సభ్యతకు ఆటంకం వస్తుందని ప్రమీల "ఏమండీ కులాసాగా వున్నారా?" అని అడిగింది సుగుణని.
"ఊఁ మీరో?"
ప్రమీల తల ఊపింది.
నిజానికి సుగుణకు ఆమె రావటం ముదావహంగానే వుంది. ఇవేళ ఆటలో ఆమె కాయలీన్న కట్టగట్టుకున్నట్లుగా చచ్చిపోసాగాయి. ఇంకా చంపుడుకూడా అందలేదు. రాధ కాయలన్నీ వరుసగా చస్తూంటే ఆమెలో ఆరాటం అధికం కాసాగింది. ఇంతలో దైవికంగా ప్రమీల వచ్చి ఆమెను రక్షించింది. ఒక అరగంట వరకూ వాళ్ళు ముగ్గురూ కబుర్లలో పడ్డారు. ఇవాళ నారాయణ ఉదయం బ్యాంకికి వెళ్ళేసరికి భోజనం ఏర్పాట్లు పూర్తికాకపోవటం చేత అన్నం తినకుండానే వెళ్ళాడు. పెందలాడే అతను రాగానే అతనితోపాటు సుగుణకూడా లోపలకు వెళ్ళింది.
ప్రమీలని కదపటానికి ఇప్పుడు రాధకు మంచి అవకాశం చిక్కింది. "నిన్నో విషయం అడగనా?" అంది.
"అడుగు"
"ఈ మధ్య నువ్వు అదోరకంగా వుంటున్నావెందుకు?"
"ఏ రకంగా ఉంటున్నానో కాస్త చెప్పు" అంటూ ఆమె నవ్వేయబోయింది.
కాని రాధ తీక్షణంగా చూస్తూ "ఎందుకు నవ్వుతావు?" నే నంత తెలివిమాలినదాన్ని కాను. ఎందుకు మీ ఇద్దరకూ చెడింది? నాతో చెప్పకూడదా?" అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది.
ప్రమీల నిరుత్తరురాయింది. ఇంత ఖచ్చితంగా స్నేహితురాలి దగ్గర్నుంచి ప్రశ్న వస్తుందని ఆమె అనుకోలేదు. మాట్లాడలేక తలవంచుకుంది. ఒక నిమిషం అలా నిదానించి చూసి ఆమె చుబుకాన్ని పట్టుకొని ఎత్తింది. ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండి వున్నాయి.
"నాతో చెప్పవా?"
"నిజంగా నాకూ తెలీదు."
రాధ నిట్టూర్చి "అలా అని నాకూ తెలుసు. కాని ఎందుకని కనిపెట్టలేకపోయావు!"
"అంది.
"ప్రయత్నించాను, కాని సాధ్యం కాలేదు."
"ఇవేళ కొట్టారు కదూ."
ప్రమీల జవాబు చెప్పలేక మళ్ళీ తల వొంచుకుంది.
"అదుగో నా ముందు..... చెప్పు."
జవాబుగా ఆమె నేత్రాలనుంచి జలజలమని నీళ్ళురాలాయి.
రాధ భారంగా "ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు" అంది. ప్రమీల బలహీనంగా అంది. "మొగవాళ్ళను గురించి మనం ఏమిటో తెలుసుననుకుంటాం. కాస్త ప్రేమతో చూడగానే పొంగిపోతాం. కాని ఆ ప్రేమ అనేది వాళ్ళ నిండు హృదయంలో ఎన్నోవంతో?" అంది.
"మీ అమ్మగారేమంటుంది?"
"ఏమంటుంది? తనలో తన ఏడ్చుకొంటుంది."
ఇలాగే వాళ్ళ సంభాషణ కొంతవరకూ సాగాక, సుగుణ వచ్చింతర్వాత ధోరణి మారింది. వెడుతూ వెడుతూ ప్రమీల రహస్యంగా "మా ఇంటికి తరచూ వస్తూ వుండు రాధా! ఏ మాత్రం మనశ్శాంతి లేక ఇలా వచ్చాను" అంది.
