస్తున్నావు?" అని అంతులేని విస్మయంతో అడుగుతోన్న కృష్ణారావుకు తాను చెప్పగలిగిన సమాధాన మేముంది?
    "నేను పడుకుంటున్నాను, తలుపులు గడియ వేసుకొని పడుకో." ఈసడింపుగా అని వెళ్ళిపోయాడు కృష్ణారావు. తులసి తలుపులు గడియ వేయలేదు. కృష్ణారావునే వాటిని బయటనుంచి దగ్గరగా లాగాడు. నిలబడలేక మంచం మీద వాలిపోయింది తులసి. విపరీతమైన అలసట వల్ల త్వరలోనే నిద్రపట్టేసింది. తులసి నిద్రలేచే సరికి పక్క గదిలో కృష్ణారావు లేడు. అతని బ్రీఫ్ కేస్ కూడా లేదు. తులసి హడలి పోయింది. కృష్ణారావు వెళ్ళిపోయాడా? అతనికి తన మీద కోపం వచ్చిందా? ఇప్పుడు తన గతి ఏం కావాలి! అయ్యయ్యో! ఎంత పిచ్చి పని చేసింది? కృష్ణా రావును క్షమాపణ కోరుకొని ఉండవలసింది.
    ఏదో జరిగిందని వాసన పసిగట్టాడు. ఇంటాయన వెంటనే వచ్చాడు.
    "ఏమిటమ్మా, ఏం జరిగింది? దుర్మార్గుడు గట్టిగా పెళ్ళి చేసుకోమనేసరికి పారిపోయాడా? వెంటనే పోలీసులకు....." హడలి పోయింది తులసి.
    "లేదండీ! పారిపోలేదు, పెళ్ళి ఏర్పాట్లు చూడటానికి వెళ్ళారు. ఇవాళ సాయంత్రమో, రేపో వస్తారు." నోటికి వచ్చిన అబద్దం ఆడేసింది.
    "సరే-సరే? ఏం కావాలన్నా సంకోచించకు, తండ్రి లాంటి వాడిని" ఆప్యాయంగా తల నిమిరి మరీ వెళ్ళాడు. ఆ 'తండ్రిలాంటి ఆయన' స్పర్శకు శరీరమంతా జుగుప్సతో జలదరించింది తులసికి.
    కృష్ణారావు తననిలా నడి సముద్రంలో వదిలి వెళ్ళిపోతాడా? డాక్టర్లు చెయ్యి స్వాధీనంలోకి వచ్చే ఆశ ఉందంటున్నారు. మరొక్క పది రోజులు అక్కడ ఉండి ఇంజక్షన్లు తీసుకుంటే కోర్సు పూర్తవుతుంది. ఆ తరువాత యింటికి వెళ్ళి వ్యాయామం చేసుకోవచ్చు. ఇల్లు! తనకు ..... ఇల్లు మాత్రం ఎక్కడుంది? ముందు ఎలాగో చెయ్యి బాగుచేయించుకుంటే, ఆ తర్వాత ఎలాగైనా బ్రతకవచ్చును. ఈ గండం గడిచి బయట పడేదెలా?

 Previous Page Next Page