కళ్ళు పెద్దవిచేసి చూసింది సుహాసిని. ఈ అమ్మాయి మాటలు ఏవీ "అమ్మగారి" మాటల్లాగ లేవు. ఏ దివ్యలోకాలలోంచో ఇప్పుడే ఈ లోకంలో కళ్ళు తెరిచిన పసిపాప మాటల్లాగ ఉన్నాయి.
"విదుషి కూడా నీతో నాలాగానే మాట్లాడేదా! అయినా నువ్వు తనని అభిమానించి గౌరవించేదానివా?"
"మీ అంత తీవ్రంగా కాదు. కానీ విదుషి అక్క ధోరణి కూడా ఇలాగే ఉంటుంది. అభిమానమంటారా? విదుషి అక్కని ఎక్కడున్నా తిరిగి తీసుకురావటానికి ఏమైనా చేస్తాను. దారి తెలీదు కానీ, సావిత్రిలాగ యమలోకానికి పోయి పోట్లాడమన్నా పోట్లాడతాను."
ఇళ మాటల్లో నిజాయితీ శంకించలేకపోయింది సుహాసిని. కంఠం ఆర్ద్రమయింది.
"నేను యం.బి.యస్ స్టూడెంట్ ని. థర్డ్ ఇయర్ లో ఉన్నాను. ఈ సంవత్సరం యం.బి.యస్. ఎంట్రెన్స్ పరీక్షల్లో గందరగోళం జరిగింది. ఎవరో కావాలని కంప్యూటర్ రిజల్ట్స్ మార్చటానికి ప్రయత్నించారు. అక్కడితో మెరిట్ వాళ్ళు వెనుకపడ్డారు. థర్డ్ క్లాస్ వాళ్ళకి సీట్లు వచ్చాయి. అంతా ఒక పెద్ద మెస్. ఈ అన్యాయానికి నిరసనగా విద్యార్థినులు గుంపులు గుంపులుగా సెక్రటేరియట్ ముందు ఆందోళన జరిపారు. విద్యార్థులు కూడా ఉన్నారు ఆందోళనలో! కానీ, ప్రధానంగా ఉమెన్స్ కాలేజి రిజల్ట్స్ లోనే కుంభకోణం ఎక్కువగా జరిగింది. నేను మా వాళ్ళకి లీడర్ ని! "జరిగిన పొరపాటు సవరించే వరకూ ఊరుకునేది లేదని" సెక్రటేరియట్ ముందే నిరాహారదీక్ష ప్రారంభించాను. ఒకరోజు గడవగానే నన్ను అరెస్ట్ చేశారు. వదిలేస్తారులెండి, మమ్మల్ని ఒకరోజు కంటే ఎక్కువగా నిర్భంధంలో ఉంచరు. అసలు నేను తలుచుకుంటే ఈ పాటికే విడుదల అయ్యేదానిని. కానీ నేనిలా నిర్భంధంలో ఉంటే తప్ప బయట ఆందోళన మరింతగా విజృంభించదు."
"మీకు అవసరం లేకపోయినా, మిగిలినవాళ్ళ కోసం ఇలా అవస్థ పడుతున్నారా? నా దగ్గరకి వచ్చి హోమాలు, వ్రతాలు, పూజలూ జరిపించే వాళ్ళకంటే మీరు, విదుషి అక్క ఎక్కువ మంచివాళ్ళలా కనిపిస్తున్నారు నాకు!"
నిజాయితీతో అంది ఇళ.
"ఈ మిస్టరీ విడగొట్టడానికి నేనూ ప్రయత్నిస్తాను. మీలో నాకు నమ్మకం కుదిరితే మిమ్మల్ని విడిపించటానికి కూడా ప్రయత్నం చేస్తాను."
"వొద్దు! ఆ ప్రయత్నాలేమీ చెయ్యకండి. దేవీ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. చిచ్చు మీకు తెలుసా?"
"తెలీదు. ఎవరతను?"
"మా ఊళ్ళో జ్ఞానదేవ్ మాస్టారుగారి అబ్బాయి."
"ఇక్కడ ఎక్కడుంటాడు?"
"తెలీదు."
"పోనీ, ఏం చదువుతున్నాడూ?"
"తెలీదు"
"బాగానే ఉంది! పోనీ, విదుషికి తెలుసంటున్నారు కదా! ప్రయత్నించి అతడి ఆచూకీ తెలుసుకుంటాను. తెలుసుకుని ఏం చెయ్యాలి?"
"విదుషి అక్క జ్యోతిని అనుసరించి వెళ్తూ నాకో టార్చిలైట్ ఇచ్చింది. తనకోసం ఎవరైనా వస్తే అది ఇమ్మంది. ఆ టార్చిలైట్ చిచ్చుకియ్యాలి. అతడు వాళ్ళ వాళ్ళకి అందజేస్తాడు."
సుహాసిని కళ్ళు తళుక్కుమన్నాయి. ఆమెకి విదుషి బాగా తెలుసు. ఆ టార్చిలైట్ లో ఏదో విశేషం లేకపోతే అంత పనికట్టుకుని చెప్పదు.
