Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 34


    "అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి?" చిరాకుగా అడిగాడు భవానీశంకర్.
    "ఆ స్థలం ఆక్షన్ వేస్తున్నారని పేపర్లో చదివాను పొద్దున్నే! పాపం అది కొనాలని అంకుల్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు కదా! నేను అంకుల్ కి తెలీకుండా అది ఆక్షన్ చేసి అంకుల్ కి తర్వాత చెప్తే సంతోషంగా సుష్మతో మ్యారేజ్ కి ఒప్పుకుంటారని అనుకుని ఆక్షన్ కొచ్చాను."
    "ఏడ్చినట్లుంది. ఆ స్థలం మేము ఆక్షన్ చేసి ఫాదరిన్లాకు చెప్తే మా మ్యారేజికి ఒప్పుకుంటాడేమోనని మేము వచ్చాం" అన్నాడు భవానీశంకర్.
    "కానీ మనం ఈ ఆక్షన్ కి నాన్నగారు వస్తారని వూహించలేకపోవడం తప్పయిపోయింది" అంది ప్రతిమ.
    ముగ్గురూ కొద్దిసేపాగి హాండ్ లూమ్ హౌస్ బయటకు వచ్చేసరికి వేలంపాటదారు నడిరోడ్డు మీద మార్కండేయులు కాలర్ పట్టుకుని నిలబడివున్నాడు.
    "ఏం నెహ్రూ డ్రస్ సాలే! సరదాగా పదిహేనులక్షల ఒకటి అని పారిపోదామనుకున్నావేం? పద. ముందా డబ్బు కట్టు...అప్పుడు ఇంటికెళ్ళు."
    "పదిహేనులక్షల ఒకటి అని నేనలేదు."
    "అన్నావ్"
    "ఆ...నా చొక్కా పట్టుకుంటావా? రాస్కెల్! వదులు! ఆ బోడి స్థలానికి పదిహేను లక్షలా? వెళ్ళు ఒక్క పైసా కూడా ఇవ్వను" అరుస్తున్నాడు మార్కండేయులు అతని చేతినుంచి చొక్కా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ.
    "విడవటమా? డబ్బు కక్కకుండా నీ శవం కూడా ఇంటికి వెళ్ళదు గుర్తుంచుకో! ఆ!"
    ఆ దృశ్యం చూసేసరికి ప్రతిమకి జాలివేసింది "అయ్యో! పాపం డాడీ!" అంది భవానీశంకర్ తో.
    "ఆల్ రైట్ పదండి." అన్నాడతను.
    ముగ్గురూ వారి దగ్గరకు చేరుకున్నారు "ఆల్ రైట్ ఫాదరిన్లా! జరిగిందేదో జరిగిపోయింది డబ్బు కడతామని చెప్పండి. ఎలాగూ మనకి ఆ స్థలం కావాలి కదా! ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కోసం" అన్నాడు భవానీశంకర్.
    "షటప్! నోర్ముయ్. ఇదంతా నీవల్లా, ఆ గుడ్లగూబ ప్రకాష్ గాడివల్లా జరిగింది. ఇద్దరూ కలిసి నన్ను సర్వనాశనం చేశారు. నా ఆస్థి కొల్లగొట్టేశారు. ఆ స్థలం ఒక్క పైసాకు కొరగాదు."
    "ఒక్క పైసాకు కొరగాదా?"
    "కాదు!"
    "అదేమిటి? ఆ స్థలం కొని మీ స్థలానికి కలుపుకుంటే కమర్షియల్ కాంప్లెక్స్ కార్పొరేషన్ పర్మిషన్ దొరుకుతుందనీ, అందుకని అది కొనడానికి మీరు విశ్వప్రయత్నం చేశారనీ ప్రతిమ చెప్పింది కదా!"
    "అప్పటి సంగతి వేరు. నా స్థలానికి ఇప్పుడు మీరిద్దరూ అతి తెలివి ఉపయోగించి నన్ను సర్వనాశనం చేసి, పదిహేనులక్షలకు పాడి రెండువందల గజాల స్థలానికి మధ్య వందగజాల స్థలం ఇంకొకటి వుంది. వాడు అది అమ్మనని మొండికేయటం వల్ల నేను ఈ రెండు వందల గజాల స్థలం కొనే ప్రపోజల్ మానుకున్నాను" మండిపడుతూ అన్నాడతను.
