దాని కతను ఏం జవాబు చెపుతాడు! ఆభమూ శుభమూ తెలియని లేత వయసులో అమాయకత్వానికీ, అసమర్థతకేగాని కఠినత్వానికి అవకాశమెక్కడిది?
బలవంతంగా నవ్వటానికి ప్రయత్నిస్తూ "కఠినంగా వెళ్ళిపోయానా? అయితే నా నేరానికి శిక్షకూడా లేదు. ఎందుకంటే అది నిర్వచించలేనంతటి నేరం" అన్నాడు.
వేదిత ఓ నిట్టూర్పు విడిచి "ఎంతసేపని నిల్చుంటావు కల్యాణమూర్తి? కూర్చో" అన్నది.
అతను తిరిగి ఆసీనుడై అబ్బ! అంత పెద్ద పేరుతో పిలుస్తూంటే యెలాగో ఉంది. చిన్నప్పుడు "కళ్యాణ్" అని పిలిచేదానివి గుర్తుందా"అన్నాడు.
"అది చిన్నతనం. ఇది బాధ్యతతో కూడిన పెద్దతనం, అది సరేగాని కల్యాణమూర్తీ! ఇన్నాళ్లూ ఏమి చేశావు? నీ జీవితం గురించి కొంచెం చెప్పు. వినాలని ఉంది" అంది కుతూహలం కనబరుస్తూ.
అతను చెప్పాడు, తన చదువు, పైకి రావాలనే పట్టుదల, అదృష్టం కొద్దీ ఒక ఆయిల్ కంపెనీలో మంచి ఉద్యోగం రావటం, తనమీద తన పై అధికార్లకు సదభిప్రాయం కలగటం.... అన్నీ చెప్పి "వేదితా! నీకు యెంతో దూరంలో ఉన్నా నీ గురించి కూడా ఎప్పటికప్పుడు విచారించి తెలుసుకుంటూనే ఉన్నాను. నీకు జరిగిన అన్యాయం విని యెంత కృంగిపోయానో, ఎంత చలించిపోయానో నా అంతరాత్మకే తెలుసు." అంటూంటే అతని కంఠం ఒణికింది.
వేదిత ముఖం తృటిలో రక్తం లేనట్లు పాలిపోయింది. "అబ్బ! కల్యాణమూర్తి ఆ విషయాలన్నీ యిప్పుడెందుకు?" అంది మాట మార్చటానికి ప్రయత్నిస్తూ.
కాని అతను వదిలిపెట్టకుండా ఆమె ముఖంకేసి పరీక్షగా చూస్తూ "ఇక్కడికి వచ్చీ రాగానేకూడా నీ గురంచి వాకబు చేశాను. దేవాలయంలో సేవికగా ఉంటున్నావనీ, నిరంతరం భగవతారాధనతో కాలం వెళ్ళబుచ్చుతావనీ యిక్కడి ప్రజలు నిన్ను అమ్మా అని పిలుస్తూ భక్తితో కొలుస్తారనీ.... వినటానికయితే ఆనందంగా ఉంది గాని దీర్ఘంగా యోచిస్తే నా హృదయం ద్రవించింది. వేదితా ఒక విషయం అడుగుతాను! నిన్ను...."
ఆమె సహనం కోల్పోయింది. కాళ్ళలో బలం నశించినట్లయింది. "అబ్బ! నిన్ను బ్రతిమాలుకుంటాను కల్యాణమూర్తీ! ఆ విషయాలు నా ముందు ఎత్తవద్దు, యెత్తవద్దు" అని అరిచింది కొంచెం గట్టిగా.
అతను ఒక నిముషం మౌనంగా వూరుకుని మెల్లగా "పోనీలే వేదితా! నీకు కష్టం కలిగించేటట్లయితే ఆ ప్రమేయం తీసుకురాను" అన్నాడు.
తానుకూడా ఒకవేళ తొందరపడ్డానేమోనని ఆమెకూడా సిగ్గుపడి, చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నిస్తూ 'అవునుగానీ కల్యాణమూర్తీ! ఇన్నాళ్ళ తర్వాత ఈ ఊరు రావాలని యెందుకనిపించింది?పనిమీద వచ్చావా?" అంది మాట మారుస్తూ.
