సీతాలుకి మగపిల్లాడు పుట్టాడు, కేరు కేరు మన్నాడు.
అవతల మాధవికి ఫోర్ సెప్స్ వేసి బిడ్డని బయటికి లాగింది డాక్టరు. బిడ్డ కేరుమనలేదు!.... చన్నీళ్ళు కొట్టింది వేణ్ణీళ్ళు తప తప మోదింది. తలక్రిందులు చేసింది బిడ్డని. నోట్లో నోరుపెట్టి వూదింది. ఏం చేసినా బిడ్డ కదలలేదు. డాక్టరు గాభరాగా నర్సువంక చూసింది. ఆవిడ కళ్ళముందు పచ్చనోట్లు కదిలాయి.... నర్సు డాక్టరు వంక, డాక్టరు నర్సువంక చూసుకున్నారు. అవతల సీతాలు కొడుకు కేరుమంటూ నర్సింగుహోము పైకప్పు ఎగరగొడ్తున్నాడు! సీతాలు సొమ్మసిల్లి పడివుంది కళ్ళు మూసుకుని. డాక్టరు ఓక్షణం నుదురు చిట్లించింది. మెదడులో ఆలోచనలు పరుగులుదీశాయి. క్షణంలో ఆవిడ మొహం తిరిగి కళకళలాడింది. ఆవిడ కళ్ళు మిలమిల లాడాయి. నర్సువంక చూసింది. ఆ నర్సుకి డాక్టరుగారి భాష, భావం కళ్ళ భాష ద్వారానే తెలుసుకోవడం అలవాటు కనక ఆవిడ భావం అర్థం అయిపోయింది. తలపంకించింది. పనికి ఉద్యుక్తురాలైంది.
ఫలితం- ఇప్పుడు మాధవి ప్రక్కన బిడ్డ కేరు కేరుమని ఏడవడం ఆరంభించాడు. సీతాలు ప్రక్కన నిల్చున్న నర్సు చాలా కంగారు నటిస్తూ హఠాత్తుగా ఏడుపు మానేసిన సీతాలు కొడుకుని ఏడ్పించే ప్రయత్నాలు అన్నీ చేస్తూంది. నర్సువల్ల ఆ ప్రయత్నం సాగక డాక్టరు స్వయంగా సీతాలు కొడుకుని ఏడ్పించడానికి ప్రయత్నాలు చేస్తూంది. హఠాత్తుగా ఆగిపోయిన కొడుకు ఏడుపు, డాక్టర్లు నర్సుల హడావిడి ఏమిటో అర్థంకాక సీతాలు కళ్ళు విప్పి అయోమయంగా చూసింది. ఐదు నిమిషాలు అన్ని ప్రయత్నాలు ప్చ్ లాభంలేదు. బిడ్డ పుట్టినప్పుడు బాగానే పుట్టాడు యింతలో ఇలా అవుతుందనుకోలేదు. ఎంత కావాలి చంటి గ్రుడ్డు ప్రాణానికి" అంటూ విచారంగా సీతాలువంక చూసింది. జరిగింది ఏమిటో అర్ధంగాక కాసేపు వెర్రిదానిలా చూసి, అర్థం అయ్యాక భోరుమంది సీతాలు. అవతల కబురు తెలిసిన రంగయ్య గుండె బద్దలయింది. "నీ అదృష్టం ఈసారి బాగులేదు రంగయ్యా, నేనేం చెయ్యగలను చెప్పు నా చేతిలో ఏముంది! నా చేతనయినంత చేశాను." అంటూ సానుభూతి పలికింది సరోజిని.
ఆ తర్వాత___ క్షణం సంతోషపు ముసుగు తగిలించుకుని వసారాకి యిటు నడిచింది___ మాధవి తల్లిదండ్రులున్న చోటికి.
"కంగ్రాచ్యులేషన్స్ మీకు మనుమడు పుట్టాడు. తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారు." అంది.
ఆ మొఖాలు వికసించలేదు. ఆనందంతో తన చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పుకోలేదు. మొదటిసారి మనవడు పుట్టినందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కాలేదు. ఆ వార్త విని ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. డబ్బు తప్ప మరేమీ కంటికి ఆనని సరోజిని దృష్టికి ఆ రోజు మాధవి తల్లిదండ్రుల మొహాలు వింతగా కన్పించాయి. ఆనందం స్థానే ఆందోళన,గర్వం స్థానే గాభరా వాళ్ళ మొహాల్లో కనపడటం వింతగా చూసింది సరోజిని.
ఆయన కాస్త గాభరాగా, హడావిడిగా డాక్టరుని చూసి డాక్టరుగారూ మీతో చిన్న విషయం మాట్లాడాలి అన్నాడు గొంతు తగ్గించి. సరోజిని కాస్త ఆశ్చర్యపోతూనే "చెప్పండి" అంది.
"ఆహా.... ఇక్కడకాదు. అలారండి" అంటూ ఆవిడ గదిలోకి దారి తీశాడు. అక్కడ ఆయన గుటకలు మింగుతూ, నీళ్ళు నములుతూ, గాభరా పడుతూ వణుకుతున్న గొంతుతో ఆయన చెప్పిన మాటలు విన్న సరోజినీదేవి నిశ్చేష్టురాలయింది. ఆమె నోట మాట రానంతగా దిమ్మెరపోయింది కొన్ని క్షణాలు.ఆ కొన్ని క్షణాలు గడిచాక ఆవిడ మొహంలోకి రక్తం ఒకసారిగా పొంగింది. ఆ క్షణంలో ఆవిడ మనోభావాన్ని చెప్పగలిగే మాటలేదు.
