ఎడమప్రక్క క్రింది భాగం:-
కవర్ కి ఎడమపక్క పైబాగంలో బాగా ఖాళీ వదిలి క్రింద ఒక మూలగా (సాధారణంగా ఫ్రం అడ్రస్ వ్రాసేచోట) అడ్రస్ వ్రాసేవారు అసూయ, కోపం అనుమానం పాలు ఎక్కువగా వున్నవారై వుంటారు. వీరు ఇంట్రావర్ట్ లైవుంటారు. అవతలవాళ్లు తమ గురించి ఏ మనుకుంటున్నారనే భయం కలిగి వుంటారు. అయితే, వీరిలో మృదుస్వభావం, అవతలవాళ్లని అర్దం చేసుకునే గుణం వుండటం వల్ల వీరితో స్నేహం చేసేవారు నెమ్మదిగా వీళ్లని గుర్తించగలుగుతారు.
కుడిప్రక్క క్రింది భాగం:
స్టాంపుకి క్రింది భాగంలో కవర్ కి కుడి పక్క మూలగా చిన్న అక్షరాలతో అడ్రస్ వ్రాసేవారు మెటీరియలిస్టులు. వీరు స్వేచ్చని విపరీతంగా కోరుకుంటారు. అయితే, వీరికి ఏ విషయంలోనూ ప్రత్యేకమైన అభిప్రాయం వుండదు. ట్రెయిన్ సాయంత్రం అయిదు గంటలకైతే, అయిదుగంటల రెండు నిమిషాలకి స్టేషన్ కు చేరుకుని వెళ్తున్న ట్రెయిన్ ఆఖరి కంపార్ట్ మెంట్ లోకి వురికి దూకటం వీరి నైజానికి మంచి ఉదాహరణ.
పైనుంచి క్రిందికి వ్రాసేవారు:
కవర్ యొక్క ఎడమ భాగం పై చివర్లో మొదటి అక్షరం ప్రారంభించి కవర్ క్రింది భాగం చివర్లో చివరి అక్షరం వ్రాసి అడ్రస్ పూర్తి చేసేవారు సుపీరియారిటీ కాంప్లెక్స్ గానీ లేదా మితిమీరిన ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల తాము సుపీరియర్ అని నిరూపించుకోవాలనే గుణం కగిలినవారై వుంటారు. వీరికి ఎదుటివారి పట్ల, కోపం అసూయలు ఎక్కువ.
పేరు, ఊరిపేరు క్రింద గీతలు గీసేవాళ్లు :
వీరు వినమ్రులు హోదా, పేరుకీ పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకుండా అవతలవాళ్లని గుర్తించటంలో సంతృప్తి పొందుతుంటారు. మంచివ్యక్తిత్వానికి వీళ్లని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే, కంపార్ట్ మెంట్ నుంచి దిగేటప్పుడు ట్రెయిన్ ల పరిచయమైన వ్యక్తి సూట్ కేస్ ను కూడా బైట వరకూ తీసుకొచ్చి అవతల వ్యక్తి చేత మంచి అనిపించుకోవాలనే గుణం కలిగి వుంటారు.
ఒత్తులు, కామాలు, పుల్ స్టాఫ్ లు, పేరాగ్రాఫ్ లు:
చేతి వ్రాతలో ఎక్కువ ఆశ్చర్యర్దకాలుగానీ ఎక్కువ చుక్కలుగానీ, చిన్నగీతలు (-) గానీ ఎక్కువగా వుంటే అది మనిషి ఆడంబరాన్ని సూచిస్తుంది. తను చెప్పదల్చుకున్న విషయం కన్నా, ఆ విషయంలో అవతలవాళ్లని కన్విన్స్ చెయ్యగలుగుతున్నామా లేదా అనే సంశయ భావాన్ని ఇది సూచిస్తుంది.
ఉత్తరాలు వ్రాసేటప్పుడు గానీ, ఏదైనా వ్యాసం వ్రాసేటప్పుడు గానీ ఒక వ్యక్తి ఎక్కువ పేరాగ్రాఫ్ లు వ్రాస్తే అది మనిషి సెంటిమెంటల్ మనస్తత్వాన్ని సూచిస్తుంది. ప్రతినాలుగైదు పదాలు తర్వాత ఒక కామాపెట్టటం లేదా చిన్నగీత గీయటం ఆ వ్యక్తి యొక్క సంక్లిష్టతని సూచిస్తుంది. తన మీదతనకి నమ్మకం లేక పోవటాన్ని కూడా ఇది సూచిస్తుంది.
కొంత మంది రచయితల రచనలలో ఎక్కువ ఆశ్చర్యార్దకాలని చూస్తుంటాం. ఇది సాధారణ జీవితం నుంచి పైకి వచ్చిన స్వభావాన్ని సూచిస్తుంది. జీవితం అంతా ఎక్సయిటింగ్ గా వున్నవాళ్లు లేదా అసలు తాము ఊహించని స్థాయికి చేరుకున్నావాళ్లు ఇలాంటి ఆశ్చర్యార్దకాలని ఎక్కువ పెడుతుంటారని గ్రాఫాలజిస్టులు భావిస్తారు.
అక్షరం క్రింద ఒత్తు వ్రాయకుండా, అక్షరం పక్కని గానీ క్రింద నుంచి పక్కకి గానీ ఒత్తులు వ్రాసే వారు తేలిక జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవాళ్లైవుంటారు.
అంకెలు:
ఈ క్రింద ఒక చార్ట్ ఇవ్వటం జరిగింది. మీరు అంకెలన్నీ ఆ విధంగానే వ్రాస్తూవుండక పోవచ్చు. కానీ, ఒకటి నుంచి సున్న వరకూ మీరు వ్రాసే వీలైనన్ని అంకెలు ఈ క్రింది చార్ట్ లో దేనికి సరిపోతాయో గుర్తించండి. దానిబట్టి మీ యొక్క మనస్తత్వం క్రింద వివరించటం జరిగింది.