అశాంతితో అలమటించిపోతున్న అతని మనసు అతణ్ని తట్టిలేపింది. ఆరాటంగా రత్నమ్మ పడుకున్న వైపు చూశాడు - రత్నమ్మ లేదు - గుండె ఝల్లుమంది..... కేకలు వేస్తే తల్లి లేస్తుందేమోననే భయంతో తన ఉద్వేగాన్ని నిగ్రహించుకుంటూ గుడిసె బయటికి వచ్చాడు. చుట్టుపక్కల రత్తి కనపడలేదు - దడదడలాడుతున్నగుండెలతో ముందుకు నడిచాడు.
అల్లంత దూరంలో ఒక స్త్రీ మూర్తి పరిగెడుతూ కనిపించింది. అది రత్తేనని నిర్ధారణ చేసుకున్న జైహింద్ బాబు "రత్తీ!" అని అరిచాడు! ఆ అరుపుకు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసి మరింత వేగంగా పరుగు పెట్టసాగింది రత్తి..... జైహింద్ బాబు అంతకంటే వేగంగా పరుగుపెట్టి రత్తిని కలుసుకుని దాని చెయ్యి పట్టుకొని "ఏం పనే ఇది రత్తీ?" అన్నాడు.
రత్తి ఏడుస్తూ అన్న గుండెలమీద వాలి "నన్ను సావనియ్యి జయన్నా! నా మూలంగానే మీకీ కష్టాలు!" అని ఏడవసాగింది.
గుండెల్లో బరువుతగ్గేవరకూ ఏడవనిచ్చాడు జైహింద్ బాబు- తరువాత నెమ్మదిగా బుజ్జగిస్తూ "ఈ శనీ, గినీ, ఇయ్యన్నీ ఒట్టిదే! మనోళ్లకి ఏం లేకపోయినా, ఈ నమ్మకాలు మాత్రం మిగిలాయి, పట్టుకు వేళ్లాడటానికి..... ఇంటికి రా! నీది బంగారు జాతకమని నేను రుజువు చేస్తానుగా?" అన్నాడు!
అన్నమాట కాదనలేక. ఉద్రేకపు పొంగు తగ్గగానే ఒంటరిగా వెళ్ళటానికి భయం వేసి, గుడిసెకొచ్చేసింది రత్నమ్మ.
అప్పటికే అన్నమ్మకు మెలకువ వచ్చింది. పక్కమీద రత్నమ్మ లేకపోయేసరికి ఆ తల్లి గుండె చెదిరింది. "రత్తీ! రత్తీ!" అని గుండె బాదుకుని ఏడవసాగింది.
రత్నమ్మ రాగానే అమాంతం ఆమెను కౌగిలించుకుని "రత్తీ! నాకడుపులో చిచ్చుపెట్టబోకే! నన్ను అన్యాయం చెయ్యబోకే! పాపిష్టిదాన్ని! నీకు పెళ్ళి చెయ్యకపోగా, నిన్ను తిట్టిపోశాను గదే! అయ్యన్నీ కడుపులో పెట్టుకోమాకే తల్లీ! నువ్వన్నాయమయిపోతే, ఇక నేనెట్టాబతుకుతానే అమ్మా!" అని కుమిలి కుమిలి ఏడ్చింది.
ఆ తల్లీ, కూతుళిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఇద్దరూ కలిసి చాలాసేపు ఏడ్చారు.
తనను కేంటీన్ లో సర్వర్ గా తీసేసినప్పుడు, తనకు జరిగిన అన్యాయాన్ని వ్యాసమూర్తితో చెప్పుకున్నాడు జైహింద్ బాబు - "ఆ! ఇంత అన్యాయమా? దయానంద్ ని అడుగుతా నుండు!" అన్నాడు ఆవేశంగా వ్యాసమూర్తి! ఆ తరువాత అతను ఆ విషయమే ఎత్తలేదు. వ్యాసమూర్తి దయానంద్ తో మాట్లాడాడనీ, అయినా జరిగిన అన్యాయాన్ని అరికట్టలేకపోయాడనీ. అర్థం చేసుకోగలిగాడు జైహింద్ బాబు. ఆతరువాత అతడు వ్యాసమూర్తి నుండి తన ఉద్యోగం విషయంలో ఏ విధమయిన సహాయాన్నీ కోరలేదు - ఒకవిషయం అన్యాయమని తెలిసేదాన్ని అరికట్టగలిగే శక్తి సామర్థ్యాలుండే, మౌనంగా పరిస్థితులకు లొంగిపోయిన వ్యాసమూర్తి ప్రవర్తనకు జైహింద్ బాబు మనసు కలుక్కుమంది. మళ్లీ అతడిముందే వాని స్వవిషయంలో చెయ్యి జాపటానికి మనస్కరించలేదు.
వారం రోజులకొకసారయినా సరళని కలుసుకుని ఏదో పిచ్చాపాటీ మాట్లాడటం బాగా అలవాటైపోయింది. జైహింద్ బాబుకి - అలా సరళతో మాట్లాడుతూ రత్నమ్మ పెళ్ళి ఫాల్స్ అంతా చెప్పి "చూడండి సరళమ్మా! ఈ మూడనమ్మకాలకి ఎలా జీవితాలు బలి చేసుకుంటున్నామో ఇక రత్తికి పెళ్లవుతుందనే ఆశలేదు - నిజానికి మా ఇంట్లో అందరిలో అది చాలా మంచిది. మంచివాళ్లకి మంచి జరుగుతుందనేది వొట్టి మాటేనేమో! దాని కర్మ అంతేనేమో!" అన్నాడు బాధగా.
