20
చచ్చుబడిపోయిన శరీరావయవాలను ట్రీట్ చెయ్యడానికి రాయవెల్లూరులోని ఆస్పత్రిలో ఒక ప్రత్యేకమైన సెక్షన్ ఉంది. రోగులను పరీక్షించి ఆయా రోగుల పరిస్థితిని బట్టి ఎవరికియ్యవలసిన ట్రీట్ మెంట్ వాళ్ళకిస్తారు. తులసికి అన్ని పరీక్షలూ చేశారు. తులసికి వచ్చిన జ్వరం ఏదో విషజ్వరం అయి ఉంటుందనీ, ఆ ఇన్ ఫెక్షన్ కారణంగానే కుడిచేతి నరాలు చచ్చుబడిపోయి ఉండవచ్చుననీ అన్నారు. రెండురోజులకొకసారి ఇంజక్షన్లు తీసుకోవాలన్నారు. అదిగాక పైకి ఏదో తైలం రాస్తూ, డాక్టర్ చూపించిన క్రమ పద్ధతిలో వ్యాయామం చెయ్యాలన్నారు.
హాస్పటల్ లో బెడ్స్ ఖాళీగా లేవు. అదీగాక తులసి పరిస్థితి ఇన్ పేషంట్ గా చేర్చుకోవలసినంత ప్రమాదకరమైనది కాదు. అంచేత కృష్ణారావు ఒక చిన్నవాటా అద్దెకు తీసుకున్నాడు. ఇంజక్షన్స్ కు రియాక్షన్ రావచ్చునని హెచ్చరించారు డాక్టర్లు. "ఇరవై నాలుగు గంటలలోపల ఎప్పుడైనా ఎలాంటి రియాక్షనైనా రావచ్చును. శరీరం నిండా దద్దుర్లు రావచ్చును. మంటలు రావచ్చును. కాళ్ళూ, చేతులూ కొంకర్లు పోవచ్చును. అలాంటిదేదైనా వస్తే వెంటనే హాస్పిటల్ కు తీసుకురండి" అన్నారు.
తులసికి ట్రీట్ మెంట్ ప్రారంభమయింది. తులసి మనసులో కృష్ణారావు పట్ల అంతులేని కృతజ్ఞతా భావమూ, వల్లమాలిన భయమూ ఒక దానితో ఒకటి పోటీలు పడుతూ తులసికి స్థిమితం లేకుండా చేస్తున్నాయి. డాక్టర్లకు, మందులకు, దానికీ దీనికి బోలెడు ఖర్చవుతోంది. అంతా కృష్ణారావే భరిస్తున్నాడు. ఏ ఆశా లేకుండానే ఇంత చేస్తున్నాడు? తనను పెళ్ళి చేసుకుంటే ఫరవాలేదు కాని, ఎటూ కాకుండా తన జీవితం నాశనం చెయ్యటానికి ప్రయత్నిస్తే ఎలా? వెనుకటి భయాలన్నీ తిరిగి ముసురుకున్నాయి తులసి మనసులో.
కృష్ణారావు చంద్రనెంతగా అభిమానిస్తున్నాడో కళ్ళారా చూసింది. అలాంటప్పుడు తనమీద ఉంటుందా? మొగవాళ్ళలో ఇదొక బలహీనత. ప్రేమ ఉంటే ఉండొచ్చును. కానీ కృష్ణారావు తనను పెళ్ళి చేసుకుంటాడా? అతనికి మంచి కట్నంతో, ఎవరో గొప్పింటి అమ్మాయి దొరుకుతుంది. చంద్ర ఉండగా మరొకరిని పెళ్ళి చేసుకుంటాడా? ఎందుకు చేసుకోడు? చంద్ర భోగంది...చంద్రని కులాసా కాలక్షేపానికి ఉంచుకుని శాస్త్రోక్తంగా మరొకరిని చేసుకుంటాడు.
తనకు ఇంత సహాయం చేస్తున్నాడు. ఎందుకూ? ఎందుకూ?