"అలాగే" అంది రాధ. ఆమె వెళ్ళిపోయాక "పాపం" అనుకుంది.
ఆమె తిరిగి లోపలకు వస్తూంటే ముసలమ్మగారి కేకలు వినిపించాయి.
"అయ్యో, అయ్యో, అయిపోయిందిరా దేముడా."
పేకాటలో ఉన్న చిదంబరంతోసహా అందరూ లోపలకు పరుగెత్తారు.
ఆవిడ కళ్ళు తేలవేసి, నోటివెంట చొంగకారుస్తూ నరకయాతన పడుతోంది. ఒకవైపు చిదంబరం, మరోవైపు శారదాంబ ఇద్దరూ ఆవిడని గట్టిగా పట్టుకున్నారు.
"ఏం చేద్దాం?" అన్నాడాయన భార్య ముఖంవంక చూస్తూ "బయట పెడదామాం?" అన్న భావం ధ్వనించింది అందులో.
"డాక్టర్ని పిలుచుకురండి" అంది శారదాంబ.
"అవునవును" అంటూ చిదంబరం వీధిలోకి పరుగెత్తాడు. అతను డాక్టరుగారితో మళ్ళీ ప్రవేశించేసరికి అరగంట పట్టింది. అప్పటిదాకా ముసలమ్మగారు అవస్థపడుతూనే వుంది. బయట పెడదామా? వద్దా? అని ఆలోచిస్తున్నారు ఇంట్లోవాళ్ళు.
డాక్టరువచ్చి, గబగబ పరీక్షచేసి ఒక ఇంజక్షన్ చేశాడు. ఒక అయిదు నిమిషాలపాటు అందరూ ఆవిడ ముఖంవంక చూస్తూ మౌనంగా నిలబడ్డారు. తెలివి తెచ్చుకొని చుట్టూరా నిల్చునివున్న అందరినీ చూస్తూ కష్టంమీద మాట పెగల్చుకొని "నేనింకా చచ్చిపోలేదూ?" అంది.
"ఎవరు చెప్పారు ఆ మాట? యింకా పదేళ్ళదాకా మీకు డోకాలేదు. ఊరికినే అప్పుడప్పుడు గడబిడ చేస్తూంటారంతే, " అని చిరునవ్వు నవ్వాడు డాక్టరుగారు.
ఈ తతంగం అంతా యిలా జరుగుతుందని రాధ అనుమానిస్తూనే వుంది. ఇదివరకు ఒకటి రెండుసార్లు యిలాగే జరిగి, ఆవిడ చెక్కు చెదరకుండా వుంది. డాక్టరుగారు వెళ్ళిపోయాక, ముసలమ్మగారు భగవంతుణ్ని ప్రార్థిస్తూ "ఇంకా యెంతకాలం ఈ బాధలు పడాలేమిటిరా? నన్ను చప్పున తీసుకుపో" అంది.
రాధ నవ్వుతూ "ఉండు బామ్మా! అప్పుడేనా! నా పెళ్ళికూడా చూడుమరి" అంది. శారదాంబ కూతురుకేసి గదమాయించి చూసింది.
ముసలమ్మగారు నిట్టూర్చి "అవునే తల్లీ, పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంకటం! నా చావు అందరికీ వేళాకోళంగా ఉంది. నేనే లేచి తిరగగలిగే స్థితిలో వుంటేనా?" అంది నీరసంగా అందులో ఉద్రేకాన్ని కూడా యిముడస్తూ.
"వాళ్ళను ఏమయిన అనుకోనీ, నీకేం భయం లేదమ్మా!" అని చిదంబరం తల్లిని సముదాయించి మళ్ళీ పేకాట గదిలోకిపోయాడు. రాధ బయటకు నడుస్తూ "అబ్బ, చావు కోసం ఎదురు చూడటంలో ఎంత బాధ వుంది?" అని తలుచుకునేసరికి ఆమె వళ్ళంతా ఝల్లుమంది.
