"అవును జగతీ! తలుపుతియ్యి" అన్నాడు స్వామి అవతలినుంచి.
'భగవంతుడా! నన్ను రక్షించు' అని వేడుకుని "ఈ రాత్రివేళ నావల్ల మీకేం సేవకావాలి స్వామీ" అన్నది వినయంగా.
"సేవలందుకోవటానికి రాలేదు జగతీ! మరో కార్యం నిమిత్తం వచ్చాను. ఆలస్యాన్ని భరించలేకుండా వున్నాను. త్వరగా తలుపు తెరు."
'నేను జగతిని కాదు, దుష్టసుందరిని' అనుకుని వాపోయిందామె. ఆమె మనస్సు కీడుని శంకించింది.
ధైర్యం తెచ్చుకుని, "ఈ అర్ధరాత్రి ఏకాంతంగా వున్న నాతో ముచ్చటించటం ఏం బాగుంటుంది స్వామీ! అసలే ఆశ్రమంలో మనగురించి అలజడి చెలరేగింది. ఊళ్ళోకూడా విషప్రచారం జరుగుతూంది. నామీద కనికరించి వెళ్లిపొండి స్వామీ!" అని వేడుకున్నది.
ఆయనలో రాను రానూ సహనం అంతరించిపోతున్నది. "నాకు కావలసింది నేనూ, ఆశ్రమమూ. ఊరు కాదు. నన్ను నేను నమ్మితే తర్వాత ఊరివారిపై ఆ భారం వేస్తాను. నీవల్ల నాకీ ఉపకారం జరుగవలసివుంది జగతీ! ఆలస్యం చెయ్యకు" అన్నాడు ఆమెను అర్ధంచేసుకోకుండా.
"ఉపకారమా?" అంది నివ్వెరపోయి.
"అవును, మహోపకారం. తెరు చప్పున."
"నేను తియ్యను" అంది జగతి.
"జగతీ! ఏమిటా పెంకితనం? నన్నే అనుమానిస్తున్నావా? నీకు ఆశ్రయం యిచ్చాను. నన్ను హింసించుకున్నాను. చిత్రవధ చేసుకున్నాను. నువ్వు దేవతవయ్యావు, ఇంకా ఎందుకు అనుమానం?"
"ఏమయినా సరే, తలుపు తియ్యను" అంది జగతి మనస్సుని మరింత దృఢం చేసుకుని, ద్వారానికి వీపు ఆనించి నిల్చుని, కళ్ళు మూసుకుని, గుండెను చిక్కబట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నది.
"తలుపు తియ్యకపోతే పగలగొట్టి లోపలకు ప్రవేశిస్తాను"
"కానీయండి" ఆమె భగవంతుడిమీద భారం వేసింది.
ఆయన నిజంగానే తలుపులు తన బిలిష్టమైన హస్తాలతో గట్టిగా అవి వూడిపోతాయని గ్రహించి ఆమె యిహ ఆశ వదిలేసి, "ఉండండి స్వామీ" అని హీనస్వరంతో పలికింది. 'భగవంతుడా! నన్ను కాపాడు. స్వామిని కాపాడు. ఈ ప్రపంచాన్ని కాపాడు' అని వేడుకుని, గుండెనిబ్బరం చేసుకుని, తలుపులు తీసివేసింది.
అయితే ఆమె చూసింది ఒక కామభయంకరమూర్తిని కాదు. అక్కడ ప్రశాంత, గంభీర, రమణీయాకృతిని.
"భయపడ్డావా?" అంటూ లోపలకు ప్రవేశించారు.
గాలికి తలుపులు మూసుకున్నాయి.
జగతి రెండడుగులు వెనక్కి వేసింది.
ఆమెవైపు జరుగుతూ, దృష్టి ఆమె సుందర వదనారవిందంనుంచి మరల్చకుండా స్వామి అన్నాడు. "నువ్వు నా జీవితంలో దెయ్యంలా ప్రవేశించావు. మొదట నేను ఝడుసుకున్నమాట వాస్తవమే. నీ స్పర్శ తగిల్తేనే నాలో ఏదో అగ్ని చెలరేగేది. తీవ్రమైన వొణుకు, విద్యుత్ తరంగాలు కదిలేవి నా రక్తంలో. అంతా నీకు తెలుసు. నీకు చెప్పాను. కాని యిప్పుడు యిది వేరు. నన్ను నేను సాధించాను. నన్ను నేను జయించాను. నా రక్తాన్ని నేను కాచి వడబోసుకున్నాను. గుండెను మరగబెట్టి దోషరహితం చేశాను. రా జగతీ! ఈ సత్యం ఋజువు కానీ, నన్ను నిరూపించనీ."
జగతి భయంలో వెనక్కి జరిగింది. "వద్దు స్వామీ, ఇలాంటి దీక్ష మీకు తగదు. మీరు గొప్పవారు. నిరూపణలు సామాన్య మానవులకుగాని మీవంటి మహాత్మునికి కాదు" అన్నది అతనికి తెలియచెప్పటానికి ప్రయత్నిస్తూ.
