అక్క తీవ్రమైన ధోరణికి బెదిరిపోయాడు సారధి.
"అది కాదక్కా! ఎంతైనా రత్నమ్మను భార్యగా చేసుకోవాలంటే - "అని నసిగాడు.
"అవును - చాటుమాటుగా నిలబడి తినేసేలా చూడటానికి రత్నమ్మ బాగుంటుంది కాని, భార్యగా బాగుండదు - నా తమ్ముడు కూడా అందరిలాంటి మొగవాడే!"
సారధి వంచిన తల ఎత్తలేదు - అప్పటికీ మాట్లాడలేదు -
"సరే! నీకు నచ్చిన సంబంధమే నువ్వు చేసుకో! నీ పెళ్ళి విషయంలో ఇంక నేను కల్పించుకోను - నా పొలంలో కొంత అమ్మి అయినాసరే, రత్నమ్మకి పెళ్ళి జరిపించి, ఈ రకంగానయినా జయన్న రుణం తీర్చుకుంటాను - మనిషిగా జన్మించినందుకు నాకూ కాస్త విశ్వాసం ఉందని నిరూపించుకుంటాను."
"అలా కష్టపెట్టుకోకక్కా! అందరూ రత్నమ్మది శని జాతకం అంటున్నారుగా! నీకు భయంగాలేదూ?"
"లేదు - నువ్వు శ్రీవైష్ణవుడివేగా! నీకూ శాంతులూ, హోమాలూ, అన్నీ తెలుసుగా! ఏదో శాంతి జరిపించెయ్యి - శని వదిలిపోతుంది."
"అక్కా!"
"ఏం? ఆ శాంతిలో నమ్మకంలేదు! కాని, ఈ శనిలో నమ్మకం ఉందికదూ! దేవుడంటే విశ్వాసం ఉన్నా. లేకపోయినా, దెయ్యాన్ని తలుచుకుంటే భయపడవలసిందే! సారధీ! అందరూ నిన్ను చిన్నప్పుడు శని జాతకుడివన్నారు. నేను నమ్మలేదు..... భయపడలేదు..... నిన్ను దూరం చేసుకోలేదు"
"నాతో నీ అనుబంధమూ, యిదీ ఒకటేనా అక్కా?"
"ఏం? జయన్న నాకు తమ్ముడికంటే ఏం తక్కువ? ఏ తమ్ముడు అంతకంటే ఆదుకుంటాడు?"
మనసు చివుక్కుమంది సారధికి.
"సరే అక్క నీ యిష్టం వచ్చినట్లే జరగనీ!"
"వద్దు సారధీ! అలా కష్టపెట్టుకోవద్దు.... బలవంతాన ఒప్పుకోవద్దు.... నువ్వే స్థిమితంగా ఆలోచించుకో దాని రూపురేఖలు నీకు తెలుసు - మనిషి మంచితనం అనువర్తన నాకు తెలుసు - మన మధ్య మసిలి మాటలో ఏసపోయింది - శుచి. శుభ్రత నేర్చుకుంది - మన ఇంటికొస్తే మన అలవాట్లు నేర్పించుకోవచ్చు - వినయంతో నేర్చుకుంటుందనే నమ్మకం ఉంది - అలా కాక నీకింకెవరినయినా చేసుకోవాలని ఉంటే చేసుకో!"
సారధి ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు - రత్నమ్మ రూపం అతనికి గిలిగింతలు పెట్టకపోలేదు - ఆ గుడిసెల మధ్య రత్నమ్మని చూడకపోతే, రత్నమ్మ ఏ కాలేజీలోనో తనకు కనిపిస్తే రత్నమ్మను ప్రేమించి వర్ణాంతరమైనా సరే, చేసుకోవటానికి తనకు అభ్యంతరం ఉండేది కాదు - రత్నమ్మను చేసుకోననటం తేలికే! కానీ, తనకు పిల్లనియ్యటానికి ఎవరు సిధ్ధంగా ఉన్నారు? తను కులం, గోత్రం ఆలోచిస్తే తనకు పిల్లనిచ్చేవాళ్ళు మాత్రం ఆలోచించరా? తన అక్క గతాన్నీ, తన గతాన్నీ తవ్వకుండా, ఎద్దేవా. చెయ్యకుండా, ఎవరు పిల్లనిస్తారు తనకి? ఏదో ఒకలోపం వుంటే తప్ప అలా ఎవరూ ఇవ్వరు - అంతకంటే రత్నమ్మనే చేసుకోవటం మంచిదికదూ? రూపం వుంది గుణం వుంది - అలవాట్లు నేర్పితే వస్తాయి. ముఖ్యమయినది అక్క చాలా సంతోషిస్తుంది - చిన్నప్పటినుంచీ తనకోసం అష్టకష్టాలు పడ్డ అక్కకి ఈ మాత్రం ఆనందం కలిగించిన వాడవుతాడు.
