"ఏమ్మా... తలదించుకుంటున్నావు... నన్ను చూసి సిగ్గుపడుతున్నావా?"
బదులు పలకలేదతను.
"తార పాత్ర అంటే నాకు ఇష్టం" మెడకింద పౌండర్ రుద్దుకుంటూ రజని అన్నది.
అయినా రవితేజ పలకలేదు.
"ఇందాకటి నుంచీ వసపోసిన పిట్టలా నేను వాగుతూనే ఉన్నాను. మీరు ఒక్క మాటకు సమాధానం చెప్పడం లేదు..." నిలువుటడ్డం ముందుకు వచ్చి తన శరీరాన్ని తనవితీరా చూసుకుంటూ అంది రజని.
అప్పటికీ అతనిలో చలనం లేదు.
అతని వేపు వింతగా... విచిత్రంగా చూసింది రజని.
ఏమిటీ వింత మనిషి?
ఎదురుగా అందాలరాశి ఉన్నా మునీశ్వరునిలా ఏమీ పట్టనట్టు మౌనంగా కూర్చున్నాడేంటి?
తను అందగత్తె కాదా? లేక అతనిని చలింపజేసేంతటి అందం తనలో లేదా?అని తనకు తను ఒకసారి నఖశిఖ పర్యంతం చూసుకుని గర్వంతో పొంగిపోయింది.
ఎలాగయినా రవితేజలో చలనం తీసుకురావాలి...
ఏం చేయాలో క్షణాల మీద ఆలోచించి... తన ఆలోచనను రజని అమలులో పెట్టింది.
తార పాత్రకు అవసరమైన బ్లౌజ్ తొడుక్కుని వెనక వైపున ఉన్న హుక్స్ పెట్టుకునే ప్రయత్నం చేసింది.
ఆమె చేతికి అందడం లేదు.
ప్లీజ్ హెల్స్ మీ..." రజని అతనని సమీపించింది.
ఆమె ఒంటికి బ్లౌజ్ మరింత టైట్ గా కనిపిస్తుంది. ఎద పొంగులు స్పష్టంగా తొంగి చూస్తున్నాయి....
రవితేజలో సంశయం తొంగి చూసింది.
అతనిలో సన్నగా వణుకు... ఆ ప్రయత్నంగానే అతని చేతివేళ్ళు రజని శరీరాన్ని తాకాయి.
ఎలాంటి భావమూ లేకుండా గంభీరంగా ఉన్నాడతను.
రవితేజ నింపాదిగా హుక్స్ పెట్టాడు.
ఇప్పుడు... రజని తార గెటప్ లో సిద్దంగా వుంది.
ఏక పాత్రాభినయం ప్రారంభం అయింది.
తార స్టేజీ మీదకు రాగానే విజిల్స్... కేరింతలు... అరుపులు... చప్పట్లు... ఆమె అందాన్ని చిలిపి జోక్ లతో వర్ణిస్తున్నారు.
చంద్రుని కౌగిలిలోని తార ఇబ్బందిగా కదులుతున్నట్టు అభినయిస్తుంది. అక్కడ పురుషుడు లేడు... స్త్రీ మాత్రమే వుంది.
అయినప్పటికీ తను చంద్రుని కౌగిలిలోనే ఉన్నట్టు నాటన అమోఘంగా వుంది.
కౌగిలిలోని తారను చంద్రుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దృశ్యం.. ఆ రసరమ్య సన్నివేశం అద్బుతంగా సాగిపోతుంది.
చంద్రుని ముందు తార సిగ్గులమొగ్గ అయిపోవడం ప్రేమ సన్నివేశానికి పరాకాష్ట అయింది.
ఆ అభినయం అందరికీ నచ్చినట్టు ఆడియన్స్ లో కోలాహాలం...
న్యాయ నిర్ణేతలు తార పాత్రధారణి రజనీకి ప్రధమ బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
బహుమతిని అందుకుంటున్న ఆమె కళ్ళు తనకు కావలసిన ఆ వ్యక్తి కోసం వెదికాయి...
అతను ఎక్కడా కనిపించలేదు...
అంతవరకూ ఆమెను ఆవరించి వున్న సంతోషం కాస్తా చప్పున చల్లారిపోయింది. అక్కడ రవితేజ లేకపోవడంతో రజని నిరుత్సాహంతో స్టేజీ దిగి వెళ్ళిపోయింది.
చేతిలో మెమెంటో వున్నా ఆ ఉత్సాహం ఆమెలో కనిపించడం లేదు...
