Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 36


    "మీరు పిచ్చి మనుష్యులు కాబట్టి సర్దుకుపోతారేమో కాని అందరూ అలాంటివాళ్ళు కాదు."
    "మీ వదినెను కూడా అలా దుయ్యబట్టేస్తున్నావేంటి? పాపం ఆమె ఎంత మర్యాదగా చూసింది - మనం అక్కడ వున్నన్నాళ్ళూ?"
    మా ఆవిడ క్పంతో మండిపడుతూ చూసింది నావేపు. "సరేలెండి సంబరం! మీకు రోజూ చికెన్ కర్రీ పెట్టేసరికి ఇంకేం తెలీవు. వాళ్ళు ఛీ పొమ్మన్నా పట్టించుకోరు! ఏం మనం వున్న నాలుగు రోజులూ ఆమెగారు ఆఫీసుకి వెళ్ళకపోతేనేం? మనల్ని వాళ్ళ పనిమనిషికి అప్పజెప్పి తన దారిన తను షికార్లు చేస్తుందా?"
    "అందులో తప్పేముందే ఉద్యోగస్తులన్నాక..."
    నా మాట పూర్తికానేలేదు- ఆమె ఆ కవర్ లాక్కుని అక్కడినుంచి విసవిసా నడుస్తూ వెళ్ళిపోయింది గొణుక్కుంటూ.
    ఆ సాయంత్రం చెస్ ఆడడానికి సాయిరామ్ వచ్చాడు.
    "ఆ బోస్ గాడు చూశావట్రా- ఎంతపని చేశాడో?"
    "ఏం చేశాడు?"
    "నేను ఒక చీటీ పాడాను కదా మొన్న- షూరిటీగా సంతకం చేయమంటే- చేయనన్నాడు" నేను ఆశ్చర్యపోయాను.
    "అదేమిటి? ఎందుకలా అన్నాడు? మనకు మంచి ఫ్రెండ్ కదా వాడు?"
    "నేనూ అదే అనుకున్నా ఇన్నాళ్ళూ! కానీ ఇప్పుడు తెలిసింది వాడి స్నేహం ఏమిటో!"
    "నేనింకా నమ్మలేకపోతున్నాను అలా అన్నాడంటే - ఇంతకూ ఎందుకు చేయనంటాడు?"
    "కిందటిసారి ఇలాగే ఇంకో ఫ్రెండ్ ఒకతనికి షూరిటీ ఇచ్చాడట. వాడు డబ్బు కట్టలేదని కోర్టు వాళ్ళొచ్చి వీడి ఇంట్లో వున్న ఫ్రిజ్, గాస్ స్టవ్, వాషింగ్ మిషన్, టీ.వీ. అన్నీ తీసుకుపోయారట.
    "అయ్యో పాపం - అప్పుడేమయింది మరి?"
    "ఇంకేమవుతుంది? వాళ్ళావిడ మెడలోని గొలుసు తాకట్టు పెట్టి డబ్బు కట్టి అన్నీ విడిపించుకొచ్చాడట."
    "పాపం! చాలా దెబ్బతిన్నాడన్నమాట"
    "అందుకని వాళ్ళావిడ గట్టిగా చెప్పిందట- ఇంకోసారి ఎవ్వడికి షూరిటీలు ఇవ్వవద్దని"
    "కరెక్టేలే - అంత గొడవ జరిగి, అంత కష్టం భరించాల్సి వస్తే ఎవరూరుకుంటారు?" నా మాటతో సాయిరామ్ కి కోపం వచ్చింది.
    "ఏడ్చావ్ లేరా! నేనూ అదివరకు వాడు షూరిటీ ఇచ్చినవాడూ ఒకటేనా? నేను అలా పాడుకున్న చీటీలు కట్టకుండా ఊరుకుంటానా?"
    "ఊరుకోవనుకో కానీ - బోస్ గాడున్న పరిస్థితిలో..."
    "నీకు తెలీదు నువ్వూరుకోరా! వాడు స్నేహానికి పనికిరాడ్రా౧ జస్ట్ మనల్ని వాడుకోవడానికి స్నేహం చేస్తున్నాడంథె౧ నక్కబుద్ధి అది!"
    "అయినా నువ్వు ఇంకోడిని వెతుక్కోవచ్చుగా! దాన్ని గురించి ఎందుకింత ఎగ్జయిట్ అయిపోవడం?"
    "వెతుక్కోక ఊరుకుంటానేమిటి? వాడి బాబులాంటి వాళ్ళతో సంతకం పెట్టించి, ఆ కాగితం వాడి మొఖం మీద కొట్టినట్టు చూపిద్దామని వాడి దగ్గరకెళ్ళా!"
    "అది చూసి క్షమించమంటూ కాళ్ళమీద పడ్డాడా?"
    "ఎక్కడా వాడింట్లో వుంటేగా?"
    "ఎక్కడికెళ్ళాడు?"
    "అంతకుముందింకెవడికో ఇంకో చీటీకి షూరిటీ ఇచ్చాడంట. వాడు కూడా డబ్బు కట్టలేదని కోర్ట్ నుంచి సమాన్లు వచ్చాయంట! అందుకని కోర్టులో హాజరవడానికి వైజాగ్ వెళ్ళాడట-"
    "అయ్యో పాపం"
    "నేనూరుకోలేదులే- అలాంటి కృతజ్ఞుడితో స్నేహం అవసరం లేదని పెద్ద ఉత్తరం రాసి వాళ్ళావిడ కిచ్చేసి వాడొచ్చాక ఇమ్మని చెప్పి వచ్చేశా"
    ఆ రాత్రంతా నాకు సాయిరామ్ మాటలే గుర్తుకొచ్చినాయ్. బోస్ మీద జాలి కలిగింది గానీ కోపం రాలేదు.
    వీటన్నిటి ద్వారా అర్థమయిందేమిటంటే మన జాతీయ టైమ్ పాస్ ఏమిటంటే అవతలివాడిని తప్పుపట్టడం! అందులో లభించే ఆనందం ఇంకెందులోనూ లభించదు మన వాళ్ళకు.
                                             *    *    *

 Previous Page Next Page