పిల్లలు సినిమానుండి వస్తున్న సందడికి శోభా, ఉమా తమ తమ ఆలోచనలలోంచి తేరుకున్నారు.
"నా సంగతేమాలోచించావక్కయ్యా!" అంది ఉమ.
"నిన్ను పెళ్ళిపీటలమీద మోసం చేసిన ఆ పెళ్ళికొడుకు తరువాత కట్నంగా తీసుకున్న మూడువేలూ పంపేశాడు. అవి వదినపేర బ్యాంక్ లో వేశాను. వదిననడిగి ఎంతకావాలో తీసికెళ్ళు."
"ఎలా అడగనక్కయ్యా!"
"అప్పుగానే కదా! వదినకు నీమీద నమ్మకముందిలే! అదీగాక నువ్వంటే ఆమెకు చాలా ప్రేమ. నీ సంగతి వివరించి నువ్వే అడుగు బాగుంటుంది. తప్పకుండా ఇస్తుంది."
చలపతీ, పిల్లలూ వచ్చేశారు. శోభ లేచి లోపలికెళ్ళిపోయింది. ఉమ అందరికీ భోజనాలు వడ్డించడానికి లేచింది.
23
పార్వతి దగ్గిర అయిదువందలు తీసుకుని హైదరాబాద్ లోనే రెండు గదుల చిన్నవాటా అద్దెకు తీసుకుంది ఉమ. చలపతిని కాలేజీలో చేర్పించింది. ఒక కంపెనీలో కెమిస్టుగా చేరింది.
చలపతి కాలేజి కెళ్ళటానికి చాలా సిగ్గుపడ్డాడు. తోటి విద్యార్థులమధ్య చలపతి స్థానాన్నీ, అతడెదుర్కోబోయే అవహేళనలనూ ఊహించుకొని ఉమ కూడా కొంచెం బాధపడింది. రెండురోజులు కాలేజీ కెళ్ళిన చలపతి మూడోరోజున కాలేజికెళ్ళే ప్రయత్నమేం చెయ్యక కదలకుండా కూర్చున్నాడు.
"అలా కూర్చున్నారేం? కాలేజికెళ్ళరా?" అంది ఉమ. కంపెనీ కెళ్ళటానికి తయారవుతూ.
"నేను వెళ్ళను."
"అదేం?"
"నన్ను చూడగానే మిగిలిన పిల్లలంతా 'ఆయ్! చలపతి బాబాయ్!' అని నానాగోలా చేస్తున్నారు. ఆ మూక మధ్యకెళ్ళి చదువుకోలేను. అసలే మొద్దుని. ఈ గోలమధ్య చదువేం వస్తుందీ?"
చలపతి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఉమ మనసు జాలితో నిండిపోయింది. కాలేజి పిల్లల అల్లరి ఉమకు తెలియంది కాదు. వాళ్ళు ఒక్క ఆడపిల్లల్ని మాత్రమే ఏడిపిస్తారనుకోనక్కర్లేదు. వాళ్ళలో వాళ్ళూ పేర్లు పెట్టుకుని అల్లరి చేస్తారు. లెక్చరర్ల సంగతి అసలు చెప్పనక్కర్లేదు. ఈ విద్యార్థులకేం దివ్యచక్షువులుంటాయో కాని లెక్చరర్ వంటింట్లో జరిగిన విషయం కూడా నడిబజారులో ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వయసులో పెద్దవాడు, అమాయకంగా కనిపించేవాడు అయిన చలపతిని ఆటలు పట్టించటంలో ఆశ్చర్యం లేదు. ఈపాటికి చలపతి విషయాలన్నీ వాళ్ళకు తెలిసిపోయుంటాయి. వాటికి తగిన ప్రచారమూ జరిగిపోయి ఉంటుంది. ఇట్లాంటి విషయాలను సానుభూతితో విని సహకరించేవారు తక్కువ. హేళన చేసేవారెక్కువ. ఎంతో గుండెనిబ్బరం కలవాళ్ళు కూడా ఆ అవహేళనకు తట్టుకొని నిలబడలేరు. ఇంక చలపతి సంగతి చెప్పేదేవిఁటి?
