Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 37

 

    ఎంత అణచుకున్నా వారిజకు దుఃఖం ఆగటం లేదు.
    "ఈ పాపిష్టి దాని మీద మీకెందు కింత ప్రేమ?"
    వారిజ చుట్టుకున్న రామచంద్ర చేతులు చటుక్కున వాలిపోయాయి....
    "ఎందుకలా మాట్లాడతావు? వద్దు వారిజా! ఎన్ని చికాకులైనా భరించగలను. కాని ......అది....మాత్రం బ భరించలేను .....ఆ ప్రసక్తి తేకు. నాకది గుర్తుచేయ్యకు."
    "అది నిజం - గుర్తు చేసుకోనంత మాత్రాన మాసిపోయేది కాదు అనుక్షణమూ శరీరాన్ని మనసునూ నిప్పులా మలమల మాడ్చేది...."
    "ఆ- బ్బా! వారిజా!"
    "ఈ వారిజ దగ్గిర ఏముంది మీ కివడానికి? ఈ ఎంగిలి శరీరం ఏ మొహంతో మీ కర్పించుకొను? ఎప్పుడూ మీ మేలు కోరుతూ మీ కోసం పరితపించే బేల మనసు మీదేనని మీకు మాత్రం తెలీదు!"
    "పోనీలే ఏదీ వద్దు. నా దగ్గిరుండిపో! నాకదే చాలు నిన్ను చూస్తూ నీతో కబుర్లు చెప్పుకుంటూ వుంటే అంతే చాలు. ఏం, ఉంటావా? నా కోసం, నా మనశ్శాంతి కోసం- నా సంతోషం కోసం, ప్రాదేయపడుతున్నాను , సరే నను."
    "మీకు తెలీదు ఇప్పుడలాగే అనిపిస్తుంది. ఈ యవనం ఒక మహా మాయావి. దీన్ని నమ్మడానికి వీల్లేదు. ఈ ఉద్రేకాలు అంతకన్నా దొంగవి. ఎప్పుడు పొంగుతాయో, ఎలా మనసు వశం చేసుకుంటాయో మనకి తెలీదు. అంతా అయిపోయాక, ఎంత బాధపడ్డా -- మనలను మనమే ఎంత అసహ్యించుకున్నా ఏం ప్రయోజనం వుండదు. మీ మేలుకోరి చెపుతున్నాను నన్ను పూర్తిగా మరిచిపొండి ..... ఇప్పుడు వెంటనే కాకపోయినా కొన్నాళ్ళకయినా లతలో పశ్చాత్తాపం రాక మానదు అప్పుడు....."
    "పో వెంటనే ఇక్కడి నుంచి పో!" ఉరిమాడు రామచంద్ర . నీకు నా మీద ప్రేమ? వట్టి స్వార్ధపరురాలివి. "ప్రేమ ఉన్నదానివైతే చెల్లెల్ని చేసుకోబోయే ముందుగానే నన్ను హెచ్చరించవూ? నీ చెల్లెలు స్వభావం తెలీదు? నీ చెల్లెలికి కట్నం లేకుండా మొగుడు దొరికిందే చాలని మురిసిపోయి ఊరుకున్నావు అశాంతితో వేగిపోయి నీ దగ్గిరికి శాంతి కోసం వస్తే ఆదరించక పోగా మరింత క్షోభ పెడ్తున్నావు. లతను ప్రేమించండి, మీ ప్రేమకు కరగని వాళ్ళెవరని నాతొ తియ్యని మాటలు చెప్పి అటు లతని హెచ్చరించడానికి తయారయ్యావు నా మీద ఏ కోశానా ప్రేమ లేని లతను ప్రేమ నటించమని చెప్పేటంత నీచానికి తయారయ్యావు. అన్నీ విధాల భంగపడి దీనంగా నీ సాహచర్యాన్ని యాచిస్తే తిరస్కరించి వెళ్ళి పోగలుగుతున్నావు . నీకు నా మీద ప్రేమ వుందని నమ్ముకోనా? పూల్ ని , నువు మహా నటివని ఎప్పటికప్పుడు మరిచి పోతూ వుంటాను."
    "నటనా! నేను మీ దగ్గర నటిస్తున్నానా?"
    అతి మాములు చీరతో, ఒక అలంకారమైన లేని శరీరంతో పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేస్తూ అమాయకంగా దీనంగా అడుగుతున్న వారిజను చూడలేక చటుక్కున వెనక్కు తిరిగాడు రామచంద్ర.
