Previous Page Next Page 
ఆత్మబలి పేజి 37


    శోభ చెయ్యి తలగడగా పెట్టుకొని తల వాల్చేసుకుంది. ఒక్కసారిగా ఆమెను అంతులేని నీరసం ఆవరించుకున్నట్లయింది.
    సరోజినీ భాస్కర్రావులు గుర్తొచ్చారు శోభకు. ఆ మధ్య ఆలిండియా రేడియోలో పాట పాడటానికి బెజవాడ వెళ్ళింది. రికార్డింగ్ అయి వస్తూంటే భాస్కరరావు కనిపించాడు. ప్రక్కన మాలిని కూడా ఉంది. వాళ్ళిద్దరూ బెజవాడలో కనిపించినందుకు ఆశ్చర్యపోతూ అలవాటుగా నవ్వింది.
    భాస్కరరావు ముఖం వెలవెలపోయిందిగాని ప్రీతిగా నవ్వాడు. మాలిని ముఖం తిప్పుకుంది. శోభ మాలినీ, భాస్కరరావులను సమీపించింది.
    "సరోజిని బాగుందా?" అని అడిగింది భాస్కరరావును.
    శోభ ఇలా మామూలుగా పలకరించటంతో భాస్కరరావు ప్రాణాలు కుదుటపడ్డాయి.
    "ఆ! కులాసాగానే ఉంది. మీరసలటు రావటంలేదు. పాట పాడటానికొచ్చారా? రండి. కాఫీ త్రాగుదాం." అంటూ హోటల్ కి దారితీశాడు. శోభకూ అలసటగా ఉండి కాఫీ త్రాగాలనే ఉంది. అతని ఆహ్వానాన్ని అంగీకరించింది. మాలిని ముఖం ముడుచుకుంది.
    "ఇందాకేగా త్రాగాం? ఇన్నిసార్లు త్రాగితే నాకు వికారపెడుతుంది." అంటూ తేలిపోయింది మాలిని. భాస్కరరావు అల్లరిగా నవ్వాడు.
    "అయితే నువ్వెళ్ళి మనగదిలో కూర్చో! నేను కాఫీ తాగొస్తాను" అన్నాడు.
    'మనగది' అనగానే ఉలిక్కిపడింది శోభ. భాస్కరరావు నాలుక కరచుకున్నాడు. మాలిని అతనివంక కొరకొరచూసింది. శోభ ఇంకేమీ మాట్లాడలేదు. కాఫీ తాగేసి వెంటనే స్టేషన్ కొచ్చి ట్రైన్ ఎక్కేసింది. సరోజిని రూపం కళ్ళముందు నిలిచి మనసంతా జాలితో నిండిపోయింది.
    ఎప్పుడో మూర్తి అన్నాడు :
    "మాలిని నన్నూరికే కవ్విస్తుంది. నాకు తనలో ఆకర్షణ లేదు. ఆ కసితో మీమీదా నామీదా లేనిపోనిమాటలు ప్రచారం చేస్తూంది" అని.
    ఇట్లాంటి మాటలు వినటం ఇష్టంలేక ఆనాడు మూర్తిమీద విసుక్కొంది. కాని తర్వాత ఆ మాట నిజమేనని తెలిసింది. తనను గురించి మాలిని నోటికొచ్చినట్లు మాట్లాడటం తనే స్వయంగా వింది.
    మాలినిపట్ల మొదటినుండీ వున్న విరక్తిభావం అసహ్యంగా మారింది. ఏలూరు చేరుకోగానే సరోజినిని కలుసుకుంది. సరోజినికి చెప్పాలా వద్దా అని మనసు మథనపడింది.
    చెప్పటం వల్ల ప్రశాంతంగా సాగుతున్న సంసారంలో కల్లోలం రేపినట్లవుతుందేమో!
    చెపితే సరోజిని ఏదైనా పరిష్కారం ఆలోచిస్తుందేమో!
    "ఏవిఁటాలోచిస్తున్నావ్!" అంది సరోజిని.
    "ఏం లేదు. మొన్న బెజవాడలో భాస్కరరావు కలిశాడు."
    "బెజవాడకెళ్ళారా ఏవిఁటి?
    "నీకు తెలీదా?"
    "ఎక్కడికో వెళ్తుంటారు. అబద్ధాలు చెప్పించటం ఇష్టంలేక వివరాలడగను."
    గతుక్కుమంది శోభ. "అయితే సరోజినికి తెలుసా?"
    "సరూ! మొన్న భాస్కరరావుతో మాలినికూడా కనిపించింది."