"వాళ్ళంతా నవ్వుతారు. నిజమే! వాళ్ళనని ప్రయోజనం లేదు. ఈనాటి మన చదువులలా ఉన్నాయి. విద్యార్థులతో సగంమందికి పైగా అల్లరి చెయ్యటానికే కాలేజికొస్తున్నారు. లెక్చరర్లకు విద్యార్థులు భయపడటంపోయి, లెక్చరర్లే విద్యార్థులకు భయపడేరోజులివి. అంతెందుకు? విద్యార్థులలో పరపతి కోసం కొందరు లెక్చరర్లే విద్యార్థులతో చేరి అల్లరి చెయ్యటం, పనికిమాలిన కబుర్లు చెప్పటం తెలుసు నాకు. మీరు దిగులుపడకండి. కొన్నాళ్ళు కష్టంగా ఉన్నా, వాళ్ళకు మీకు కూడా కొన్నాళ్ళలో అలవాటైపోతుంది. మీరు బాధపడుతున్నట్లు తెలిస్తే వాళ్ళు మరింత రెచ్చిపోతారు! మిమ్మల్ని కానట్లుగా ఊరుకొంటే వాళ్ళే విసిగిపోతారు. నడవండి."
చలపతి బెంగగా చూశాడు.
"నేను వెళ్ళలేను ఉమా! వాళ్ళందర్నీ చూస్తుంటేనే నాకు కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి. నన్ను చంపకు."
ఉమకు గుండెల్లో రాయిపడినట్లయింది. తన ఇంత ప్రయత్నమూ వృథాయేనా? చలపతి ఇంక చదవడా?
"భయంలేదు. నేనూ వస్తాను పదండి" అంది.
ఉమ 'నేనూ వస్తా' ననేసరికి చలపతికి కొండంత ధైర్యం వచ్చింది. "పద!" అంటూ బయల్దేరాడు.
చాలారోజుల తరువాత కాలేజి ఆవరణలో అడుగుపెట్టేసరికి ఉమకే కాళ్ళు వణికాయి.
"అయ్ బాబోయ్! పిన్నమ్మ వెంటబెట్టుకొచ్చావే! ఝడుసుకున్నావా?"
"ఛ! ఛ! పిన్నమ్మ కాదేమోరా! కొత్త స్టూడెంటేమో?"
"ఏడిశావ్! చలపతి బాబాయ్ పక్కన నడిచే గర్ల్ స్టూడెంట్ లోకంలో ఎక్కడుంటుంది భాయ్!"
"బంధువులు కావచ్చుగా!"
"ఛ! ఛ! నీకు కళ్ళు సరిగా ఆనటంలేదు. వాళ్ళిద్దరినీ సరిగ్గా చూడు. బంధువుల్లా అనిపిస్తున్నారా? అదీగాక 'తిరమౌపయ్యెదలో నడంగి..' ఆ తరువాత గుర్తులేదు. అది కనిపిస్తోంది చూశారా?"
"అయితే పిన్నమ్మే నంటావా?"
"ఆహా! పాపం పిన్నమ్మే! 'తొలినే జేసిన పూజాఫలమిది'...."
విద్యార్థిలోకంలో దుమారం సాగుతూన్న ఈ వ్యాఖ్యానాలన్నీ ఉమా చలపతులకు వినిపిస్తూనే ఉన్నాయి. వినిపించాలనే వాళ్ళంటున్నప్పుడు వినిపించకేంచేస్తాయి? విచిత్రమేమంటే ఆ అంటున్న వ్యక్తెవరో ఎవరికీ తెలీదు. తీక్షణంగా వెనక్కు తిరిగేసరికి అంతా అమాయకుల్లాగా నిలబడిపోతారు. ఆ వ్యక్తిని కనిపెట్టడం బ్రహ్మతరం కాదు. వాళ్లలో వాళ్ళకంత కట్టు.
"వింటున్నావా ఉమా?" గొణిగాడు చలపతి.
"హుష్!" అంది ఉమ.
సహజంగా ఉమ ఎంతో మొహమాటస్థురాలు. చొరవగా ఎవరితోనూ మాట్లాడేది కాదు. కాని ఆ సమయంలో ఆమెకు లేనిధైర్యం వచ్చింది. స్వయంగా వెళ్ళి ప్రిన్సిపాల్ ని కలుసుకుంది.