ఆఖరికి నోట్లోనుంచి మాటలు పెగల్చుకుని, తీక్షణంగా చూస్తూ "ఈ సంగతి ముందుగా నాతో ఎందుకు చెప్పలేదు...." అనిమాత్రం అనగలిగింది.
ఆయన చేతులు నలుపుకుంటూ "ఎలా చెప్పడం....ఏమని చెప్పడం ఎలా చెప్పగలం? సరే కాన్పు అయ్యాక చెప్పొచ్చు అనుకున్నాం.... ఈ సంగతి మరో మనిషికి తెలియకుండా వుంచడం మీ చేతుల్లో వుంది. డాక్టర్! మా పరువు ప్రతిష్టలు మీ చేతుల్లో వున్నాయి. ఆ పరువు కాపాడుకోటం కోసమే అమ్మాయిని తీసుకుని ఇక్కడికి ఈ కొత్త వూరు వచ్చి ఈ వూరుకాని ఊరులో హోటల్లో రెండు నెలలనుంచీ అమ్మాయిని పెట్టుకుని వున్నాం.అమ్మాయి ఇలాంటి వెధవపని చేసిందని ముందుగా మాకు ఏమాత్రం తెల్సినా ఏదో చేసేవారం! ఐదు నెలలు నిండేవరకు మేమూ కనిపెట్టలేదు.అమ్మాయీ చెప్పలేదు. అప్పుడింక ఏం చెయ్యలేక, ఏడో నెల రాగానే ఆ ఊరునించి ఇక్కడకొచ్చి మకాం పెట్టాం. ఈ కాన్పు అయితే ఆ పిల్లాడిని ఏ అనాధ శరణాలయంలోనో ఇచ్చేసి అమ్మాయిని తీసికెళ్ళిపోవాలని మా వుద్దేశ్యం. డాక్టర్! అమ్మాయికి ఇంకా తెలివి రాలేదుగదా! అమ్మాయికి తెలివి రాగానే పిల్లాడు పుట్టి పోయాడని చెప్పండి. నేనా పిల్లాడిని తీసికెడతాను. ఈ సంగతి దానికి తెలిస్తే అది భవిష్యత్తులో నిశ్చింతగా వుండలేదు. డాక్టర్ ఈ విషయం అమ్మాయికి చెప్పొద్దు..... డాక్టర్, ఈ రహస్యం దాచినందుకు మీకు తృప్తి కలిగిస్తాను.... డాక్టర్, పిల్లాడిని తెప్పిస్తారా, దానికి తెలివి వచ్చేలోగానే వదిలించుకుని వస్తాను." ఆయన హడావిడిగా డాక్టర్ మొహంలో మారుతున్న రంగులని చూడకుండానే చెప్పాడు.
డాక్టర్ కి ఆ మాటలు తలకెక్కడంలేదు. ఆవిడకా క్షణాన్న హృదయ విదారకంగా ఏడుస్తున్న సీతాలు, పెళ్ళాం గుండెల్లో మొహం దాచుకుని ఆడదానిలా ఏడుస్తున్న రంగయ్య, మాధవి ప్రక్కన ఉయ్యాలలోని పసికందు మాత్రం కనిపిస్తున్నారు. ఆవిడ- డాక్టర్ సరోజిని కోపాన్ని ఎంతో నేర్పుతో పైకి కన్పించకుండా వుంచుకోవడం ఎంతో ప్రాక్టీసువున్న ఆమె అప్పుడు కోపాన్ని కంట్రోలు చేసుకోలేకపోయింది. "ఈ సంగతి ముందుగా నాకెందుకు చెప్పలేదు." అన్న ప్రశ్నే మరోసారి కోపంతో, తీక్షణంగా అడిగింది.
ఆ సంగతి ముందు చెప్పకపోవడంవల్ల ఆ డాక్టర్ కి ఏం నష్టమో ఆ సంగతి ఆవిడకి ముందు ఎందుకు చెప్పాలో... చెప్పకపోయినందున ఆవిడకి జరిగిన అనర్ధం ఏమిటో అన్నట్లు వింతగా_ ఎర్రబడిపోయిన డాక్టర్ మొహంలోకి చూశాడు. డాక్టర్ కి ఇందులో ఇంత కోపం రావల్సిది ఏముందో అంతుబట్టలేదు ఆయనకి.
ఆయన ముందుగా ఆ సంగతి చెప్పనందున జరిగిన అనర్థం తెలుసుకున్న డాక్టర్ సరోజినీదేవి హృదయం ప్రాక్టీసు పెట్టాక మొదటిసారిగా "మనీ" క్రిందనించి నిద్రలేచింది. సీతాలు, రంగయ్యని చూస్తున్న సరోజినీదేవి కళ్ళకి పల్చటి నీటి తెర వచ్చి అడ్డు నిల్చింది.
(1972 దీపావళి కథల పోటీలో ఆంధ్రజ్యోతి వారపత్రిక బహుమతి పొందినది)
* * * *