Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 39


    సుమతి పాతివ్రత్యగరిమ అలా నగ్నంగా బయటపడి కన్నీరై కురవసాగింది. సుమతి గుండెలో ఎన్ని దుఃఖపు ఊటలున్నాయో కాని, ఎప్పటికప్పుడు కన్నీరు మాత్రం సిద్ధంగా ఉంటుంది. కన్నీటితో తడిసి తడిసి కనుగ్రుడ్లు కొద్దిగా ఎరుపురంగుకి దిగాయి.
    ఆ అక్క చెల్లెళ్ళమధ్య కూచోలేకపోయాడు కృష్ణారావు. "నేను నీలకంఠంగారితో మాట్లాడతాను" అని వెళ్ళిపోయాడు.
    కృష్ణారావు వెళ్ళిపోయాక సుమతి చెల్లెలి దగ్గరగా వచ్చి కూచుంది.
    "సుమతీ! ఏమీ అనుకోకే. అమ్మకీ, నాన్నకీ, నువ్వెంతో చేస్తున్నావు? నాకు తెలుసు. నన్నూ ఎన్నో విధాలుగా ఆదుకున్నావు. కానీ, నేను తిరిగి ఏం చెయ్యలేకపోతున్నాను. ఎంతకని దెబ్బలాడనే! అరిచి అరిచి ప్రాణాలు పోతున్నాయి. ఫిట్స్ తెచ్చుకుని ప్రాణంమీదకి తెచ్చుకోవటం కంటే ఏం చెయ్యగలను నేను?"
    దీనంగా మాట్లాడుతోన్న సుమతిని చూస్తోంటే, సుమతిమీద వచ్చిన కోపమంతా హరించుకుపోయింది తులసిలో...సుమతి అసలు ఒక మనిషా? ఎటూ కాని మధ్యతరగతి యంత్రాంగంలో ఒక మర. అర్థం పర్థంలేని నీతి సూత్రాలు ఆలోచన లేకుండా వల్లించే మట్టి బొమ్మ. తన కాళ్ళమీద తను నిలబడలేని తెలుగుదేశంలోని పిల్లల తల్లి....
    "రా! అన్నం తిందువుగాని, కృష్ణారావు వస్తే పెట్టడానికి లేదు" అంది సుమతి...
    "వద్దులే అక్కా! ఆకలిగా లేదు."
    "అలా అనకే! నా అదృష్టం బాగుండి ఆయన లేని సమయంలో వచ్చావు. నా చేత్తో గుప్పెడు మెతుకులు పెట్టనియ్యి. రా."
    ఆ ఆర్తి చూసి మళ్ళీ "వద్దు" అనలేకపోయింది తులసి.
    సుమతి కూరలో సగం తులసికి వేసేస్తొంటే, "ఉండనియ్యి. మిగిలిన వాళ్ళకో?" అంది.
    సుమతి ఇంత పచ్చికారం కూరలో కలుపుతూ, "కారం ఎక్కువయితే ఎవరూ తినరులే! అందరికీ సరిపోతుంది" అంది.
    "బావ తిట్టడూ?"
    "బాగున్నప్పుడు బాగుందని ఎలాగూ మెచ్చుకోడు. అలాటప్పుడు తిడితే నష్టమేమిటి? తిట్టనియ్యి. మా సరసాలూ, సరదాలూ అన్నీ అవేగా...."
    తులసికి ఉన్న మజ్జిగలో మూడువంతులు పోసి, మరో రెండు గ్లాసుల నీళ్ళు మజ్జిగలో కలిపింది సుమతి.
    ఎలాగో భోజనం ముగించింది తులసి ఆ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటపడి పారిపోదామా అనిపించింది.
    అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకపోతే, తన అరుపులతో, తన వాగుడుతో ఒక రాక్షసిలాగ కనిపిస్తుంది సుమతి. అర్థంచేసుకోవటానికి ప్రయత్నించిన కొద్దీ, ఆ మూర్ఛరోగి మోస్తున్న దుఃఖభారానికి ఒక దరీ, దాపూ కనిపించదు.
    కృష్ణారావు తిరిగివచ్చి, "నీలకంఠంగారు మీ అమ్మగారిని చూసుకోవటానికి ఒప్పుకున్నారు" అన్నాడు.