ఈ ఇంట్లో సంగతంతా చూస్తుంటే - అసలే వదిన కొత్తగా వచ్చింది. ఆమె ఎక్కడ భయపడుతుందోనని ఆమె అనుమానం. అందుచేత "రా వదినా! మనం పూలమొక్కలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం" అని ఆమెను చేయిపట్టుకొని యిప్పుడు ఖాళీగాలేని ముందు ప్రదేశంలోకి తీసుకువెళ్ళిది. వాళ్ళిద్దరూ ఈ తోట విషయమై రోజూ రెండు మూడు గంటలకు పైగా కష్టపడుతున్నారు. వెనుకటి మాదిరి అపరిశుభ్రంగా, అనాగరికతకు పుట్టినిల్లయినట్లుగా లేదు ఆ ప్రదేశం. అక్కడ పడివున్న చెత్త వీధిలో పారబోయిందారు. రాధ అన్నీ పూలమొక్కలే వేద్దామని సలహా యిచ్చింది. ఒక వైపున పూలమొక్కలు, ఒకవైపున కూరగాయల చెట్లు వేశారు. అవి దినదినాభివృద్ధి గాంచుతుంటే చూసి సంతోషించసాగారు. ఈ ఇద్దరి అమ్మాయిల కృషిలో యింట్లో యెవరో జోక్యం కలిగించుకొకపోయినా, చూసి యెవరి మనస్సులో వాళ్ళ ఆనందిస్తూ ఉండేవాళ్ళు.
ఇవాళ గులాబీమొక్క ప్రక్కన నిల్చుని "ఈ మధ్య వో కధ చదివాను. అందులోని సందేశం ఏమిటంటే 'ప్రపంచం పై విషయాలే గమనిస్తుందటగాని, లోపల వున్న అగాధాలు గమనించదు.' దాన్ని ఆ రచయిత గులాబీ పువ్వుతో పోలుస్తూ "మనుషులు ; వీళ్ళు గులాబీ పూవు ఎలావుందో, ఎంత అందంగా ఉందో, దాని సౌరభం ఎలా ఉందో చూడగలుగుతారుగాని, ఆ పూవు అడుగున యిమిడి ఉన్న ముళ్ళ విషయం యెవరూ పట్టించుకోరుకదా?" అని విరగబడి నవ్వి " అంటే ముళ్ళ విషయం ఎవరికీ తెలియదని అతడి అభిప్రాయం" అంది.
"కేవలం ఊహమీద కల్పించబడిన కథ. అందులో యేమీ నిజం లేదు. మామిడిపండు తియ్యగా వుంటుందనీ, ఉసిరికాయ వగరుగా వుంటుందనీ గ్రహించగలిగిన మనుషులూ గులాబీకి ముళ్ళు ఉంటాయని తెలియనివారై వుంటారా? అంది సుగుణ. రాధ మాటకు మెరుగు పెట్టటానికి ప్రయత్నించింది.
అయితే ఈ ఇద్దరూ కలిసి అలానే సారస్వత విమర్శకు పూనుకోలేదు. వెంటనే రాధ అంది. "నా అభిప్రాయం ఏమిటంటే, మా ఇల్లే ఒక గులాబీ పూవనీ మా ఇంట్లోని కష్టాలు, గందరగోళం, యతనలు ఇవన్నీ ముళ్ళనుకుంటే నువ్వేమీ పొరబడలేదుకదా అని"
సుగుణ కొంచెం కోపంగా "ఎందుకలా తరిచి అడుగుతావు రాధా? నేనిందాక చెప్పిన జవాబులోనే ఈ ప్రశ్న కూ సమాధానం యిమిడిలేదా?" అంది.
