Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 40


    సరోజ కళ్ళు పెద్దవిచేసి విభ్రాంతితో చూసింది కుమార్ వైపు. చూస్తుండగా సరోజకళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి.
    ఆ ముఖం చూడలేకపోయాడు కుమార్. తల దించుకున్నాడు.
    "బావా! ఆనాడు నా సహాయానికి ఋణం తీర్చుకోలేనని అన్నావు. ఈ రకంగా ఋణం తీర్చుకుంటున్నావా?"
    "సరోజా!"
    "నేను చేసిన అపరాధమేమిటి చెప్పు బావా! ఇంత అకస్మాత్తుగా నీతో మాట్లాడే అర్హత ఎలా పోగొట్టుకున్నాను నేను?"
    "మనం మన పెద్దవాళ్ళమాట గౌరవించాలిగా సరోజా!"
    "అదా సంగతి? ఎవరా పెద్దవాళ్ళు?"
    "నీ తలిదండ్రులూ, నా తలిదండ్రులూ...."
    "మన తలిదండ్రుల ఇష్టాలకు విరుద్దంగా మనకు కావలసింది నిర్ణయించుకునేటంత పెద్దవాళ్ళం కాలేదా మనం?"
    "కాలేదు-కాము. మన చదువులు పూర్తయి జీవితంలో స్థిరపడేవరకూ మనకా పెద్దరికం రాదు."
    అక్కడే ఉండి ఇంకా సరోజతో మాట్లాడితే తన మనసు నిగ్రహించుకోలేననిపించింది కుమార్ కి. సైకిలెక్కి వెళ్ళిపోయాడు. ఏడుపు పొంగివచ్చింది సరోజకి. ఇంటికి వెళ్ళలేక ఒక స్నేహితురాలి దగ్గిరకు వెళ్ళి కరువుతీరా ఏడ్చి, ఆ స్నేహితురాలి ఓదార్పు మాటలు విని, ఆ అమ్మాయి ఇచ్చిన కాఫీ త్రాగి అప్పుడు ఇంటికొచ్చింది. అనూరాధ కూతుర్ని అనుమానంగా చూస్తూ "ఇంతవరకూ ఎక్కడున్నావే?" అంది. అసలే తిక్కగా ఉన్న సరోజ తల్లి ఇలా అడిగేసరికి రెచ్చిపోయి "కుమార్ బావతో తిరిగి తిరిగి వస్తున్నా!" అంది. అనూరాధ పట్టరాని కోపంతో సరోజ చెంప ఛెళ్ళు మనిపించింది. చెంప ఎంత మండుతుందో, మనసు అంతకు మించి భగ్గుమంది సరోజకి. దెబ్బ తగిలిన చెంపని చేత్తో అదిమి పట్టుకుని దెబ్బతిన్న త్రాచులా బుసలు కొడుతూ "నన్ను కొట్టినా, చంపినా, చీల్చినా కుమార్ బావనే పెళ్ళి చేసుకుంటాను-చేసుకుని తీరుతాను" అంది.
    అనూరాధకు కోపంకంటే భయమూ, బాధా ఎక్కువయి పోయాయి. అప్పటికప్పుడే ఆడబిడ్డ దగ్గిరకు బయలుదేరింది.
    ఉప్పెనలా వచ్చిన వదినగారిని చూసి హడలిపోయింది సుమతి.
    "రా వదినా౧ కూచో!" అని మర్యాద చెయ్యబోయింది. అనూరాధ సుమతిని విదిలించి "నీ మర్యాదలు చాల్లే! మమ్మల్నిలా బ్రతకనియ్యవా అమ్మా! నామీద కోపముంటే ఉంది, అన్నగారనే అభిమానమయినా లేదా? పోనీ, ముక్కుపచ్చలారని పసిపిల్ల అని దాని మీద జాలైనా లేదా! నువ్వంటే ఎవడినో తెచ్చి ఉదారంగా కొడుకంటూ పెంచావు. అంత మాత్రాన వాడిని నా అల్లుడిగా చేసుకోమంటావా? ఇదే, నీ కూతురే ఇలా ఎవడితోనో తిరిగితే నువ్వు ఊరుకుంటావా?"
    అన్నింటికంటే చివరిమాటలు చాలా కష్టమనిపించాయి సుమతికి.
    "అంతంత మాట లెందుకు వదినా? మా కుమార్ కి మీ సరోజ నియ్యమని మే మెవ్వరమూ బ్రతిమాల లేదుగా మిమ్మల్ని! సరోజకి చాలా మంచి సంబంధం రావాలని మీ అందరిలాగే నేనూ కోరుకుంటున్నాను. మా కుమార్ తో గట్టిగా చెప్పాను. మీ సరోజతో మాట్లాడవద్దని. కుమార్ నా మాట కాదనడు."
    "ఆఁ కాదనడు-ఇవాళ సరోజ ఎనిమిదింటికి ఇంటికి వచ్చింది. ఎక్కడకు వెళ్ళావంటే బావతో కలసి తిరుగుతున్నానని చెప్పింది. బావ? నా ప్రాణానికి దాపురించాడు బోడిబావ! ఇంక నేను పడలేను. నువ్వు కుమార్ కి గట్టిగా చెప్పకపోతే, మా సరోజ వాడితో కలసి తిరిగిందంటే నేను దాన్ని చదువు మానిపించి నాతో మా పుట్టింటికి తీసుకుపోతాను. దాని చదువు పాడయినా సరే! నా కాపురం పాడయినా సరే!"

 Previous Page Next Page