టెంటు లోపలికి వేసి ఉంది రెడ్ కార్పెట్. ద్వారానికి ప్రక్కన ముఖమల్ పరదాలు కట్టి వున్నాయి.
ఆ ప్రక్కనే సపరేట్ గా చిన్న ఎన్ క్లోజర్ లాగా చేసి ఉంది గొలుసులతో. అక్కడే ఒక టేబులూ, రెండు సోఫాలూ వేసి వున్నాయి...
టేబుల్ దగ్గర నిలబడి ఉన్నాడు మాస్టర్ గోపాలన్.
నల్లటి మనిషి. బాగా పొడుగ్గా ఉన్నాడు. తెల్లటి ఫ్యాంటూ, షర్టూ టక్ చేసి టై కట్టుకుని వున్నాడు.
అతను ఆ సర్కస్ కి యజమాని! గోపాలన్ ది కేరళలోని టెల్లిచెర్రి.
ఎందుకోగానీ సర్కస్ ప్రొఫెషన్ లో చేరేవాళ్ళలో ముప్పాతిక మూడొంతుల మంది కేరళలోని టెల్లిచెర్రి నుంచే వస్తారు.
టెల్లిచెర్రిలో కూడా 'తియ్యా' అనే కులంవారే ఎక్కువగా సర్కస్ లోకి రావడానికి యిష్టం చూపిస్తారు.
అక్కడి పిల్లలను సర్కస్ యజమానులు కాంట్రాక్టుకి కుదుర్చుకుని తల్లిదండ్రులకు యింత డబ్బు మాట్లాడుకుని యిచ్చేసి, పిల్లలను తమ దగ్గరే వుంచుకుని ట్రైనింగ్ యిస్తారు.
ఇదంతా అప్పట్లో తెలియదు రాజాకి. ఆ తరువాత తెలిసింది.
గోపాలన్ దగ్గరికి వెళ్ళి నిలబడి విష్ చేశాడు రాజా.
"ఏమిటి?" అన్నాడు గోపాలన్ హిందీలో.
హిందీలోనే చెప్పాడు రాజా.
"నాకు సర్కస్ ట్రూప్ లో చేరాలని ఉంది."
"నీకేం వచ్చు?"
"ఏమీ రావు! నేర్పితే నేర్చుకుంటాను. తెలివి వుంది ధైర్యం వుంది" అన్నాడతను నిజాయితీగా.
అసహనంగా అన్నాడు గోపాలన్ "ఏం చెయ్యగలవు నీ ధైర్యముతో?"
"పులి నోట్లో తల పెట్టగలను" అన్నాడతను.
ఆ ఒక్క మాటతో పడిపోయాడు గోపాలన్. రాజా వేపు అంచనా వేస్తున్నట్లు చూశాడు.
"నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు?"
"నాకెవరూ లేరు. దేవుడే దిక్కు!"
"అదీ ఒకందుకు మంచిదే! ఇకనుంచి నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు. అయితే ఒక విషయం చెప్పు....ఎందుకు చేరుతున్నావ్ నువ్వు సర్కస్ లో? తిండి కోసమా?"
"కాదు! తిండి ఎక్కడయినా సంపాదించుకోగలను. ఫీట్సు నేర్చుకోవడానికి చేరుతున్నాను... జీతం డబ్బులతో చదువుకోడానికి చేరుతున్నాను...."
ఆశ్చర్యంగా చూశాడు గోపాలన్.
"చదువుకుని?"
"పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరతా! చేరి కమెండోని అవుతాను."
భుజాలు చరిచాడు గోపాలన్.
"పెద్దయ్యాక ఏమవుతావో నీ ఇష్టం. కానీ నా దగ్గర ఉన్నన్నాళ్లూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వుండాలి. నా డిసిప్లిన్ అంటే మాటలు కాదు."
తల ఊపాడు రాజా.
రాత్రికి అతను జోకర్స్ టెంటులో పడుకున్నాడు.
