Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 34


    వారిజకు తల తిరిగింది . సరిగ్గా తను భయపడినట్లే జరుగుతోంది. లతలో పరివర్తన రాకపోగా అహం మరింత ఎక్కువవుతోంది. ఎలా చెప్పటం ఈ ముర్ఖురాలికి , ముందున్న ప్రమాదాన్ని.....?
    లత ఇంకా వుత్సాహంగా చెప్పుకు పోతుంది.
    "అసలీ మురికి వూళ్ళో వుండటం నాకిష్టం లేదు నాగమణి ఉండ బట్టి కాస్త తోస్తుంది కాని, లేకపోతే పిచ్చెక్కి పోయేది. ఈ వ్యవసాయం వదిలేసి ఉద్యోగం చూసుకోమని ఎంత పోరు పెట్టినా అయన వినిపించుకోవటం లేదు. ఇదిగో ఇప్పుడిప్పుడు నా వలలో పడుతున్నారా! నెమ్మది మీద ఏమయినా ఉద్యోగం చూసుకుని ఈ వ్యవసాయం వదిలెయ్యమని చెపుతాలే. బ్రతిమాలిన లొంగకపోతే ఏడుస్తాను. అప్పటికీ జాలి కలగకపొతే లేచి పోతానని బెదిరిస్తాను. అప్పడికి చచ్చినట్లు నేను చెప్పినట్లు వింటారు......"
    లత ఆలోచనలు వింటోన్న వారిజకు కొన్ని క్షణాలు నోట మాట రాలేదు. లాభం లేదు ఉన్న సంగతి స్పష్టంగా విడమరిచి చెప్పటం తప్ప కర్తవ్యమ్ లేదు.
    "నీకు పుణ్యం వుంటుంది.....లేచిపోతానని మాత్రం అనకు. వెంటనే రైలెక్కిస్తారు......." గంబీరంగా అంది వారిజ.
    వేళాకోళంగా విరగబడి నవింది లత. "మరే ! రైలెక్కిస్తారు! ఆయనకు నామీదేంత వ్యామోహమో నీకేం తెలుసు? పొలంలో వున్నప్పుడు కూడా నేనే గుర్తొస్తానట! నన్ను విడిచి ఒక్క గంట ఉండాలన్నా ఎలాగో ఉంటుందట....అట్లాంటి మనిషి నేను లేచి పోతానంటే నాకోసం ఏం చెయ్యరు?"
    "నువు పరమ ముర్ఖురాలివి లతా!" నిగ్రహించుకోలేక కోపంగా అంది వారిజ. లత కస్సుమని లేచింది. "ఏమిటి చూశావు నా మూర్ఖత్వం ? గుట్టుగా ఏదో సంసారం చేసుకుంటాననా! అవునులే , పెద్ద స్తారైపోయే తెలివి నాకేక్కడిది?"
    వారిజకు బాధ కలగలేదు.....జాలి కలిగింది. రూపు దాల్చిన మూర్ఖత్వం లాంటి ఈ లతకు స్పష్టంగా చెప్పవలసిందే కాని లేకపోతె అర్ధం కాదు. "లతా స్థిమితంగా విను. మీ అయన ప్రస్తుతం నీ మీద చూపిస్తున్న ప్రేమంతా నీ రూపానికి వ్యామోహపడి కాదు. ఒక రకంగా ఇది నీకు పరీక్ష. నీ మీద గడమైన ప్రేమను చూపిస్తే నన్నా నువాయనను తిరిగి ప్రేమించగలవేమోనని పరీక్షించుకొంటున్నారు. ఇది నువు వ్యామోహమనుకొని మరింత పెట్రేగి పొతే, ఆయనకు నీ మీద పూర్తిగా విరక్తి కలుగుతుంది ఆ తరువాత నువెంత విచారించినా ప్రయోజన ముండదు."
    లత కనుబొమలు ముడిచి వారిజ వంక చురచుర చూసింది.
    "అనుభవీస్తోన్న దాన్ని- నాకంటే యెక్కువ తెలుసా నీకు? అసలు నీ కేలా తెలుసు ఈ సంగతులన్నీ ?" కొన్ని క్షణాలు వారిజ మాట్లాడలేకపోయింది.
    "మాట్లాడవేం?" తీక్షణంగా అడిగింది. "ఆయనే స్వయంగా చెప్పారు కనుక తెలుసు....." నిదానంగా చెప్పింది వారిజ .
    అదిరిపడింది లత.
    "అయన స్వయంగా చెప్పారా? ఎప్పుడు చెప్పారు? అసలాయన ఎలా తెలుసు నీకు? యెంత కాలంగా జరుగుతోంది ఈ నాటకం? చివరకు నా మొగుడ్నే నాకు కాకుండా చేస్తున్నావా?"
    విపరీతమైన వేదనతో అల్లల్లాడిపోతున్న హృదయాన్ని అదిమి పట్టుకుని శాంతంగా అంది ఆమె.
