"ఏం జరుగుతుంది?"
చిదంబరం భార్య ముఖంలోకి తీవ్రంగా చూసి "నాకు మట్టుకు ఏం తెలుసు? చూడాలి" అన్నాడు.
ఆమె ఎలాగో ధైర్యం చేసి "మీరు చేసినపని పొరపాటు కాదనుకోండి. అయినా ముందుగా నారాయణతో చెప్పాల్సింది" అంది.
ఆయన కోపంతో మండిపడుతూ "తెలివితక్కువ మాటలెందుకు మాట్లాడతావు? వాడు తెలుసుకుని ఏం చేస్తాడు? మూడువందల రూపాయలు కావాలంటే అప్పు పుట్టించగలిగాడా? అవసరం గడిచిపోయినప్పుడు మాట్లాడకుండా వూరుకున్నారూ - ఇప్పుడేమో దెప్పుతారేం?" అన్నాడు.
కొంచెం ఆగి "ఆయితే యీ విషయమంతా జరిగి రెండు మూడు నెలలయినా కాలేదు గదా, ఆయనప్పుడే ఎందుకింత త్వరపడ్డాడు?" అంది శారదాంబ.
ఈ పాయింటుని గురించి చిదంబరం కొంచెం దీర్ఘంగానే యోచించాడు. భార్య ప్రశ్న ఆయనకు సబబుగానే కనిపించింది. హఠాత్తుగా ఏదో తోచి వెలవెలబోతూ అన్నాడు "అంతా తెలిసింది. ఇదంతా గంగాధరం చేశాడు"
భార్య కూడా తెల్లబోతూ చూసింది.
"అవును గంగాధరమే. వాడు ఈ మధ్య పరంధామయ్య ఇంటికి అడపా పోతున్నాడని అవధాన్లుగారు చెబుతే పెడచెవిని పెట్టాను. ఇదంతా చేసింది వాడే. పరంధామయ్యకు బాగా పురెక్కించి వుంటాడు"
"ఆయన కేమిటి అవసరం?"
చిదంబరం ఈసారి విసుక్కోకుండా భార్య ముఖంలోకి దీనంగా చూసి "ఎందుకు అవసరం లేదు? నా మెడ పగబట్టాడు. వాడి కూతుర్ని నారాయణకు చేసుకోవటంలో ఏదో అవమానపరిచాననీ వాడి ఊహ! నన్ను చూసి మొహం తిప్పుకునేవాడు. చివరికి ఇలా పగ సాధించదలుచుకున్నాడు" అన్నాడు.
కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. తర్వాత శారదాంబ అడిగింది, "ఇంత త్వరగా బాకీ తీర్చమని అడిగే హక్కు ఆయనకు వుందా?"
"ఆఁ. ఎప్పుడు అడిగితే అప్పుడు బాకీ తీర్చే పద్ధతిమీద తెచ్చానాయె" అన్నాడు చిదంబరం విచారింగా.
"ఏం చేసేది? అలా అయితేగాని ఇవ్వనని అన్నాడాయన."
భర్తతో ఇంక యేమీ మాట్లాడటానికి తోచలేదు. శారదాంబకు. విగ్రహంలాగా అలా చూస్తూ నిల్చుంది. చిదంబరానికి కూడా అక్కడ వుండటానికి నొప్పక పేకాట గదిలోకిపోయి తలపట్టుకుని కూర్చున్నాడు.
గదిలో నిల్చునివున్న నారాయణ సుగుణవైపు ఒకసారి చూశాడు. అంతే ఏమీ మాట్లాడకుండా సైకిలు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
చిదంబరం కూడా అలా చాలాసేపు కూర్చున్నాడు. ఆయన మనస్సేమీ బాగుండని కారణంచేత ఇవాళ పేకాటకి వచ్చిన వాళ్ళతో ఆడనని ఖచ్చితంగా చెప్పేశాడు. చాలాసేపు మౌనంగా గడిపాక ఏదో తోచి, అక్కడున్న తువ్వాల మీద వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు.