    "ఓ! అసలు ప్రాబ్లమ్ అదన్నమాట" అన్నాడు ప్రకాష్.
    "ఓ! ఆ వంద గజాల స్థలం మధ్యలో వుండటం వల్ల ఈ స్థలం కొనటం వృధా అయిందన్నమాట."
    "వృధాయే కాదురా ఇడియట్స్! మార్కెట్ రేటు కంటే రెండు రెట్లు ఎక్కువ పెట్టి నన్ను సర్వనాశనం చేశారు" చిందులు తొక్కసాగాడు.
    "నా పదిహేను లక్షల సంగతేమిటి?" అడిగాడు వేలంపాట వాడు.
    "నేను పదిలక్షల దగ్గరే పాట మానేశాను. ఆ తరువాత పాడింది వీళ్ళు. వీళ్ళను పట్టుకో" అరిచాడు మార్కండేయులు.
    "వీళ్ళిద్దరినీ కూడా కట్టి పడేస్తాను. వదుల్తాననుకున్నారేమిటి?" అన్నాడతను తాడు సంచిలో నుంచి తీసి.
    "నోనో...యూ ఆర్ మిస్టేకెన్ ఫాదరిన్లా! నేను పాడినా, ప్రకాష్ పాడినా కేవలం మీ మీదున్న అపార ప్రేమాభిమానాల వల్ల పాడాం. అందుచేత ఆ పాట, ఆ స్థలం అన్నీ మీవే" అన్నాడు భవానీశంకర్.
    "నోనో నో! మీకూ, నాకూ సంబంధం లేదు" గర్జించాడతను. "మీరు చేసే వెధవ పనులకు నేను బాధ్యుడిని కాను."
    "సంబంధం లేదు అన్నంతమాత్రాన సబందాలు తెగిపోయాయా ఫాదరిన్లా! ఇదేం తెలుగు సినిమానా? నువ్వు నా కూతురివి కాదు! ఆ కూలింగ్ గ్లాసులవాడు నా అల్లుడు కాదు, గెటౌట్ అనడానికి! నో! దిసీజ్ రియల్ జీవితం ఫాదరిన్లా!"
    "య్యా" అంటూ బిగ్గరగా అరిచాడు మార్కండేయులు పీక్కోడానికి జుట్టు కోసం వెతుకుతూ.
    "పదిహేను లక్షల ఒకటి" అరిచాడు వేలంపాట వాడు ఇంకా బిగ్గరగా.
    అప్పటికే కొన్ని వేలమంది జనం మూగిపోయారు వారిచుట్టూ.
    "ఆల్ రైట్" అన్నాడు మార్కండేయులు జనాన్ని చూసి కోపం అణుచుకుంటూ.
    "ఆల్ ఈజ్ వెల్" అన్నాడు భవానీశంకర్ జనాన్ని చూసి చిరునవ్వుతో.
    "షటప్!" అరిచాడు మార్కండేయులు.
    "ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం!" అన్నాడు భవానీశంకర్ జనంతో.
    జనం అంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
    "ఇంటికిరా! చెక్కు ఇస్తాను" అన్నాడు మార్కండేయులు వేలంవాడితో.
    "నెహ్రూ డ్రస్ మిలియనీర్ జిందాబాద్" అన్నాడు భవానీశంకర్.
    "జిందాబాద్ జిందాబాద్" అరిచారు వేలంవాడు, ప్రకాష్ కలిపి.
    "షటప్" ఉక్రోషంగా అరిచాడు మార్కండేయులు.
    "అలాంటి పిచ్చికేకలేస్తే చస్తే డబ్బివ్వను" అరిచాడతను.
    దాంతో అందరూ సైలెంటయిపోయారు.
    "ప్రతిమా" కోపంగా పిలిచాడతను "నువ్వు నా కారెక్కు! నీతో మాట్లాడాలి."
    ప్రతిమ తండ్రి కార్లో కూర్చుంది.
    "ఏమిటి డాడీ?"

 Previous Page Next Page