లక్ష్మణుడు కౌసల్య దుఃఖం చూచాడు. ఓర్చలేకపోయాడు. ప్రళయకాలం రుద్రుడు అయినాడు.
అమ్మా! అన్నయ్య అడవులకు ఎందుకు వెళ్లాలి? రాజు ముసలివాడయినాడు. కామంతో ఆడదానికి లొంగాడు. అలాంటి రాజుమాట వినడం ధర్మంకాదు. అన్నయ్యా! కదులు తండ్రి ఆజ్ఞ అందరికీ తెలియకముందే రాజ్యం ఆక్రమించుకుందాం. దశరథుడు మనతండ్రి. నిజమే! కైకచేతి కీలుబొమ్మ అయినాడు. దుష్టుడయినాడు. మనకు శత్రువు అయినాడు. వధ్యతాం బధ్యతామపి. కట్టేద్దాం చంపేద్దాం. తండ్రి అయితే మాత్రమేం! ఆలోచన లేకుండా అకార్యం చేసినవాణ్ని శిక్షించవచ్చు.
అలా కాదంటావా? సత్యంమీదా, ధర్మంమీదా, ధనుస్సుమీదా ఒట్టుపెట్టి చెపుతున్నా రాముడు అడవులకు వెళ్తే నేనూ వెళ్తా. అతడు అగ్నిలో దూకాల్సి వస్తే ముందు నేనే దూకుతాను" అని ఉరిమాడు.
కౌసల్య లక్ష్మణుని మాటలు విన్నది. రామునితో అన్నది.
"రామా! నీవు ధర్మజ్ఞుడివి. నీకు తండ్రి ఎంతో తల్లి అంతే. నీవు ఇక్కడే ఉండిపోవాలని నేను కోరుకున్నాను. నేను ఏడ్చినా నువ్వు వెళ్లిపోతే నేను ప్రయోపవేశం చేసి చచ్చిపోతాను. అందువలన నీకు దుర్గతి కలుగుతుంది.
"అమ్మా! తండ్రిమాట వ్యతిరేకించేశక్తి నాకు లేదు. తండ్రి మాటకు అడ్డుపలకలేను. అతిక్రమించలేను. నేను అడవులకు వెళ్లడానికి నిశ్చయించాను. నన్ను ఆశీర్వదించి పంపించు" అని తల్లిని ఓదార్చాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు.
"తమ్ముడూ! నీ భక్తి నాకు తెల్సు. నీ శక్తి నాకు తెలుసు. కాని నా సంకల్పం తెల్సుకోకుండా మాట్లాడి ప్రయోజనం లేదు. ధర్మం అర్థం కామం మూడూ మంచివే. ఒక పనితో ఆ మూడూ సిద్ధించాయనుకో ఆ పని తప్పక చేయవలసిందే. ఒకపని చేస్తే అర్థం. కామం సిద్ధించక, ధర్మం మాత్రమే సిద్దించినదనుకో - ఆ పనీ చేయాల్సిందే - కాని ఒక్క అర్థం మాత్రమే సిద్దించే పనిచేయకూడదు. ఒక కామం మాత్రం సిద్ధించే పని కూడా చేయరాదు. అట్లాగాక అర్ధం కామం రెండు సిద్ధించి, ధర్మం సిద్ధించకుంటే ఆ పని చేయరాదు.
"దశరథుడు మనకు గురువు - రాజు - తండ్రి. అతడొక మాట చెప్పాడు. అది యిష్టపూర్తిగా చెప్పినా, కోపంతో చెప్పినా, కామానికి లోబడి చెప్పినా, మనందాన్ని ఆచరించాల్సిందే. ఎంచేతనంటే దాన్ని నెరవేరుస్తే ధర్మం కల్గుతుంది. వ్యతిరేకిస్తే అర్ధం మాత్రం కలుగుతుంది. అర్ధం మాత్రం కల్గేపని త్యాజ్యం. దశరథుడు నాకూ, భరతునికీ తండ్రే. అతడు ఏది ఆజ్ఞాపించినా మేం చేయాల్సిందే."
ఐనా లక్ష్మణుడు శాంతించలేదు. రాముని వాదం అతనికి నచ్చలేదు. అతని కళ్లల్లో మంటలు కనిపించాయి. రాముడది చూశాడు. ఇంకా ఇట్లా అన్నాడు.
"తమ్ముడూ! మన తండ్రి సత్యవాది - సత్యపరాక్రముడు. అతడు ఇచ్చిన మాటను నిలబెట్టడం మనవిధి. అలా చేయకుంటే అతనికి ఉత్తమ లోకాలు లేకుండాపోతాయి. అంతేకాదు మన రాజ్యం రాకపోవడానికి, నేను అడవులకు వెళ్లడానికి తండ్రి కారణమని ఎందుకనుకోవాలి. అన్నింటికి దైవమే కారణం. అలా కాకుంటే కైక నాకు తల్లి. నన్నూ భరతుణ్ణీ సమానంగా ప్రేమించింది. ఆమెకిటువంటి బుద్ధి ఎందుకు పుట్టాలి? కైక సహజంగా ఉత్తమురాలు. రాజవంశంలో పుట్టింది. మంచి గుణాలు కలది. అన్నింటినీ మించి నన్ను ఎక్కువగా ప్రేమించింది. అలాంటి కైకకు ఇలాంటి బుద్దెందుకు పుట్టాలి? అది దైవసంకల్పం.
