"మీరలా కూర్చుంటే నాకేం బాగాలేదు."
"ఏం చేయమంటారు?"
"ఏమయినా చదువుకోండి. లేకపోతే నాతో కబుర్లు చెప్పండి. అంతే కాని ఎంతసేపూ ఒకే విషయం గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంటే మతి చెడుతుంది."
"జిజ్ఞాసలేకుండా ఏ పనీ చేయలేం కదా! మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. అది సాధ్యమంటారా పంతులుగారూ?"
ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేక "మీ ఇష్టం" అని లోపలకు వెళ్ళి పోబోయాడు.
"చూడండి" అంది శకుంతల చిన్నగా, "నాకు ఇవాళ బీచికి పోదామని వుంది. మీరు వస్తారా?"
ప్రకాశరావు సంతోషంగా "తప్పకుండా" అన్నాడు.
ఆ తర్వాత ఇద్దరి మధ్యా యెక్కువ సంభాషణ జరగలేదు. ఆమె చాలా సేపటిదాకా యోగినిలా అలాగే కూర్చుంది. అతను గదిలో పచార్లు చేస్తూనే ఉన్నాడు. అయిదింటికి ఇద్దరూ బయల్దేరారు. నడిచే పోసాగారు.
బీచికి చేరుకొని జనస్మర్దం యెక్కువగాలేని ప్రదేశంలో ఇద్దరూ కూర్చున్నాక శకుంతల అంది మన్లవదనంతో "మీకు గుర్తుందా? ఇది రెండోసారి మనమిద్దరం కలిసి రావటం."
"అవును."
అంతే చాలాసేపటిదాకా ఇద్దరూ మాట్లాడుకోలేదు. అటూ ఇటూ తిరుగుతున్న మనుషుల్ని చూస్తూ, సముద్రపు హొరుని వింటూ కాలం గడిపేశారు.
కనుచీకటి పడబోతున్న సమయానికి శకుంతల అంది వినిపించీ వినిపించనట్లుగా "నాకు ఒక్కటే అర్థం కాలేదు."
"ఏమిటి?"
"ఎక్కువ విచారం కలిగినప్పుడు, ఆ మహా విచారంతో ప్రపంచంమే మరిచిపోయాక ఇంకా స్వార్థం పనిచేస్తూ వుంటుంది. బీచికి రావాలని యెందుకు అనిపించింది? విచారాన్ని మరచిపోవాలని, మనసు ఉల్లాసం కలగాలని! అలా యెందుకు అనిపించాలి? తండ్రి చనిపోయిన యీ విషాదకరమైన సమయంలో ఇటువంటి యోచనకు చోటు ఎక్కడ్నుంచి వచ్చింది?" అని నిట్టూర్పు విడిచి "అంటే మళ్ళా జీవితంమీద మమకారం కలుగుతుందన్నమాట. సుఖాలమీద ఆశ కలుగుతుందన్న మాట. దుఃఖాల మీద జుగుప్స కలుగుతుందన్నమాట. ఛీ? ఏం మనుషులం? అంది.
ప్రకాశరావు ఆ రోజు మొదటనుంచీ మాట్లాడుతున్న సహజ ధోరణిలో "మనుషులం గనుకనే ఏ ఎండకి ఆ గొడుగు పట్టేందుకు ప్రయత్నిస్తాం. ఈ మమకారాలూ, ఆశలూ లేకపోతే మనం బ్రతకటం వ్యర్ధం గనుక యెప్పుడో చచ్చిపోవచ్చు. అలా జరిగేందుకు వీలులేదు. గనుక కాలానికి ఒక విచిత్రమైన ప్రభావం వుంది. అది మనుషుల్ని ఎప్పటికప్పుడు మామూలు స్థితిలోకి తీసుకువస్తుంది" అన్నాడు.
"అయితే కొన్ని రోజుల తర్వాత నేను నాన్నగారిని పూర్తిగా మరచిపోతానన్న మాట."
ప్రకాశరావు చకితుడై యీ విచిత్ర ప్రశ్నకు జవాబు చెప్పలేక వూరుకున్నాడు.
"మీరు జవాబు చెప్పరు. నాకు తెలుసు. జవాబు ఒక్కటే..... నేను పాపిష్టిదాన్ని.