తెల్లారుజామునే లేపేశారు అతన్ని.
గోపాలన్ అన్నాడు రాజాతో -
"ఒక్క వారం రోజులపాటు నువ్వు అన్నిటినీ చూస్తూ ఉండు. నేను నిన్ను చూస్తూ వుంటా. వారం గడిచాక చెప్తా నిన్ను ఏ ట్రైనింగ్ లో పెట్టాలో."
వారం రోజుల తరువాత డిసైడ్ చేశాడు గోపాలన్.
రాజాకి షూటింగ్ లో ట్రైనింగ్ ఇవ్వాలని.
మొదటగా అతనికి ఒక ఎయిర్ గన్ ఇచ్చారు. దానిలో బుల్లెట్స్ వుండవు. చిన్న సీసం ముక్కలు వుంటాయి. కాలిస్తే దెబ్బ తగులుతుంది కానీ ప్రాణాపాయం వుండదు.
"తుపాకిని అందుకోబోయేముందు గురువుగారి కాళ్ళకి దణ్ణం పెట్టు" అన్నాడు జోకర్ అరవిందన్.
"అదెట్లా మర్చిపోతాను..." అంటూ జేబులో నుంచి పర్సు తీశాడు రాజా. దానిలో నుంచి కృష్ణాజీ ఫోటో తీశాడు. దాన్ని కళ్ళకద్దుకున్నాడు.
రాజా ఇంకా గోపాలన్ కి దణ్ణం పెడతాడని ఊహిస్తున్న జోకరు అరవిందన్ ఆశ్చర్యపడ్డాడు.
"అదెవరు?" అన్నాడు అనుమానంగా.
"ఆయన నా తొలి గురువు!" అన్నాడు రాజా. "ఆయన తరువాత వచ్చిన వాళ్ళందరూ మలి గురువులు. తొలి గురువు మాత్రం ఆయనే..." అని అప్పుడు గోపాలన్ కాళ్ళకి దణ్ణం పెట్టాడు.
ఆ విధంగా మొదలయ్యింది అతని ట్రైనింగ్.
* * * *
ఆ తరువాత తొమ్మిదేళ్ళు ఎలా గడిచిపోయాయో రాజాకే తెలియదు.
తను పెట్టుకున్న లక్ష్యం సాధించడానికి సర్కస్ లో చేరడం సరైన పనే అని అతనికి ఆ తరువాత నమ్మకం ఏర్పడింది. సర్కస్ మాస్టర్ గోపాలన్ కి రాజా అంటే మంచి గురి కుదిరింది. అభిమానం ఏర్పడింది. అలాంటి శిష్యులు దొరకడం విద్య నేర్పించే గురువులకి కూడా అదృష్టమే!
అతి త్వరలోనే షూటింగ్ ఎక్స్ పర్ట్ అయిపోయాడు రాజా.
చీకట్లో వెలుగుతున్న కొవ్వొత్తిని వెనక్కి తిరిగి అద్దంలో నుంచి చూస్తూ అతను షూట్ చేసి ఆర్పేస్తుంటే, మత్స్యయంత్రాన్ని ఛేదించిన అర్జునుడే గుర్తు వచ్చేవాడు గోపాలన్ కి.
అందరికీ సంవత్సరాలు పట్టే ట్రైనింగ్ రాజా ఆరునెలల్లోనే కంప్లీట్ చెయ్యగలిగాడు. ఆ తర్వాత ట్రెపీజ్ ఫీట్స్ లోకి వెళ్ళాడు. అతి త్వరలోనే కింద రక్షణ కోసం ఉంచే నెట్ కూడా లేకుండా, ఉయ్యాలల మీద ఒళ్ళు గగుర్పొడిచే ఫీట్స్ చెయ్యడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత విలువిద్య, ఆ తర్వాత హార్స్ రైడింగ్, రెండు గుర్రాల మీద చెరోకాలూ పెట్టి స్పీడుగా సవారీ చెయ్యడం, కత్తులు విసరడం...