    "అలాగా!" నిర్లిప్తంగా అంది సరోజిని.
    ఒకసారి సరోజిని ముఖంలోకి చూసి ఊరుకుంది.
    సరోజిని నీరసంగా నవ్వింది.
    "నువ్వు చెప్పటానికి సందేహిస్తున్న విషయమేదో నాకు తెలుసులే శోభా! నాకిది అలవాటైపోయింది. ఫరవాలేదు. ఆయనెవర్నీ ఇంటికి తీసుకురారు. నన్ను కఠినంగా చూడరు. బుద్ధి పుట్టినప్పుడు నన్నూ లాలిస్తారు. నేనిచ్చిన కట్నం డబ్బులు నాకు గిట్టుబాటవుతున్నాయిలే! అంతకుమించి పాడే అర్హత నాకెక్కడిదీ?"
    కళ్ళలో నీళ్ళతో చిత్రంగా నవ్వింది సరోజిని. ఆ కన్నీళ్ళను, ఆ చిరునవ్వును సమన్వయించుకోలేకపోయింది శోభ. దిగులుగా వచ్చేసింది.
    ఏవిఁటీ జీవితాలు? మాలినిలాంటి ఆడవాళ్ళూ, మూర్తిలాంటి మొగవాళ్ళూ, సరోజినీ భాస్కరరావులు, ఉమా చలపతులు లాంటి దాంపత్యాలు, తప్పనిసరిగా ఉద్యోగం చేస్తూ ఏదో ఒక సంబంధం చేసుకోలేక, యోగ్యుడైన వరుణ్ణి కొనుక్కోగలిగే స్థోమతలేక, ఈర్ష్యాశువుల ఈర్ష్యాగ్నికీ, కామాంధుల కక్షలకూ గురై అపనిందలతో అవివాహితులుగా మిగిలిపోయే తనలాంటి కన్యలూ-
    ఏవిఁటీ సమాజం? పోలేక పోలేక పోయే పాతకాలపు అత్యాచారాల గ్రీష్మతాపానికీ, రాలేక రాలేక అతిమెల్లిగా వచ్చే సంస్కారయుత సభ్య సమాజానికీ నడుమ అందంగా, ఆకర్షణీయంగా ఆశలూ, భయాలూ కలబోసుకుని విరిసిన ఈ సంధ్యారాగంలో విజ్ఞానమలవరించుకొని సంస్కారం సంతరించుకొని పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పొంది దాని విలువను గుర్తించిన స్త్రీ ఎంత కాలమీ అయోమయంలో తడుముకోవాలి? ఈ సంధ్య అంతరించి వెన్నెల జల్లులు సంపూర్ణంగా స్త్రీ జీవితంపై ప్రసరించేదెన్నటికో?
    మోకాళ్ళపై తల ఆనించి అక్క వంకే చూస్తూ కూర్చుంది ఉమ. తీవ్రవాది అయిన అక్క మనసులో జరిగే సంఘర్షణ ఊహించుకోగలదు. పిచ్చిది. కాలం మారాలంటుంది. ఏ కాలంలోనైనా మనుష్యులే! చావుపుట్టుకలూ, ప్రేమాభిమానాలూ, ఈర్ష్యాద్వేషాలూ, కార్పణ్యాలూ అన్ని కాలాల్లోనూ ఉండేవే! లోభమూ, స్వార్థమూ అన్నికాలాల్లోనూ మానవుని మనసులో దోబూచులాడేవే! వాటివల్ల కలిగే సమస్యలూ ఎప్పటికీ తప్పవు. పరిస్థితుల కనుగుణంగా మనం మసలుకోవాలి కాని, మనకోసం పరిస్థితులు మారతాయా?
    కాని ఒకటాశించవచ్చు. అజ్ఞానం అనేక సమస్యలకు మూలం. విజ్ఞానావశ్యకత రోజురోజుకీ అధికంగా గుర్తించబడుతోంది. సంఘం అప్పటికంటే విజ్ఞానవంతమైనపుడు ఇప్పుడు బాధించే కొన్ని సమస్యలు దూరం కావచ్చు. సంఘంలో ఈనాడు డబ్బుకు విపరీతమైన ప్రాధాన్యం ఉంది. సంఘంలో సరైన విజ్ఞానం వ్యాపించిననాడు డబ్బు విలువకంటే వ్యక్తి విలువ అతిశయించవచ్చునేమో! అలా జరిగిననాడు ఇంకా చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. అయినా ఇదంతా ముందుతరాల సంగతి. కావచ్చు. కాకపోవచ్చు.

 Previous Page Next Page