    కొన్ని క్షణాలు అలాగే నిలబడిన వారిజ శాంత స్వరంతో అంది - "చిన్న చిన్నచికాకులకే ఇంతగా బెదిరిపోయే మీరు ఆనాడు నాకన్ని మాటలు ఎలా చెప్పగలిగారో ఆశ్చర్యంగా వుంది. సమయానికి పనికిరాని జ్ఞానమెందుకు? క్లిష్ట పరిస్థితుల్లో దృడంగా నిలబడలేని బలహీనపు క్షణాలలో తట్టుకోలేని ఉద్రేకాలను జయించలేని వ్యక్తిత్వమూ ఒక వ్యక్తిత్వమేనా?"
    గిర్రున వారిజ వంక తిరిగాడు రామచంద్ర.
    "ఏమిటీ? నువు వెక్కిరిస్తున్నావా నా వ్యక్తిత్వాన్ని?"
    "అవును నేనే వెక్కిరిస్తున్నాను. నేను పతితను, భ్రష్టను .....అయినా నేను నిలద్రోక్కుకున్నాను. అనేక ప్రలోభాల మధ్య నుంచి బయటకి వచ్చాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నా వ్యక్తిత్వం తోనే మీ ముందు నిండుగా నిలిచి మీ వ్యక్తిత్వాన్ని అదిక్షేపిస్తున్నాను."
    "నా వ్యక్తిత్వం బలహీనమైనదా?"
    "కాదా! ఇప్పుడింతగా క్రుంగిపోతున్నారే? ఎందుకు? అంత దుర్భలులా/ ఒక స్త్రీ లేకుండా బ్రతకలేరా?"
    "ఛీ! ఛీ! ఒక ఆడదాని కోసం కృంగి పోతున్నా నంటావా?"
    "ఏమనను మరి? నన్ను ప్రేమించి, నా ప్రేమ కోసమే పరితపిస్తున్నారని అనుకోమంటారా? మీ అంతరాత్మను అడిగి చెప్పండి. లత మీకు అనుకూలంగా ఉండి మీరిద్దరూ అన్యోన్యంగా ఉండగలిగితే నా కోసం ఇలా ప్రాకులాడేవారా? దౌర్భాగ్యురాలు ......జీవించటం చేతకాక  వెళ్ళిపోయింది. అందుకు మిమ్మల్ని నిందించను. కానీ లత పోయినంత మాత్రాన మీరిలా కృంగిపోపోవటం న్యాయం కాదు.
    తిండి తిప్పలు మాని, మీ పనులు మాని మీరు సాధించేదేమిటి? లతలో పశ్చాత్తాపం కలగక మానదు. అప్పటికి మీ ఇల్లాలిని హృదయపూర్వకంగా ఆదరించగల దశలో నిలబడండి. మోడు లాటి నేను కూడా ఈ సృష్టి ని చూసుకుంటూ నిండుగా బ్రతకగలుగుతున్నాను. ఏ లోపమూ లేని అదృష్ట వంతులు, అల్పమయిన చికాకులతో బ్రతుకు మీద విరక్తి పెంచుకుని మనసులోని మాధుర్యాన్ని హరింపచేసుకోకండి.
    బ్రతుకుని ప్రేమించండి. నిండుగా బ్రతకండి మన మనసులను కవిస్తూ మనసు ఉక్కిరిబిక్కిరి చేసే ఉద్రేకాలకు మీ వ్యక్తిత్వాన్నే భంగపరచేటంత బలం ఇవకండి. ఆలోచించండి. వెళతాను."
    రామచంద్ర ఆశ్చర్యంగా చూస్తుండగానే వారిజ గడప దాటి గబగబ బయటికి అడుగులు వేసింది.

    
                                                       -------------

    గుండెల నిండా బరువుతో పరధ్యానంగా , ఏడుపు అడుగులతో గుమ్మంలో అడుగు పెట్టిన వారిజ గడపలో వడలిపోయిన ముఖంతో మండిపోతున్న కళ్ళతో కూర్చున్న పార్వతిని చూసి ఉలికిపడింది?
    "అమ్మా! ఎప్పుడో......" వారిజ మాటలను పూర్తీ చేయనియ్య లేదు పార్వతి. శరీరం తూలిపోతుండగా ఉద్రేకంతో లేచి "ఎక్కడ్నించి వస్తున్నావ్?" అంది.

 Previous Page Next Page