ఆ మరునాడు సారధితో పెళ్ళి విషయం ఏమీ ప్రస్తావించలేదు సరళ.
సారధీ గారాబంగా "నా మీద కోపం వచ్చిందా అక్కా!" అన్నాడు.
గారాబంగా, ఆ అడుగుతున్న ధోరణికి నవ్వొచ్చింది సరళకి -
"లేదు సారధీ! నిజంగా నీమీద నాకేమీ కోపం లేదు - ఎప్పుడూ రాదు" అంది వాత్సల్యంగా.
తన మాట కాదన్నా తనమీద కోపం తెచ్చుకోని అక్కమీద గౌరవంతో నిండిపోయింది సారధి మనసు.
"మరి, ఈ సారధికేనా, నీమీద ప్రేమలేదు? అక్కా! ఈ తమ్ముడు నీ ఆనతి జవదాటడు- రత్నమ్మని పెళ్ళి చేసుకుంటాడు - "అన్నాడు నాటక ఫక్కీలో.
సరళ ఎంతో ఆనందించింది - వాత్సల్యంగా "నీకిష్టం లేకపోతే పెళ్ళి చేసుకోవద్దులే తమ్ముడూ! నేనేమీ అనుకోను" అంది.
"రత్నమ్మంటే నాకిష్టమే అక్కా"
తమ్ముడి ముఖంలో వెలుగు చూసి ఆ మాటలు మనసారానే అంటున్నాడని నమ్మింది.
జయన్నని పిలిపించి సంగతి వివరించింది సరళ - తన చెవులని తను నమ్మలేకపోయాడు జైహింద్ బాబు.
"ఇది - ఇది సాధ్యమేనా?" అన్నాడు సంభ్రమంగా.
"అంత అసంభవానికేముంది ఇందులో? రత్నమ్మకేం తక్కువయింది? నా కష్టాలలో ఎన్నోసార్లు ఆదుకుని మా ఇంటి మనిషిలా కలిసిపోలేదూ?"
మాట్లాడలేక సరళకు రెండుచేతులూ జోడించి నమస్కారం చేశాడు అతడు.
విషయం విన్న అన్నమ్మ ఆనందంతో తబ్బిబ్బయింది - రత్నమ్మమాత్రం భయంతో "నా శని ఆరికికూడా కూడా పట్టుకుంటాదేమో" అంది.
"నోర్ముయ్" అనిచెల్లెల్ని ముద్దుగా కసిరాడు జైహింద్ బాబు.
ఏ ఆడంబరాలూ లేకుండా, ఎవరినీ పిలవకుండా ఆర్య సమాజంలో పెళ్ళికానిద్దామంది సరళ - జైహింద్ బాబు సంతోషంగా ఒప్పుకున్నాడు - గుడిసెల్లో ఎవరినీ పెళ్ళికి పిలవలేదు! అన్నమ్మకి ఆ పెళ్ళి సంతృప్తిగా లేదు - "ఇదేం పెళ్ళి? ఏ యేడుకలూ లేకుండా....." అని గొణుక్కుంది. ఏదో ఒక విధంగా రత్నమ్మ పెళ్ళయిందే చాలునని సంతృప్తి పడింది. పెళ్ళయిపోయాక గుడిసెల్లో అందరికీ విషయం తెలిసి ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకున్నారు.
సారధికి యల్. ఐ. సి, లో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూలో తన బయోడేటా ఇస్తూ తను వెనుకబడ్డ జాతిలో పిల్లను పెళ్ళి చేసుకున్న విషయం కూడా చేర్చాడు. ఆ కారణంచేత అతనికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు - కొంచెం రోజుల్లోనే సారధి ఆఫీసర్ గా సెలెక్టు అయినట్లు ఆర్డర్స్ వచ్చాయి. పరమానందంతో ఆ ఆర్డర్స్ సరళ చూపించి సరళ పాదాలకు నమస్కారం చేశాడు సారధి.
సరళ కూడా ఎంతో ఆనందించింది!
"సారధీ! నువ్వు రత్నమ్మను చేసుకోకుండా వుంటే, ఇంత మంచి ఉద్యోగం నీకు రావటం అనుమానమే? ఇప్పుడు చెప్పు, రత్నమ్మది శనిజాతకమా?"
"కాదక్కా! రత్న మనింటికి నిజంగా రత్న దీపం లాగే వచ్చింది."
తన కలలుపండిన పారవశ్యంతో తన అదృష్టానికి పరోక్ష కారకురాలయిన ఇల్లాలిని మనసారా మెచ్చుకున్నాడు సారధి.