"నన్ను వారించకు జగతీ. అల్పత్వాన్నుండి ఔన్నత్యానికి వెళ్ళానని తెలుసు కోవడానికి మరోమార్గంలేదు. నువ్వూ పునీతురాలివి, నేనూ పునీతుడ్ని. భయమెందుకు?"
ఆమెకాళ్ళలో బలం నశించి భూమికి అంటుకుపోయినట్లు అయిపోయాయి. అంత చలిలోనూ ముఖాన స్వేదబిందువులు క్రమ్మివేశాయి. ఊపిరి విడవటానికి కూడా శక్తిలేక కళ్ళప్పగించి చూస్తోంది.
ఆయన జగతిని సమీపించాడు. అలాగే చూస్తోంది ఆమె కదల్లేదు మెదల్లేదు బొమ్మలా నిల్చున్నది. ఆమె శిరస్సుమీద చేయివేసి నిమిరాడు. ఆమె సుందరతరళ నయనాలను తాకాడు. తమలపాకువంటి కపోలాలమీద మెత్తగా రాశాడు. ఆమె తెల్లటి కంఠంచుట్టూ చేతులు పోనిచ్చి ముఖంలోకి చూస్తున్నాడు. భుజాలమీద చేతులువేసి అక్కడినుంచి ఆమె చేతివ్రేళ్ళవరకూ తన చేతుల్ని జార్చాడు. ఆమె నడుముని ముట్టుకున్నాడు. హృదయాన్ని స్పర్శించాడు. నేలమీద మోకాళ్ళవరకూ కూర్చుని ఆమె పాదాలమీద ముఖం వుంచి పెదవులతో తాకాడు. ఆమె రెండుచరణాల చుట్టూ చేతులు బిగించి, వాటిమీద తల మోపి ఒక నిముషం వున్నాడు. లేచినిలబడి ఆమె భుజాలచుట్టూ చేతులు పోనిచ్చి ఆమెను దగ్గరకు లాక్కుని హృదయానికి అదుముకున్నాడు. ఆమె ముఖంమీద తనముఖం వుంచాడు. ఆయన చెంపలూ, ఆమె చెంపలూ రాసుకున్నాయి. ఆమె మృదు అధరాలమీద తన పెదవులు కలిపాడు. ఆయన గుండె ఆమె హృదయానికి అదుముకుంటున్నాడు. అంత బలానికి మరో స్త్రీ అయితే నలిగి ముక్కలైపోయేది.
అయినా...
ఇరువురిలో ఉద్రిక్తతలేదు. ఇరువురిలో ఒక్కబిందువుకూడా రక్తపుపోతూ పెరగలేదు. ఇరువురిలో పరిమితిగాని, శ్వాసగాని లేదు. ఇరువురిలో నరాల స్పందనలేదు. ఇరువురిలో కండరాల కదలికలేదు. ఇరువురిలో ఏ అసహ్యమూ లేదు. ఇరువురిలో ఏ సహజప్రకృతి మహిమా లేదు. ఇరువురిలో ఏ బంధమూ లేదు. ఇరువురిలో విపరీతంలోని అల్పపు పొరకూడా లేదు.
ఆమె బొమ్మలా నిల్చుంది. ఆయన బొమ్మలా కదలికలు చేశాడు. ఏదో అమరత్వం, ఏదో అమాయకత్వం, ఏదో పసితనం, ఏదో స్వచ్చత, ఏదో పరిపూర్ణశాంతి, ఏదో అపురూపతృప్తి యిరువురినీ ఆవహించివేసింది.
ఆకస్మికంగా ఆమెను వొదిలివేశాడు. క్రిందికి జారి, పాదాలమీద మోకరిల్లి, "నీవు నా తల్లివి, సహోదరివి, నా స్నేహానివి, నా జ్ఞాననేత్రానివి, నా హృదయ జ్వాలకు ఉపశమనం కలిగించిన దేవతవు. నువ్వు పరమేశ్వరుడు ప్రసాదించిన మణికాంతుల వివిధ శాఖల సముదాయానివి, ఆదిశక్తివి, ఆదిశక్తి కరుణా కిరణానివి" అంటూ అమితానందంలో ఏమీ తెలియక ఏడ్చేస్తున్నాడు.
జగతి తెప్పరిల్లింది. పాదాలను వెనక్కి లాక్కుని "స్వామీ! స్వామీ! ఏమిటిది? లేవండి" అంది వ్యాకులచిత్తంతో.
ఆ సమయంలో బయటనుండి పెద్ద కలకలం వినవచ్చింది. చాలామంది జనం అరుస్తూన్న అరుపులు, "రండి, అందరూ రండి" అంటూన్న కేకలు యిద్దరికీ వినిపించి ఒకింత ఉలికిపడ్డారు.
"స్వామీ! బయట ఏదో రగడ జరుగుతోంది. నాకు భయంగా వుంది" అంది జగతి విహ్వలురాలై.
