సీత యేదో మైకం ఆవహించినట్లు కళ్ళు మూసుకుని ఆలకిస్తోంది. బహుశా ప్రక్కగదిలో ఇందుమతమ్మగారు కూడా అదే స్థితిలో ఉండి ఉండాలి.
అట్లా కొంతసేపు గడిచాక వేదిత పాడటం ఆపి , ముందుకు వొంగి సీత ఫాలభాగాన్ని ముద్దు పెట్టుకుని, హఠాత్తుగా లేచి నిల్చుని "వస్తాను చెల్లీ! నీ జీవితం శుభప్రదం అవుగాక" అంది.
ఆమె ఇహ ఆగదని సీత తెలుసుకుని ఖిన్నవదనురాలై, అతి ప్రయత్నం మీద చేతులు రెండూ జోడించి నమస్కరించి "అక్కా గుర్తుంచుకో" అంది.
వేదిత ఆమెవంక తన కరుణాపూరిత దృష్టిని బరపి, మెల్లగా బయటకు వచ్చింది. ఇందుమతమ్మగారి దగ్గరకూడా సెలవు తీసుకుని, ఆ యింటిని దాటి యివతలకు వచ్చి వడివడిగా దేవాలయము కేసి నడవసాగింది.
గుళ్ళోకి వచ్చి, తోటలోంచి నడుచుకుంటూ కుటీరం చేరేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ముక్కాలిపీటమీద కూర్చున్న వ్యక్తి వీపు మాత్రం బయటకు కనిపిస్తోంది. "ఎవరితను!" అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది.
అడుగుల చప్పుడు విని తలత్రిప్పి వెనక్కి చూసిన అతని ముఖం చూసి వళ్ళు ఝల్లుమంది వేదితకు. అతను కల్యాణమూర్తి.
* * *
కల్యాణమూర్తి ఎత్తుగా, పుష్టిగా పెరిగి పచ్చని పసిమితో మిసమిసలాడుతున్నాడు. ముఖం కోలగా ఉండి, పెద్ద పెద్ద కళ్ళు అటూ యిటూ కదుల్తూండగా అందంగా కనిపిస్తోంది. పైజమా, లాల్చి వేసుకున్నాడు. జుట్టు వొంకెలు తిరిగి, సుకుమారంగా సాగి, కొన్ని వొంకెలు ముఖంమీద పడుతున్నాయి.
అతనివంక విస్మితురాలై చూస్తూ "కల్యాణమూర్తి" అంది వేదిత కంపిత స్వరంతో.
కల్యాణమూర్తి చప్పున లేచి నిలబడి, ముఖాన చిరునగవు, ఆశ్చర్యం, ఆనందం ద్యోతకమవుతూ ఉండగా "నువ్వు....నువ్వు.... మా వేదితవేనా?" అన్నాడు ఆమెవైపు రెండడుగులు వేసి.
అతని ముఖంలో గోచరిస్తూన్న ఆవేశం చూస్తే అమాంతం తనని పట్టుకుని పైకెత్తి వేస్తాడేమో నన్నంత భయం కలిగింది వేదితకు. అయితే ఆమె సంతోషానికి కూడా పట్టపగ్గాలు లేకుండా పోయినై. అనుకోకుండా మనస్సు గతంలోకి పరిగెత్తింది. చిలిపి పిల్లగా తను, చిన్నపిల్లాడిలా కల్యాణమూర్తి.... తమ అమాయకపు ఆటలు.... తమ తియ్యని బంధాలు ఆమె ఆలోచనలు మధురంగా సాగాయి. ఆక్షణంలో ఆమె సర్వ ప్రపంచాన్నీ, తన చుట్టూ అల్లుకున్న వాతావరణాన్నీ, తన స్థితి ప్రజ్ఞతనూ అన్నీ మరిచిపోయింది.
"వేదితా!" అన్నాడు తన్మయంగా మళ్ళీ.
ఆమె యీ లోకంలోకి వచ్చి "కూర్చో కల్యాణమూర్తి! ఎన్నాళ్ళకి నిన్ను చూశాను! ఎన్ని యుగాల తర్వాత మనము కలుసుకున్నాం!" అన్నది.
"వేదితా! నువ్వు పెద్దదానివిలా గంభీరంగా అయిపోయావు! నిజంగా యీ రోజు నేను అదృష్టం చేసుకున్నాను. నువ్వు యీ ఊళ్ళో ఉంటావో ఉండవో అన్న సందేహంతో సతమతమయినాను. నిన్ను కలుసుకుంటానా, నిన్ను కనులారా చూస్తానా అని ఎంతో ఆరాటపడ్డాను." అంటూ అతనెంతో భావోద్రేకంతో చెప్పుకుపోతున్నాడు.