తనరాక ఆమెలో సంచలనాన్ని కలిగించిందనీ, తనతో యెంతో ఆప్యాయతతో ఆత్మీయతతో మాట్లాడాలన్న అభిలాష ఆమెకున్నదనీ, కాని ఏవో శక్తులు ప్రతిఘటించి, అందుకు భిన్నంగా ప్రవర్తించేటట్లు చేస్తున్నాయనీ అతను గ్రహించాడు. ఆమెనలా చూస్తూంటే అతనికి దిగులుగా, బాధగా ఉంది. గుండెల్లో ఏదో తొలుస్తున్నట్లుగా వుంది. ఆ క్షణంలో అతనికి ఆ వూరు యెందుకు వచ్చానా అనిపించింది.
"ఏమిటి ఆలోచిస్తున్నావు జవాబు చెప్పకుండా?"
"ఊ-! ఇంకో పదిహేను రోజుల్లో విదేశాలకు వెళ్తున్నాను వేదితా! మాది ఫారిన్ కంపెనీ. అక్కడి విషయాలు పరిశీలించి, నేర్చుకుని రావాటానికి మా కంపెనీ పంపిస్తోంది నన్ను. మళ్ళీ ఈ ప్రాంతాలకు ఎప్పుడు వస్తానో, అసలు రాకపోవచ్చుకూడ కదా. అదీగాక, మాయిల్లు ఇంకా అలాగే ఉందిగా. ఈ ఊరిలో ఋణం తీరిపోతున్నప్పుడు ఆ ఇంటితో నాకు పనేముంటుంది? అదికూడా విక్రయించి...."
"మా అందరికీ స్వస్తి చెప్పి వెళ్ళిపోదామనీ...." అంటూ నవ్వింది వేదిత.
"అలాగే అనుకో పోనీ!"
"అవునుగాని యింకా పెళ్ళిచేసుకోలేదా నువ్వు?"
"ఏమనిపిస్తోంది? చేసుకున్నాననిపిస్తోందా?"
"ఏమనీ అనిపించటం లేదు. ఇంత దూరంలో, ఈ అడవిలో ఉన్న దాన్ని నాకెలా తెలుస్తుంది చెప్పు? ఈ విచిత్రజగత్తులో ఏమి జరిగినా ఆశ్చర్యం లేదుగదా!"
"ఇంకా చేసుకోలేదు."
"ఎందుకని?"
"ముక్కూ మొహం తెలియని ఏ అమ్మాయినో చేసుకుంటే జీవితం ఆనందప్రదంగా ఉండగలదని నమ్మకం కలగటం లేదు."
ఆ విషయం యింకా గ్రుచ్చి గ్రుచ్చి అడగటానికి ఆమె భయపడింది.
"మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా?" అని అడిగాడు కల్యాణమూర్తి. బహుశా అతనికికూడా ఆ ప్రసంగం రుచించలేదేమో, మాట మార్చాడు.
"అదే కులాసా. ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా పగలల్లా ఓ క్షణమైనా యింట్లో కూర్చోకుండా తిరుగుతుంటారు. ఆయనకు ఎండాలేదు వానాలేదు."
తర్వాత కొంతసేపు అలాగే మాట్లాడుకున్నాక కల్యాణమూర్తి లేచి నిల్చుని "యిహ వెళ్తాను." అన్నాడు.
వేదిత తల వూపింది.
"మళ్ళీ వస్తాను."
"నీ యిష్టం."
"రమ్మంటావా?"
"అది నేను చెప్పే విషయం కాదు" అంటూ ఆమె పొడిగా నవ్వింది.
"భగవంతుడు నిన్ను గడుసుగా వుండమని ఆదేశించాడు" అని అతను అక్కడ్నుంచి కదిలి, బయటకు వెళ్ళిపోయాడు.
అతను వెళ్లిపోయినవైపే చూస్తూ వేదిత చాలాసేపు స్తబ్దుగా నిలబడింది. చాలాకాలానికి ఆమె మనస్సు ఆమెకు తెలియకుండానే అనిర్వచనీయమయిన ఆనందం పొందుతుంది. కనులు నీలాలుగా మెరుస్తున్నాయి. ఎన్నడూలేని నూతన అనుభూతి, స్పందన కలిగిందీవేళ. అట్లా చాలాసేపు నిలబడి ఓ నిట్టూర్పు విడిచి వెనుదిరిగింది.