"ఎందుకు జగతీ భయం! మనమా భయపడవలసింది? మనని చూసి భయమే భయపడుతుంది" అంటూ స్వామి లేచి గుమ్మందగ్గరకు వెళ్ళి తలుపులు లాగాడు. అవి రాలేదు. బయట ఎవరో గొళ్ళెం పెట్టారు.
ఆయన ఏమీ చలించలేదు. చెక్కు చెదరలేదు. "ఎవరు బయట? మూర్ఖతమాని తలుపు తియ్యండి" అన్నాడు గంభీరస్వరంతో.
"అవును నిజమే. ఇన్నాళ్ళూ మూర్ఖుల్నిచేసి ఆడించావు నువ్వు. నీ ఆట నేటితో కట్టింది" బయటనుంచి మార్కండేయుడి గొంతు వినిపించింది.
"మూర్ఖులు" అన్నాడు స్వామి నిర్వికారంగా. "మార్కండేయా! ఇంత నీచానికి ఒడిగట్టావా నువ్వు? తలుపులు తెరు. సమాధానం చెబుతాను" అన్నాడు బిగ్గరగా.
"నీచానికి ఒడిగట్టింది ఎవరు స్వామీ?" మార్కండేయుడి గొంతు వికటంగా వినిపించింది. "తొందరపడకండి మహాశయా. తలుపులు తీస్తాం. ఊళ్ళోని పెద్దలింకా రావలసివుంది. వాళ్ళ సమక్షంలో మీ ప్రేయసీ ప్రియుల్ని బయటకు ఆహ్వానిస్తాం."
జగతి విషణ్ణవదనంతో స్వామి సన్నిధికి వచ్చింది. "ఏమి జరగబోతున్నది స్వామి?" అని ప్రశ్నించింది వికలమనస్సుతో.
"నా పాపానికి యిప్పటివరకూ అనుభవించిన ప్రాయశ్చిత్తం చాలలేదు. ఇంకా శిక్ష అనుభవించబోతున్నాను."
"మీకు విచారంగా లేదా?"
"పరమేశ్వరుడు తీర్పు యిచ్చినప్పుడు ఆ శిక్ష అనుభవించటంకన్నా ఆనందమేముంటుంది జగతీ!"
"నాకు యీ క్షణాన భగవంతుడు లేడనిపిస్తోంది."
"జగతీ!"
"ప్రతిమనిషీ నాస్తికుడైతే యింతకంటే సుఖపడగలడనిపిస్తోంది."
"జగతీ!"
"అవును. ఒకరి విలువని ఒకరు అర్ధం చేసుకోరు. ఒకరి మహనీయత ఒకరు వెలగబెట్టలేరు. జీవహింస చేయరాదని ఘోషలు పెడతారు. మరోజీవిని చంపితేనేనా హింస? ఇవన్నీ చిత్రలీలలే అనుకుంటే, యింతకంటే దారుణ హింసాకాండకు మూలకారకుడనుకునేవాడు, అసలు లేడనే అనుకుంటే ఆ కొత్తనియమాలు, సాంఘికధర్మాలు యింత క్రూరంగా వుండవేమో!
బయట గడబిడ ఎక్కువవుతోంది. స్వామి ఏమీ సమాధానం చెప్పలేదు. ఆమెమాటలు గుండెను తాకి అవాక్కయి ఊరుకున్నాడు. కాని ఆయన మస్తిష్కంలో ఓ కాంతిపుజం ఎప్పుడూ కదుల్తూవుంటుంది. అది ఎన్నటికీ ఆరదు.
తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. "రండి! బయటకు రండి" అని కేకలు. చీకట్లో చాలామంది మనుషులు నీడల్లా కనిపిస్తున్నారు.
స్వామి ద్వారందాటి బయటకు వెళ్ళి మౌనముద్ర దాల్చి నిలబడ్డాడు. జగతి ఆయన వెనుకనే నడిచివచ్చి ప్రక్కగా నిల్చున్నది. కొంచెం దూరంలో మార్కండేయుడు వక్రచాలనం చేస్తూ నిలబడ్డాడు. అతనికి యిరుప్రక్కలా ఆశ్రమంలోని శిష్యులు సర్దుకున్నారు. వారి ప్రక్కలా, వెనుకా రెండుమూడు వందలమంది గ్రామస్థులు గుంపులు గుంపులుగా చేరివున్నారు. అక్కడక్కడా కొందరి చేతులలో వున్న లాంతర్లవల్ల మసకవెల్తురు వ్యాపించి ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయిదునిముషాలు ఎవరూ మాట్లాడటానికి సాహసించలేకపోయారు. మార్కండేయుడుకూడా తలుపులు మూసివున్నప్పుడు రంకెలు పెట్టాడుగానీ, యిన్నాళ్ళూ సేవిస్తూ వచ్చిన ఆ మానవతామూర్తి ఎదురుగా ప్రత్యక్షంకాగానే వళ్లు ఝల్లుమని నోటమాట రావటంలేదు. జనమంతా కళ్ళప్పగించి చూస్తున్నారు.
ఆకస్మికంగా స్వామే నిశ్శబ్దం బ్రద్దలుచేశారు. "మీరంతా ఏమడగదల్చుకున్నారు?"