Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 4


                                ఒక రాత్రి

గగనమంతా నిండి, పొగలారు క్రమ్మి -
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
ఆకాశపు టెడారి నంతటా, అకట!
ఈ రేయి రేగింది ఇసుక తుపాను!
గాలిలో కనరాని గడుసు దయ్యాలు
భూ దివమ్ములమధ్య ఈదుతున్నాయి!
నోరెత్తి, హోరెత్తి నొగులు సాగరము!
కరి కళేబరములా కదలదు కొండ!
ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి!
విశ్వమంతా నిండి, వెలిబూదివోలె-
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!

                                                                               12-8-1933

                                                        *  *  *

 Previous Page Next Page