దైవం వున్నదనటానికి గుర్తేమిటి? దైవాన్ని బలగర్వాలతో గెలవలేమా? అంటావేమో? విను. దైవం కంటికి కనిపించేది కాదు. ఫలితాన్ని బట్టే దైవసంకల్పాన్ని తెలుసుకోవాలి. మహర్షులు గొప్ప తపస్సును చేస్తారు. అలాంటి వాళ్లు కూడ కామ క్రోధాలకి లోనవుతారు. భ్రష్టులవుతారు. ఒకేవిధమైన ప్రయత్నం చేస్తే, ఫలితాల్లో సామ్యం ఉండదు. ఎంతో ప్రయత్నించి ప్రారంభించిన పని పాడవుతుంది. ఎలాంటి ప్రయత్నం లేకున్నా ఒకపని సిద్ధిస్తుంది. వాటన్నింటికి దైవమే కారణం.
'నాకు అదంతా తెల్సు. కాబట్టి విచారం లేదు. నాకు రాజ్యం, వనవాసం సమానాలే. కాబట్టి పట్టాభిషేకానికి విఘ్నం కల్గించింది కైక కాదు దైవం. దైవాన్ని ఎదిరించడం ఎవరి తరమూకాదు.'
రాముని ఉపన్యాసం విన్నాడు లక్ష్మణుడు. ఐనా అతని కోపం తగ్గలేదు. అతని మంటలు చల్లారలేదు. అతడిలా అన్నాడు:-
"అన్నా! బలంలేని దైవాన్ని బలీయమనడం నీ భ్రాంతి. దైవం కంటికి కనిపించడంలేదు. అలాంటి దైవాన్ని వీటన్నింటికి కారణం అంటున్నావు. దశరథుడు, కైక కంటికి కనిపిస్తున్నారు. వారిని దోషులు కాదంటావు. ఇదంతా వారు పన్నిన కుట్ర-మోసం. భరతుడు పట్టం కట్టుకొని కులకటం ధర్మవిరుద్ధం" అలాంటి పితృవాక్యం నీకు గొప్పది కావచ్చు. నాకు మాత్రం కాదు. దాన్ని తిరస్కరించడమే నా ధర్మంగా భావిస్తాను. బుద్ధిహీనులు మాత్రమే దైవాన్ని నమ్ముకుంటారు. పరాక్రమవంతుడు దైవాన్ని లెక్కసేయడు - దైవశక్తి గొప్పదో, పురుషశక్తి గొప్పదో ప్రజలే తెల్సుకుందురుగాక - నా పౌరుషంతో దైవాన్ని లొంగదీస్తాను. వజ్రాయుధం ధరించి ఇంద్రుడు అడ్డువచ్చినా నరికివేస్తాను. నా అస్త్రంలో దశరథుణ్ణి కూలదోసి, నీకు పట్టంకడ్తాను. చెప్పు నీకు శత్రువు ఎవరు? నేనెవరి ప్రాణాలు తియ్యాలి. ఈ భూమండలం సాంతం నీకు వశమయ్యె ఉపాయం చెప్పు. నీవెలా చెబితే నేనలా చేస్తాను. నేను నీకు సేవకుణ్ణి - మరేం కాదు."
లక్ష్మణుని దుఃఖం పెల్లుబికింది. జలజల కన్నీళ్లు కార్చాడు. రాముడు అతని కన్నీరు తుడ్చాడు. అతన్ని శాంతపరిచాడు - "తమ్ముడూ! సౌమ్యంగా ఉన్న నీకు ఇంత ఉద్రేకమెందుకు పడ్డావు? నేను తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాల్సిందే" అన్నాడు.
రాముని నిశ్చయం విన్నది. కౌసల్య దుఃఖం పొంగింది. నా రాముడు పరిగ ఏరుకుని ఎలా జీవిస్తాడు? అతని సేవకులు మంచి భోజనం చేస్తుంటే ఇతడు కందమూలాలెలా తింటాడు? నీవు సమస్తభూతములకు ప్రియుడివి. బలవంతుడివి. ఐనా నిన్ను దైవం అడుగునకు తోస్తున్నది. నీవు లేకుంటే నేను దుఃఖాగ్నిలో కాల్చివేయడం నిశ్చయం. దూడవెంట ఆవు పోకుండుట సంభవమా? నేను కూడా నీ వెంట అడవులకు వస్తాను.
అప్పుడు రాముడు "తల్లీ! నా తండ్రి కైకవల్ల వంచితుడైనాడు. నేను అడవులకు పోతున్నాను. నీవు నా వెంట వస్తే అతనెట్లా జీవిస్తాడు? అంతేగాదు. భర్తను వదలిరావడం దోషం. అలాంటి దోషం నీవు మనసులోనైనా తలచరాదు. నా తండ్రి వున్నంతకాలం నీవతనిని సేవించవలసిందే" - అని అన్నాడు.
'నాయనా! నిన్ను నేను ఆపలేను. కాలగతిని ఎవరూ తప్పించలేరు. దైవం బలీయమైంది. అదే నాతో నిన్ను అడవులకు వెళ్లమనిపిస్తూంది. అని కౌసల్య కొడుకును దీవించింది.
తల్లివద్ద సెలవు తీసుకొని రాముడు సీత వద్దకు వెళ్లాడు.
సీత శుభకార్యాలు ముగించుకొని రాముడు కోసం ఎదురుచూస్తున్నది.
సీతకీవార్త ఎలా చెప్పడమా? అని తల నేలకు వాల్చి రాముడు భవనంలో ప్రవేశించాడు. రాముడు మనసు కలతచెంది వున్నది. అతడు భయంతో వణికిపోతున్నాడు. సీత రాముని చూచింది. చప్పున లేచింది. రాముడు సీతను చూచాడు. దుఃఖం ఆగిందికాదు. దుఃఖం బయటపడింది.