     "లతా నన్ను కాస్త అర్ధం చేసుకోమ్మా! నీ మొగుడ్ని నీకు కాకుండా చెయ్యాలనుకునే దాన్నే అయితే ఈ తిప్పలన్నీ ఎందుకు నాకు? నీకు నచ్చ చెప్పడానికి పనికట్టుకుని యింత దూరం ఎందుకొస్తాను? పది రోజుల క్రిందట ఎంతో అశాంతితో నా దగ్గర కొచ్చారు --నిన్ను భరించలేననీ, నిన్ను వదిలి ఎటైనా వెళ్ళి పోతానని అన్నారు. నేనే అతి కష్టం మీద అయన మనసు మళ్ళించాను. నిన్ను ప్రేమించి ఆ ప్రేమతోనే నీ ప్రేమను పొందాలని చెప్పాను. ఇది నీకు చివరి అవకాశం ఇప్పుడు కూడా నువు-"
    "అదంతా సరేలే! అయన కంట అశాంతి ఎందు కొచ్చిందట, వస్తే నీ దగ్గర కెలా వచ్చారు? నువేలా తెలుసు?" చూపులతో పిడుగులు కురిపిస్తూ అడిగింది.
    "అయన ఈ మద్యంతా అశాంతిగానే వుంటున్నారు. అందుకు కారణం నీ ప్రవర్తనేనని వీరన్న చెప్పాడు. పది రోజుల క్రిందట శుక్రవారం నాడు......"
    "వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయినా నాడు."
    "వాళ్ళ అమ్మ వచ్చారా? నీ మాటలకూ కష్ట పెట్టుకుని వెళ్ళిపోయారా? ఎంత పని చేశావు లతా?"
    "నోరు మూసుకో. నేనేం మాటలనలేదు. అన్ని సేవలూ చేశాను. ఆవిడే "మీరు దరిద్రులు" అంటూ తిట్టి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. అందుకోసం ఈయన గారికి ఆశాంతా? పై పెచ్చు నీ దగ్గిరికి పరుగెత్తి కొచ్చారా?"
    వారిజ నమ్మలేకపోయింది. సాధారణ ప్లీడర్ గుమాస్తాని పెళ్ళి చేసుకుని ఎంతో వివేకంతో వ్యవహరించి, పిల్లల్ని వృద్దిలోకి తీసుకొచ్చి, కట్నానికాసించకుండా లతను కోడలిగా చేసుకున్న వ్యక్తీ అలా నోరు పారేసుకుంటుందంటే ఎలా నమ్మటం? రామచంద్రకు తల్లి అంటే యెంత గౌరవమో, ఎంత ప్రేమో వారిజకు తెలుసు. తననింత వాడిని చేసిన తల్లి తన యింటి కొచ్చి పరాభవింపబడి వెళ్ళిపోతే అతని హృదయం క్షోభతో ఘార్జించదా? ఆ ఆవేశంలో విచక్షణా జ్ఞానమంతా నశించిపోయినా ఆశ్చర్య'మేముంది?
    "నువు, కాస్త మంచీ .......మర్యాదా తెలుసుకోవాలి వారిజా!" బాధగా అంది.
    'అవి నీ దగ్గర నేర్చుకుంటాలే మంచీ ......మర్యాదా.......! ముందు ఇది చెప్పు .....అయన నీ దగ్గిరికి ఎందుకు రావాలి? నువేలా తెలుసు? నా మొగుడితోనే రంకు సాగిస్తున్నావా?"
    "లతా!' విలవిల లాడుతూ దీనంగా అకోశించింది వారిజ.
    "అతడు నీ మొగుడు కాక పూరమే నాకు తెలుసు. అతడితో నాకు అనుబంధం లేదనలేదు. కానీ , అది రరంకు కాదు......."
    "ఓహో! అయితే ఇది చాలా రోజులుగా సాగుతున్న భాగోతమన్న మాట! మరి, పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు నాకీ సంగతి? ఈ ముండల ముఠాకొరుకు కట్టబెట్టి నా గొంతు కోస్తుంటే ఎందుకు ఊరుకున్నావు చూస్తూ?"
    "నీ పెళ్ళి ఎవరితో జరుగుతుందో నాకు తెలుసా? నాకు చెప్పారా ఎవరయినా? ఆనాడు నీ పెళ్ళి కోసం డబ్బు తెచ్చిన నన్ను గుమ్మలోంచే వెళ్ళ గొట్టారుగా! ముందు తెలిస్తే తప్పకుండా హెచ్చరించే దాన్ని.....నీకోసం కాకపోయినా , అతని కోసం......"
    రామచంద్రను ముండల ముఠా కోరనటం సహించలేని వారిజ కొంత కటువుగా అనకుండా వుండలేకపోయింది.
    'అతని కొసం!........అవును - నీకు అయన ముఖ్యం. అన్నట్లు నువు పని కట్టుకుని ఈ ఊరికే ఎందు కొచ్చావ్? అయన కోసం కదూ? ఇకనేం నిన్ను మరిగి నాకు నానా గడ్డి తినిపిస్తున్నారు. నువు చెప్పావా ఆయనకు నన్ను ప్రేమించమని? అందుకని నీ మాట కాదనలేక నన్ను ప్రేమిస్తున్నారా? అంతకన్నా విషం పెట్టమనలేకపోయావా? పైగా నాకు బుద్ది చెప్పడానికి తయరయ్యావా? నీకు సిగ్గెంత లేకపోయిందే! రానీ అడుగుతాను.......చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు, సినిమా స్టార్ తో ప్రేమాయణం సాగిస్తున్న పెద్ద మనిషికి, పెళ్ళాం కష్ట సుఖాలు లెందుకు? నా మీద చిరాకూ, విరక్తి కాక ప్రేమా - అనురక్తి ఎలా వస్తాయి?"

 Previous Page Next Page