Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 4

    "ఒకరు అని పరాయి వాళ్ళలా అంటావేమిటి?"

    "అమ్మ, నానమ్మ, తాతమ్మ మన పూర్వులే కదా? వాళ్ళంతా గొప్పవాళ్ళు!"

    "అయితే కావచ్చు! వాళ్ళు గొప్పవాళ్ళే! కాదని నేను అనలేను! కానీ మరొకరు వాడిన వస్తువులని నేను వాడను! నా టెంపర్ మెంట్ నాకు తెలుసు కదా! ఊరికే అలర్జిటిక్ అయిపోతాను. ఎక్స్ క్యూజ్ మీ అక్కా! గాజులును నేను వేసుకోను. అన్నీ నువ్వే ఉంచుకో!"

    ట్రెడిషన్ గా వంశానికి వస్తున్న గాజులు చెల్లికి వాటా ఇస్తానంటే వద్దు అంది! మొత్తం తానే ధరించి నిండుగా తయారయింది గాయత్రి.

    అంతలో తల్లినించి వారికి పిలుపు వచ్చింది!

    క్రిందికి దిగి హాలులోకి వెళ్ళారు.

    గాయత్రి ఆ ఇంటి ఆడపడుచులు చేసుకోదగిన ఖరీదయిన గంభీరమయిన అలంకరణ చేసుకోవటం గమనించింది రాణి సుమిత్ర.

    ఆ ఇంటికి సరయిన వారసురాలు కాగల వ్యక్తిత్వం ఆమెకి ఎక్కువగా కనిపిస్తుంది, తెలివితో పాటు వినయ విధేయతలున్నాయి.

    ధైర్యంతో పాటు ఒద్దిక కూడ ఉంది.

    ఆమని సింపుల్ గా మిషన్ మీద తీసిన ఒక్క బంగారు చెయిన్ మాత్రమే మెడలో వేసుకుంది. అది కన్పించీ కనిపించనంత సన్నగా ఒంటి రంగులో కలిసిపోయి ఉంది! డ్రస్ కూడ అక్కలా కాకుండా మోడరన్ గా వేసుకుంది.

    డైమండ్స్ పొదిగిన ఇయర్ డ్రాప్ పెట్టుకుంది.

    వజ్రాల దిద్దులు ఎన్నో జతలున్నాయి.

    వాటిని గాయత్రి పెట్టుకుంది. కాని ఆమని ఎప్పుడూ పెట్టుకోదు.

    ఆమె చెవులకు పెట్టుకునే ఆభరణం తలతో పాటుగా ఊగిసలాడుతూ ఉండాలి. అమనికి అదో సరదా! తల్లి ముందుకు వస్తోంది కాబట్టి నిర్లక్ష్యంగా వదలి వేయకుండా రోబ్ ని జాగ్రత్తగా సవరించుకుని మరీ మెట్లు దిగి వచ్చింది. లక్ష్మీ సరస్వతుల్లా ఉన్నారు బిడ్డలు!

    వారి రాకను ఎంతో అపురూపంగా చూచుకుంది సుమిత్రాదేవి!

    ఈ ఇంటి వారసత్వాన్ని చేతుల్లోకి తీసుకోనున్న వారిని తనతో తీసుకుపోయి ఎన్నో ముఖ్యమయిన పరిచయాలు చేయాలి! బాధ్యతలు అప్పగించాలి!

    ఆ ఇంటిలో చిన్నతనం నించి అందరి మనసులని అర్ధం చేసుకుంటూ కష్ట సుఖాలకు ప్రతిస్పందిస్తూ ఉండే పనిమనిషి వర్ధిని!

    సుమిత్రాదేవి ప్రతి ఆలోచనా ఆమెకు చెప్తుంది! అవసరమయిన సలహా తీసుకుంటుంది. అడుగడుగున ఎంతో విలువయిన వస్తువులుంటాయి. ఆమని అయితే రింగులు జూకాలు నక్లెస్ లు చెయిన్ లు విలువయిన కాస్మిటిక్స్ అన్నీ విసరి విసరి కొడుతూ ఉంటుంది.

    కాని ఎందరు పనివాళ్ళు ఉన్నా ఆ ఇంటిలో ఒక్క వస్తువు కూడ పోలేదెప్పుడూ! పనివారి వల్ల దొంగతనాలు జరగకుండా చూడటం, పెద్ద ఇంటికి వచ్చేవారు ఎవరి స్థాయిని అనుసరించి వారికి తగిన మర్యాదలు చేసి యజమాని వచ్చేలోగా వారిని ఆదరించటం వర్ధనమ్మ పనులు. సాధారణంగా సుమిత్రాదేవి ఆలయానికి తప్ప మరో అవసరానికి బయటకు వెళ్ళదు. ఆలయానికి వెళ్ళాలంటే పక్కన వర్ధనివుండి తీరాలి. కాని ఇప్పుడు కుమార్తెలు ఇద్దరూ వున్నారు కాబట్టి వర్ధని బయలుదేరలేదు. గడపదాటి వెళ్ళే ముందు మంచినీరు త్రాగి వెళ్ళాలనేది పాతకాలం నాటి అలవాటు. దాన్ని రాణి ఇంకా అమలు పరుస్తోంది. వర్ధిని వచ్చి మంచినీరు అందించింది.

