Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 33

 

    బాధతో రామచంద్ర కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. వారిజ భరించలేకపోయింది. అతని హృదయం మీద వాలిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తూ "మీకు తెలీదూ! మీ వారిజ మిమ్మల్ని ఏ వేళా అతి గాడంగా ప్రేమిస్తూ ఉంటుందని తెలీదూ" అంది.
    ఆమె చుట్టూ ఆప్యాయంగా చేతులు వేశాడు.
    "తెలుసు వారిజా! ఆ ధైర్యంతోనే నీ దగ్గరకు వచ్చాను పద - ఇంకే ఆలోచనలు వద్దు వెంటనే ఎక్కడికైనా వెళ్ళి పోదాం."
    అతడిని విడిపించుకొని దూరంగా జరిగింది వారిజ.
    "వస్తాననే అనుకున్నారా? నా సాటి ఆడదాని జీవితంలో నిప్పులు పొయ్యటం నావల్ల అయ్యే పనే అనుకున్నారా?"
    రామచంద్ర ముఖం శిలలా కఠినమయింది. "సరే! నువు రాకు. ఇంకెవరో వస్తారు. సుఖాన్ని వెతుక్కుంటూ , ఎక్కడికో నాకే తెలియని అయోమయంలోకి పారిపోతాను."
    గడగడ వణికింది వారిజ.
    "ఎమిటంటున్నారూ?"
    "అవును నిశ్చయం చెపుతున్నాను ఇంకా ఈ క్షోభ నేను భరించలేను."
    అతి గంబీరంగా వున్న రామచంద్ర ముఖం చూసి హడలిపోయింది వారిజ. అమాయకురాలయిన చెల్లెలి ముఖం మనసులో మెదిలింది. రామచంద్ర దగ్గిరిగా వచ్చి అనునయంగా భుజం మీద చేయి వేసింది.
    "ఒకనాడు మీరే ఆన్నారు. సృష్టి సుందరమైనది, జీవితం మధురమైనది, ఈ సౌందర్యం, ఈ మాధుర్యం అనుభవించటానికి సున్నితమయిన మనసుండాలి . కానీ, ఈ సున్నితత్వం కలవాళ్ళ క్షోభను కూడా అంత గాడంగా అనుభవించవలసి వస్తుంది. ఈ క్షోభకు భయపడి తను సున్నితత్వమే వదులుకుంటే వాళ్ళు మానవత్వం లోంచి పాశవిక దశలోకి దిగుతున్నారన్న మాట, ఈ మాటలన్నీ మరచిపోయారా? కొద్ది పాటి అనందం కోసం మీ మానవత్వాన్నే కాలరాయదల్చుకున్నారా?"
    "వారిజా!" దీనంగా ఆర్తిగా క్షోభగా పిలిచాడు రామచంద్ర.
     అతని తల మీద చెయ్యి వేసి లాలనగా నిమిరింది వారిజ.
    "ఈ వారిజ ఎప్పటికీ మీదే! కానీ మీరిలా కుంగిపోతే ఎలా లత తప్పకుండా మారుతుంది? మీ ప్రేమను ఒకసారి అనుభవించిన స్త్రీ మిమ్మల్ని ప్రేమించకుండా ఉండగలదా?"
    దిగ్గున తలెత్తి వారిజ ముఖంలోకి చూశాడు రామచంద్ర.
    "నేను నిజం చెపుతున్నాను. మీరు గతం తవకుండా మనసులో ఏ శంకలూ పెట్టుకోకుండా లతను గాడంగా ప్రేమించండి. అలాంటి ప్రేమ అనుభవించాక లత మిమ్మల్ని ప్రేమించకుండా వుండలేదు. ఇద్దరి మధ్యా గాడమైన ప్రేమానురాగాలు అల్లుకున్న తరవాత మిగిలిన సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి"
    అనుమానంగా చూశాడు రామచంద్ర.
    అతని గెడ్డం పట్టుకుని ఆప్యాయంగా ఊగించింది వారిజ.
    "ఈ ఒక్కసారి నామాట వినరూ? పూర్తీ సహనంతో , గతమంతా మరచి, ఒక్కసారి చివరి సారి ప్రయత్నించి చూడండి. ఈ నెల అలా ఉండండి. అప్పటికీ లత మారకపోతే, నేను మీతో వస్తాను."
    "వస్తావా?"
    "తప్పకుండా ! కానీ మీరు హృదయ పూర్వకంగా ప్రయత్నిస్తారు కదూ?" రామచంద్ర విషాదంగా నవాడు.
    "లతలో పరివర్తన రావటం కంటే నేను కోరుకునేది ఏం ఉందీ!" దిగులుగా వెళ్ళిపోయాడు రామచంద్ర. బరువుగా నిట్టూర్చి అప్పుడిక తన కర్తవ్యమేమిటా అని ఆలోచించసాగింది వారిజ.


