Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 4


    అప్పుడప్పుడు క్రీస్టినీ అంటుండేది-

 

    "బ్రదర్... నీ ఆలోచనలు మూగవైనా నష్టం లేదు కాని అభిమానం, ఆరాధన మూగవి కారాదు! అవి బయటపడవలసిన సమయానికి బయట పెట్టవలసిన వ్యక్తి ముందు ఎక్స్ పోజ్ చెయ్యలేకుంటే చాలా విలువైన వాటిని, వ్యక్తుల్ని కోల్పోతావ్ సుమా!"

 

    అయినా అతను గంభీరంగా తలూపేవాడే తప్ప నోరు తెరిచేవాడు కాదు.

 

    ఆ ముగ్గురికి తెలుసు- రాబర్ట్ అప్పుడేం మాట్లాడాలనుకుంటున్నాడో!

 

    అందుకే క్రీస్టినీ, మాంటే ఏదో సాకుతో అక్కడినుండి తప్పుకున్నారు.

 

    ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది.

 

    అతనేదో మాట్లాడాలనే ఉద్వేగానికి గురవుతున్నట్లు నాయకి ఊహించగలిగింది.

 

    ఆమెకు తెలుసు... అతనెంతసేపటికీ అలా టెన్షన్ ఫీలవుతాడే తప్ప ఏమీ చెప్పుకోలేడని.

 

    అందుకే తనే మాట్లాడాలనుకుంది.

 

    "ఐ నో...వాట్ యూ ఫీల్ మిస్టర్ రాబర్ట్... బట్... మీరంటే నాకిష్టమే. మీ మేధస్సంటే మరీ ఇష్టం. బట్ ఇష్టం ప్రేమగా మారనక్కర్లేదేమో..."

 

    అతను దెబ్బతిన్నట్లుగా చూశాడు.

 

    "కంట్రోల్ యువర్ సెల్ఫ్... ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకూ బాధగానే వుంది. బట్ నేను నాకోసం బ్రతకటానికే ప్రాముఖ్యత ఇస్తాను. ఎవర్నయినా, దేన్నయినా నాకు నచ్చితేనే స్వీకరిస్తాను. చాలామంది అంటుంటారు నీవు ప్రేమించే వ్యక్తి కన్నా నిన్ను ప్రేమించే వ్యక్తి మూలంగా సుఖపడతావని. బట్ ఐ డోంట్ ఎగ్రీ వితిట్... నాకు నేను ప్రేమించే వ్యక్తి కావాలి. అయినా నా లైఫ్ లో ప్రేమించటం, ప్రేమించే పెళ్ళి చేసుకోవటమనేదే వుండకపోవచ్చు. నాకో సైకాలజికల్ యాంకర్ మా నాయనమ్మ... అలాగే మా నాయనమ్మకు కూడా నేనో సైకలాజికల్ యాంకర్" అలా రాబర్ట్ తో చెప్పవలసి వచ్చినందుకు ఆమె మధనపడుతూనే వుంది.

 

    అతను జీవితంలో ఆఖరిసారిగా దెబ్బతిన్నాడు.

 

    అతనికి అంతకుముందే తెలుసు- నాయకి తనకు ఎప్పటికీ లైఫ్ పార్టనర్ కాదని.

 

    తెలిసినా అర్థం లేని ఆశ అతన్ని అప్పటివరకూ వెంటాడుతూనే వుంది.

 

    ఆమె నుంచి అలాంటి సమాధానమే ఎదుర్కోవలసి వస్తుందని మానసికంగా ఎప్పటినుంచో ఆశించాడు గనుక షాక్ అవ్వలేదు. కాని ఆఖరి నిర్ణయం జరిగిపోయిందని తెల్సుకున్నాడు.

 

    "నాకు నా దేశమన్నా, నా జాతి అన్నా చాలా ఇష్టం. అలా అని బ్రాడ్ అవుట్ లుక్ లేదని, నేరోమైండ్ అని, అర్థంలేని ఆచరణకందని సిద్ధాంతాల గురించి అరిచేవాళ్ళను నేనసలు పట్టించుకోను. అందరూ... ప్రపంచమంతా ఒక్కటే- ప్రపంచ ప్రజలంతా ఒకేజాతి అనే ఉద్యమం మొదలైనప్పుడు నేనే ముందుంటాను. అప్పటివరకు ఏ ఇతరదేశాన్ని, జాతిని ద్వేషించకుండా, గౌరవిస్తూ నాదేశాన్ని, నాజాతిని ప్రేమిస్తాను కనుకే ఒక తెలుగువాడ్ని, మా నాయనమ్మ సెటిల్ చేసిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంటాను"

 

    అతనోక్షణం ఆమెకేసి ఆరాధనగా చూశాడు.

 

    ఆ తరువాత ప్రశంసగా చూశాడు.

 

    "అందుకే... మీరంటే ఇష్టం, గౌరవం నాకు... మీ వ్యక్తిత్వమంటే అనంతమయిన గౌరవం... ఆరాధనతో కూడిన గగుర్పాటు"

 

    అతను లేచి కౌంటర్ దగ్గరకు వెళ్ళి రెండు లెమన్ జ్యూస్ టిన్స్ పట్టుకొచ్చి ఒకటి ఆమెకు అందించాడు. "ఐ లైక్ లెమన్ జ్యూస్... యూనో నిమ్మకాయను పిండేకొద్దీ చేదు ఎక్కువవుతుంది. అలా నాకిష్టముండదు. అందుకే ఈ టాపిక్ ఇక వదిలేద్దాం. మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను - జీవితం చివరివరకు మీరు మీలాగే బ్రతకాలి" జ్యూస్ ని సిప్ చేస్తూ చిన్నగా అన్నాడు.  