ప్రకాశరావు వ్యాకులపాటుతో "మీరలా వ్యధచెందుతారెందుకు? అది లోక విరుద్దమైన విషయం అయితేగా" అన్నాడు.
"అమ్మపోయిన్పట్నుంచీ నన్ను ప్రేమతో పెంచాడు. ఆయన ప్రేమలో కరిగిపోయి నేను స్నేహాన్నీ, అభిలాషల్నీ ఇవన్నీ విస్మరించాను. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని నేను ఎక్కాడా ఇకముందు.....చూడలేను."
ప్రకాశరావు మౌనంగా వింటున్నాడు. ఆమె తర్వాత మాట్లాడలేదు. చీకటిలో ఒకరి ముఖాలు ఒకరికి సరిగ్గా కనబడలేదుకూడా. కొంచెం వుండి అతను స్తబ్దుడయ్యాడు. నిశ్శబ్దంగా తనలో తను కుమిలిపోతూ ఏడుస్తోంది.
"మీరు.......మళ్ళీ"
శకుంతల లోపలినుంచి పొంగి పొర్లి వస్తోన్న దుఃఖాన్ని అణుచుకోలేక పెద్దగా విలపిస్తూ "నాకు తల్లీ తండ్రీ ఎవరూ లేరు. ఏడవక యేం చేసేది?" అంది.
"మీకు ఏ లోటూ వుండకుండా చూడటానికి నే నున్నాను." అని అందామనుకున్నాడు అతను. కాని సిగ్గుపడి వూరుకున్నాడు. ఆమెను ఓదార్చి దుఃఖం నుండి విరమింపజేయటం అతనికి క్లిష్టమైన సమస్యగా పరిణమించింది. ఇంటికి వచ్చేసరికి ఎనిమిది దాటింది.
తండ్రి పోయినప్పట్నుంచి శకుంతల రాత్రులు ఒంటరిగా పడుకోవటానికి భయపడుతోంది. కళ్ళు తెరచినా మూసినా నవ్వుతూ, బాధపడుతూ అనేక రకాలుగా తండ్రి స్వరూపం కనబడేది. ఆయన పడుకున్న మంచం, చనిపోయిన స్థలం ఇవన్నీ చూసేసరికి ఆమె శరీరం గజగజమని ఒణికి పోయేది అప్పట్నుంచీ రంగయ్య ఆమెకు తోడుగా పడుకుంటున్నాడు. ఇవేళ ప్రకాశరావు వచ్చాడు. తను వచ్చినప్పట్నుంచీ ఆమెకు క్రమ క్రమంగా స్వస్థత చేకూరసాగింది. సిగ్గువిడిచి తనకు సహాయంగా హాల్లోనే పడుకోమంది. ఆమె ఏదికోరినా నిర్వర్తించేందుకు అతను సిద్ధంగానే వున్నాడు.
ప్రకాశరావుకు చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు. శకుంతల భయపడుతుందని లైటు వేసే వుంచాడు. ఒక రాత్రివేళ లేచి ఆమె మంచం దగ్గరకుపోయి ముఖంలోకి పరీక్షగా చూశాడు. నిద్రలోకూడా...... ఆమె వదనం అంతా చీకటిచ్ఛాయలు క్రమ్మి వేసివున్నాయి. పెదాలవణుకు తగ్గలేదు. ఒకనాడు చిలిపిగా మాట్లాడివున్న ఆమె మనస్తత్వం అంతా మరచిపోయింది. ప్రకాశరావు నిట్టూర్చి "పిచ్చిపిల్ల" అనుకున్నాడు.
పడుకోబోతూ "భగవాన్! ఈమె బాధ్యత యికముందు నామీద వుంది. చాక చక్యంగా ప్రవర్తించగలిగేటట్లు చెయ్యి" అని వేడుకున్నాడు.
19
ఈరోజు రాధ మనసంతా చాలా చిరాకుగా వుంది. దెబ్బతిన్న హరిణంలాగా బెదిరిపోసాగింది. శత్రువుని చూసిన జెర్రిగొడ్డులా బెదిరిపోసాగింది. పరాజయం పొందిన సైనికునిలా అవమానంతో కుమిలిపోసాగింది.