జైహింద్ బాబు వెళ్ళిపోయాక కూడా రత్నమ్మ గురించే ఆలోచిస్తూ కూచుంది సరళ. ఆవిడకు లీలగా ఒక ఆలోచన వచ్చింది. తన ఆలోచనకు తనకే భయం వేసింది మొదట! కానీ ఆ ఆలోచన ఆవిడ మనసును వదలలేదు. మళ్ళీ మళ్ళీ ఆలోచించగా ఫరవాలేదని అనిపించింది. ఇంకా ఆలోచిస్తే దివ్యంగా ఉందనిపించింది....
సారధికి భోజనం వడ్డిస్తూ సరళ "సారధీ! నీకొక సంబంధం ఆలోచించాను - ఒప్పుకుంటావా?" అంది.
తన జీతం మొత్తం తన పేర బ్యాంక్ లో వేస్తూ "నీకు ఇల్లూ వాకిలీ ఏర్పడాలి. నాలా కాకుండా నువ్వయినా మంచి సంబంధం చేసుకుని సుఖంగా ఉండాలి!" అన్న అక్క మాటలు గుర్తుకొచ్చాయి సారధికి.
"నీ మాట ఎప్పుడు కాదన్నానక్కా!" అన్నాడు.
సారధికి పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడాలనే ఉంది.... అతడు ఇటీవలె లైఫ్ ఇన్యూరెన్స్ ఆఫీసర్ పదవులకోసం నిర్వహించిన కాంపిటీటివ్ పరీక్షలు వ్రాశాడు. చాలా బాగా వ్రాశాననుకున్నాడు! కానీ, ఆ పదవుల్లో యాభై శాతం వెనుకబడిన కులాలవాళ్ళకు కేటాయించినట్లు తెలుసుకుని కొంత నిరుత్సాహం పొందాడు! ఇప్పుడు తన అక్కచూసే సంబంధం ఎలాటిదో? ఆ అమ్మాయి ఎవరైనా ఆఫీసర్ గారి అమ్మాయి అయితే, ఆ ఆఫీసర్ గారి పరపతివల్ల తనకు మంచి ఉద్యోగం దొరికితే..... అలలు - అలలుగా సాగిపోతున్నాయి సారధికలలు....
"సారధీ! ఇంతవరకూ నేను విన్నదీ అడగలేదు! ఈ లోకంలో నాకు నువ్వూ, నీకు నేను తప్ప ఎవరూ లేరు. నా మాట కాదనవు కదూ?"
"నువ్వింతగా చెప్పాలా అక్కా! ఈ లోకంలో నీకంటే నామేలు కోరే వాళ్ళెవరు?"
తన ఆలోచన బాగుందని ఎంతగా అనుకున్నా, వెంటనే ఆ విషయం సారధితో చెప్పలేకపోయింది సరళ.
సరళ సంకోచంచూసి సారధి బెదురుగా "ఏమిటక్కా పెళ్లి సంబంధం విషయం చెప్పటానికి ఇంత ఆలోచనదేనికి?" అన్నాడు.
"నేను ఎంతో ఎంతో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను సారధీ! నువ్వూ, ఎంతో, ఎంతో ఆలోచిస్తేనే కాని, నా నిర్ణయాన్ని ఆమోదించలేవు - నువ్వు జయన్న చెల్లెలు రత్నమ్మని చేసుకోగలవా సారధీ?"
"ఛీ! రత్నమ్మనా?" మతిపోయినట్లే అరిచాడు సారధి..... అతని 'ఛీ'లో ఎంత చీదరింపైనా ఉంది.
"ఇందులో అంత చీదరించుకోవలసిన అవసరమేముంది సారధీ?"
"అదేమిటక్కా? ఆ కూలిగుడిసెల్లో మనిషిని......"
"సారధీ! అన్నీ మరిచిపోయి మాట్లాడకు- మనకు ఒకనాడు ఆమాత్రం ఆశ్రయం కూడా లేనిరోజున ఆ కూలి గుడిసెలే మనకు నీడనిచ్చాయి......"
"ఛ! ఆకులం....."
"కులం!..... అపనిందల పాలయి, కులంకాని వాడితో ఇల్లు వదిలి నడివీధిలో నిలబడిన నీ అక్కది ఏం కులంసారధీ? మిలటరీ కేంటీన్ లో చేపలూ, మాంసమూ వండటానికి సహాయం చేసి ఆ జీతం డబ్బులతో తమ్ముణ్ని చదివించుకున్న నీ అక్కదే కులం సారధీ? పురిటి రోజులు వచ్చి, ఉన్న ఆ కాస్త ఆధారమూ పోతుందేమోనని భయపడిన రోజుల్లో రత్నమ్మ ఆసరాతో కష్టకాలం గడుపుకొన్న నీ అక్కదే కులం సారధీ?"