కోపం వచ్చింది చిచ్చుకి.
"ఊరికే ఫార్మల్ గా చిచ్చు కనపడితే అడిగానని చెప్పు. అందా?"
పడిపడి నవ్వింది ఆ అమ్మాయి చిచ్చు కోపానికి. చిచ్చుకీ, ఇళకీ ఎంత తేడా?
"అదీ కాదు." నవ్వుతోనే అంది.
"అయితే నేను గెస్ చెయ్యలేను."
"విదుషి జ్యోతిని అనుసరించి వెళ్తూ ఒక టార్చ్ లైట్ ఇళకిచ్చి తనకోసం ఎవరైనా వస్తే వాళ్ళకియ్యమని చెప్పిందట. ఈ విషయం మీకు చెప్పమంది. ఇంతే సారీ ఫర్ ది డిజప్పాయింట్."
"వాట్? మామూలు టార్చ్ లైట్ అయితే విదుషి అంత కేర్ చెయ్యదు. దానిలో ఏదైనా క్లూ ఉందేమో?"
"నేను అదే అనుకుంటున్నాను. ఆ టార్చ్ లైట్ ఇళ తల్లి దగ్గర ఉందట. మీరు తీసుకురాగలరా?"
"నన్ను వెళ్ళనివ్వరు."
"అయితే ఎలా? పోనీ నేను వెళ్ళనా?"
"థాంక్స్. అక్కర్లేదు, తెప్పిస్తాను."
"నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అయ్ వాంట్ టు ఫాలో దిస్ మిస్టీరియస్ కేస్."
"అలాగే! మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అవసరమయినప్పుడు..."
తన ఇంటి అడ్రసూ, ఫోన్ నంబరూ ఒక చిన్న కాగితం మీద రాసి చిచ్చు కిచ్చింది సుహాసిని.
* * * *
ప్రమధపురికి రావద్దని హెచ్చరికగా చెప్పింది పిచ్చిది. నామాలయ్య ఏదో చేస్తున్నాడు. ఇళని కాపాడటానికి ప్రయత్నించాడా? తన స్వార్థం కోసమైనా ప్రయత్నిస్తాడేమో? చూడాలి. ప్రమధపురిలో కోయ యువకుడు కుమార్ కి ఉత్తరం రాశాడు, అన్ని విషయాలతో. అతడు తిరుగు టపాలో టార్చ్ లైట్ తీసుకుని వచ్చాడు. ఆతృతగా ఓపెన్ చేసి చూసాడు. అతడు ఆశించినట్లే దానిలో బేటరీల మధ్య ఒక ఉత్తరం ఉంది. తీసి చదివాడు.
"ఈ ఉత్తరం ఎవరు చదువుతారో తెలీదు. సహృదయులే చదువుతారని నా ఆశ. జ్యోతి మిస్టరీ తెలుసుకోవాలని బయలుదేరాను. నా ప్రాణం పోయినా నిజం బయటపడాలి" ఆ పట్టుదలతోనే బయలుదేరాను. అడవిదారిలో జ్యోతిని అనుసరించి వెళ్తూ దారి పొడుగునా ఐరన్ ప్లేక్స్ వేస్తూ వెళ్ళాను. అడవిలో ఎవరూ ఊడవరు గనుక అవి పోవు. తేలికగా ఉండవు గనుక అవి ఎగిరిపోవు. ఇదే దారిలో మరో పదిమంది నడవటం వల్ల అణిగిపోయే ప్రమాదమూ లేదు. నేను మాయం కాగానే పోలీసులు రంగంలోకి వస్తారు. ఆ ఏర్పాటు చేశాను. ఏదైనా పవర్ ఫుల్ మేగ్నెట్ తో నేను నడిచిన దారిని గుర్తించవచ్చు. జ్యోతి నడిచే మార్గం ఇళకి తెలుసు. ఇళ సహకరిస్తే నేను మాయమైన విధానం తెలుసుకోవటం తేలిక. ఇదంతా ఇళ ప్రమేయం లేకుండా జరుగుతోందనే నా నమ్మకం. ఇళ సహకరించకపోతే, ఇళ కూడా ఈ కుంభకోణంలో భాగస్థురాలనే అనుకోవాలి! అప్పుడు నేను మాయమయిన ప్రదేశం తెలుసుకోవటం కష్టమవుతుంది. ఈ ఉత్తరం దొరికినవారు సత్యాన్వేషణకి ప్రయత్నించండి. దీనిని పోలీసులకి ఇస్తే మంచిదే. కానీ ఇవ్వబోయే ముందు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ విధానం ఎలా ఉందో, జాగ్రత్తగా తెలుసుకుని మరీ ఇవ్వండి.