"పో. అన్నీ బడాయిలు" అన్నది వేదిత బుంగమూతిపెట్టి.
"నన్ను నమ్మటం లేదా వేదితా నువ్వు?"
ఆమె కళ్ళు చిత్రంగా ఎగరేసి "నమ్మను, యివన్నీ బడాయిలు కాక మరేవిటీ ఇప్పుడు నేను కనిపించాను కాబట్టి యిన్ని కబుర్లు చెబుతున్నావు. ఈ అభిమానమంతా యిన్నేళ్లూ యేమయిపోయింది? నీ చిన్ననాటి స్నేహితురాలు ఏమయిపోయిందోనన్న ఆదుర్దాతో ఒకసారైనా యిటు వైపు తిరిగి చూశావూ?" అంది.
కల్యాణమూర్తి ఆమె మాటలు విని తప్పుచేసినవాడిలా తలవంచుకున్నాడు. కొంచెం సేపటికి అతను తల యెత్తేసరికి అందులో విచారం, పశ్చాత్తాప చిహ్నాలు ద్యోతకమౌతున్నాయి.
"నేరం నేరం చేయలేదని అనటంలేదు వేదితా! కాని యీ ఊరు నుంచి వెళ్లిపోయాక ఓ మహా ప్రవాహంలోపడి కొట్టుకుపోయాను. ఒక వైపు నుంచీ చదువు, ఉన్నత స్థితికి రావాలన్న ఆకాంక్ష, తల్లిదండ్రుల బాధ్యత, క్రమంగా వారు గతించటం, ఉద్యోగ నిర్వహణ యివన్నీ నన్ను తిరిగి యిటువైపు రానీయకుండా చేశాయి. కాని నిన్ను మరిచిపోయానని భావించటం మాత్రం భ్రమ వేదితా! ఎక్కడవున్నా యేం చేసినా మన బాల్య స్మృతులు, నీవు అనుక్షణమూ గుర్తు వస్తూండేవారు. నిన్ను చూడకుండా ఒక్క రోజుకూడా గడపలేదంటే నమ్మతావా?"
"అదేమిటి? ఎలాగా?"
"ఇది చూడు, నీకే తెలుస్తుంది" అని అతను జేబులోంచి ఒక వస్తువు తీసి ముందుకు వెళ్లి ఆమె చేతికి అందిచ్చాడు.
వేదిత ఆ వస్తువు అందుకుని కుతూహలంగా వీక్షించింది. చిన్న ఫోటో అది. అందమైన బుల్లి ఫ్రేములో కూర్చబడింది. ఆమె ఒక్కసారిగా పులకితురాలయిపోయింది. తమ చిన్నతనాన బస్తీనుంచి ఒకసారి శాయి గారింటికి ఫోటో గ్రాఫర్ వచ్చాడు. వాళ్ళ యింట్లో అందరూ రకరకాల ఫోటోలు తీయించుకున్నారు. అది చూసి కల్యాణమూర్తికీ, తనకూ కూడా ఫోటో తీయించుకోవాలని కోరిక కలిగింది. ఫోటోగ్రాఫర్ని బ్రతిమిలాడి అతను బస్తీకి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు గుళ్ళోకి తీసుకువచ్చి యిద్దరూ కలిసి ఒకే ఫోటో తీయించుకున్నారు. వేదిత ఆ సంగతులు గుర్తు చేసుకుంటూ ఆసక్తిగా ఆ చిత్రాన్ని పరిశీలిస్తోంది. తాను పరికిణీ జుబ్బా వేసుకున్నది. అతను నిక్కరు, పొట్టి చొక్కా వేసుకున్నాడు. యిద్దరూ ఒకరికొకరు ఆనుకుని, ఒకరి భుజంమీద మరొకరు చేతులు వేసుకుని నిలబడ్డారు. యిద్దరి కళ్ళల్లో బుగ్గల్లో చిలిపితనం, లేతదనం గోచరిస్తున్నాయి. చాలాసేపు తనివితీరా, తదేకంగా ఆ ఫోటోవంక చూసి, తిరిగి అతనికి అందిస్తూ "నీకెంత జాగ్రత్త! ఎక్కడా మాసిపోకుండా, పదిలంగా అట్టేపెట్టావు. కాని నువ్వు చాలా కఠినంగా వెళ్లిపోయావు సుమా!" అంది.
ఈ చివరిమాట యెందుకందో, ఎలా అందో ఆమెకే తెలియదు. ఏదో అజ్ఞాతశక్తి అనుకోకుండా ఆమెతో పలికించినట్లయింది.