    ఆ వార్త అక్కచెల్లెళ్ళిద్దరికీ ఆశ్చర్యాన్నే కలిగించింది.
    "ఎలా ఒప్పుకున్నారు?" అంది సుమతి నమ్మలేక....
    "ఏముందీ? సింపుల్! డబ్బు ఇస్తానన్నాను."
    "డబ్బు ఇస్తానన్నారా?" ఈసారి ఆశ్చర్యపోవటం తులసి వంతు అయింది.
    "అవును. ఆవిడ భోజనానికీ, మందులకీ, దానికీ దీనికీ ప్రస్తుతం ఒక యాభైరూపాయలు ఇచ్చాను. మేము ఒక నెల కంటే ఇంకా ఎక్కువరోజులు ఉండవలసివస్తే మళ్ళీ పంపిస్తానని అన్నాను."
    "యాభై రూపాయలూ ఆయనకిచ్చేశారా? అయ్యయ్యో నాకు ఇయ్యవలసింది" అంది సుమతి. తెల్లబోయి చూశాడు కృష్ణారావు. అతనికి ఈ ప్రపంచమంతా చాలా వింతగా ఉంది.
    "తులసీ! మనకు ట్రైన్ కి టైమయిపోతోంది. మీ అమ్మగారికి చెప్పి వెళ్ళిపోదాం" అన్నాడు కృష్ణారావు. తులసి వెంటనే లేచి బయలుదేరింది.
    తులసి రాయవెల్లూరు వెళ్తున్న విషయం విని జానకి దీనాతి దీనంగా "నన్నూ తీసికెళ్ళవే? అక్కడ మంచి మందులుంటాయేమో! త్వరగా నయమవుతుందేమో!" అంది.
    తులసికి నోటమాట రాలేదు. తన వైద్యం కోసం వెళ్ళటానికే ఎన్ని అవస్థలు పడవలసి వచ్చిందో తల్లికి బాగా తెలుసు. అయినా అలా అడుగుతోందంటే.... పెద్ద వయసులో ఇలాంటి జబ్బులు తగ్గేవి కావు. ఆ సంగతి తల్లికి తెలియదా? ఎలా చెప్పటం ఆ మాట? 'మృత్యు ముఖంలో నిలబడ్డ నీకోసం వృధా చెయ్యగలిగేటంత డబ్బు ఎవరి దగ్గరా లేదమ్మా!' అని ఎలా అనటం?
    "ఇక్కడ మంచి డాక్టర్లే ఉన్నారమ్మా! నీకు త్వరలో నయమయిపోతుంది" అంది తులసి.
    అక్కడితో తులసి తనను తీసుకువెళ్ళదని అర్థమయిన జానకి చిన్నపిల్లలా కన్నీళ్ళు పెట్టుకోసాగింది. ప్రాణభయం ఆ కళ తప్పిన కళ్ళలో భయంకరంగా చిందులు వేసింది.
    "రా! తులసీ!" అన్నాడు కృష్ణారావు ఆ దృశ్యం చూడలేక. "వస్తానమ్మా!" అని తల్లి సమాధానం కోసం ఆగకుండా బయటపడింది తులసి.
    కృష్ణారావు తమకోసం ఫస్ట్ క్లాస్ టికెట్స్ రిజర్వుచేయించి ఉంచాడు. ఫస్ట్ క్లాస్ ప్రయాణం ఎలా ఉంటుందో? ఎప్పుడూ వెళ్ళలేదు. అదేదో కథలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో హీరోయిన్ ని రేప్ చేసినట్లు చదివింది. అంత ఏకాంతంగా ఉంటుందా? కొంపదీసి కృష్ణారావు.
    "రా! తులసీ!" అంటూ కృష్ణారావు థర్డ్ క్లాస్ కంపార్ట్ మెంట్ లోకి దారితీయటం చూసి ఆశ్చర్యపోయింది. ఆశాభంగం కూడా కలిగింది. ఎలాగో తోసుకుని లోపల ప్రవేశించి కూచోడానికికూడా చోటులేక, బెడ్డింగ్ మీద కూచున్నాక, తన ఆలోచనలకు తనే నవ్వుకుంది. మనిషి మనసు ఎంత తేలికగా సుఖభోగాలవైపుకు మొగ్గుతుంది? కనే కలలకూ వాస్తవానికీ ఎంతదూరం?

 Previous Page Next Page