 

    ఆమె గుండెనిండా ఊపిరి తీసుకుంది.

 

    అంత తేలిగ్గా ఆ సమస్య పరిష్కారమైనందుకు ఆమెకి సంతోషంగా అనిపించింది.

 

    "బట్... మీకు ఆప్తుడు, అత్యంత ఆత్మీయుడు, మిత్రుడు రాబర్ట్ ఈ మిచిగాన్ ఆటోమొబైల్ యంత్రాల మధ్య పరిశోధనలో వున్నా మీ క్షేమాన్నే కాంక్షిస్తాడని మరువవద్దు" అతని కళ్ళలో తడి...

 

    అతని కళ్ళను చూసి ఆమె కళ్ళు తడిదేరాయి.

 

    కృతజ్ఞతగా అతనివేపు చూస్తూ "నా ఆఖరి శ్వాసవరకు మిమ్మల్ని మర్చిపోను రాబర్ట్. మీ విశిష్టమైన వ్యక్తిత్వానికి నా జోహార్లు. మ్యేరేజ్ ఈజ్ ఏ గేంబ్లింగ్. మ్యారేజ్ పెద్ద రిస్క్ అని తెలిసికూడా ముక్కూ మొహం తెలీని వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతున్నానే - దటీజ్ మై సెంటిమెంటల్ యాంకర్. అన్నీ తెలిసిన, అన్నిరకాల అర్హులైన మిమ్మల్ని వదులుకుంటున్నాను. ఇవన్నీ మనిషి జీవితానికి లంగర్లే. ఏ లంగరు ఏ నడి సంద్రంలో ఎక్కడ పడిపోతుందో తెలీదు. బట్.. తప్పదు. ఏది ఏమైనా మీరు నాజీవితంలో ఒక మరుపురాని, అద్భుతమైన వ్యక్తిగా మిగిలిపోతారు" అవన్నీ అతనికి బాగానే అర్ధమయ్యాయి.

 

    "ఎప్పుడు ప్రయాణం?" అతను మామూలుగా అయ్యాడు.

 

    "రేపు మార్నింగ్... మిచిగాన్ టూ న్యూయార్క్... న్యూయార్క్ టూ ఢిల్లీ"

 

    "రేపు సెండాఫ్ ఇవ్వటానికొస్తాను"

 

    "థాంక్యూ" అందామె అభిమానంగా. అతను లేచాడు- లేచి ఆమెకేసి చూసాడు. అతని చూపుల్లోని ఓ ఆత్మీయతా భావం ఆమెను కదిలించింది.

 

    ఆమె వెంటనే తన కుడిచేతిని అతనివేపుకు చాపింది.

 

    అతను కృతజ్ఞతగా చూస్తూ ఆమెచేతిని తన కుడిచేతిలోకి తీసుకొని సున్నితంగా ముద్దు పెట్టుకొని జీవితంలో ఒక అపురూపమైన దాన్ని కోల్పోతున్నట్లు చూస్తూ ఆమె చేతిని వదిలేశాడు.

 

    అమెరికాలో ఆత్మీయుల్ని కలుసుకున్నప్పుడు, వదిలి వెళ్ళేప్పుడు చెక్కిలి మీద ముద్దు పెట్టుకోవటం వాళ్ళకు చాలా ఇష్టమైన చర్య.

 

    అది ఆ ఇద్దరికీ తెలుసు.

 

    అయినా అతను ఆమె కుడిచేతి వేపే చూశాడు. ఆమెకు చెక్కిలి మీద ముద్దు తీసుకోవడం ఇష్టముండదని గతంలో తెలిసుండడంతో అలా చేశాడు. అది అతడి సంస్కారం.

 

    ఇద్దరూ ఆఖరిసారిగా చూసుకుంటున్నట్టు చూసుకొని, ఆ బాధను తట్టుకోలేక, చప్పున చూపుల్ని క్రిందకు మరల్చుకున్నారు.


                               *    *    *    *


    షేర్ - ఇ - కాశ్మీర్.

 

    ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్.

 

    ఆసియా ఖండంలోనే ఫైనెస్ట్ గోల్ఫ్ సెంటర్...

 

    కాశ్మీర్ కే గుండెకాయలా వుంటుంది.

 

    ప్రపంచ ప్రఖ్యాత గోల్ఫ్ కేఫ్ స్పెషలిస్టు రాబర్ట్ ట్రెండ్ జోన్స్ ప్రత్యేక శ్రద్ధతో తయారుచేసిన గోల్ఫ్ కోర్స్ అది.

 

    ఇప్పుడక్కడ పొద్దు ఏటవాలుతోంది.

 

    ఆఖరిబాల్ ని శక్తి కొద్దీ గట్టిగాకొట్టి, స్టిక్ పక్కనే వున్నా బాయ్ కి అందించాడు అర్జునరావు.

 Previous Page Next Page