పరంధామయ్యగారింటికి పోయేసరికి కృష్ణుడు ఎదురుగా కనిపించాడు. "మీ నాన్నగారున్నార్రా అబ్బీ?" అనడిగాడు.
"ఉన్నారు" అని కృష్ణుడు ఒక గదివైపు చూపించాడు.
చిదంబరం గబగబా ఆయనవున్న గదిదగ్గిరకు పోయేసరికి, నెరిసిపోయిన మీసాలు దువ్వుకుంటూ బయటకు వస్తూన్న గంగాధరంగారు ఈయనవంక కోరచూపులు చూసి వీధిలోకి వెళ్ళిపోయాడు. చిదంబరం పళ్ళు పటపట కొరికి, లోపలకు పోయి పరంధామయ్యగారికి యెదురుగా నిబడ్డాడు.
"కూర్చోండి" అన్నారాయన.
"నేను కూర్చునేందుకు రాలేదు"
"మరి?"
"మీతో మాట్లాడేందుకు వచ్చాను"
"అయితే మాట్లాడండి"
"ఇలా యెందుకు చేశారు?"
"అది నా యిష్టం"
"డబ్బు కావాలంటే వచ్చి అడగకూడదా? ఇవ్వనని బుకాయిస్తేగదా నోటీసు యివ్వాలి."
"మీ ఇంటికివచ్చి బాకీ తీర్చమని అడగవలసిన అగత్యం నాకేమీ పట్టలేదు. అవతల వాడు మర్యాదస్తుడు అయితే ఆ పని చేసేవాడిని."
"నేను మర్యాదస్తుడిని కానా?" చిదంబరం కోపోద్రిక్తుడై అడిగాడు.
"కాదు. అంతేకాదు. డబ్బుకోసం కూతుళ్ళను అమ్ముకునే వ్యాపారివి.
"ఏమిటి పేలావు?" చిదంబరం గొంతు అపస్వరాలు పలికింది.
పరంధామయ్యగారు నిర్లక్ష్యంగా అన్నాడు. "ఎవరిమీద ఈ బెదిరింపు"
"అవాచ్యాలు పేలితే ఎవరూరుకుంటారు?"
"అవాచ్చాలు యెవరు పలికారు. నువ్వు మీ అమ్మాయికి యేం ప్రేరేపణ చేశావు? మా ఆనందరావు మీ అమ్మాయిని తప్ప ఇంకొకర్ని పెళ్ళిచేసుకోనని యెందుకు మొండిపట్టు పట్టాడు?"
"అది నాకేం తెలుసు?"
"వాడిని వలలో వేసుకోమని నువ్వే మీ పిల్లకు నూరిపోశావు."
"నోరు ముయ్యి."
పరంధామయ్యగారు కుర్చీలోంచి లేస్తూ "ఆట్టే వాగక బయటకు నడు. జరగవలసిందంతా కాయితాలమీదా, కోర్టులోనూ నడుస్తుంది. పద" అని గట్టిగా అరిచాడు.
చిదంబరం ముఖం కందగడ్డలా అయిపోయింది. పిడికిలి బిగించి క్రోధపూరితంగా ఎదుటి మనిషివైపు చూశాడు. కాని ఆయన దౌర్జన్యాన్ని వాంఛించే మనిషి కాదు. అయినా దౌర్జన్యం చేసేంతటి నైచ్యస్థితికి ఆయన ఇంకా దిగజారిపోలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోయాడు.
ఇంటికివచ్చి తనగదిలోకిపోయి తువ్వాలుతో చెమటపట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్నాడు. మనసంతా భగభగమని మండిపోసాగింది.