    రాణితోపాటు గాయత్రి కూడ ఒక గ్లాసు ఫ్రిజ్ వాటర్ త్రాగింది.

    వర్ధని యజమానురాలి వంక చూచింది. ఆ సమయంలో ఐస్ క్రీం తినటం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా పనిమనిషి ముందు మాటాడటం ఇష్టంలేక మౌనంగా ఊరుకుంది సుమిత్రాదేవి.

    ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి వర్ధని వెళ్ళి ఐస్ క్రీం తెచ్చి అందించింది.

    అది వెంటనే ఖాళీ చేసి మరో కప్పు ఇచ్చినా తినగలను అన్నట్టు చూచింది. కాని సుమిత్ర లేచి నిలబడటంతో తప్పనిసరి అయి తల్లిని అనుసరించింది.

    "మమ్మీ! డ్రయివర్ వద్దులే. నేను డ్రయివ్ చేస్తాను అంది ఆమని. డ్రయివర్ పక్కకు ఒదిగి నిలిచాడు. తల్లి పూర్తి యిష్టాన్ని సూచించకముందే డ్రయివింగ్ సీట్లోకి ఎక్కి కూర్చుంది. ముగ్గురూ ముందు సీట్లో ఆసీనులయ్యారు.

    డ్రయివర్ వెనుక కూర్చున్నాడు.

    ఆమని స్పీడు సుమిత్రకు తెలుసు. "ఇక స్టార్ట్ చెయ్యి. నెమ్మదిగా పోనివ్వు. వీధులనిండా పిల్లలే, సందడిగా తిరుగుతున్నారు" అంది సుమిత్ర.

    గ్రామం అంతటా పందిళ్ళు వేశారు. తిరునాళ్ళకు వచ్చే జనాలకు ఎండ తగలకుండా ఏర్పాటు చేసారు. చలువ పందిళ్ళలో చలివేంద్రాలలో నీరు యిచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. ఆలయం వెలుపల అడిగిన వారందరికి పులిహోర పెరుగు అన్నం పొట్లాలు ఉచితంగా యిచ్చే ఏర్పాటు ఈ సంవత్సరం ప్రత్యేకత.

    జగదీశ్వరస్వామి మహిమలు విని, రాణి సుమిత్రాదేవి గొప్పతనం విని తిరునాళ్ళు చూచేందుకు వచ్చేవారు ఎలాంటి లోపం ఉందని అనకూడదు.

    తాను చేయించిన ఏర్పాట్లు వివరిస్తూ కూతుళ్ళకు ఆయా స్థలాలు చూపించింది సుమిత్ర. గాయత్రి తల్లితోపాటు దిగి వెడుతోంది.

    ఆమని వీలయినప్పుడల్లా డ్రయివింగ్ నెపంతో సీటు దిగి రావటం లేదు!

    మహా నగరాలలో ఎంత అద్భుతమయిన జీవితం వుంది?

    డబ్బున్న వారికి ఎన్ని సుఖాలు ఎన్ని ఆనందాలు!క్ కోరికలు తీర్చుకునేందుకు ఎన్నెన్ని దారులు. అన్నీ విడిచిపెట్టి ఈ పల్లెలో గ్రామీణ జనాలచేత స్తోత్ర పాఠాలు పాడించుకుంటూ జీవితమంతా గడిపింది తల్లి.

    ఇప్పుడు గాయత్రిని కూడ తనలాగ తయారు చేస్తోంది. నాన్సెన్స్! డబ్బిస్తేనే కదా వీళ్ళంతా పొగుడుతున్నారు! వాళ్ళ కష్టాలన్నీ కావాలని పంచుకుంటేనే కదా స్తోత్ర పాఠాలు పాడుతున్నారు?

    నిజంగా చెప్పాలంటే డబ్బిచ్చి కొనుక్కుంటున్న పొజిషన్ ఇది! ఈ పలుకుబడి ట్రెడిషనల్ అంటుంది అమ్మ! కాని అది వాస్తవం కాదు! అవసరాలు తీర్చుకున్న ఆనందంలో జనాలు చేసే ముఖస్తుతులు ఇవి!

    ఏది ఏమైనా తాను ఈ ఊబిలో దిగకూడదు. దూరంగా ఉండాలి. అక్క దిగుతోంది కదా అంటే అది దాని ఖర్మ!

    అమ్మలాగే జీవితమంతా ఇలా ఆలయాలకి, పంటలకి నీరందించే ప్రణాళికలకి అంకితమయి పోతుంది కాబోలు!