రాధ ఆమె చేతిని నొక్కుతూ "కోపమా? నీకు ఈ యింట్లో బాధ కలుగుతుందేమోనన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాను తప్ప నీకు కష్టం కలిగిద్దామని అడగలేదు" అంది.
"కోపం ఏమీలేదు. కాని నన్ను పరాయిదానిగా ఇకముందు చూడకు రాధా!" అంది సుగుణ.
తను అన్న మాటలవల్ల వదిన చాలా వ్యధిత హృదయురాలైనదని గ్రహించి ఖిన్నురాలైంది రాధ.
రెండు మూడు రోజులు మామూలుగా గడిచాయి. ఆ రోజు ఉదయం పోస్టు వచ్చాక చిదంబరం హడావుడిగా ఇంట్లోకి వస్తూ "నాకు తెలుసు. ఎప్పుడో యింతపని జరుగుతుందని నేను అనుకొంటూనే ఉన్నాను" అన్నాడు.
శారదాంబ ఆయన ఖంగారును గమనించి "ఏం జరిగిందండీ" అని అడిగింది చేస్తున్నా పనిని ఆపి లేచి నిల్చుంటూ.
చిదంబరం వెంటనే జవాబు చెప్పలేదు, ఆయన నుదుటిమీద చిరుచెమటలు పట్టాయి. కొంచెం ఆగి అన్నాడు విషాదంగా, "ఏం జరుగుతుందో నా కర్థంకావటంలేదు"
"ఏం జరిగిందండీ?" అని మళ్ళీ ఆదుర్దాగా ప్రశ్నించింది. ఆ సమయానికి రాధ, అన్నపూర్ణ వంటయింట్లో వున్నారు. వాళ్ళు చెవులు రిక్కించి వింటున్నారు.
"పరంధామయ్య ప్లీడరు చేత రిజిష్టర్ నోటీసు ఇప్పించాడు"
"అదేమిటి? యెందుకు?"
చిదంబరం కొంచెం చిరాగ్గా "ఎందుకేమిట నీ మొహం? ఆయనకు మనం బాకీ ఉన్నాం"
"బాకీనా" శారదాంబ నివ్వెరపోయింది.
"అవును"
"అప్పు యెందుకు చేశారు?"
చిదంబరం వెటకారంగా "అప్పు యెందుకు చేస్తారు? వాసుగాడి కాలు విరగినప్పుడు దానికయిన ఖర్చంతా యెలా వచ్చింది? దమ్మిడీ కట్నం పుచ్చుకోకుండా నారాయణ పెళ్ళి జరిగినప్పుడు పెళ్ళి ఖర్చంతా యెలా వచ్చింది? వాడు తెచ్చే చాలీ చాలని జీతంలో ఈ ప్రత్యేకమైన ఖర్చులుకాక యింట్లో యెంతమంది యెలా తిరుగుతున్నారనుకున్నావు? అందుకని అప్పుచేశాను. నేనేమిటి? ఈ స్థితిలో ఎవరైనా ఆ పనిచేస్తారు" అన్నాడు.
ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. శారదాంబ ప్రతిమలాగ నిలబడిపోయింది. వంటయింట్లో అక్కచెల్లెళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అప్పటికీ నారాయణ యింట్లోనే వున్నాడు. సుగుణ కూడా అతనితోనే వుంది.
ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు.
"ఎంత చేశారు?"
"రెండువేలు"
శారదాంబ కేమిటి? ఈ మాట విన్న ప్రతివారికీ గుండెలు నిలిచిపోయినాయి. ఇన్నాళ్ళనుంచీ యీయణగారు చేస్తున్నా ఘనకార్యం ఏమిటో యింట్లో అందరికీ తెలియవచ్చింది.
"అయితే ఇప్పుడేమిటి చేయ్యడం" అనడిగింది శారదాంబ తడబడుతూ.
"ఏం చేస్తాం? జరిగేదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి"