Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 38


    ఆవిడ లేచి నిలబడితే, ఆ పొట్ట బరువుకి కాకీ యూనిఫాం గుండీలు విరిగిపోవు కదా, అని భయం వేసింది ఇళకి. ఆవిడ ముఖం పైకి కఠినంగా భయంగొలిపేదిగా కనిపిస్తుంది కానీ కళ్ళలోకి జాగ్రత్తగా చూస్తే లోపల స్థయిర్యం కంటే భయమే ఎక్కువగా వున్నట్లు కనిపిస్తుంది.
    గొంతు సర్దుకుని ప్రారంభించింది.
    "ప్రియ ఖైదీలారా! మీరంతా ఇక్కడ చాలాకాలం గడపవలసి ఉంది. చేసిన నేరానికి చట్టం శిక్ష విధిస్తుంది. మీరు ఇప్పటికైనా చేసిన నేరానికి పశ్చాత్తాపపడి సత్ప్రవర్తనతో మెలిగితే, మీరు సుఖంగా ఉండగలరు. మీరు మా ఆజ్ఞలు సక్రమంగా నిర్వర్తించాలి. మీరు ఎప్పుడు లేవాలో, ఎప్పుడు పనికి బయలుదేరాలో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు మలమూత్ర విసర్జనలకు వెళ్ళాలో మేము చెప్తాం. మీరు వినాలి. వినకపోయారో ఖైదంటే ఏమిటో తెలుసుకుంటారు. మా మాట మీరు వినేలా ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. అంచేత వినయ విధేయతలతో మెలగండి."
    మహిళా కానిస్టేబుల్ కి సైగచేసి కూర్చుంది వార్డెన్. మళ్ళీ నడక మరో ఆఫీస్.
    "మీ బట్టలు ఊడదీసెయ్యండి."
    గతుక్కుమని చూసింది ఇళ. మహిళా కానిస్టేబుల్ ఖైదు యూనిఫాం బట్టలు గుట్టలుగా ఉన్న మూల చూపించి, "ఆ బట్టలు కట్టుకోండి" అంది. బట్టలు మార్చుకోమని చెప్పడం కాబొలు౧ ఇళ అటు ఇటు చూసింది. అందరూ ఒక గదిలోనే చకచకా బట్టలు మార్చేసుకున్తున్నారు. అటూ ఇటూ చూసింది ఇళ.
    "ఏం అమ్మవారూ! తమరికి స్పెషల్ గా చెప్పాలా?" ఇళ కాళ్ళ మీద లాఠీ దెబ్బ పడింది. ఆ మహిళా గార్డ్ క్రిష్టియన్. ఆవిడకి ఫాదర్స్ అన్నా, సిస్టర్స్ అన్నా ఇష్టమే కాని హిందూ "అమ్మ"లంటేనే మంట. గోడ వైపుకు తిరిగి, లజ్జతో కృంగిపోతూ బట్టలు మార్చుకుంది. ఎన్నో జతల కళ్ళు తననే చూస్తున్నట్లు అనిపించింది. అణువణువూ జుగుప్సతో నిండిపోయింది.
    తరువాత ఖైదీలందర్నీ మరో గదిలోకి తోలారు. అక్కడ జైలు ఫోటోగ్రాఫర్ ఒక్కొక్కరినీ అన్ని కోణాల లోంచి ఫోటోలు తీస్తున్నాడు. ఇళని అంతకుముందు ఫోటోలు తీశారు కానీ అవన్నీ పూలదండలతో, ధ్యానంలో ఉన్న ఫోటోలు.
    "ఏయ్! తిన్నగా నిలబడు. ఇటు చూడు! కుడిప్రక్కకి! ఎడం ప్రక్కకి."
    మరబొమ్మలా ఏం చెయ్యమంటే అది చేస్తోంది. ఈ వాతావరణంలో మనసు స్థంభించిపోయినట్లు అవుతోంది. అంతా మరబొమ్మలేనా? మనిషి మరబొమ్మకంటే ఏం కాదా? లోలోపల ఏవో గొంతుకలు.