కృష్ణారావు తమకోసం తీసుకున్న వాటాలో రెండు గదులున్నాయి. రాత్రి పడుకోబోతూ గది తలుపులు గట్టిగా వేసేసుకోబోయింది తులసి.
"తలుపులు గడియ పెట్టకండి, కావాలంటే దగ్గిరగా వేసుకోండి" అన్నాడు కృష్ణారావు. తులసికి గుండె ఝల్లుమంది. "ఎందుకూ?" అంది గొంతులో వణుకు వినిపించనీయకుండా.
"డాక్టర్ ఇరవైనాలుగు గంటలలో ఎప్పుడైనా రియాక్షన్ రావచ్చునన్నాడు. మీరు తలుపులు వేసుకుని పడుకుంటే.... ఒకవేళ రియాక్షన్ వస్తే.... నేనెలా లోపలికి రాగలను?" అన్నాడు.
రియాక్షన్ మాట వినేసరికి హడలిపోయింది తులసి. దురదృష్టవశాత్తు హాస్పిటల్ లో రియాక్షన్ వచ్చిన పేషెంట్స్ ని చూసింది. అంచేత తలుపులు దగ్గిరగా వేసి పడుకుంది. పడుకుందన్న మాటేకాని కంటిమీదకు నిద్ర రాలేదు. ప్రతి చిన్న చప్పుడుకూ ఉలికి పడుతూనే ఉంది. అంతలో అవతలి గదిలోంచి కృష్ణారావు మంచంమీద నుంచి లేచిన చప్పుడయింది. అదిరిపడి తన మంచంమీద లేచి కూచుంది తులసి. నడుస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపించింది. తులసికి శరీరమంతా చెమటలు పట్టాయి. గుండె దడ దడ కొట్టుకుంది. అడుగుల చప్పుడు ఆగిపోయింది. తులసి సస్పెన్స్ భరించలేకపోయింది. నెమ్మదిగా తలుపు తెరిచి చూసింది. అప్పుడే బయటినుంచి వస్తున్నాడు కృష్ణారావు. తులసిని చూసి, "ఏం కావాలి?" అన్నాడు.
తులసి గతుక్కుమని "ఏం అక్కర్లేదు" అంది.
"మంచినీళ్ళు పెట్టుకోవటం మరిచిపోయాను. మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యటం ఇష్టంలేక బయటికి వెళ్ళి సోడా త్రాగి వచ్చాను" అన్నాడు.
అతణ్ణి అనుమానించినందుకు చూడా సిగ్గుపడింది తులసి. లోపలినుంచి మరచెంబుతో నీళ్ళూ, గ్లాసూ తెచ్చిపెట్టింది. మళ్ళీ తలుపులు దగ్గిరగా వేసుకుంది.
'కృష్ణారావు మంచివాడు' అనుకుంది పడుకుంటూ. ఆ భావాన్ని తరుముకుంటూ వచ్చాయి. 'పచ్చి రౌడీ ముండల ముఠాకోరు' అనే భావాలు.
దగ్గర దగ్గర వారం రోజులు గడిచాయి. కృష్ణారావు ఎంతో స్నేహంగా అన్నివిధాలా సహాయం చేస్తున్నాడు, ఏనాడూ ఏ విషయంలోనూ అనవసరంగా మాట్లాడలేదు. అమాయకంగా నవ్వే కృష్ణారావు ముఖం చూస్తే తులసికి ఎంతో గౌరవం కలిగేది. కానీ, వెంటనే లోపలనుంచి ఏదో గొంతు 'ముండల ముఠాకోరు, ముండల ముఠాకోరు' అని ఘోషపెట్టేది. రాత్రివేళ మాత్రం ఎంత ప్రయత్నించినా సుఖంగా నిద్రపోలేకపోయేది. ఏదో బ్రహ్మాండమైన ఉపద్రవం జరగబోతున్నట్లు, దానిని ఎదుర్కోవటానికి సిద్ధపడసాగింది తులసి మనసు.