"ఎక్కడుంది ఆ టార్చిలైట్?"
"మా అమ్మ దగ్గర. ప్రమధపురిలో!"
"తప్పకుండా ప్రయత్నిస్తాను. మీ కేసు నేను ఫాలో అవుతాను."
స్నేహ పూర్వకంగా చెయ్యి జాపింది సుహాసిని.
15
చిచ్చు అడ్రసు తెలుసుకోవటం సుహాసినికి కష్టం కాలేదు. విదుషి ఇంట్లో అందరికీ చిచ్చు తెలుసు. చిచ్చు అగ్రికల్చరల్ యూనివర్శిటీలో చదువుతున్న విషయం విదుషి తల్లి చెప్పింది. విదుషి కుటుంబంలో అందరికీ ఇళ అంటే మంటగా వుంది. ఆమెకి కఠిన శిక్ష పడాలని ఆ ఇంట్లో అందరూ కోరుకుంటున్నారు కానీ చిచ్చు మీద కోపం లేదు. చిచ్చుకి ఇళకి ఉన్న అనుబంధం కూడా ఆ కుటుంబంలో ఎవరికీ సరిగా తెలియదు. చిచ్చు కోసం అగ్రికల్చరల్ యూనివర్సిటీకి బయలుదేరింది సుహాసిని. నగరానికి చాలా దూరంగా ఉంటుంది ఆ యూనివర్శిటీ! చాలా విశాలమైన ఆవరణలో ఏ శాఖకు ఆ ప్రత్యేకమైన భవనాలతో, ప్రయోగాలకు అనువుగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఫీల్డ్స్ తో చాలా అందంగా ఉంటుంది. యూనివర్శిటీ క్యాంపస్ చెక్ పోస్ట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఎంక్వయిరీలో అడిగి చిచ్చు ఉన్న బిల్డింగ్ తెలుసుకోగలిగింది సుహాసిని. చిచ్చు క్లాసులో వున్నాడు. క్లాసయ్యేసరికి ఫీల్డ్స్ లో తిరిగి, తర్వాత అతణ్ణి కలుసుకుంది.
"మిస్టర్ చైతన్య దేవ్."
"యస్! వాట్ కెన్ అయ్ డూ ఫర్ యూ?"
"నా పేరు సుహాసిని. విదుషికి రెండేళ్ళు జూనియర్ని మెడికల్ కాలేజీలో!"
"గ్లాడ్ టు మీట్ యూ! కూర్చోండి"
ఇద్దరూ లాన్స్ లో కూర్చున్నారు. యూనివర్శిటీ లాన్స్ లో స్టూడెంట్స్ జంటలుగానూ గుంపులుగానూ కూర్చుని కబుర్లు చెప్పుకోవటం అతి సాధారణమైన విషయం. అంచేత వాళ్ళిద్దరినీ ఎవరూ పట్టించుకోలేదు.
"నేను ఇళ దగ్గిర్నుంచి మీకొక మెసేజ్ తెచ్చాను" తనను తను మరిచిపోయి సుహాసిని రెండు చేతులూ పట్టుకున్నాడు చిచ్చు. సంభ్రమంగా మాట తడబడుతూ అడిగాడు.
"ఇళ దగ్గిర్నుంచా? ఇళని కలుసుకోగలిగారా? మాట్లాడారా? ఎలా ఉందీ? తిరగ్గలుగుతోందా? బాధ ఎక్కువ కాలేదా? డాక్టర్ చూశాడా? ధైర్యంగానే ఉందా?"
తెల్లబోయి చూసింది సుహాసిని. చటుక్కున చేతులు వదిలేసి నర్వస్ గా సంజాయిషీ ఇచ్చుకునే నవ్వు నవ్వాడు చిచ్చు. "అయామ్ సారీ! ఇహ్హిహ్హీ!" అన్నాడు.
ఒకమ్మాయి నోట అబ్బాయి పేరు వినగానే వాళ్ళ మధ్య ఏదో ఉందనుకొనే తత్వం కాదు సుహాసినిది. అందుచేత ఇళ చిచ్చు గురించి చెప్తున్నప్పుడు ఏమీ అనుకోలేదు. కానీ, ఇప్పుడు చిచ్చు ముఖం చూస్తోంటే... క్షణం ఆగి నవ్వింది. ఈ నవ్వుకి అర్థం వేరు. ఇది చిచ్చుని సిగ్గులో ముంచేసే నవ్వు. కొన్ని క్షణాలు తలెత్తలేకపోయాడు అతడు.
"ఇంతకూ ఇళ మెసేజ్ ఏమిటని అడగలేదు మీరు!"
"సారీ. ఏమిటి మెసేజ్?"
సిగ్గుపడుతోన్న అతడి ముఖం చూస్తోంటే టీజ్ చెయ్యాలనిపించింది ఆ అమ్మాయికి.
"గెస్ చెయ్యండి."
"ఏదైనా సహాయం కావాలని అడిగిందా?"
"నో."
"నన్ను ఓసారి రమ్మందా!"
"నో."