    బల్లమీద ఫింగర్ ప్రింట్ ఎక్విప్ మెంట్స్ ఉన్నాయి. ఇళ తన చేతికి ఇంక్ పేడ్ తడిచేసి, తెల్లని అట్టమీద అద్దింది కుడిచెయ్యి, ఎడం చెయ్యి బొటనవేలు.
    ఆడ, మొగ గార్డులు తుపాకులతో ఒక చిన్న చీకటి గుహలోకి నెట్టబడింది ఇళ. జైలులో ఆమె ఉనికి గురించి ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆమెని సాధారణంగా సి బ్లాక్ లోనే వేశారు. సాధారణంగా ఒక్కొక్క సెల్ లో ఇద్దరు ఖైదీలని ఉంచాలి. ఆ రకంగానే కట్టారు వీటిని. అయితే దేశంలో మిగిలిన అన్నిచోట్లలో లాగానే, జైలులోనూ ఆర్ధిక మాంద్యం చేత, ఒక్కొక్క సెల్ లోనూ నలుగుర్నీ, అయిదుగుర్నీ, ఒక్కొక్కసారి ఆరుగుర్ని కూడా కూరుతున్నారు. అవసరమయితే ఇంకా ఎక్కువ మందిని కూడా కూరేస్తారు. అన్ని చోట్లలో లాగే జైలులోనూ ఖైదీ లెక్కువ. స్టాఫ్ తక్కువ. ఆ జైలు రోజుకోరుకి ఖైదీలతో తోటివారి పట్ల అసహ్యాన్ని పెంచి. మానవతతో విశ్వాసాన్ని సడలించి, మరింత మృగాలుగా మారుస్తుందే తప్ప, పశ్చాత్తాప పడటానికి ఏమాత్రం అవకాశం కలిగించదు.
    కిర్రుమన్న తలుపు చప్పుడు, బయట తాళం వేసిన చప్పుడు. అప్పటికే లోపల వున్న ముగ్గురు ఖైదీలు ఇళని ఆశ్చర్యంగా, భయంగా చూస్తున్నారు. దూరంగా తొలగి నిలబడ్డారు.
    ఇళకి ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా దిమ్మెర పోయింది. మెదడు తనను తను అదుపులోకి తెచ్చుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ తనని బంధించిన ఇనుప ఊచల్నే గట్టిగా పట్టుకుంది. ఏదో మరో వింత లోకంలోకి ప్రవేశిస్తోంది. కాళ్ళకింద వైతరణి! ఈ వైతరణిలో మునిగిపోతోంది. లేవాలి! పైకి లేవాలి!
    హఠాత్తుగా గాఢాంధకారం! జైలులో ఖైదీల వార్డ్స్ లైట్లారిపోయి ఎటు తలతిప్పినా అర్థరాత్రి చిమ్మచీకటి! ఈ అంధకారపు అర్థరాత్రిలో సూర్యోదయపు వెలుగు కిరణం కనిపిస్తుందా? ఆ వెలుగు రేఖ తను చూడగలదా?


                                     17


    చీకట్లో ఒకమూల సెల్ లోంచి ఒక కేక! ధీనంగా గుండె కరిగించే ఏడుపు. ఎవరిదో గద్దింపు స్వరం. మరింత దయనీయంగా ఏడుపు.
    అంతలో లైట్లు వెలిగాయి. జీవితమంటేనే చీకటి వెలుగుల సమ్మేళనం చీకటి అని నిరాశ చెందేటంతలో వెలుగురేఖలు వెలుగులో మురిసిపోయేటంతలో చీకటి మేఘాలు, లైట్ వెలుతురులో చేతిలో బెత్తం పట్టుకుని సెల్ లో ఖైదీని గడమాయిస్తున్న వార్డెన్ స్పష్టంగా కనిపిస్తోంది.
