Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 4


    ఈ నీళ్ళు నమలడం లేకుండా
    ఈ కాళ్ళు తడబడడం లేకుండా
    స్పష్టంగానే కాకుండా శ్రావ్యంగా
    స్వచ్చంగానే కాకుండా సమగ్రంగా
    రాబోయే యుగంలో
    గుండెలు విప్పి మాటాడుకుందాం-
    మినహాయింపులు లేని క్షమాపణలు లేని
    సౌందర్యవంతమైన ఆ స్వర్ణయుగంలో

 

        ఎంచేతనంటే భవిష్యత్తుమీదే
        ఎప్పుడూ నా నిఘా వుంటుంది
        ఇవాళకంటే రేపే
        ఎంతో బాగుంటుందంటాను నేను.

 

    వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
    కవులను కదిలించడం అంటే
    కాలం డొంకంతా అమాంతంగా
    కదిలించడమే అవుతుంది.

 

    స్వయంగా నీతో మాట్లాడి
    చాలా కాలమయింది
    అందుకే అవ్యక్తంగా అయినా
    ఆప్యాయంగా మాట్లాడుతున్నాం.

 

        ఎలాగైనా నువ్వు మాకు
        ఏకరక్త బంధువుడివి
        నీతో కాకపోతే ఎవరితో
        మా ఘోషలు చెప్పుకోవాలి?

 

    వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
    వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ
    మనోహరమైన సంగీతం వినిపిస్తూ
    ప్రయాణించు శశీ ప్రయాణించు.    

 

        ఇదిగో మాట! ఈ ప్రపంచంలో
        ఇంకా ఎందరో అభాగ్యులున్నారు
        పలకరించు వాళ్ళని చల్లగా
        ధైర్యంచెప్పు వాళ్ళకి మెల్లిగా

 

    ఆసుపత్రి కిటికీల్లోంచి నీ
    కిరణాలను జాలుగా పంపించి
    వ్యాధిగ్రస్తుల పాలిపోయిన కపోలాలను
    జాలిగా స్పృశించడం మరిచిపోకు.

 

        జైళ్ళలో వున్నారు కొందరు
        వాళ్ళని ఓదార్పక తప్పదు సుమా
        నేరాలు చేశారు నిజమే
        అందుకని అలక్ష్యంగా చూడకేం!

 

    మురికి గుడిసెల్లో నివసించే
    పరమ దరిద్రుల నుదుటి మీద
    ఏ కన్నంలోంచో జాగా చేసుకొని
    ఎలాగైనా పరామర్శ చేస్తావు కదూ?

 

        ఇదిగో జాబిల్లీ నువ్వు
        సముద్రంమీద సంతకం చేసేటప్పుడు
        గాలి దాన్ని చెరిపెయ్యకుండా
        కాలమే కాపలా కాస్తుందిలే.

                                                                    _ కృష్ణా పత్రిక - 23.10.1954

 Previous Page Next Page