రాధ వచ్చి కొంచెం ఇవతలగా నిల్చుని "పరంధామయ్యగారు ఏమన్నారు నాన్నా." అనడిగింది. ఇందాక తండ్రి పోయే విధానమూ అదీ చూసి ఆయన దగ్గరకే బయలుదేరుతున్నాడని వూహించింది.
తండ్రి కూతురివంక ఎగాదిగా చూసి "ఏమంటాడు? నేను మధ్యదస్తుడ్ని కాదుట. గట్టిగా నిలదీసి ఇలా యెందుకు చేశావని అడిగేసరికి బయటకు నడవమన్నాడు" అన్నాడు.
ఈ మాటలు చెబుతూంటే ప్రయోజకుడైన అంత పెద్దమనిషికీ కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.
తండ్రి దుస్థితి చూసేసరికి రాధ హృదయం అంతా సానుభూతి తోనూ, జాలితోనూ నిండిపోయింది. "ఆయన దగ్గరకు మళ్ళీ వెళ్ళకు నాన్నా, మనకు డబ్బులేకపోయినా అభిమానం వుంది. ఏమి జరుగుతుందో జరగనియ్యి" అంది గాద్గదిక కంఠంతో.
"నేనూ అదే అనుకుంటున్నానమ్మాయి" అని చిదంబరం అన్నాడు.
కొంచెం ఆగి, ఆయన కూతుర్ని చూస్తూ "నేను ఇలా చేసినందువల్ల ఇంట్లో అందరికీ కష్టం కలిగినట్లుంది. నేను చేసింది మంచిపని కాదంటావా అమ్మాయి?" అనడిగాడు.
"ఎందుకు నాన్నా! నువ్వు మా అందరి శ్రేయస్సునూ కోరిన వాడివి కదా? ఆ సమయంలో నువ్వు అలా అప్పు చేయకపోతే ఇబ్బందులు యెలా గడిచేయి?"
సంతోషంతో "చూశావా? మరి మీ అమ్మాయేమో అలా తెలివి తక్కువగా మాట్లాడుతుంది" అన్నాడు.
"అమ్మకేమీ తెలియదు. వొట్టి పిచ్చిది."
ఈసారి చిదంబరం ఏమీ మాట్లాడలేదు. రెండు మూడు క్షణాలు అక్కడే నిలబడి రాధ లోపలకు వెళ్ళిపోబోయింది. ఇంతలో ఆయనకు ఏదో గుర్తుకు వచ్చి "చూడు, అమ్మాయ్!" అని పిలిచారు. రాధ ఆగింది.
"మరి పరంధామయ్య అలా అంటాడేమిటి?"
"ఏమన్నా డేమిటి?"
"దగ్గరకు రా చెబుతాను."
రాధ దగ్గరకు వచ్చి నిల్చుని "చెప్పు నాన్నా!" అంది.
కూతురి మనస్సుకి ఎక్కడ కష్టం కలుగుతుందోనని ముందుగానే ఆయన "నే నసలు నమ్మలేదనుకో వాడేమిటో చెవాకులు పేలాడు. నిన్ను నేను ప్రేరేపణ చేసి ఆనందరావును వలలో వేసుకోమన్నానుట. నువ్వలా చేసేసరికి వాడేమో నిన్ను తప్ప ఇంకొకర్ని పెళ్ళి చేసుకోనని మొండిపట్టు పట్టాడట." అని కొంచెం ఆగి "నేను డబ్బుకు పిల్లల్ని అమ్ముకుంటానుట" అన్నాడు.
చరచరా రాధ ముఖం ఎర్రబడిపోయింది. ఒణుకుతున్న పెదాలతో ఆమె అంది, "పొగరుబోతులు, వెధవలు." తర్వాత ఆమె విసురుగా లోపలకు వెళ్ళిపోయింది. చిదంబరం ఆమె వెళ్ళిపోయినవైపే దిగాలుపడి చూడసాగాడు. "డానికి చెప్పకపోయిన బాగుండేది- దాని మనస్సులో చాలా బాధ పడింది" అనుకున్నాడు.
