Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 39


    అంతా చీకటి.....

 

    కుడివేపు నుంచి కేకలు వేసుకుంటూ పరుగెత్తుకొస్తున్న పల్లెజనాన్ని చూసి ఎడంవేపు మట్టిరోడ్డుమీద చీకట్లో పరుగెత్తడం ప్రారంభించాడు అతను.

 

    ఒక ఆకారం శివరాణి ఇంట్లోంచి బయటకు పరుగెత్తి పోతుండడంతో చూసిన పల్లె జనం డేవిడ్ వెనక పరుగుతీశారు.

 

    "పట్టుకోండి... దొంగ... దొంగ..."

 

    దూరంనుంచి పరుగెత్తుకొస్తున్న జనం... వాళ్ళముందు పరిగెత్తుకుంటూ వస్తున్న ఇన్ స్పెక్టర్ని చూడగానే పరిస్థితిని అర్ధం చేసుకొన్నా డ్రయివర్ రాములు... జీపుని సిద్ధం చేసి రెడీగా వుంచాడు.

 

    పరుగున వచ్చి ఇన్స్ పెక్టర్ డేవిడ్ జీపెక్కడం... జీపు స్టార్ట్ కావడము... అక్కడనుంచి ఎనభైమైళ్ళ వేగంతో ముందుకి దూసుకుపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.

 

    డేవిడ్ కి అప్పటికి పూర్తిగా నిషా తగ్గిపోయింది.

 

    జీపు అరమైలు దూరం వెళ్ళిపోయాక అడిగాడు డ్రయివర్ రాములు...

 

    "ఏమైంది సార్?" అని.

 

    అతను మాట్లాడలేదు. సిగరెట్ మీద సిగరెట్ వెలిగిస్తున్నాడు. పూర్తిగా సిగరెట్ కాల్చకుండానే విసిరేస్తున్నాడు.

 

    శివరాణి లాంటివాళ్ళని డీల్ చేసే పద్ధతి అదికాదు... ఆమెని ఎలా డీల్ చేయాలో ఆలోచిస్తున్నాడతను.

 

    "సిటీకేనా సార్?" అడిగాడు డ్రయివర్ రాములు.

 

    "కాదు... పంజాబీ... డాబాకు పోనీ" సీటు వెనక్కు జారబడుతూ కళ్ళు మూసుకుంటూ అన్నాడతను.

 

    జోరుగా వెళుతున్న జీప్ హెడ్ లైట్ల వెలుగులో మట్టిరోడ్డు ఎర్రగా మెరుస్తోంది.


                                                 *    *    *    *    *


    ఏదో పక్షి వింత అరుపుకి అకస్మాత్ గా మెలుకువ వచ్చింది ఆదిత్యకు.

 

    కళ్ళు విప్పి చూశాడు... మంచి గాలి, మంచి నేల వాసన ముక్కు పుటాలకు తగిలింది.

 

    పల్చటి నీలితెరలా వున్న ఆకాశంవేపు అలా చూస్తూ వుండిపోయాడు.

 

    ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

 

    ఎందుకో తలవని తలంపుగా కాలేజీ హాస్టల్ లోని రోజులు జ్ఞాపకాని కొచ్చాయి.

 

    రెండు నెలల కాలం... తన జీవితమార్గాన్ని ఎంతగా మార్చేసింది. అందుకేనేమో కాలం గురించి ఇంగ్లీషు కవులు అంతంత కావ్యాలు రాశారు.

 

    తానిప్పుడు ఓ హంతకుడు... ప్రభుత్వమూ, పోలీసులూ వెతుకుతున్న హంతకుడి... తను చదివిన క్రైమ్ స్టోరీస్, రాబరీ స్టోరీస్, కిడ్నాప్ స్టోరీస్ గుర్తుకొచ్చాయి. వాటిల్లోనూ హీరోలంతే...

 

    ఏకాంతంగా అడవుల్లోనే వాళ్ళకు సూర్యోదయమూ... సూర్యాస్తమయమూ...

 

    నెమ్మదిగా లేచి కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు.

 

    పెదవిమీద, వంటిమీద వున్న గాయాలింకా నొప్పెడుతూనే వున్నాయి.

 

    లేచి అటూ ఇటూ చూసి నడవటం ప్రారంభించాడు.

 

    గంటలు గడుస్తున్నాయి... మధ్యాహ్నం దాటింది.

 

    మధ్యాహ్నం సాయంత్రంగా మారుతున్న దశ...