    తను మాత్రం అనుకున్న టార్గెట్ సాధించాలి.

    ఐఎఎస్ చేయటంలో ఎటువంటి పొరపాటు పడకూడదు!

    అదంత సులభం కాదు. కనుక ఆల్టర్ నేట్ గా ఎం.బి. కి మెడికల్ ఎంట్రన్స్ వ్రాసి ప్రయత్నించాలి. ఇలాంటి సమయంలో ఇంకా అయిదారు రోజులు పల్లెల్లో గడపటం వృధా! అయినా తల్లి అజ్ఞమేరకు కట్టుబడిపోయి ఉండాల్సి వచ్చింది. అసహనంగా దిక్కులు చూస్తోంది ఆమని.

    వారితోపాటు వెళ్ళలేదు. ఆ ఊబిలో తలదూర్చలేదు.

    అయినా ప్రతి చిన్న అంశాన్ని తల్లి అక్కతోపాటు తనకి కూడ వివరిస్తూ వుంటే నిరాసక్తిగా ఊకొట్టి తప్పించుకుంటోంది.

    వారు ఒక వీధి మలుపుకు వచ్చారు.

    జీపు రావటం గమనించిన ఆ యింటిలోని వారంతా వెలుపలకు పరుగు తీశారు. రాణి సుమిత్రతోపాటు ఆ ఇద్దరిని లోనికి ఆహ్వానించారు.

    అది ఆ ఊరి కరణంగారి యిల్లు.

    అయితే ప్రస్తుతం ఆయన నిరుద్యోగి- ప్రభుత్వపరంగా! రాణి సుమిత్ర గారి భవంతి అంటే ఒకప్పటి దివాణంలో ఆయన పూర్వులు చేసినట్లే ఆయన కూడ నౌకరీ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ రాయటం, అవసరాన్ని అనుసరించి నగరానికి వెళ్ళి లాయర్లని సంప్రదించటం ఆయన పనులు.

    వారికి సందేహాలు, సాక్ష్యాలు కావాల్సివస్తే దివాణానికి తీసుకువచ్చి సుమిత్రతో మాటాడించటం ఆయన పనే!

    ఆస్థి వివరాలు డబ్బు వాడకం, దాచటం మొదలైన కీలక విషయాలన్నీ ఆయన చేతుల మీదుగానే ఇప్పటికీ జరుగుతున్నాయి. ఏనాడూ పొరపాటు చెయ్యని మనిషి. ప్రతిరోజూ సాయంత్రం వెళ్ళముందుగా రాణి సుమిత్రకి అక్కౌంట్స్ చూపించేందుకు ఒకసారి కలుస్తాడు.

    అతనికి ఆస్థి అంటూ ఏదయినా వుంటే అది దివాణంలో నౌకరీ మాత్రమే. దాంతోనే ఆయన ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశారు. మగపిల్లల ఉద్యోగాలు వేయించారు. నమ్ముకున్న చోటు జీవితావసరాలు అన్నింటిని  తీర్చింది.

    సంవత్సరానికి ఒకసారి ఆ యింటికి వెళ్ళి యిల్లాలితో మాటాడి పరిస్థితులు తెలుసుకుని అవసరమయిన సహాయం అందిస్తుంది సుమిత్ర.

    ఆమె ఎంత చిన్న పని కూడ అది ట్రెడిషన్ లా చేస్తుంది. అలా చేయడం వల్ల ప్రతి చిన్నపనికి ప్రాధాన్యత పెరుగుతుంది.

    అది చేసేవారి విలువ పెరుగుతుంది.

    సుమిత్ర చాలా ఎత్తున కన్పించే కారణం  అదే!

    లింగమూర్తి గారు రాణి గారికి పిల్లలకి మర్యాదలు చేశారు.

    వెంటనే కొబ్బరిబొండాలు దింపించి దాహం అందించారు.

    "అంతా బావున్నారా?" అని ప్రశ్నించింది.

    "అవును అమ్మగారూ! మీదయ ఉన్నంతకాలం మాకేమిటిలోటు!?" అంది లింగమూర్తిగారి ఇల్లాలు కృతజ్ఞత నిండిన కంఠస్వరంతో.

    "అందరికి దయచూపే వాడు ఆ జగదీశ్వరస్వామి" అంటూ ఆలయంవైపు చూపించి చేతులు జోడించింది సుమిత్ర.

    "ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల వేడుకలు మరింత బాగా జరుగుతాయని చెప్పుకుంటున్నారు. గాయత్రి మామిడి గున్నలా పురి విప్పింది. ఎంత అందం వచ్చింది అమ్మగారూ!

    పప్పు అన్నం ఎప్పుడు పెట్టిస్తారు?" అని ప్రశ్నించింది ఇల్లాలు.
 

 Previous Page Next Page