ఆ రోజంతా ఎవరికీ మనశ్శాంతి లేదు. ఎప్పుడూ లేనిది, చిదంబరం యీవేళ రాత్రి భోజనంకూడా చేయలేదు. ముసలమ్మాగారు "ఏమిటర్రా యీ గొడవ?" అని అడుగుతుందేగాని ఆమె గొడవ యెవరూ పట్టించుకోలేదు. శారదాంబ ఆ రాత్రి చిన్నకూతుర్ని గట్టిగా కావిలించుకొని ఏడుస్తూ పడుకుంది. "ఎలాగయినా ఈ పిల్లల్ని కాపాడు భగవంతుడా?" అని పదే పదే ప్రార్థించసాగింది.
ఆ రాత్రి సుగుణ గదిలోకి పోయినప్పుడు నారాయణ లైటు దగ్గర కూర్చుని ఏదో రాస్తూ కూర్చున్నాడు. ఆమె దగ్గరకు పోయి రాసేదేమిటో చూసింది. ఇంకా అందంగా పెయింటు చేయబడలేదుగాని సన్నగా పెన్సిలుతో ఓ అట్టమీద "ఈ ఇంట్లో ఒక భాగం అద్దెకు యీయబడును" అని రాసి వుంది.
ఆశ్చర్యంగా చూస్తున్న సుగునకేసి చూసి నారాయణ విచారంగా నవ్వాడు.
"ఏమిటండీ ఇదీ!" అనడిగిందామె.
"కనబడుతుందిగా?"
"మన ఇంటికే!"
"అలా మాట్లాడు" అని ప్రేమగా భార్య బుగ్గమీద చిటిక వేశాడు. ఇదివరకు ఒకసారి ఏదో మాటల సందర్భంలో "మీ ఇంటి విషయమా?" అని అంటే ఆమెను మందలించాడు.
తర్వాత "అవును, మన ఇంటికే. ఎవరింటికిపోయి తగిలిస్తే ఎవరు వూరుకుంటారు?" అన్నాడు.
ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే "రోజురోజుకూ వృద్ధి అయిపోతున్న మన ఖర్చుకు తట్టుకోవాలంటే మన ఇంట్లో ఈ ఎడమవైపు భాగం అద్దెకు ఇచ్చేస్తే ముప్ఫయి రూపాయలదాకా వస్తాయి. మన ఇల్లు చాలా పెద్దది. కొన్ని గదులు ఎందుకూ పనికి రాకుండా పనికిరాని చెత్తా- చెదారంతో మురిగిపోతున్నాయి. వాటిని ఈ విధంగా సద్వినియోగం చేద్దాం. బాగుంటుందంటావా?" అన్నాడు.
"ఎందుకు బాగుండదు? ఇన్నాళ్ళనుంచీ ఈ అభిప్రాయం ఎందుకు రాలేదో ఆశ్చర్యంగా వుంది."
నారాయణ చేస్తున్నా పనిని ఆపి, కొంచెంగా నవ్వి "నిజమే, నాకూ ఆశ్చర్యంగానే వుంది. కాని రోజు రోజుకు మనం అనేక కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం అనేమాట వాస్తవదూరం కాదుగదా" అన్నాడు.
సుగుణ మెదలకుండా అతని ప్రక్కనే కూర్చుంది.
"చూడు సుగుణా! ఈ ఇంట్లో అనేక తరహాల మనుష్యులున్నారు. కొందరు తెలివిగలవారు. కొందరు తెలివిలేని వాళ్ళు. మరికొందరకు అతితెలివి గలవాళ్ళు. ఈ ఇంట్లో అందరూ ఒకేదిశ నడవరు. ఒకరు తూర్పు అయితే ఇంకొకరు పడమర. అశాంతి కాపురముండటానికి ఈ ఇంట్లో కావలసినంత స్థావరం వుంది. నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది. ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావా అని?"