 

    లోయలోంచి కొండెక్కిన ఆదిత్య...

 

    దూరంగా అడవి మధ్యలో పూరిళ్ళు కనబడడంతో సంతృప్తిగా వూపిరి పీల్చుకున్నాడు.

 

    గబగబా కొండ దిగడం ప్రారంభించాడు.

 

    తను అనుకున్నదే నిజమైతే అదే శివదేవునిపల్లె.

 

    నడుస్తూ నడుస్తూ అకస్మాత్తుగా ఆగిపోయాడు ఆదిత్య.

 

    దానిక్కారణం... ధరణికుమార్.

 

    ఇంత మారుమూల కుగ్రామంలో ధరణికుమార్ వుండాల్సిన అవసరం ఏమిటి? కనీసం రహసారి కూడా లేని, గ్రామంకాని గ్రామంలోకి ధరణికుమార్ ఎందుకొచ్చాడు?

 

    తనకి ధరణికుమార్ చెప్పింది నిజమేనా? నిజమని నమ్మడం తప్ప, దానికి సాక్ష్యాలేవీ లేవు!

 

    ఎప్పుడూ ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడని ధరణికుమార్, తనతోనే ఎక్కువగా ఎందుకు మాట్లాడాడు? తనతోనే ఎందుకు స్నేహం చేశాడు? నిజంగా ధరణికుమార్ గుర్రం పెద్దబ్బాయి పెద్ద కొడుకే అయితే, జైల్లోకి ఎందుకొచ్చాడు?

 

    చనిపోయేనాటికి ధరణికుమార్ మానసికస్థితి సరిగానే వుందా?

 

    ఆ ఆలోచన రాగానే-

 

    ఆదిత్య స్థాణువులా నిలబడిపోయాడు ఒక్కక్షణం!

 

    ధరణి పిచ్చివాడు కాదుగదా?!

 

    కాదు... పిచ్చివాడు కాదు.

 

    మరి-

 

    ఇంతదూరం... ఇంతదూరం...

 

    ఆదిత్య ప్రశ్నలకు సమాధానాల్లేవు.

 

    చూద్దాం ఏం జరుగుతుందో? ధరణి పిచ్చివాడనే అనుమానం మొలకెత్తడంతో, ఆదిత్యలో వుత్సాహం సన్నగిల్లింది. అయినా నడక తప్పదు.

 

    శివదేవునిపల్లె...

 

    ఊరు రెండు కిలోమీటర్ల దూరం వుందనగా మళ్ళీ పంటపొలాలు మొదలయ్యాయి.

 

    పొలాల గట్లమీంచి నడుస్తున్నాడు ఆదిత్య.

 

    ఊరు మొదట్లో పెద్ద మర్రిచెట్టు, మర్రిచెట్టు పక్కన పెద్ద బావి... ఆదిత్య అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే బావి చుట్టూ జనం పోగయివున్నారు. అందరూ పల్లె జనం...

 

    అందులో ఓ స్త్రీ గుండెలు బాదుకొని ఏడుస్తోంది.

 

    "ఏమైంది?" ఎవర్నో అడిగాడు ఆదిత్య.

 

    అతని ఆకారం వేపు, మనిషి వేపు విచిత్రంగా చూసి-

 

    "లక్ష్మమ్మ కూతురు నీళ్ళలో పడిపోయింది" చెప్పాడతను కంగారుగా.

 

    "ఎవరికీ ఈత రాదా?"

 

    ఏ ఒక్కరూ జవాబు చెప్పలేదు.

 

    మరే మాత్రం ఆలస్యం చెయ్యలేదు ఆదిత్య. వెంటనే బావిలోకి దూకేశాడు.

 

    పావుగంట గడిచింది.

 

    లక్ష్మమ్మ కూతురంటే చిన్నపిల్లనుకున్నాడతను. కాదు... పదహారేళ్ళ అమ్మాయి! ఆమెను భుజాలమీద వేసుకుని, పల్లె జనం బావిలో వేసిన కొబ్బరితాళ్ళను పట్టుకొని నెమ్మదిగా పైకొచ్చి-

 

    ఆ అమ్మాయిని మర్రిచెట్టు కిందనున్న అరుగు మీద పడుకోబెట్టి, కడుపులోని నీళ్ళను కక్కించాడు.

 

    గండం గడిచింది. లక్ష్మమ్మ కూతురు కదిలింది.

 Previous Page Next Page