విదుషి...."
చదివాక ఆపుకోలేని ఏడుపు వచ్చింది చిచ్చుకి. ఒక సత్యం తెలుసుకోవటానికి, జనాన్ని మోసంలోంచి బయటపడెయ్యటానికి తన ప్రాణాల్నే బలిపెట్టింది విదుషి. నామాలయ్య మీద కసితో పళ్ళు నూరుకున్నాడు. వెంటనే సుహాసినికి ఫోన్ చేశాడు.
* * * *
ఉత్తరం చదివింది సుహాసిని. ఎప్పటిలాగే లాన్స్ లో కూర్చున్నారు చిచ్చు సుహాసిని.
"ఈ ఉత్తరం పోలీసులకి ఇచ్చేస్తేనే మంచిదేమో!" అంది సుహాసిని.
"చివరి వాక్యం చదివారుగా."
"అవును. ఎలా ఉంది ట్రెండ్?"
"సాధారణంగా పోలీస్ బలగమంతా నామాలయ్య చేతిలోనే వుంటుంది. మాయమయింది విదుషి గనుక ఈ మాత్రమన్నా ప్రయత్నాలు జరిగాయి. నామాలయ్య తలుచుకుంటే ఇళ అరెస్ట్ కాకుండా ఆపగలిగేవాడు. కానీ ఎందుకో ఇళనే అప్పజెప్పి చేతులు దులుపుకున్నాడు."
"పేపర్లలో ఇళ ఫోటోతో సహా పడుతున్నాయి. రకరకాల కథలు, జనం ఇళ మోసకత్తెగా భావించి ఇళ పేరు చెపితే మండిపడుతున్నారు."
"జనం అంతా కాదు. చదువూ సంస్కారం ఉన్నవాళ్ళు మాత్రమే. ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఇళని దేవతగా భావించి మొక్కులు చెల్లిస్తూనే ఉన్నాయి. ఏదో మహాద్భుతం జరిగి ఇళ విడుదలయి పూజలందుకొంటుందని నమ్ముతూనే ఉన్నాయి."
జాగ్రత్తగా ఆలోచించింది సుహాసిని.
"నేను ముందు ఇళతో మాట్లాడతాను. తన ఉద్దేశం తెలుసుకుంటాను. తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం."
"మీరు నాకొక ప్రామిస్ చెయ్యాలి."
"ఏమిటి?"
"మనమిద్దరం ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చేవరకూ ఈ విషయం పోలీసులకి తెలియపరచకూడదు."
"తెలియపరచను. ప్రామిస్."
* * * *
ఇళ దగ్గరకి ఎవరినీ రానీయటం లేదు. కానీ సుహాసిని లాంటి వాళ్ళని ఆపటం కష్టం. అదీగాక ఎంత ఆపాలని ప్రయత్నించినా ఇళ ఫోటోలూ, వార్తలూ, పేపర్లలో రానే వచ్చాయి. అంచేత సుహాసిని ఇళతో మాట్లాడటానికి అనుమతి ఇచ్చారు కూడా. ఒక మహిళా పోలీసు ఉంది. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఇళ ముఖంలో కళ తగ్గింది. శరీర బాధ భరించలేకపోతోంది. అయినా నోరువిప్పి తనకు బాధ అని చెప్పదు. ఏకాగ్రంగా ధ్యానంలో ఉండటానికి వీలు కుదరటం లేదు. చుట్టూ రణగొణధ్వని. సుహాసినిని చూడగానే ప్రాణంలేచి వచ్చింది ఇళకి. చిరునవ్వుతో_
"బాగున్నారా?" అంది.
తననే ఎదురు కుశలమడుగుతోన్న ఆ అమ్మాయిని చూసి మనసు తరుక్కుపోయింది సుహాసినికి.
ఇళ నిర్దోషి అవునో, కాదో నిర్ధారించుకోలేకపోతోంది అప్పటికీ.
"మీకొక విషయం చెప్పాలని వచ్చాను."
"చెప్పండి"
"విదుషి వెళ్ళిన జాడ మీకు తెలుసా?"