                                                     ------------

    రామచంద్రలో పరివర్తన చాలా విచిత్రంగా అనిపించింది లతకు. తను నైలాన్ చీర బాగుందంటే కస్సుమనే మనిషి తానె స్వయంగా నైలాన్ చీర తెచ్చి పెట్టాడు. సినిమా పేరెత్తితే మండిపడే వ్యక్తీ తనే "సినిమా కెళ్దాం" రమ్మని తీసి కేళుతున్నాడు. తను కాస్త గట్టిగా మాటాడితే చిరాకు పడే వ్యక్తీ తను ఎంత గట్టిగా దేబ్బలాడినా మాటాడక పోగా, పై పెచ్చు తనకే కితకితలు పెట్టి నవిస్తున్నాడు. లత మురిసిపోయింది. ఆవిడ కోరికలు తీర్చుతున్న కొద్దీ పెరుగుతున్నాయి అన్నీ ఓపికగా చిరునవు తో తీరుస్తున్నాడు.
    పక్కింటి నాగమణి కొనుక్కున్న లాంటి పసుపు పచ్చ ఫారిన్ నైలెక్స్ కొనమని రామచంద్ర అడగాలను కొంటె మంచం మీద పడుకుని కలలు కంటోన్న లత తలపు చప్పుడు విని తలుపు తెరచి వారిజను చూసి నిర్ఘాంత పోయింది.
    "ఇలా వచ్చావెంటక్కా! ఎవరయినా చూస్తే!" అంది కంగారుగా. వారిజ ముఖం పాలిపోయింది.
    రామచంద్ర తన దగ్గర్నుండి వెళ్ళినప్పటి నుండి వారిజకు మతి స్థిమితం లేకుండా పోయింది. లత స్వభావం బాగా తెల్సిన వారిజ రామచంద్ర ప్రగడ ప్రేమ కయినా ఆ లత కరుగుతుందని ఆశించలేకపోయింది. ఒక వేళ రామచంద్ర ఎంతగా ప్రేమించినా , లత అతని పట్ల శ్రద్ధ చూపక పొతే? అతని మనసు పూర్తిగా విరిగిపోతే? అప్పుడు లత గతి ఏం కావాలి?
    రామచంద్ర మాత్రం ఏం సుఖ పడగలడు? అలోచించి ఆలోచించి లత నొక్కసారి హెచ్చరించాలని నిర్ణయించుకొని వచ్చింది.
    "చాలా అవసరమైన పనుండి వచ్చానులే! లోపలికి రానా?"
    "రా! కూర్చో! ఇవాళ ఒంటిగంటకీ నాగమణి షాపింగ్ కి వేళదాం తోడు రమ్మంది. వస్తానన్నాను." తనతోనే ఇలా మాట్లాడుతోన్న మనిషి రామచంద్రను అసలు అర్ధం చేసుకోగలదా? "వెళుదువుగానీలే! ఇవాళ ఒక్కరోజుకి వెళ్ళకపోయినా ఫరవాలేదు. నీతో అత్యవసరంగా కొంత మాట్లాడాలి.'
    "ఏంటి ? నాతొ నీకు ఆత్యవసరం విషయాలు? నీ పదీ ఇస్తాలే, మెల్లగా వీలు చూసుకుని ......" వారిజ కుంగిపోయింది.
    "అది కాదు- చెప్పేది విను. ఇదివరకు నీ సంసారంలో ఏవో కలతలున్నాయని చెప్పే దానివి కదూ? ఇప్పుడు ఎలా ఉంది?"
    "ఓస్! అందుకోసం పని కట్టుకుని వచ్చావా? ఇప్పుడే కలతలూ లేవు. అయన చాలా మారిపోయారు. నేనేది అడిగితె అది కొంటున్నారు. ఎలా ఉండమంటే అలా వుంటున్నారు. మారకేం చేస్తారు? నేనెంత అందమైన దాన్నో నీకు మాత్రం తెలీదు! నా అందం ముందు దాసోహం అవని మొగవాడుంటాడా ? సిగ్గేగ్గులు లేకుండా తైతక్కలాడటం నాకు చేత కాలేదు కాని, లేకపోతే నీకంటే పెద్ద స్టార్ నయి ఉండేదాన్ని తెలుసా?"

 Previous Page Next Page