    "అబ్బబ్బ! రాత్రింబవళ్ళు క్షణం స్థిమితంగా ఉండనివ్వరు. ఎప్పుడూ ఏదో గొడవ." విసుక్కుంటోంది వార్డెన్. సెల్ లోంచి ఏడుపు ఆగకుండా వినిపిస్తోంది. "ఎందుకేడుస్తోంది?" అడిగింది ఇళ. చాలా చిన్నతనం నుంచీ ఎవరైనా ఏడుస్తోంటే సహించలేకపోయేది. ఇళతోపాటు సెల్ లో ఉన్న మరో ఖైదీ చెప్పింది.
    "అది కోమలమ్మ, దానికి చీకటంటే భయం. చీకట్లో అది చంపినవాళ్ళు దయ్యాలయ్యి దాని కంటికి కనిపిస్తారు. భరించలేక అలా ఏడుస్తోంది. ఇక, ఈ రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది అలసిపోయి నిద్రపోయే వరకూ."
    అదేదో జోక్ అయినట్లు నవ్వింది.
    "ఏయ్ పడుకోండి! గోల చెయ్యకండి!"
    ఇటు తిరిగి గద్దించింది వార్డెన్.
    "పడుకో! పడుకో! ఈ వార్డెనమ్మతో పడలేం! కోపం జాస్తి!"
    నేలమీద పరుచుకున్న తన పక్కబట్టలమీద పడుకుని నిద్ర నటించింది. నిద్రపోతున్నారో లేదో కాని అందరూ పడుకున్నారు. గాలిలో ఏదో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇళ తనపక్క వేసుకోలేదు. వంగుని పక్కవేసుకోబోతుంటే, మోకాళ్ళు పట్టేశాయి.
    "అబ్బా!" అంది తన శరీరం అంతా బాధపడుతోందని ఇళకి అప్పటివరకు తెలీదు.
    "ఏమిటీ" గద్దించింది వార్డెన్. ఇళ సమాధానం చెప్పలేదు. మొదటినుంచీ తన బాధలు మరొకరితో చెప్పుకోవటం ఆ పిల్లకి అలవాటు లేదు. కటిక నేల! ఆపైన కంబళి మీద దుప్పటి పక్క, ఆ పక్కమీద పడుకుంటుంటే, కీలు కీలునా ఎవరో కత్తులు కుమ్మినట్లు బాధ! ఊహించని ఉడకపోత!
    ఆపైన దోమల సంగీతం! ఇళకి ధ్యానమూ కుదరటం లేదు. నిద్రా రావటం లేదు. మనసు మీద శరీరానికున్న ఆధిపత్యం అనుభవంలోకి వస్తోంది.
    ఆ అమ్మాయికి పాశవిక అవసరాలను మించిన దశలో మనసు శరీరాన్ని వశపరచుకోగలదు. ఆ దశలో ధ్యానంలో ఉండి శారీరకావస్థను జయించగలిగింది ఇళ. ఆకలి నిద్రలాంటి ప్రాథమిక పాశ వికావసరాలలో, శరీరానిదే ఆధిపత్యం! ఆ దశలో శరీరం మనసు మీద ఆధిపత్యం వహించి, ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంది. నిద్రరాని తెప్పించుకోలేని ఇళ, శరీర బాధ భరించలేకపోతోంది. మూల సెల్ లో ఉండుండి ఏడుపు వినిపిస్తూనే ఉంది. లేచి కూర్చోబోయి, శరీరం స్వాధీనం కాక పడుకునే ఉండిపోయింది. ఆ ఏడుపు ఏదో నేపథ్య సంగీతమయినట్లు ఎవరూ పట్టించుకోకుండా పడుకున్నారు. ఆ అమ్మాయి హత్య చేసిందట! హత్య చేసిన సమయంలో దేవుణ్ని మరిచిపోగలిగింది కానీ, ఇప్పుడు దెయ్యాలను తప్పించుకోలేకపోతోంది. నిండు ప్రాణాన్ని నిలువునా తీసింది. ఎలా చెయ్యగలిగింది అలా? ఎందుకు చేసింది? ఆమెలోని మానవత్వాన్ని పూర్తిగా దోచుకున్న పరిస్థితులెలాంటివి? 

 Previous Page Next Page