Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 34


    సరోజ వెంటనే బాగా కోపం తెచ్చుకుని "పో! నన్నింత అవమానం చేస్తే నీతో మాట్లాడను" అంది.
    కుమార్ తెల్లబోయి "నిన్ను అవమానించానా?" అన్నాడు.
    "కాకపోతే ఏమిటి? నేను ఎవరయినా పరాయివాళ్ళకి చేశానా? ఋణాలూ, తీర్చుకోవటం, ఈ మాటలన్నీ ఏమిటి?"
    కుమార్ పకపకనవ్వి ముద్దుగా ముడుచున్న సరోజ బుంగ మూతిమీద తన వేలుతో కొట్టాడు.
    అనూరాధ ఇదంతా ఏ మాత్రమూ సహించలేకపోయింది.
    "మీ చెల్లెలు వాడిని పెంచుకుంటే మీరంతా నోరు మూసుకున్నారు. నేనూ నాకెందుకని ఊరుకున్నాను. ఇప్పుడు మీ కూతుర్ని కూడా వాడికి కట్టబెట్టాలనుకుంటున్నారా? అది మీ కూతురేకాదు- నా కూతురు కూడా! ఆ విషయం గుర్తుపెట్టుకోండి?" అని భర్త మీద విరుచుకుపడింది.
    జగన్నాధ్ శాంతంగానే "కుమార్ కేం తక్కువయింది? బుద్ధిమంతుడు_బాగా చదువుకుంటున్నాడు-చంద్రశేఖర్ వాడిని బాగా చదివిస్తున్నాడు. మన హోదాకి చాలదనుకుంటే మనమే వాడిని ఇంకా బాగా పైకి చదివించుకోవచ్చు" అన్నాడు.
    "అంటే? మీ మనసులోనూ ఈ ఉద్దేశం ఉందన్నమాట! అయ్యోరామ! ఇదెక్కడి అన్యాయమండీ? బంగారంలాంటి పిల్లను తీసుకుపోయి ఆ కులంతక్కువవాడికి కట్టబెడతానంటా రేమిటి? ఇప్పుడే చెప్తున్నాను ఇవాళనుంచీ సరోజ ఆ ఇంటి కెళ్ళిందంటే నేను పచ్చి మంచినీళ్ళు ముట్టను."
    "అయితే అక్కడికి పోవద్దని సరోజతోనే చెప్పు! దానికింత అల్లరి దేనికి?"
    "నేను లక్షసార్లు చెప్పాను. అది నా మాట వినటంలేదు."
    "మరి నన్నేం చెయ్యమంటావే? నేను చెప్పనా? ఇవ్వాళ ఇంటికి రాగానే చీవాట్లు పెడతాను."
    "అలా కాదు. అంతకంటె మంచి పద్ధతి మీ చెల్లెలుతోనే చెప్పండి. సరోజను కుమార్ తో కలిసి తిరగనీయవద్దని. ఆవిడమాటే అందరూ వింటారు. మనం వద్దన్నా వాళ్ళు రహస్యంగా కలుసుకుంటారు."
    జగన్నాధ్ కూడా ఆలోచనలో పడ్డాడు. కులభేదాలు నశించిపోతున్నాయని స్లోగన్లు వినటం, పేపర్లలో చదవటం జరుగుతోంది కాని, వాస్తవంలో ఉండవలసిన భేదాలు ఉండనే ఉన్నాయి. ఆరోజుల్లో సుమతి కుమార్ ని పెంచుకుంటానని అన్నప్పుడు ఎంత గొడవ జరిగిందో జగన్నాధ్ మరిచిపోలేదు. అప్పటికంటె ఇప్పుడు పరిస్థితులు కొంత మారినమాట నిజమే కాని, అయినా తమ సరోజను కుమార్ కిచ్చి పెళ్ళిచేయవలసినంత అవసరమేమొచ్చింది? ఆస్తి, అంతస్తు, చదువు రూపమూ, అన్ని ఉన్న వరుణ్ణి తేగలిగేశక్తి ఉంది తనకి. ఈ విషయం మాట్లాడాలనే చెల్లెలి ఇంటికి వచ్చాడు. సుమతి అన్నాను ఆదరించి కాఫీ ఫలహారాలిచ్చి, "వదిన కులాసాగా ఉందా?" అని అడిగింది యధాలాపంగా.
    "ఆవిడ కులాసా సంగతి ఏమోకాని, నా ప్రాణాలు తీస్తోంది" అన్నాడు జగన్నాధ్ నవ్వుతూ తన చెప్పదలచుకున్న విషయానికి నాందిగా....
    "ఏ విషయానికన్నయ్యా?"
    "సుమతీ! ఒక్క విషయం అర్ధం చేసుకోవాలమ్మా నువ్వు? ఎంతో సాహసంతో కుమార్ ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వాడిని పెంచావు. నీ అభ్యుదయ భావాన్ని అభినందిస్తున్నాను. వాడిని నీ సొంత కొడుకులాగే చూస్తున్నావు. అది నాకు తెలుసు. కానీ, వాడిని నీ కొడుకు అని నువ్వనుకున్నంత తేలిగ్గా అందరూ అనుకోలేరమ్మా!"
    సుమతి తలెత్తి భయంగా చూసింది అన్నవైపు. "ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు అన్నయ్యా! కుమార్ ని నేను పెంచినందుకు మంజుకు మంచి సంబంధం దొరికి పెళ్ళికాదంటావా?"
    జగన్నాధ్ కి నవ్వు వచ్చింది. జాలీ కలిగింది. ఆడ పిల్లల్ని కన్న తలిదండ్రులందరికీ ఎవరి భయాలు వాళ్ళకుంటాయి.
    "నేను భయపడుతున్నది మంజు విషయం కాదమ్మా! ఈ ప్రస్తావన రావటమూ మంచిదే అయింది. మంజు పెళ్ళి గురించి నువ్వెలా ఆరాటపడుతున్నావో, సరోజ పెళ్ళిగురించి నేనూ అలా ఆరాటపడటం న్యాయమేగా?"

 Previous Page Next Page