ఉదయం కృష్ణుడు వచ్చి ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. అది చదువుతున్నప్పటినుంచీ ఆమె అజ్ఞాత వ్యక్తిమీద మండిపడసాగింది. సరిగ్గా భోజనంకూడా చేయలేదు "అదేమిటే?" అని తల్లి అడిగితే, "నాకాకలిగా లేదు" అని విసురుగా జవాబుచెప్పి కంచంలో చేయి కడుక్కొని ఇవతలకు వచ్చేసింది. గదిలోకిపోయి చాపవేసుకొని వ్యధచెందసాగింది.
ఈలోగా లోపల్నుంచి ముసలావిడ "మంచినీళ్ళు, మంచినీళ్ళు" అని అరిచింది.
రాధ వినిపించీ వినపించనట్లుగా ఊరుకుంది.
ఆవిడ మళ్ళీ అరిచేసరికి "పోపో, ఇక్కడ నీకు అన్నీ తేరగా అందించటానికి సేవకుల్లా పడివుండలేదు" అని విసురుగా జవాబిచ్చింది.
ఆవిడ "అంతేలేవే! నాఖర్మమిట్లా కాలిపోయింది. నా కాలూ, చేయ్యి బాగా వుంటే ఒకరిచేత చేయించుకుందునా? పదిమందికి చేసిపెట్టేదాన్ని. నన్ను త్వరగా తీసుకుపోవేమిట్రా తండ్రీ!" అని ఏడ్చుకుంది.
అసలు రాధ ఇలా సాధారణంగా విసుక్కోదు. అందులో జబ్బులో వున్న మనుష్యులంటే ఆమెకు ఎడతెగని సానుభూతి. వాళ్ళని దేవుడు చిన్నచూపు చూశాడని ఆమె బాధపడుతూ వుంటుంది. కాని ఇవాళ పరిస్థితి వేరుగా వుండటంచేత ఆమె మాటలు విని రుసరుసలాడింది. వంటింట్లో నుంచి వస్తూన్న అన్నపూర్ణ యీ గొడవంతా విని గ్లాసుతో నీళ్ళు తీసుకొని ముసలావిడ వున్న గదిలోకి వెళ్ళింది. "నిండుచూలాలివి నీకెందుకో శ్రమ" అంటూనే ఆవిడ పీడా అనుమరాలు నోట్టో నీళ్ళుపోస్తూ వుంటే గుతగుతా మింగింది.
నిద్రపోయేందుకు పడుకోలేదు రాధ. ఆమె మాటిమాటికీ "ఈ మగవాళ్ళంతా ఇంతే" అని అనుకోసాగింది.
మొదట్నుంచీ అనుకుంటూనే వుంది, ఇలా జరుగుతుందని! ఎందుకు వొప్పుకుంటారు వాళ్ళు? వాళ్ళకేమిటి అవసరం! ధనవంతులు వాళ్ళు తాము. ఇంట్లో ప్రతాపం చూపించలేని ఆనందరావు తనముందు ప్రగల్భాలు పలికాడు. ఇంకా పైగా సిగ్గు విడిచి ఉత్తరం రాస్తున్నాడు. అతన్తో మద్రాసు వచ్చేసేయాలట. అక్కడ "రిజిష్టర్ మేరేజ్" చేసుకుంటాడట. అంతులేని కోపంతో, పరితాపంతో ఆమె హృదయం క్షోభించసాగింది. అసలు అతనెవరు? తనని పెళ్ళి చేసుకోమని ఎవరు అడిగారు? అతనంటే అయిష్టం మాత్రం లేనందున ఇంట్లోవాళ్ళు వొప్పుకుంటే సరేనంది. వాళ్ళు ఒప్పుకోలేదు. అంత బాధపడటం దేనికి?
కాని ఈ విధంగా ఆమె ఆత్మద్రోహం చేసుకొని సంతృప్తి కలిగించుకోలేకపోయింది. చుట్టూ వున్న మునుష్యులపై విరక్తి జనించసాగింది. మనసులో పెంపొందించుకున్న ఆశలు విఫలమైతే ఇలాగే అశాంత వాతావరణం ఏర్పడుతుందని ఆమె గ్రహించింది.
కాని........