ఘోర ఫరాజయం పొందినట్టు.. జీవితంలో విలువైంది ఏదో కోల్పోతున్న భావన ఆమె ముఖంలో స్పష్టంగా కన్పిస్తుంది!
* * * *
'ఇన్ స్పెక్టర్ చతుర్వేది మరణం. యాక్సిడెంటా లేక ఎవరైనా ప్లాన్ ప్రకారం అతనని ఫినిష్ చేశారా?"
ఏసిపి వీరేష్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు...
దొంగ నోట్ల ముఠాకు చెందిన ఇన్ ఫర్మేషన్ ఏదో చతుర్వేదికి లభించి వుండాలి.
ఎందుకంటే అతను చాలాకాలం నుంచీ ఆ ముఠాకు చెందిన వివరాల కోసం ఇన్ వెస్టిగేట్ చేస్తున్న విషయం డి జి పి యే స్వయంగా అతనితో చెప్పాడు.
ఆఖరిసారి అతనని ప్రాణాలతో చూసింది. నారాయణ గూడా స్టేషన్ లోని సిబ్బంది అని తెలియడం తో వాళ్ళవల్ల ఏమయినా ఆధారాలు లభిస్తాయేమోనని అటుకేసి బయలుదేరాడు.
వీరేష్ వెళ్ళేసరికి ఆ రోజు చతుర్వేదిని చూసిన సెంట్రీయే డ్యూటీలో ఉన్నాడు.
"చతుర్వేది జీప్ లో రాలేదా?"
"ఎస్ సర్... జీప్ లోనే వచ్చారు"
"ఆర్ యూ ష్యూర్..."
"ఎస్ సర్! ఆయనే స్వయంగా డ్రయివ్ చేసుకుంటూ వచ్చారు" అన్నాడు సెంట్రీ.
"ఎటు వెళ్ళారో గమనించావా?"
"నారాయణగూడా వేపు వెళ్ళారు సర్"
వీరేష్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు.
షెడ్ లోపల సీజ్ చేసి ఉన్న చతుర్వేదీ వెహికల్ ను క్షుణ్నంగా పరిశీలించాడతను. అక్కడ ఉన్న రికార్డ్ లో పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ దగ్గర్లోనే అతని జిప్సీ ఆగి వుందని తెలిసింది.
వెహికల్ దిగి కింద నిలబడి ఉన్న సమయంలో ఏదో లారీ వచ్చి గుద్దిందనీ... కాళ్ళవద్దనుండి తలవరకూ లారీ టైర్లక్రింద పడడం వల్ల అతని శరీరం నజ్జు నజ్జుగా మారిపోయి ఉందని ఫైలులో వ్రాయబడి వుంది.
అసలు అది ఎంతవరకు సమంజసం...!
ఒక పోలీస్ ఆఫీసర్ అంత అజాగ్రత్తగా ఎందుకుంటాడు!
నిజంగా లారేయే గుద్దినట్టయితే అక్కడ ఆ లారీ ఉండాలి కదా. యాక్సిడెంట్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని ఎస్కేప్ అయిందని అనుకోవడానికి ఎందుకనో మనస్కరించడంలేదు అతనికి...
ఈ కేసులో ఎక్కడో లూప్ హోల్ వుందనిపిస్తుంది.
కానీ, ఆ లింక్ ఏమిటో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు అతనికి.
జిప్సీ ని ఎంత శోధించినా ఏమీ దొరకడంలేదు. ఆయిల్ ఎంత వుందో చూశాడు. పుల్ టాంక్ లో బహుశా ఐదులీటర్లుర్ల మాత్రం ఖర్చు అయి వుంటుందని ఆయిల్ డెప్తుని బట్టి ఊహించాడు. మీటర్ రీడింగ్ కూడా ఎందుకయినా మంచదని నోట్ చేసుకున్నాడు.
చనిపోబోయే ముందు చతుర్వేదీ ఎక్కడ తిరిగిందీ తెలియాలంటే ముందు ఆయిల్ ఎంత కొట్టించిందీ తెలియాలి. అందుకే ఆయిల్ ఫీలింగ్ స్టేషన్ కు వెళ్ళి వెరిఫై చేశాడు. పుల్ టాంక్ నింపినట్టు అప్పటి తేదీ, సమయం కూడా వేసి ఉండడంతో అతని భృకుతి ముడిపడింది.
చతుర్వేది ప్రాణాలు పోయింది రాత్రి పదిగంటల సమయంలో... తొమ్మిది గంటలప్పుడు నారాయణగూడా స్టేషన్ ముందునుంచి వెళ్ళాడు. అంటే మధ్యనున్న గంట ప్రాంతంలోనే హత్య జరిగి ఉండాలి.