అన్నీ తెలిసే ఆమె యేదో కలలు కనసాగింది.
అలా యెక్కువసేపు జరగకముందే ఆమెకు విసుగుపుట్టింది. ఆలోచనలతో కాలిపోతూ ఎంతసేపని పడుకుంటుంది? లేచి నిలబడి వంటింట్లో వున్న తల్లి దగ్గరకు వెళ్ళి "నేను కాసేపు ప్రమీలా వాళ్ళ యింటికి పోయి వస్తానమ్మా " అంది.
తల్లి కూతురుకేసి నిదానించి చూసి "సరే" అంది. రాధ బయలుదేరింది. ముందు గదిలో పడుకొనివున్న వాసు "ఎక్కడకు అక్కా?" అని అడిగాడు. "ప్రమీల ఇంటికి" అని జవాబు చెప్పి రాధ బయటకు వచ్చింది.
దార్లో ఆనందరావు ఇంటిమీదుగా పోవలసి వచ్చినప్పుడు ఆమె మనసు ఆవేశంతో పరవళ్ళు తొక్కింది. అతను గదిలోనే వున్నాడు. కిటికీ లోంచి రోడ్డుమీదకు చూస్తున్నాడు. అతనికి ఆకస్మికంగా రాధ కనిపించింది. ఆమెకూడా అతనివంక సూటిగా చూసింది.
అతను నేరం చేసిన వాడిలాగా తల వంచుకున్నాడు. తరువాత ధైర్యం చేసి తలయెత్తి చూచేసరికి ఆమె అతనివంక చూడకుండా విసురుగా వెళ్ళిపోతోంది.
"అతను కనిపించకుండా వుంటే బాగుండేది" అనుకుంది రాధ, లేనిపోనీ వ్యధతో. ప్రమీల ఇంటికి వెళ్ళేసరికి ఎదురుగా మనుషులు ఎవరూ కనిపించలేదు. మెట్లెక్కి తిన్నగా లోపలకు వెళ్ళింది. ప్రక్కనున్న గదిలోంచి ఏవో మాటలు వినబడేసరికి చటాలున ఆగిపోయింది.
"నేనేం తప్పు చేశాను?"
"ఎవరన్నారు చేశావని? నువ్వేం చేయలేదు"
"అయితే ఎందుకు కోపం?"
జవాబు లేదు.
"నాతో మాట్లాడటానికి కూడా అసహ్యంగా వుందా?"
"అబ్బబ్బా! నన్ను చంపక యిక్కడినుంచి వెళ్ళిపోదూ?"
రాధ ఒక ప్రక్కకు వొదిగి నిలబడి ఆశ్చర్యంగా వింటోంది. వాళ్ళిద్దరూ కీచులాడుకుంటూండగా వినటం ఇదే ప్రధమం. నివ్వెరపోయి అలానే నిలబడిపోయింది.
"కాదు. మీరీ మధ్య ముభావంగా వుంటున్నారు. నాతో చెప్పండి. సరిదిద్దుకుంటాను" ప్రమీల దీనంగా అంది.
"నువ్వేమీ చేయలేదని చెప్పలా? అంతా నేనే చేసుకున్నాను."
"మీరు చేసుకున్నదేమిటి? ఎందుకింత చికాకు చెప్పండి. నాకు తెలియనివ్వకుండా మీ రెందుకింత బాధపడాలి?"
"నీతో చెబుతే ఆరుస్తావా : తీరుస్తావా?"
"ప్రయత్నిస్తాను."
"వద్దులే. నన్నిలా బ్రతకనియ్యి."
కొంతసేపు మౌనంగా గడిచింది. తరువాత ప్రమీల ప్రార్థిస్తున్నట్లుగా అంది; "నేను ఒక్క విషయంలో సందేహిస్తున్నాను. అడగమంటారా?
"ఏమిటే నీ గొడవ?"
"మీరలా విసుక్కోకండి. ఇప్పటికే మీ ముఖాన్ని చూసి అనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాను" అని గద్గదికంగా "చూడండి, ఈ ఇంట్లో ఇలా వుండటం మీ కిష్టం లేదా?"
"అదేమీ కాదులే" శ్రీపతి విసుగ్గా జవాబిచ్చాడు.
"మరి?"